Telugu Global
MOVIE REVIEWS

Pathaan Movie Review: ‘పఠాన్’ - మూవీ రివ్యూ! {3/5}

Shah Rukh Khan's Pathaan Movie Review: సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రసిద్ధ నిర్మాత ఆదిత్యా చోప్రా అందిస్తున్న ‘పఠాన్’ గత సంవత్సరపు బాలీవుడ్ భారీ పరాజయాల రికార్డుని సరిదిద్ది కొత్త ప్రారంభాన్ని స్థాపిస్తుందని ఆశిస్తున్నారు.

Pathaan Movie Review: పఠాన్ మూవీ రివ్యూ
X

Pathaan Movie Review: పఠాన్ మూవీ రివ్యూ

చిత్రం: పఠాన్

దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్

తారాగణం : షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే, జాన్ అబ్రహాం, డింపుల్ కపాడియా, షాజీ చౌదరి, ఆశుతోష్ రాణా తదితరులు

కథ : సిద్ధార్థ్ ఆనంద్, స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవన్, మాటలు : అబ్బాస్ టైర్ వాలా

సంగీతం- పాటలు : విశాల్ -శేఖర్, నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా-అంకిత్ బల్హారా, ఛాయాగ్రహణం : సత్ ఛిత్ పౌలోస్

బ్యానర్ : యశ్ రాజ్ ఫిల్మ్స్

నిర్మాత : ఆదిత్యా చోప్రా

విడుదల : జనవరి 25, 2023

రేటింగ్ : 3/5


సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రసిద్ధ నిర్మాత ఆదిత్యా చోప్రా అందిస్తున్న ‘పఠాన్’ గత సంవత్సరపు బాలీవుడ్ భారీ పరాజయాల రికార్డుని సరిదిద్ది కొత్త ప్రారంభాన్ని స్థాపిస్తుందని ఆశిస్తున్నారు. యశ్ రాజ్ సినిమాల వైఫల్యాల పరంపరని ఈ యాక్షన్ సినిమా బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. మూడు వరుస ఫ్లాపులతో గత నాల్గేళ్ళుగా పెద్దతెర మీద కన్పించకుండా పోయిన షారుఖ్ ఖాన్ పునరాగమనం అతడి భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది. 2019లో యశ్ రాజ్ ఫిలిమ్స్ కి హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ లతో ‘వార్’ అనే సూపర్ హిట్ మూవీ అందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భుజాల మీద ఇప్పుడు ఫ్లాపుల్లో వున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ నీ, షారుఖ్ ఖాన్ నీ ఒడ్డున పడేయాల్సిన బాధ్యత వుంది. ఇదే గనుక జరిగితే రియల్ పఠాన్ సిద్ధార్థ్ ఆనంద్ అవుతాడు. ఇది జరిగిందా లేదా చూద్దాం...

కథ

2019 లో ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ జనరల్ ఖదీర్ (మనీష్ వాధ్వా) ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాది జిమ్ (జాన్ అబ్రహాం) ని ఉసిగొల్పు

తాడు. జిమ్ ఇండియామీద పగబట్టిన మాజీ ఇండియన్ ‘రా’ ఏజెంట్. ఈ సమయంలో ‘రా’ లోనే పనిచేసే నందిని (డింపుల్ కపాడియా), ఫ్రాన్స్ లో తేలిన పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ డాక్టర్ రుబీనా (దీపికా పడుకొనే) సీసీ టీవీ వీడియో చూసి ఎలర్ట్ అవుతుంది. దీంతో ఒకప్పుడు అత్యుత్తమ ‘రా’ ఏజెంట్‌లలో ఒకడైన పఠాన్ ( షారుఖ్ ఖాన్ ) కి ఆపరేషన్ అప్పజెప్తుంది. ఈ క్రమంలో రష్యాలో భద్రపర్చిన రక్త బీజ్ అనే మశూచి ద్రావణాన్ని తస్కరించి దాంతో ఇండియాని ధ్వంసం చేయడానికి జిమ్, రుబీనాలు పథకం పన్నారని తెలుసుకున్న పఠాన్, ఈ కుట్రని ఎలా తిప్పికొట్టాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

హై కాన్సెప్ట్ స్పై అడ్వెంచర్ కథ. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాల్లో ఎలాగైతే సింపుల్ కథ, దాంతో హెవీ యాక్షన్ వుంటాయో ఆ తరహా మేకింగ్. హిట్టయిన ‘బ్రహ్మాస్త్ర’ కూడా ఇదే తరహా మేకింగ్. ‘పఠాన్’ లో మూడే ప్రధాన పాత్రలు- పఠాన్, రుబీనా, జిమ్ ల మధ్య రక్త బీజ్ కోసం హోరాహోరీ. ఈ హోరాహోరీలో చివరంటా వూహించని మలుపులు. హాలీవుడ్ భాషలో చెప్పాలంటే మలుపులతో పది నిమిషాలకో ‘వామ్మో’ (బ్యాంగ్). ఒక్కో వామ్మోతో- కొత్త మలుపుతో- సింపుల్ కథ ఒక్కో లెవెల్ పైకెళ్తూ వుంటుంది. ఒక్కో వామ్మోతో ఒక్కో భావోద్వేగం- దేశభక్తి, యాక్షన్, హాస్యం, థ్రిల్, కన్నీళ్లూ, ఉద్రేకం, భయం, స్నేహం, రోమాన్స్, సస్పెన్స్ ప్లే అవుతూ వుంటాయి. ఎంటర్టయినర్ పేరుతో అడ్డుతగిలే ఇతర కమర్షియల్ మసాలాలుండవు.

ప్రాంతాలు మాత్రం యాక్షన్ తో నిండిపోయి చాలా వుంటాయి- దుబాయి, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, మాస్కో, మలోర్కా, కాడిజ్, సైబీరియా మొదలైనవి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా యాక్షన్. రోడ్ల మీద, భవనాల్లో, పర్వతాల్లో మంచు పర్వతాల్లో, ట్రైను మీద, ఆకాశంలో హెలీకాప్టర్ల మీద, ఘనీభవించిన సరస్సులో –ప్రతీ ఛోటా విలన్ జిమ్ పాత్ర నటించిన జాన్ అబ్రహాం షారూఖ్ ఖాన్ని ముప్పుతిప్పలు పెడతాడు.

చిత్ర విచిత్ర తుపాకులు, క్షిపణులు, బాంబులు. ఈ యాక్షన్లో లాజిక్ మాత్రం అడగవద్దు. వివిధ వాహనాలు, ఆయుధాలు రెడీగా వుంటాయి. జాన్ కి ఏది దొరుకుతుందో, పక్కన రెడీగా పెట్టి షారుఖ్ కీ అదే దొరుకుతుంది. ఇక వాటితో ఛేజింగ్స్, కొట్టుకోవడం, కాల్చుకోవడం. మధ్యలో ‘టైగర్ జిందా హై’ లో స్పై గా నటించిన సల్మాన్ ఖాన్ వచ్చేసి షారుఖ్ ని కాపాడతాడు. షారుఖ్, దీపికా, జాన్ అబ్రహాంల స్పీడ్ యాక్షన్ సీన్లు, ఫైట్లు కళ్ళు తిప్పుకోనివ్వవు.

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ కథ చాలా సరళంగా వున్నా మూలంలో మూస కథే. ఒక ఫార్ములా కోసం స్పై కథలు పాతవే. దీనికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్‌ప్లే మాత్రం బోరు కొట్టించే సన్నివేశాలు లేకుండా నిత్య చలనంలో వుంచాడు. మాస్ రైటర్ అబ్బాస్ టైర్ వాలా ఈసారి సింపుల్ డైలాగులు, హుషారైన డైలాగులు, కొన్ని చోట్ల కదిలించే డైలాగులు రాశాడు. అదే పనిగా అక్షయ్ కుమార్ కాపీరైటు చేసుకున్న దేశభక్తి మోత మోగించే, జింగోయిజం జోలికి పోలేదు. ఇది భక్తులకి పనికొచ్చే ఎజెండా మూవీకాదు. భక్తులు రెచ్చిపోయిన ఆ బికినీ మాత్రం సినిమాలో అలాగే వుంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం క్వాలిటీతో వుంది. 250 కోట్ల బడ్జెట్ తో క్వాలిటీని పై స్థాయిలో వుంచుతూ కథనం, దానికి తగ్గ మేకింగ్ చేశాడు. సెకండాఫ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంటేజస్ డిసీజ్‌లో నందిని పాత్ర నటించిన డింపుల్ కపాడియా ఎమోషనల్ సీక్వెన్స్ ని మామూలు ప్రేక్షకుడు ఏడ్చేలా తీశాడు.

నటనలు- సాంకేతికాలు

పఠాన్ రఫ్- మాస్ లుక్ పాత్రలో షారుఖ్ ఖాన్ పైసా వసూల్ ఎంట్రీ ఇస్తాడు ప్రారంభంలోనే. హెవీ యాక్షన్ కి తగ్గ షేపులో డాషింగ్ గా వుంటాడు. ఆ వయసుకి సాధ్యంకాని పోరాట విన్యాసాలు చేశాడు. కొన్ని చోట్ల మాస్ లుక్, కొన్ని చోట్ల క్లాస్ లుక్ తో ఎంటర్ టైన్ చేస్తాడు. మాస్ లుక్ సిల్వస్టర్ స్టాలోన్ రాంబో లా వుంటుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రస్తుతానికి తను టాప్ అన్పించుకున్నాడు.

హాట్ హాట్ గా దీపికా పడుకొనే బేషరమ్ రంగ్ పాటతో బికినీల్లో ఎంట్రీ ఇస్తుంది. ఆమె ప్రతీ సీనులో ఎక్స్ ఫోజ్ చేస్తూనే వుంటుంది. ఆమె పాత్రకి షేడ్స్ వున్నాయి. ఇంటర్వెల్లో బయటపడే ఆమె ఒక షేడ్ షాకిస్తుంది. కథనంలో ఆమె పాత్ర కీలకమైనది. యాక్షన్ సీన్స్ లో చాలా కూల్ గా వుంటుంది. షారుఖ్ కి, జాన్ అబ్రహాంకీ వున్నట్టే తనకీ ఓ బాధాకర ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఇక హీరో జాన్ అబ్రహాం భయంకర, ఫన్నీ, కామిక్, డాషింగ్ విలన్ పాత్ర వేయడం ఒక హైలైట్. ఎప్పుడేం చేస్తాడో వూహకందని ఎత్తుగడలతో చివరిదాకా ఏడ్పిస్తాడు. డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా (‘రా’చీఫ్), ప్రకాష్ బెలవాడి (సైంటిస్ట్) నటనలు సింపుల్ గా వుంటూనే సన్నివేశాల్ని ప్రభావితం చేస్తాయి. షారుఖ్- సల్మాన్ల ట్రైను మీద వాళ్ళ మధ్య బాండింగ్, యాక్షన్ సీను, దాని ముగింపూ చాలా హైరేంజిలో వుంటాయి.

విశాల్- శేఖర్ సంగీతంలో 'బేషరమ్ రంగ్’, 'ఝూమే జో పఠాన్' రెండు పాటలున్నాయి. సంచిత్ బల్హారా- అంకిత్ బల్హారా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు స్పై థ్రిల్లర్ కి సరిపోలే బాణీలతో గుర్తుండి పోతుంది. సత్ చిత్ పౌలోస్ కెమెరా విదేశీ లొకేషన్స్ ని సమున్నతంగా కళ్ళముందుంచుతుంది. 19 మంది విదేశీ యాక్షన్ డైరెక్టర్లు సమకూర్చిన యాక్షన్ సీన్లు అంతర్జాతీయ స్థాయిలో వున్నాయి. వీఎఫ్ఎక్స్ కూడా ప్రపంచ ప్రమాణాలకి సరిపోలుతుంది.

మొత్తం మీద ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుఖ్ కి, ఆదిత్యా చోప్రాకీ వూహించని హిట్టిచ్చినట్టే దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. షారుఖ్ పునరాగమనాన్ని సమతులాహారం చేసిన అతడికి రియల్ పఠాన్ టైటిల్ ఇవ్వాలి.

First Published:  25 Jan 2023 4:20 PM IST
Next Story