Telugu Global
MOVIE REVIEWS

Siddharth Roy Movie Review: సిద్దార్థ్ రాయ్- రివ్యూ {2/5}

Siddharth Roy Movie Review: చాలాకాలం క్రితం ప్రారంభమై ఈవారం విడుదలైన ‘సిద్ధార్థ్ రాయ్’ కొత్త దర్శకుడు యశస్వి డ్రీమ్ ప్రాజెక్టు. దాదాపు ‘అర్జున్ రెడ్డి’ విడుదలై నప్పటినుంచి దీన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికి పూర్తి చేశాడు.

Siddharth Roy Movie Review: సిద్దార్థ్ రాయ్- రివ్యూ
X

చిత్రం: సిద్దార్థ్ రాయ్

రచన-దర్శకత్వం: వి యశస్వి

తారాగణం : దీపక్ సరోజ్, తన్వీ నేగి, మ్యాథ్యూ వర్గీస్, కళ్యాణీ ఎన్, ఆనంద్ తదితరులు

సంగీతం : రధన్, ఛాయాగ్రహణం : శ్యామ్ కె నాయుడు

నిర్మాత: జయ ఆడపాక

విడుదల: ఫిబ్రవరి 23, 2024

రేటింగ్: 2/5

చాలాకాలం క్రితం ప్రారంభమై ఈవారం విడుదలైన ‘సిద్ధార్థ్ రాయ్’ కొత్త దర్శకుడు యశస్వి డ్రీమ్ ప్రాజెక్టు. దాదాపు ‘అర్జున్ రెడ్డి’ విడుదలై నప్పటినుంచి దీన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికి పూర్తి చేశాడు. ఇందులో బాల నటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించిన దీపక్ సరోజ్ ని హీరోగా తీసుకున్నాడు. ఇది ఇతడికి చాలా గట్టి పరీక్ష. ఎందుకంటే మెంటల్ క్యారక్టర్ ని చరిత్రలో నిలిచిపోయేలా నటించడం 1. ‘చివరకు మిగిలేది’ లో సావిత్రి, 2. ‘కృష్ణవేణి’ లో వాణిశ్రీలకే సాధ్యమైంది. అలాటిది కొత్త హీరో మీద ఇంత భారమా? ఏం చేశాడో చూద్దాం...

కథ

సిద్దార్థ రాయ్ (దీపక్ సరోజ్) ధనిక కుటుంబానికి చెందిన స్టూడెంట్. అతను ఇందు(తన్వి నేగి) అనే అమ్మాయి మీద ప్రేమ పిచ్చితో అలజడి సృష్టిస్తాడు. దీంతో అతడి తండ్రి (ఆనంద్ భారతి) ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ కి కొడుకు గురించి చెప్తాడు. పోలీస్ ఇన్స్ పెక్టర్ సిద్ధార్థ గురించి ఎంక్వైరీ చేస్తూంటే ఒకొక్కరూ అతడి గురించి చెప్పుకొస్తారు. సిద్ధార్థ చిన్నప్పుడే ఫిలాసఫీ పుస్తకాలు చదివేసి బాల మేధావిగా పెరుగుతాడు. ఈ మేధావితనంతో లాజిక్ తప్ప సున్నిత భావాలు డెవలప్ కాకుండా పోతాయి. తిండి, నిద్ర, సెక్స్ మాత్రమే మనిషి అవసరాలనీ, వాటి కోసమే బతుకుతున్నామనీ, ఆకలేస్తే ఆకులు తింటాడు, నిద్రవస్తే రోడ్డు పక్క నిద్రపోతాడు, కోరిక పుడితే పని మనిషితో సెక్స్ చేస్తాడు. ఇలాటి అతడికి కాలేజీలో ఇందు పరిచయమవుతుంది. ఆమె ఫీలింగ్స్ లేకపోతే బతకడం వృధా అని కాలేజీ కాంపిటీషన్ లో అతడ్ని ఓడించేస్తుంది. దీంతో ఫీలింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన ఫీలింగ్స్ తో న్యూసెన్స్ గా మారతాడు. ఇప్పుడు ఇందుతో అతడి ప్రేమ సంబంధం ఏమైందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

రాజభోగాల్ని త్యజించి బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడి పోలికతో కథ చెప్పాలనుకున్నారు. సిద్ధార్ధుడు లోకంలో దుఖాన్ని చూసి బుద్ధుడిగా మారాడు. ఈ కథలో ధనికుడైన సిద్ధార్థ్ రాయ్ లోకం కోసం భోగాల్ని త్యజించలేదు. వెర్రి మేధావితానంతో బుర్ర పాడు చేసుకుని బజారు పాలయ్యాడు. అందరికీ సమస్య అయ్యాడు. అతను త్యజిస్తే మధ్యలో మేధావితనం త్యజించి ఫీలింగ్స్ పెంచుకున్నాడు. మళ్ళీ ఈ ఫీలింగ్స్ ని మితిమీరి పెంచుకుని సమస్య అయిపోయాడు. ప్యూర్ మెంటల్ కేసు కథ ఇది. పట్టుకుని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే తప్ప దారికి రాడు.

ఇలాటి బాధ్యత లేని, పిచ్చి యూత్ క్యారక్టర్ కథని సానుభూతితో సినిమాగా చూడడం కష్టమే. ఫీలింగ్స్ లేకుండా పెరగడానికి బాల్యంలో ఎవరో హాని చేసి వుంటే జాలిపుట్టి, బాగుపడాలని కోరుకుంటామే తప్ప, ఇలా చెడిపోతే కాదు. ఫీలింగ్ పెంచుకోవడానికి మేధావితనాన్ని వదిలేయడం ఎందుకు? మనిషికి లాజికల్ మైండ్, ఎమోషనల్ మైండ్ రెండూ వుంటాయి. ఫీలింగ్స్ లేని మేధావితనానికి ఫీలింగ్స్ జోడించుకుని మనిషిగా మారవచ్చు. ఇది చాలా క్లిష్టమైన సైకలాజికల్ సబ్జెక్టు. దీన్ని ప్రేక్షకులకి అర్ధమయ్యేలా తీయడానికి చాలా కష్టపడాలి. వివిధ పుస్తకాల్లో కోట్స్ గురించి చెబుతూంటే ప్రేక్షకులకి అర్థం చేసుకునే ఓపికకూడా వుండదు. ఈ సినిమా మేధావుల కోసమూ కాక, సామాన్యుల కోసమూ కాక ఎవరి కోసం తీశారో అర్ధం కాదు. ఈ కథని వందమందికి చెప్పినా వర్కౌట్ కాక తానే సహ నిర్మాతగా మారి తీశానన్నాడు దర్శకుడు. సినిమా ప్రమోషన్స్ లో ఇలాటి స్టేట్ మెంట్ లతో సెల్ఫ్ గోల్ చేసుకోవడమే. సైకాలజీ మీద సినిమా తీసిన దర్శకుడి సైకాలజీ ఇలా వుంది!

నటనలు- సాంకేతికాలు

దీపక్ సరోజ్ పాత్ర, నటన చూస్తే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు గుర్తుకు రాకమానవు. ఇది మైనస్ అవుతుంది బాక్సాఫీసుకి. హీరోగా సరోజ్ ఫస్టాఫ్ నటించడానికి కష్టపడనవసరం లేకుండా పోయింది. ఎందుకంటే అది ఫీలింగ్స్ లేని పాత్ర. సెకండాఫ్ లో ఫీలింగ్స్ దగ్గరికి వచ్చేసరికి అది కూడా వెర్రి కావడంతో రఫ్ గా నటించేసి బయటపడ్డాడు. ఇక్కడ రోమాన్స్ పేరుతో హీరోయిన్ తో అతి బోల్డ్ దృశ్యాలు, అతి అడల్ట్ డైలాగులూ యదేచ్చగా ప్రవహించాయి.

హీరోయిన్ తన్వీ ఫస్టాఫ్ గ్లామర్ దృశ్యాలు, సెకండాఫ్ బోల్డ్ దృశ్యాలు నటించి ప్రేక్షకుల్ని రెచ్ఛగొట్టే ప్రయత్నం చేసింది. హీరో హీరోయిన్లతో సమస్యేమిటంటే ఇద్దరి మధ్య ఫీలవడానికి రోమాంటిక్ డ్రామా అనేదే లేదు.

కథని ఎలా నడపాలా అని గాక హీరోపాత్ర చేష్టల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో ప్రణాళిక లేని కథ నిడివిని పెంచుకుంటూ సాగుతూ- సాగుతూ పోయింది. ఇక సంగీత దర్శకుడు రధన్ తో గొడవ కూడా బయట పెట్టి ఇంకో హాని చేసుకున్నాడు దర్శకుడు. దానికి తగ్గట్టే సంగీతమూ పాటలూ వున్నాయి. శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం బడ్జెట్ కొరతని చాటి చెప్పింది.

మొత్తానికి సినిమా సాంతం ఎలా నడిచినా క్లయిమాక్స్ ని మాత్రం బాగా తీశాడు. కానీ గుర్తుండేది మాత్రం, కనపడిన పాత్రల్లా లాజిక్స్ గురించి, ఫీలింగ్స్ గురించీ క్లాసు తీసుకుంటూనే వుండడం.

First Published:  23 Feb 2024 4:57 PM IST
Next Story