Telugu Global
MOVIE REVIEWS

Ravanasura Movie Review: రావణాసుర మూవీ రివ్యూ {2/5}

Ravanasura Movie Review: రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Ravanasura Movie Review: రావణాసుర మూవీ రివ్యూ {2/5}
X

Ravanasura Movie Review: రావణాసుర మూవీ రివ్యూ {2/5}

చిత్రం: రావణాసుర

నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు…

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ

నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌ వర్క్స్

కథ - డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో

డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్

ఎడిటర్: నవీన్ నూలి

విడుదల తేది: ఏప్రిల్‌ 7, 2023

రేటింగ్: 2/5

"హత్యలన్నీ హీరోనే చేస్తాడు, కానీ ఎందుకు చేస్తున్నాడనేది చివర్లో తెలుస్తుంది. అప్పటివరకు విలన్ గా కనిపించిన వ్యక్తి క్లయిమాక్స్ కు వచ్చేసరికి హీరో అయిపోతాడు." ఈ స్టోరీలైన్ ఎక్కడో విన్నట్టుంది కదా, ఇలాంటి లైన్ లో ఎన్నో సినిమాలు చూసినట్టుంది కదా. సరిగ్గా ఇదే లైన్, రావణాసుర సినిమాలో కూడా రిపీటైంది. ఇంతోటిదానికి థ్రిల్లర్ అనే పేరొకటి.

ఏ కథ చెబుతున్నామనేది ఈకాలం ముఖ్యం కాదు, ఆ కథను ఎంత ఎంగేజింగ్ గా చెప్పామనేది చాలా ముఖ్యం. రొటీన్ స్టోరీతో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు హిట్టవ్వడానికి అదే కారణం. ఇన్ని ఉదాహరణలు పెట్టుకొని కూడా దర్శకుడు సుధీర్ వర్మ, పేలవమైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. నిజానికి మంచి ట్విస్టులున్న కథ ఇది. దీన్ని అలానే యాజ్ ఇటీజ్ గా గంటన్నరలో చెబితే భలేగా ఉండేది. కానీ ఇందులో రవితేజ ఉన్నాడు కదా, పాటల్లేకపోతే ఫీల్ అవుతాడు, కామెడీ పెట్టకపోతే హర్ట్ అవుతాడు. అందుకు సుధీర్ వర్మ ఈ సినిమాలో అన్నీ ఇరికించేశాడు.

కామెడీ కోసం హైపర్ ఆదిని పెట్టాడు, హీరోయిన్లతో పాటలతో పాటు, ఏకంగా ఓ ఐటెంసాంగ్ కూడా పెట్టేశాడు. ఇది చాలదన్నట్టు హీరో ఎలివేషన్లు కూడా. అలా అన్ని ఎలిమెంట్స్ పెట్టి కథను 2 గంటల 22 నిమిషాలు సాగదీసి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.

ఇదొక మైనస్ అనుకుంటే.. థ్రిల్లర్ సినిమాల్లో ఫాలో అవ్వాల్సిన కనీస రూల్స్ ను కూడా సుధీర్ వర్మ ఫాలో అవ్వలేదు. హత్యలు చేస్తోంది ఎవరనే విషయాన్ని ఇంటర్వెల్ కు ముందే చెప్పేశాడు. ఆ తర్వాత హత్యలు చేస్తోంది తనే అనే విషయాన్ని కూడా సదరు పాత్రధారితో ఓ చోట చెప్పిస్తాడు. కథ ఇంత క్లియర్ గా కళ్లముందు కనిపిస్తున్నప్పుడు చివరివరకు ఎందుకు కూర్చోవాలనేది ప్రేక్షకుడి ప్రశ్న. దానికోసం దర్శకుడు ఓ ఫార్మా కుంభకోణం టర్న్ తీసుకున్నాడు. అయితే అక్కడ కూడా వడివడిగా సన్నివేశాల్ని తీసేసి, పండించాల్సిన దగ్గర ఎమోషన్ పండించక తన పాత సినిమాల్లో చేసిన తప్పుల్నే రిపీట్ చేశాడు దర్శకుడు.

వీటికితోడు క్యారెక్టర్ ఆర్క్ సమస్య కూడా. సినిమాలో చాలా పాత్రల్ని అర్థాంతరంగా వదిలేశాడు దర్శకుడు. ఉదాహరణకు జూనియర్ లాయర్ హైపర్ ఆది పాత్రనే తీసుకుంటే, ఇంటర్వెల్ కు ముందే ఆ పాత్ర మాయమైపోతుంది. ఇక ఫరియా అబ్దుల్లా పాత్రను ఉన్నఫలంగా కట్ చేశాడు దర్శకుడు. చాలా పాత్రల్ని చంపడం లేదా జైలుకు పంపించడం కోసమే సృష్టించుకున్న దర్శకుడు.. ఆ పాత్రల తీరుతెన్నుల్ని సరిగ్గా రాసుకోలేకపోయాడు. ఉన్నంతలో మేఘా ఆకాష్ పాత్ర కాస్త బాగుంది, షాకింగ్ అనిపిస్తుంది కూడా.

ఈ సినిమాలో మరో సమస్య కూడా ఉంది. హీరోలు విలన్లుగా మారినప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు. అసలైన విలన్లను చంపేస్తుంటారు. రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. రవితేజది కూడా ఇలాంటి పాత్రే. కానీ సినిమాలో రవితేజ చేసిన తప్పులు మాత్రం అంగీకరించే స్థాయిలో ఉండవు. కేవలం మర్డర్లు చేయడమే కాదు.. ఇతగాడు మానభంగాలు కూడా చేస్తాడు. హీరోయిన్లను గొలుసులతో కట్టి పడేస్తాడు. చివర్లో తిరిగి హీరో అనిపించేసుకుంటాడు. అదే మేజిక్కు.

ఇక టెక్నికల్ గా కూడా సినిమా ఆశించిన స్థాయిలో లేదు. హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పేలవంగా ఉన్నాయి. చివరికి రీమిక్స్ సాంగ్ ను కూడా కిచిడీ చేసి పడేశారు. ఈమధ్య కాలంలో ఫెయిలైన రీమిక్స్ సాంగ్ ఏదైనా ఉందంటే అది ఇదే. సినిమాటోగ్రఫీ ఉన్నంతలో ఓకే. ఆర్ట్ వర్క్ అయితే దారుణం. కొన్ని సెట్స్ మరీ లో-లోవెల్ లో ఉన్నాయి. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఓ పోలీస్ స్టేషన్ సెట్ లో గోడపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫొటో చూపించారు. కానీ సినిమాలో మాత్రం ముఖ్యమంత్రిగా మరో వ్యక్తిని చూపిస్తారు. తెరపై క్లియర్ గా కనిపించే ఈ తప్పును ఎడిటింగ్ స్టేజ్ లో సరిదిద్దుకోలేకపోయింది యూనిట్.

ఇక తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా హీరో చుట్టూ పోలీసులు తిరగడం, సాక్ష్యాల కోసం అతడి వెంట పడడం ఫన్నీగా ఉంటుంది. ఇదే సినిమాలో పేరుమోసిన క్రిమినల్ లాయర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, అదే సినిమాలో జూనియర్ లాయర్ రవితేజను మాత్రం అరెస్ట్ చేయలేకపోతారు. అదే విడ్డూరం.

ఇలా చెప్పుకుంటూపోతే రావణాసుర సినిమాలో ప్లస్ పాయింట్స్ కంటే, మైనస్ పాయింట్సే ఎక్కువగా కనిపిస్తాయి. ఓ కొత్త కథ, సరికొత్త స్క్రీన్ ప్లే ఆశించి ఈ సినిమాకు వెళ్తే మాత్రం భంగపాటు తప్పదు. కేవలం రవితేజ యాక్షన్, అతడి డాన్స్ కోసం మాత్రం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

First Published:  7 April 2023 10:41 AM GMT
Next Story