Sapta Sagaralu Dhaati (Side A) Review : సప్త సాగరాలు దాటి.. రివ్యూ! {2.5/5}
Sapta Sagaralu Dhaati (Side A) Review : కన్నడలో విడుదలై ప్రశంసలతో బాటు ఆర్థిక విజయం కూడా పొందిన ఈ కన్నడ డబ్బింగ్, ఇంతవరకూ తెరమీదికి రాని అద్భుత ప్రేమ కావ్యంగా తీశామని ప్రచారం చేశారు. ఈ ప్రేమ కావ్యం ఎలా వుందో కథలోకి వెళ్తే..
రచన -దర్శకత్వం : హేమంత్ ఎం. రావు
తారాగణం : రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, అనీష్, అచ్యుత్ కుమార్, పవిత్రా లోకేష్ తదితరులు
సంగీతం : చరణ్ రాజ్, ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
బ్యానర్ : పరమ్వాహ్ స్టూడియోస్, నిర్మాత : రక్షిత్ శెట్టి
పంపిణీ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల : సెప్టెంబర్ 2, 2023
2.5/5
గత సంవత్సరం కన్నడ నుంచి ‘కేజీఎఫ్-2’, ‘కాంతారా’ అనే యాక్షన్ సినిమాలు తెలుగులో విడుదలై సూపర్ హిట్టయిన తర్వాత, ఈ సంవత్సరం ‘సప్త సాగరాలు దాటి..’ అనే ప్రేమ కథ తెలుగు ప్రేక్షకుల ముందు కొచ్చింది. దీన్ని ‘సప్తసాగరదాచే ఎల్లో’ పేరుతో కన్నడలో హీరో రక్షిత్ శెట్టి నిర్మించాడు. సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలై ప్రశంసలతో బాటు ఆర్థిక విజయం కూడా పొందిన ఈ కన్నడ డబ్బింగ్, ఇంతవరకూ తెరమీదికి రాని అద్భుత ప్రేమ కావ్యంగా తీశామని ప్రచారం చేశారు. ఈ ప్రేమ కావ్యం ఎలా వుందో కథలోకి వెళ్తే..
కథ
మనూ (రక్షిత్ శెట్టి) సంపన్నుడైన శేఖర్ గౌడ (అవినాష్) దగ్గర డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ప్రియా (రుక్మిణీ వసంత్) కాలేజీలో చదువుతూ సింగర్ కావాలన్న కలలతో వుంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ప్రియకి మనూతో ఉంటే సముద్రంతో కలిసి వున్నట్టు వుంటుంది. పెళ్ళి చేసుకుని బీచి దగ్గర ఇల్లు కట్టుకోవాలన్న కోరికతో వుంటుంది. ఇలావుండగా.. ఒక రోజు గౌడ కొడుకు కారు యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం తీస్తాడు. దీంతో గౌడ మనూకి ఒక ప్రతిపాదన పెడతాడు. ఈ నేరం మీదేసుకుని జైలుకి పోతే 30 లక్షలు ఇస్తానంటాడు. మూడు నెలల్లో బెయిల్ మీద విడిపిస్తానంటాడు. 3 లక్షలు అడ్వాన్సు ఇస్తాడు. ప్రియా కోరిక తీర్చాలన్న లక్ష్యంతో వున్న మనూ ఇది ఒప్పుకుని జైలుకి పోతాడు. అయితే మాటిచ్చిన గౌడ గుండెపోటుతో చనిపోతాడు. ఇక మనూ తనని కాపాడే వారు లేక, ప్రియా కోసం కన్న కలలు కల్లలై, చేయని నేరానికి జైల్లో ఇరుక్కుంటాడు. అటు మనూకి దూరమై ప్రియ విషాదంలో మునిగిపోతుంది. ఇప్పుడు ఈ ప్రేమికులిద్దరి మధ్య దూరాలు ఎలా తొలగి ఏకమయ్యారన్నది మిగిలిన కథ.
ఎలావుంది కథ
లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం నీతి తప్పితే శిక్ష తప్పదనే అర్థంలో ఈ కథ వుంటుంది. ప్రియురాలి కలని నెరవేర్చడం కోసం చేయని నేరాన్ని మీదేసుకుంటే ఆమెకి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు ఎలా వచ్చాయన్నది భావోద్వేగభరితంగా చెప్పే కథ ఇది. అయితే అపార్థాలతో విడిపోవడాలు, కాకపోతే మూగ ప్రేమలతో అలమటించడాలూ అనే రెండే ఫార్ములాలతో వచ్చే ప్రేమ కథల ముందు- కాస్త తేడా గల కథ ఇది. చాలా కవితాత్మకంగా, లోతైన తాత్విక ఇతివృత్తాలతో చెప్పే ప్రయత్నం చేశారు.
ఫస్టాఫ్ ప్రేమ, కలలు, జైలు చూపించాక, సెకండ్ ఆఫ్ లో జైల్లో మనూ సంఘర్షణ తాలూకు కథనం, తోటి ఖైదీలతో ఘర్షణ, ప్రియాకోసం తపన వగైరా అంశాలతో సాగుతుంది. అయితే ప్రేమని మరీ క్లాసిక్ గా చెప్పే ప్రయత్నం వల్ల సినిమా నడక తగినంత వేగంతో వుండదు. దర్శకుడి భావుకతలో లీనమై సినిమాని చూడాల్సి వుంటుంది. లోతైన సంభాషణాల్ని కూడా అర్థం చేసుకోవాల్సి వుంటుంది. మరొకటేమిటంటే.. ఇది రోమాంటిక్ డ్రామా కావడం వల్ల పాసివ్ పాత్రలతో కథని చూడాల్సి వుంటుంది. సెంటిమెంటల్ గా చెప్పుకుంటే, విధి ఆడిన వింత నాటకంలో చిక్కుకున్న ప్రేమికుల కథ. లాజికల్ గా చెప్పుకుంటే, చేసుకున్న వారికి చేసుకున్నంత. విధితో సంబంధం లేదు.
ఈ భావుకతతో కూడిన ప్రేమ కథని ప్రియురాలి కళ్ళల్లో ఉట్టిపడే భావాలతో, ఇంటలిజెంట్ కెమెరా వర్క్ తో, దృశ్యం కంటే సంగీతమే చెప్పే అర్థాలతో సమున్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రేమికుల సన్నిహిత క్లోజప్‌లు, భావోద్వేగాలతో కూడిన విజువల్స్ ఒడిదుడుకులు లేకుండా ఏకీకృతం చేయడం వలన – ప్రేమికుల ఎడబాటులోని తీవ్ర నైరాశ్యాన్ని, ఏకమవ్వాలన్న తీవ్ర వాంఛనూ ప్రభావవంతంగా తెలియజేశాడు దర్శకుడు.
నటనలు –సాంకేతికాలు
ఇది ఏ ఒక్కరి సినిమా కాదు- రక్షిత్, రుక్మిణీ పోటాపోటీగా నటించి నిలబెట్టిన పాత్రలివి. ప్రియ పాత్రలో రుక్మిణి శక్తివంతమైన నటనని ప్రదర్శించింది. పాత్ర వేదనని, దృఢ నిశ్చయాన్నీ సమర్థవంతంగా పోషించింది. మరోవైపు, రక్షిత్ శెట్టి పాత్రలో దుర్బలత్వాన్ని, పచ్చి భావోద్వేగాలనీ ప్రేక్షకుల హృదయాల్లో చొచ్చుకుపోయేలా నటించాడు. ఈ రెండు పాత్రల్లో వీళ్ళిద్దరూ కొంత కాలం ప్రేక్షకుల్ని వెంటాడుతారు.
చరణ్ రాజ్ సంగీతం నటుల మూడ్ ట్రాన్సిషన్స్ ని లోతైన స్వరాలతో పలికించేలా వుంటుంది. భావోద్వేగాల పరంపరని ఎలివేట్ చేస్తూ పోతూ ఉంటుంది. ఈ సంగీతం కథలో అట్టడుగు నుంచి పాలు పంచుకుంటుంది. ఇదొక ప్లస్ పాయింటు. ఇదే అద్వైత గురుమూర్తి కెమెరా వర్క్ కి వర్తిస్తుంది.
ఈ కథ సంపూర్ణం కాదు, ఇంకా వుంది. రెండో భాగం కన్నడలో అక్టోబర్ 20న విడుదలవుతుంది. మొదటి భాగం ముగింపు రెండో భాగం కోసం ఎదురు చూసేలా చేస్తుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ పంథాలో వుండదు- రియలిస్టిక్ లేదా సెమీ రియలిస్టిక్ సినిమాగా దీన్ని చూడాలి.
*