Telugu Global
MOVIE REVIEWS

Rules Ranjan Review: రూల్స్ రంజన్ - రివ్యూ {1.5/5}

Rules Ranjan Review: నాల్గేళ్ళ క్రితం కొత్త హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం 8 సినిమాలు నటిస్తే 7 ఫ్లాపవడం ఒక రికార్డు. అయినా తనతో సినిమాలు తీసే కొత్త దర్శకులు, నిర్మాతలు ఇనుమడించిన ఉత్సాహంతో మరిన్ని తీయడానికి ఉరకలు వేస్తున్నారు. అలా తీసిందే ‘రూల్స్ రంజన్’ అనే మరో ఆణిముత్యం.

Rules Ranjan Review: రూల్స్ రంజన్ - రివ్యూ {1.5/5}
X

చిత్రం: రూల్స్ రంజన్

రచన, దర్శకత్వం : రత్నం కృష్ణ

తారాగణం : కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, సుబ్బరాజు, అభిమన్యు సింగ్, అజయ్, మకరంద్ దేశ్ పాండే, హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ తదితరులు

సంగీతం : అమ్రీష్, ఛాయాగ్రహణం : ఎంఎస్ దులీప్ కుమార్

సమర్పణ : ఏఎం రత్నం

బ్యానర్ : స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్

నిర్మాతలు : దివ్యాంగ్ లావనియా, మురళీ కృష్ణ వేమూరి

విడుదల : అక్టోబర్ 6, 2023

రేటింగ్: 1.5/5

చాలా కాలానికి ఒక ఆణిముత్యం!

నాల్గేళ్ళ క్రితం కొత్త హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం 8 సినిమాలు నటిస్తే 7 ఫ్లాపవడం ఒక రికార్డు. అయినా తనతో సినిమాలు తీసే కొత్త దర్శకులు, నిర్మాతలు ఇనుమడించిన ఉత్సాహంతో మరిన్ని తీయడానికి ఉరకలు వేస్తున్నారు. అలా తీసిందే ‘రూల్స్ రంజన్’ అనే మరో ఆణిముత్యం. ఇది ఆణిముత్యమెలా అయిందో ఆలస్యం చేయకుండా చూసేద్దాం...

కథ

మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) బీటెక్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదిస్తాడు. కానీ తనకి హిందీ రాకపోవడం వల్ల కంపెనీలో సమస్యలెదుర్కొంటాడు. దీంతో అలెక్సా సాయంతో హిందీ నేర్చుకుని కంపెనీని ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పిస్తాడు. కంపెనీ అతడ్ని టీం మేనేజర్ గా ప్రమోట్ చేస్తుంది. దీంతో కంపెనీలో అందరూ తన రూల్స్ ప్రకారం నడుచుకునేలా కండిషన్స్ పెడతాడు. కొంత కాలం తర్వాత అదే కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ కోసం సనా (నేహా శెట్టి) వస్తుంది. ఈమెని కాలేజీ రోజుల్లో ప్రేమించాడు. ఇప్పుడు మళ్ళీ ప్రేమించబోతే ఆమెకి జాబ్ రాక తిరిగి తిరుపతికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తను కూడా తిరుపతి వెళ్ళిన మనోరంజన్ ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకోగలిగాడా, లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

కిరణ్ అబ్బవరం సినిమా కథ లాగే వుంది. తను ఏ సినిమా నటించినా నాసిరకం కథలే వుంటాయి. ఇన్ని నాసిరకం కథలు తన దగ్గరికే ఎందుకొస్తున్నాయో-దీని వెనుక కుట్ర ఏమైనా దాగి వుందేమో, నాసిరకం కథలతో తనని తొక్కేస్తుస్తున్నారేమో తెలుసుకోవడం చాలా అవసరం. అసలే కాలేజీ క్రష్ తిరిగి కనిపిస్తే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడా లేదా అనే పరమ నాసి కథ. దీనికి కాన్ఫ్లిక్ట్ ఏమిటా అనేది కనిపించదు. పెళ్ళి చేసుకోవడానికి అడ్డొచ్చిన సమస్య ఏమిటి?

ఈ కాన్ఫ్లిక్ట్ కనీసం ఇంటర్వెల్ కైనా రాదు. సెకండాఫ్ లో ఎప్పుడో క్లయిమాక్స్ కి ముందు వస్తుంది. అంటే క్లయిమాక్స్ వరకూ కథేమిటో, ఏం చెప్తున్నాడో అర్ధంగాదన్న మాట. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. ప్రతీ మూడో, నాలుగో సినిమా ఒక మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో తీసి ఫ్లాప్ చేసుకున్న చేతులు ఈ మధ్య కాలంలో విశ్రాంతి తీసుకున్నాయి. ఇలాటి సినిమాల బెడద ఇక తప్పిందనుకుంటే, ఇప్పుడు మరో కొత్త దర్శకుడు వచ్చేసి మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లేతో సినిమాని అలంకరించాడు!

ఇందుకే ఈ సినిమా అంతా విషయం లేని నసగా తయారైంది. పైగా చాలా తక్కువ విషయ పరిజ్ఞానంతో సన్నివేశాల కల్పన. ఇంగ్లీషుతో ఆపరేట్ చేసే సాఫ్ట్ వేర్ కంపెనీలో హిందీ రాకపోతే చులకనగా చూడడం ఏమిటి? వాళ్ళకి తను 30 రోజుల్లో తెలుగు నేర్పి పద్యాలు చెప్పడమేమిటో అర్ధంగాదు. తనకి ఫైలుకి, కంప్యూటర్ ఫైలుకీ తేడా కూడా తెలీదు. అలాటి వాడు రాత్రికిరాత్రి ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తాడు. కంపెనీ పేరు ప్రమాదంలో పడితే చిటికెలో దాన్ని సాల్వ్ చేసేస్తాడు. రూల్స్ రంజన్ కాబట్టి పద్ధతిగా జీవిస్తున్నానంటూ ఎక్కడపడితే అక్కడ రూల్స్ పెట్టేస్తాడు. కానీ పద్ధతిగా ప్రేమించలేకపోతాడు.

హీరోయిన్ కూడా ఆన్ లైన్ ఇంటర్వ్యూల కాలంలో జాబ్ ఇంటర్వ్యూకి తిరుపతి నుంచి ముంబాయి వరకూ రావడం కూడా హాస్యాస్పదంగా వుంటుంది. ఫస్టాఫ్ లో కామెడీ పేరుతో సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఇలాటి చీప్ దృశ్యాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాక, ఇంటర్వెల్లో కూడా కథేమిటో చెప్పకుండా సెకండాఫ్ లో విలేజీకి దారితీస్తాడు దర్శకుడు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ కి ముందు హీరో హీరోయిన్ల ప్రేమ ఫ్లాష్ బ్యాకు చూస్తే కలిగే నీరసం వుండగానే, సెకండాఫ్ లో ప్రెజంట్ లవ్ అదొక అద్భుతం. కానీ ఇప్పటివరకూ ప్రేక్షకులు చాలామంది లేరు. ఇంటర్వెల్ కి వెళ్ళి తిరిగి రాలేదు.

ఇక ప్రెజంట్ లవ్ కి అజయ్, హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ కమెడియన్ల బృందం సృష్టించే అడ్డంకులు ఇంకో అద్భుతం. ఫస్టాఫ్ నుంచీ ఈ అద్భుతాలన్నీ ఉపోద్ఘాతమే, ఇంకా కథ ప్రారంభం కాలేదు. ఇలా రెండు గంటలు సాగి సాగి, ఇంకో పావుగంటలో స్సినిమా ముగుస్తుందనగా క్లయిమాక్స్ కి ముందు, ప్రేమకి ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టి కథ ముగించేస్తాడు దర్శకుడు!

సినిమా కథ గురించి మినిమం నాలెడ్జి కూడా లేకుండా సినిమా తీసే అవకాశం పొందడం ఈ దర్శకుడు సాధించిన విజయం!

నటనలు- సాంకేతికాలు

కిరణ్ అబ్బవరం సినిమా కథల్లాగే నటన కూడా ఒకే టైపు నటన. అవే మార్పు లేని రెండు హావభావాలతో సినిమా మొత్తం లాక్కొచ్చేస్తాడు. కానీ స్టయిలింగ్ లో, మ్యానరిజమ్స్ లో సూపర్ మాస్ హీరోగా ఎదగాలని కోరుకుంటాడు. ఇక కామెడీ, రోమాన్స్ సరే. ఇద్దరు హీరోయిన్లున్నా ఫీలింగ్స్ కనపడని రోమాన్సు, పాటలు.

సినిమాలో ‘సమ్మోహనుడా’ అన్న ఒక్క పాట హిట్టయింది. ఈ పాటలో హీరోయిన్ నేహాశెట్టి ఫీలైన విధానం, హావభావాలు ఇవే టాప్. కానీ ఈమె పాత్రలో కూడా విషయం లేదు. ఇక బి గ్రేడ్ సినిమాల కో-డైరెక్టర్‌గా వెన్నెల కిషోర్ కామెడీ సి గ్రేడ్ లో వుంటుంది. ఇతర కమెడియన్లు డిటో.

కిరణ్ అబ్బవరంతో ఒకటుంది- సినిమా ఎంత నాసిగా వున్నా ఆరేడు కోట్లు బడ్జెట్ పెట్టించుకోనిదే సంతృప్తి వుండదు. నిర్మాతలకి సంతృప్తి కరంగా ఒక ఫ్లాప్ అందిస్తాడు.



First Published:  8 Oct 2023 3:37 PM IST
Next Story