Samajavaragamana Review: సామజవరగమన మూవీ రివ్యూ {2.75/5}
Samajavaragamana Movie Review: శ్రీవిష్ణు గత నాల్గేళ్ళలో ‘బ్రోచేవారెవరురా’, ‘రాజరాజ చోర’ తప్పితే, నటించిన మిగతా ఐదు సినిమాలతో ఫ్లాపు లెదుర్కొని, ప్రస్తుతం మరో తన లెవెల్ కామెడీతో వచ్చాడు.
చిత్రం: సామజవరగమన
రచన-దర్శకత్వం: రామ్ అబ్బరాజు
తారాగణం: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం : రామ్ రెడ్డి
సమర్పణ: అనిల్ సుంకర, సహ నిర్మాత : బాలాజీ గుత్తా, నిర్మాత : రాజేష్ దండ
విడుదల: జూన్ 29, 2023
రేటింగ్: 2.75/5
శ్రీవిష్ణు గత నాల్గేళ్ళలో ‘బ్రోచేవారెవరురా’, ‘రాజరాజ చోర’ తప్పితే, నటించిన మిగతా ఐదు సినిమాలతో ఫ్లాపు లెదుర్కొని, ప్రస్తుతం మరో తన లెవెల్ కామెడీతో వచ్చాడు. ‘సామజవరగమన’ అనే ఈ కామెడీకి ‘వివాహభోజనంబు’ తీసిన రామ్ అబ్బరాజు దర్శకుడు. ప్యూర్ కామెడీ సినిమాలు కరువైపోయిన ఈ రోజుల్లో, ఆరోగ్యకర హాస్యంతో ఓ సినిమా తీయడమే కాదు, దాన్ని సక్సెస్ చేయడం కష్టమైన పనే. ఈ పనిని ఎలా సాధించారో చూద్దాం...
కథ
బాలు (శ్రీవిష్ణు) మల్టీప్లెక్స్ లో బుకింగ్ క్లర్క్ గా వుంటాడు. ఇంటిదగ్గర తల్లిదండ్రులుంటారు. తండ్రి ఉమామహేశ్వరరావు (నరేష్) కి విచిత్ర సమస్య వుంటుంది. అతను డిగ్రీ పాసైతేనే కోట్ల రూపాయల ఆస్తి అతడికి చెందేలా వీలునామా రాశాడు తండ్రి. దీంతో 30 ఏళ్ళుగా డిగ్రీ పాసయ్యేందుకు పరీక్షలు రాస్తూనే వుంటాడు ఉమామహేశ్వరరావు. తండ్రి చేత పదేపదే పరీక్షలు రాయిస్తూ విసిగిపోతాడు బాలు. బాలు గతంలో ప్రేమలో దెబ్బతిని వుంటాడు. దాంతో ఏ అమ్మాయి లవ్యూ చెప్పినా చిర్రెత్తుకొచ్చి రాఖీ కట్టించుకుంటాడు. ఒక పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికొచ్చిన సరయూ (రెబా మోనికా జాన్) పరిచయమవుతుంది. ఆ పరిచయం పెరిగి బాలు ఇంట్లో పేయింగ్ గెస్టుగా దిగు తుంది. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడతారు. పడ్డాక సరయూ తనకి చెల్లెలి వరస అని తెలుస్తుంది.
ఇప్పుడేం చేశాడు బాలు? ప్రేమలో ఈ చిక్కు ఎలా వీడింది? తండ్రి డిగ్రీ పాసై ఆస్తికి వారసుడయ్యాడా? ఈ ప్రశ్నలతో మిగతా కథ కొనసాగుతుంది.
ఎలావుంది కథ
2021 లో తమిళంలో సంతానం నటించిన కామెడీ ‘పారిస్ జైరాజ్’ విడుదలైంది. అందులో సంతానంకి ప్రేమిస్తున్న హీరోయిన్ చెల్లెలి వరస అని తెలుస్తుంది. ఇదే పాయింటు ‘సామజవరగమన’ లో వుంది. ఈ పాయింటులో చాలా పూర్వం కె బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగళ్’ (తెలుగులో దాసరి నారాయణ రావు ‘తూర్పు పడమర’) హిట్టయ్యింది. అయితే ఇది సీరియస్ కథ. ‘సామజవరగమన’ లో కామెడీ కథ. ఈ కథతో సంబంధం లేకుండా టైటిల్ పెట్టారు. ‘శంకరాభరణం’ లో రాజ్యలక్ష్మి ప్రేమిస్తున్న చంద్రమోహన్ తో ‘సామజవరగమన’ పాట పాడుకుంటూ వుంటే, తండ్రి శంకర శాస్త్రికి దొరికిపోయి - శారదా!- అని అతను గద్దించే ఐకానిక్ సీనుని సెటైర్ గా వాడుకుని టైటిల్ కి న్యాయం చేసి వుండొచ్చు.
ఇంటర్వెల్ సీనులో ఓ పెళ్ళిలో శ్రీవిష్ణుకి కమెడియన్ ఫ్రెండ్ సుదర్శన్, హీరోయిన్ రెబా ని చూపించి, ఆమె నీ చెల్లెలి వరస అవుతుందని చెప్పే సాదాగా అన్పించే ట్విస్టుని, పైన చెప్పిన ‘శంకరాభరణం’ సీనుతో సెటైర్ చేసి వుండాల్సింది. శ్రీవిష్ణు -రెబాల మీద ‘సామజవరగమన’ పాట క్రియేట్ చేసి మధ్యలో సుదర్శన్ చేత -ఆమె నీ చెల్లెలురా- అని అరిపించి వుంటే ట్విస్టు చాలా హాస్యభరితంగానూ వుండేది.
ఇప్పుడు తెలుగులో జంధ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి ఫక్తు కామెడీలు తీసే దర్శకులు కరువై పోయారు. రోమాంటిక్ కామెడీలు తీసినా ఫస్టాఫ్ నవ్వించి సెకండాఫ్ ఏడ్పించే సినిమాలే తీస్తారు. ప్రస్తుత కామెడీలో ప్రేమకి బ్రేకు పడ్డా, సెకాండాఫ్ కామెడీగానే సాగడంతో ఇది పై దర్శకుల ధోరణిలో ఫక్తు కామెడీ సినిమా అన్పించుకునేలా వుంది.
ఈ కామెడీకి చెల్లెలి వరస అనే సంఘర్షణ, తండ్రి పరీక్షలు రాసే సబ్ ప్లాట్ తో బాటు, హీరో అమ్మాయిల చేత రాఖీలు కట్టించుకునే -మూడూ ఆసక్తిని పెంచే యాంటీ ప్లాట్ కథనాలు తోడ్పడ్డాయి. దీంతో బాటు వదలకుండా ఫన్నీ డైలాగులు, సిట్యుయేషనల్ కామెడీలూ- కథకి బలాన్నిచ్చాయి. రొటీన్ గా సినిమాల్లో అవారాగా తిరిగే కొడుకుని చదువుకోమని తిట్టే తండ్రి వుంటాడు. ఈ పాత ఫార్ములాని ఇక్కడ రివర్స్ చేశారు- కొడుకే తండ్రిని చదువుకోమని తిట్టే ట్రాక్.
ఇంకా ప్రధాన కథ లవ్ ట్రాక్ ని ఎక్కడా బరువెక్కించకుండా చివరి వరకూ కామెడీతోనే నవ్వించేలా క్రియేట్ చేయడం వినోదాత్మక విలువల్ని పెంచింది. మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ ధరల గురించి జోకులు, ఏషియన్- పీవీఆర్ మల్టీప్లెక్సుల మీద సెటైర్లు, సెకండాఫ్ లో కులశేఖర్ పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ, నరేష్ తో ఒక సినిమా స్పూఫ్ మొదలైనవి దర్శకుడి క్రియేటివిటీకి అద్దంపట్టేలా వున్నాయి.
అయితే అక్కడక్కడా ద్వంద్వార్ధాలు ప్రయోగించడం క్లీన్ ఎంటర్ టైనర్ కి సెట్ కాలేదు. కథలో లాజిక్కులు వుండవు. కామెడీతో లాగించడమే వుంది. అయితే సెకండాఫ్ లో కొన్ని చోట్ల కథ ముందుకు కదలదు. బోరు కొట్టేలా దృశ్యాలుంటాయి. ఇక చెల్లెలి వరస సమస్యకి పరిష్కారం పైన చెప్పిన తమిళ సినిమాలోనిదే- ప్రేక్షకులు వూహించుకో గలదే.
కామెడీకి నటీనటుల టైమింగ్ కూడా బాగా వుండేలా చూసుకుంటూ –ఒక పూర్తి నిడివి కామెడీ సినిమాని సక్సెస్ దిశగా నడిపాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఇంకా ఇలాటివే సినిమాలు తీస్తూ హాస్య దర్శకులు లేని లోటు తీరిస్తే బావుంటుంది.
నటనలు- సాంకేతికాలు
మధ్య తరగతి యువకుడి పాత్రలో చుట్టూ సమస్యలు సృష్టించుకుని యాతన పడే ఫన్నీ క్యారక్టర్ గా శ్రీవిష్ణు నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. యూత్ లో మరింత క్రేజ్ ని పెంచుకునేలా కృషి చేశాడు. తండ్రి పాత్రలో నరేష్ తో కామిక్ బాండింగ్ బాగా కుదిరింది. భయపెట్టి మరీ రాఖీలు కట్టించుకునే సీన్స్ ని కూడా ఎలివేట్ చేశాడు. లాజిక్ చూడని కమర్షియల్ లవర్ గా హీరోయిన్ రెబాతో రోమాన్స్ ని కూడా పండించాడు. చాలా కాలానికి ఒక హిట్ ని సాధించాడు.
హీరోయిన్ రెబా కామిక్ టైమింగ్ తో చెప్పే డైలాగులు, నటన, ఆమె పాత్ర బ్యాక్ గ్రౌండ్, ఆమె తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ తో సీన్లూ వగైరా బాగా పోషించింది. పరీక్షలు రాసే కామెడీ సీన్లతో నరేష్ పాత్ర సినిమాకి ఓ మూల స్తంభం. ఇక మిగిలిన అన్ని పాత్రల్లో అందరూ కామెడీ పల్లకీని తేలిగ్గా మోసేశారు.
గోపీసుందర్ సంగీతంలో ఒక పాటే బావుంది. మిగిలిన పాటలు కామిక్ ఫ్లోకి అడ్డుపడే క్వాలిటీతో వున్నాయి. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం ఉన్నతంగా వుంది కలర్ఫుల్ విజువల్స్ తో. మిగతా సాంకేతిక హంగులు ఫర్వాలేదు. పూర్తి నిడివి కామెడీని నిలబెట్టాలంటే దర్శకత్వ ప్రతిభ కంటే ముందు, సృజనాత్మక రచన ముఖ్యమని తేల్చి చెప్పే ఈ ఫ్యామ్ –కామ్ (ఫ్యామిలీ కామెడీ) హిట్లు లేని శ్రీవిష్ణుని పై మెట్టు పైకెక్కించింది.