Telugu Global
MOVIE REVIEWS

Spark LIFE Movie Review: స్పార్క్-లైఫ్ మూవీ రివ్యూ {2/5}

Spark LIFE Movie Review: ఏకంగా రచయితగా, ద్విపాత్రాభినయం చేస్తూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా అట్టహాసంగా భారీ స్థాయిలో ‘స్పార్క్- లైఫ్’ అనే సినిమా పూర్తిచేసుకుని, టాలీవుడ్ రంగప్రవేశం చేశాడు విక్రాంత్ రెడ్డి అనే కొత్త యూత్.

Spark LIFE Movie Review: స్పార్క్-లైఫ్ మూవీ రివ్యూ
X

Spark LIFE Movie Review: స్పార్క్-లైఫ్ మూవీ రివ్యూ

చిత్రం: స్పార్క్-లైఫ్

రచన-నటన-నిర్మాణం- దర్శకత్వం: విక్రాంత్

తారాగణం: విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, నాజర్, సుహాసిని, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, గురు సోమసుందరం తదితరులు

సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : ఏఆర్ అశోక్ కుమార్

బ్యానర్: డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్

నిర్మాత : లీలా రెడ్డి

విడుదల: నవంబర్ 17, 2023

రేటింగ్: 2/5

ఏకంగా రచయితగా, ద్విపాత్రాభినయం చేస్తూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా అట్టహాసంగా భారీ స్థాయిలో ‘స్పార్క్- లైఫ్’ అనే సినిమా పూర్తిచేసుకుని, టాలీవుడ్ రంగప్రవేశం చేశాడు విక్రాంత్ రెడ్డి అనే కొత్త యూత్. అతడి ధైర్యానికి టాలీవుడ్ లో అందరి దృష్టీ అతడి మీద పడింది. ట్రైలర్లు, ప్రమోషన్లు, పబ్లిసిటీలతో ఉత్కంఠ కూడా పెరిగింది. ఇది ధైర్యమనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఏమనుకోవాలి? ఏమనుకోవాలో ఈ క్రింద చూద్దాం...

కథ

లేఖ (మెహ్రీన్ పిర్జాదా) తన కలల్లో కన్పిస్తున్న యువకుడ్ని ప్రేమిస్తూ అతడికోసం వెతుకుతుంది. ఇంట్లో వచ్చిన సంబంధాలు తిరస్కరిస్తుంది. ఓ హాస్పిటల్లో కలల్లో కనిపిస్తున్న యువకుడిలాగే వున్న ఆర్య (విక్రాంత్) ని చూసి వెంటపడుతుంది. విక్రాంత్ ఆమెని తిరస్కరిస్తాడు. ఇంతలో నగరంలో వరుస హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూంటాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు తమకి కావాల్సిన వాళ్ళనే చంపి ఆత్మహత్యలు చేసు కుంటూంటారు. ఇదంతా ఆర్యయే చేస్తున్నాడని అనుమానిస్తాడు లేఖ తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్).

మరోవైపు వైజాగ్ లో ఆర్యలాగే వున్న జై (విక్రాంత్ ద్విపాత్రాభినయం) అనన్య (రుక్సార్ ధిల్లాన్) ని ప్రేమిస్తూంటాడు. ఇతనెవరు? ఆర్య కేమవుతాడు? ఈ హత్యలు, ఆత్మహత్యల వెనుక వున్నది ఎవరు? వీటితో డాక్టర్ ఇందిర (సుహాసిని ), మేజర్ జనరల్ భరద్వాజ్ (నాసర్), సైనిక డాక్టర్ (గురు సోమసుందరం) లకి ఏం సంబంధం? ఇవి తెలుసుకోవాలంటే వెండి తెరని ఆశ్రయించాలి.

ఎలా వుంది కథ

నిజానికిది మెడికో థ్రిల్లర్ కథ. పక్క దేశంలో టెర్రరిస్టుల బ్రెయిన్ ని కంట్రోలు చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవచ్చని చెప్పడం ఈ కథ ఉద్దేశం. అయితే ఆర్మీలో కొందరు డాక్టర్ లు బ్రెయిన్ కంట్రోల్ పై చేస్తున్న ప్రయోగాల కారణంగా పౌరుల మరణాలు జరుగుతున్నాయని తేల్చారు. ఇంతవరకూ బాగానే వుంది. అమెరికా గూఢచార సంస్థ సిఐఏ ఇలాటి ప్రయోగాలే చేస్తూంటుంది. అయితే ఈ మెడికో థ్రిల్లర్ కథని ఏక సూత్రతతో మెడికో థ్రిల్లర్ గానే వుంచక కొత్త రచయిత, దర్శకుడు విక్రాంత్ - క్రైమ్, రోమాన్స్, మిస్టరీ, కామెడీ, సైంటిఫిక్, బయోలాజికల్ జానర్స్ అన్నీ కలిపేసి గందరగోళం చేశాడు.

పైగా హత్యలు- ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పడానికి కథని సెకండాఫ్ లో ఎక్కడో ప్రారంభించాడు. దీంతో ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయి ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఈ కథ క్రైమ్ గురించి కాదు, రోమాన్స్ గురించి కాదు, కామెడీ గురింఛీ కాదు, మిస్టరీ గురించి కూడా కాదు, ఇంకేదో సైంటిఫిక్ అంశం గురించీ కాదు. కానప్పుడు వీటితోనే సమయమంతా వృధా చేసి- చెప్పాలనుకున్న కథకి కేంద్ర బిందువైన మైండ్ కంట్రోల్ బయోలజికల్ అంశాన్ని చిట్ట చివర్లో పైకి తీశాడు.

ఇలా క్రైమ్, రోమాన్స్, మిస్టరీ, కామెడీ, సైంటిఫిక్ తదితర ఎలిమెంట్స్ తో బోలెడు సస్పెన్స్ పుట్టి ఆడియెన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతారనుకున్నాడు. కానీ అసలు చెప్పాలను కుంటున్న కథేమిటో అర్ధంగాక తలలు పట్టుకుంటారని తెలుసుకోలేకపోయాడు.

‘మంగళవారం’ లో కూడా ఫస్టాఫ్ లో నాలుగు హత్యలు, వాటి తాలూకు దర్యాప్తు జరుగుతూ వీటి వెనుక ఎవరున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇంటర్వెల్ సీన్లో అంతవరకూ లేని హీరోయిన్ని దెయ్యంగా చూపించి ఆమే హంతకురాలని కథని ఓపెన్ చేసేశారు. ‘స్పార్క్’ కథ కూడా మైండ్ కంట్రోల్ ప్రయోగాల కారణంగా పౌరుల మరణాలు జరుగుతున్నాయని ఇంటర్వెల్లో ఓపెన్ చేసేస్తే ఈ సినిమా బతికి వుండేది. స్క్రీన్ ప్లే సూత్రాలు తెలియకుండా సినిమా తీస్తే ఫలితాలు ఏమంత బావుండవు. విక్రాంత్ ఈ కథని అనుభవమున్న రచయితకి అప్పజెప్పాల్సింది.

హత్యలు జరిగే తీరు మాత్రమే థ్రిల్లింగ్ గా వుంటుంది. మిగతా రోమాన్స్, కామెడీ, మిస్టరీ సీన్లు, బయోలజీ ప్రయోగాల సీన్లూ పేలవంగా వుంటాయి. పైగా ద్విపాత్రాభినయంతో ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ దారుణంగా తయారైంది. సీన్ల ప్రారంభ ముగింపులు కూడా చూపించిన హత్యలంత ఘోరంగా వుంటాయి. ఇక హీరో దగ్గర్నుంచీ ఆర్మీ మేజర్, డాక్టర్ వరకూ, మధ్యలో నోబెల్ బహుమతీ గ్రహీత వరకూ పాత్రచిత్రణలు సరే. ఇది సినిమా గురించి తెలిసి చేసిన ధైర్యం కాదు. అన్నీ తెలుసనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన దుష్ప్రయత్నం.

నటనలు -సాంకేతికాలు

ముందు విక్రాంత్ తనకి నటన రాదని తెలుసుకోవాలి. వచ్చిందల్లా కాస్త చిరునవ్వు ఒలికిచడం మాత్రమే. రోమాన్సులో ప్రేమ, రోషంలో కోపం, ఇతర ఎమోషన్లు వంటి కనీసావసరాలు తీర్చలేకపోయింది నటన. ఇంగ్లీషులో చెప్పాలంటే తనది బిగుసుకుపోయిన కార్డ్ బోర్డు ఫేసు. ఫైట్స్ కూడా అంతే. యాక్షన్ సీన్స్ లో తను అలా నిలబడి వుంటే శత్రువులే వచ్చి గుద్దుకుని చచ్చిపోతారని నమ్మకమేమో. యాక్షన్ సీన్స్ లో స్లోమోషన్ బిల్డప్ షాట్స్ కి తగ్గ కమర్షియల్ హీరోయిజం కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వుంది. ఇక ద్విపాత్రాభినయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనే ఓవరాక్షన్.

మెహరీన్ పీర్జాదా, రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్లు ఇద్దరూ తమకి డబుల్ యాక్షన్ హీరో సరిపోక ఇబ్బంది పడి నటిస్తున్నట్టు అన్పిస్తారు. వెన్నెల కిషోర్, సత్య లతో మూస కామెడీ ట్రాక్ తాము నవ్వించాలా, ఏడ్పించాలా అన్నట్టుంది. నోబెల్ అవార్డు విజేత డాక్టర్ గా సుహాసిని, ఆర్మీ మేజర్ జనరల్ గా నాజర్, ఆర్మీ డాక్టర్ గా గురు సోమసుందరం, ఫస్ట్ హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ తామింత భారీ పాత్రలు పోషించడానికి తగిన విషయం లేదని రాజీపడే నటించినట్టున్నారు.

సినిమా మొత్తం మీద బాగున్నది హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతంలో రెండు పాటలే. పేలవమైన కథాకథనాల కారణంగా అశోక్ కుమార్ ఛాయాగ్రహణం వృధా అయింది. అలాగే మిగతా టెక్నీషియన్ల పని తీరు. నిడివి రెండు గంటల 50 నిమిషాలు చాలా పెద్ద సహాన పరీక్ష.

తొలి సినిమాతోనే విక్రాంత్ తానే రచన, ద్విపాత్రాభినయం, ఇద్దరు హీరోయిన్లతో రోమాన్సు, దర్శకత్వం, భారీ బడ్జెట్ వెచ్చించి మెడికో థ్రిల్లర్ వంటి హై కాన్సెప్ట్ సినిమా నిర్మాణం సాగించడం ఓవర్ గా లోడ్ చేసుకున్న కాన్ఫిడెన్సే!



First Published:  20 Nov 2023 12:45 PM IST
Next Story