Ranneeti - Balakot & Beyond Review: రణనీతి- బాలాకోట్ అండ్ బియాండ్ రివ్యూ {3/5}
Ranneeti - Balakot & Beyond Review: మొత్తం మీద ఈ సిరీస్ సాధారణ యుద్ధ కథలా కాకుండా, యుద్ధానికి ముందు వ్యూహాలతో వార్ రూమ్ డ్రామాని కూడా కొత్తగా చూపిస్తుంది. బాలాకోట్ పై దాడికి ముందు అధికారుల వార్ రూమ్ లో ఏం జరిగిందనేది ఇంతవరకూ చూపించని దృశ్యాల్ని చూపిస్తుంది. ఇదే దీని ప్రత్యేకత. ఈ సిరీస్ హిందీతో బాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వుంది.
చిత్రం: రణనీతి- బాలాకోట్ అండ్ బియాండ్
దర్శకత్వం: సంతోష్ సింగ్
తారాగణం: జిమ్మీ షేర్గిల్, లారా దత్తా, ఆశీష్ విద్యార్థి, ఆశుతోష్ రాణా, సత్యజీత్ దూబే, ఎల్నాజ్ నోరౌజీ, మీర్ సర్వర్, ఆకాంక్షా సింగ్, సందీప్ ఛటర్జీ, సునీల్ సిన్హా, సందీప్ ఛటర్జీ తదితరులు
రచయితలు: మైత్రీ బాజ్‌పాయ్, సంజయ్ చోప్రా, అనిరుద్ధ గుహ, రమీజ్ ఇల్హామ్ ఖాన్, సుదీప్ నిగమ్, వాసిం కపాడియా
సంగీతం: జోయెల్ క్రాస్టో, ఛాయాగ్రహణం : తన్వీర్ మీర్
నిర్మాతలు: సంజనా వాద్వా, కోమల్ సుంజోయ్ వాద్వా, సుంజోయ్ వాద్వా విడుదల :
విడుదల: జియో సినిమా
రేటింగ్: 3/5
ఓటీటీల్లో సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచీ రోమాంటిక్ కామెడీల వరకూ ఏవైనా చూడొచ్చు. టెర్రరిజం సిరీస్ కూడా చూడొచ్చు వార్ సిరీస్ అరుదు. అంటే మన ఉపఖండంలో వార్ గురించి. ఈ మధ్య హిందీలో ‘ఫైటర్’ అనీ, తెలుగులో ‘ఆపరేషన్ వాలంటైన్’ అనీ రెండు సినిమాలొచ్చాయి. రెండూ ఫుల్వామా దాడి - తదనంతర సర్జికల్ స్ట్రైక్ గురించే ప్రేక్షకుల ముందుంచాయి. ఇప్పుడు దీనిపై ఒక వెబ్ సిరీస్ రావడం విశేషం. ఈ వెబ్ సిరీస్ ని సంతోష్ సింగ్ అనే దర్శకుడు రూపొందించాడు. జిమ్మీ షేర్గిల్, లారా దత్తా, ఆశీష్ విద్యార్థి, ఆశుతోష్ రాణా వంటి తెలిసిన బాలీవుడ్ నటులు నటించారు. ఇది 9 ఎపిసోడ్లతో వుంది. నిడివి 6 గంటలు.
కథ
మొదటి ఎపిసోడ్ అంతా పుల్వామాలో జరిగిన దాడికి సంబంధించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుల కాన్వాయ్‌పై జైషే మహ్మద్ గ్రూపు ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది జవాన్లని బలిగొన్న ఉదంతం ఈ ఎపిసోడ్లో రికార్డవుతుంది. రెండో ఎపిసోడ్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కశ్యప్ సిన్హా (జిమ్మీ షేర్గిల్) ఫుల్వామా ఘటనపై రియాక్టవడం, దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని పై అధికారులతో వాదించడం వుంటుంది. ఇక్కడ్నుంచి పాక్ లోని బాలాకోట్ లో జైషే మహమ్మద్ శిబిరాలపై అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులకి వ్యూహాన్ని రచించడం కోసం వార్ రూమ్ డ్రామా వుంటుంది. బాలాకోట్‌పై వైమానిక దాడులకి సైన్యంతో పాటు వైమానిక దళం ఎలా పక్కాగా ప్లాన్ చేసిందనేది ఇక్కడ గ్రిప్పింగ్ స్టోరీ. ఒక పవర్ బ్రోకర్ మనీషా (లారా దత్తా) ఇంటర్నెట్ సహాయంతో సరిహద్దులో వున్న శత్రు బలగాల్ని ఎలా మోసగించాలో ప్లాన్ చేస్తుంది. అటు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఆశుతోష్ రాణా) ఇండియా రియాక్షన్ గురించి అధికారులతో వూహాగానాలు చేస్తూంటాడు. ఇక మూడవ ఎపిసోడ్ నుంచి బాలాకోట్ పై వైమానిక దాడులు, తదనంతర పరిణామాలపై కథగా వుంటుంది.
ఎలావుంది కథ
పైన పేర్కొన్న ‘ఫైటర్’, ‘ఆపరేషన్ వాలంటైన్’ అనే రెండు ఫుల్వామా సినిమాల కంటే ఈ వెబ్ సిరీస్ బలంగా, పకడ్బందీగా వుండడం గమనించాల్సిన మొదటి విషయం. పై రెండు సినిమాలూ ఫ్లాపయ్యాయి. ‘రణనీతి’ యుద్ధరంగంలో చర్యల్నే కాదు, దానికి ముందు వార్ రూమ్ లో ఎంత మేధో మధనం జరిగిందో తెర వెనుక కథ చూపిస్తుంది. అన్ని యుద్ధాలూ యుద్ధ భూమిలో జరగవనీ, మనసుల్లో జరుగుతాయనీ, ఈ వార్ రూమ్ లో కృషి చేసిన వార్తల్లోకి రాని అధికారుల గురించి తెలుపుతుంది. యుద్ధభూమి వెలుపల వున్న అధికారులు తమ తెలివితేటలతో, జిత్తులమారి వ్యూహాలతో ఎలా విజయం సాధించారో చూడడం ఇక్కడొక మంచి అనుభవంగా వుంటుంది. ఆధునిక యుద్దానికి సంబంధించిన అనేక ఆశ్చర్యకర అంశాలు ఈ వార్ రూమ్ డ్రామాలో తెలుస్తాయి. ఫిబ్రవరి 14, 2019న పాకిస్తాన్ జరిపిన పుల్వామా దాడి, ఫిబ్రవరి 26, 2019న ఇండియా జరిపిన బాలాకోట్ వైమానిక దాడుల మధ్య జరిగిన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడి చేయడంతో కశ్యప్ సిన్హా నాయకత్వంలో, దత్తా (ఆశీష్ విద్యార్థి) మార్గదర్శకత్వంలో, బృందం విజయవంతంగా ఆపరేషన్‌ని నిర్వహిస్తుంది. ఈ ఆపరేషన్ సందర్భంగా వింగ్ కమాండర్ అభిమన్యు వర్ధన్ (ప్రసన్న) పాక్ భూభాగంలో పడిపోవడంతో కథలో ట్విస్ట్ వస్తుంది. అతను తిరిగి వచ్చిన తర్వాత, అసలు కథ ప్రారంభమవుతుంది.
వింగ్ కమాండర్ అభినందన్ నిజ జీవిత సంఘటనలకి కల్పనని జోడించి అతడి ధైర్యాన్ని, సాహసాన్నీ హైలైట్ చేయడం కథకి ప్రధానాకర్షణగా వుంటుంది. చరిత్రలో ఇటువంటి ముఖ్యమైన క్షణాల గురించి అంతగా తెలియని ప్రపంచానికి ఇతడి కథ ఒక అవగాహనని అందిస్తుంది.
ఈ కథలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని చేర్చడం కూడా ఒక విశేషం. ఈ కారిడార్ ప్రత్యేకమైన రాజకీయ కోణాన్ని జోడించే ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఈ అంశాన్ని తాకడం ద్వారా, వెబ్ సిరీస్ కథనానికి డెప్త్ ని జోడించడమే కాకుండా, మనకి అంతగా తెలియని భౌగోళిక రాజకీయ కోణంపై సమగ్ర అవగాహన కల్గించారు. చైనా -పాకిస్తాన్ ల మధ్య రాజకీయ ఉద్రిక్తతలతో బాటు, పాకిస్తాన్ ఆర్థిక వైఫల్యాలు కూడా ఇందులో వున్నాయి.
అయితే ఇదంతా ఒకవైపు కథ. ‘ఫైటర్’ లో నైనా, ‘ఆపరేషన్ వాలంటైన్’ లో నైనా, వీటికి పూర్వం ‘యూరీ –ది సర్జికల్ స్ట్రైక్’ లో లోనైనా, ఇప్పుడు ‘’రణనీతి’ లోనైనా, ఈ కథనే చూపించుకుంటూ వస్తున్నారు : ఫుల్వామా దాడికి ప్రతీకార దాడి కథ. అసలు ఫుల్వామా దాడి వెనుక కథేమిటి? ఇటీవల జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్పాల్ మాలిక్ కేంద్రఓంపై మోపిన అభియోగాల మాటేమిటి? ఫుల్వామా దాడి జరగడానికి ప్రభుత్వ బాధ్యత లేదా? ఎందుకు దీనిపై విచారణ జరిపి బాధ్యుల్ని శిక్షించడం లేదు? బహుశా ప్రభుత్వం మారితే ‘ఫుల్వామా ఫైల్స్’ అని ఈ కథ కూడా రావొచ్చు.
ఉత్తమ సృష్టి
దర్శకుడు సంతోష్ సింగ్ ఒక ఉత్తమ శ్రేణి వార్ జానర్ సిరీస్ ని సృష్టించాడు., ‘ఫైటర్’ లో ఆకట్టుకునే ఏరియల్ యాక్షన్ సీక్వెన్సుల్ని చూశాం. ‘రణనీతి’ సిరీస్ లో కూడా ఎయిర్ కొరియోగ్రఫీ తీసిపోని విధంగా వుంది. స్టీవెన్ మాత్ నైపుణ్యంగా దర్శకత్వం వహించిన ఎయిర్ కొరియోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ వెంట్రుకలు నిక్కబొడుచుకునే థ్రిల్స్ తో వున్నాయి. సిరీస్ లో ఎపిసోడ్లు వేగంగా పరుగెట్టడంతో క్షణం కూడా కళ్ళు తిప్పుకోలేం. అయితే 9 ఎపిసోడ్లనేవి ఎక్కువే. ఆరుకి తగ్గిస్తే సరిపోతుంది. మొదటి ఎపిసోడ్ చివర్లో ఫుల్వామా దాడి తర్వాత రెండో ఎపిసోడ్ ఏమీ బాగా లేదు. మృత జవాన్ల పట్ల కలగాల్సిన సానుభూతినీ, భావోద్వేగాల్నీ, ప్రజాగ్రహాన్నీ, మీడియా కవరేజినీ, యంత్రాంగం రియాక్షన్ నీ - ఏదీ చూపించకుండా వెంటనే అంతిమ సంస్కారాలు చూపించేసి చప్పగా ముగించ్గారు.
జిమ్మీ షేర్గిల్,లారా దత్తా, ఆశీష్ విద్యార్థి, ఆశుతోష్ రాణా, ప్రసన్న తదితరులు బలమైన నటనల్ని ప్రదర్శిచారు. ఆశీష్ విద్యార్థి సినిమాల్లోలాగే కాస్త ఓవరాక్షన్. జోయెల్ క్రాస్టో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు దృశ్యాల్లోకి ఎఫెక్టివ్ గా వెళ్ళి కట్టిపడేస్తుంది. తన్వీర్ మీర్ చాయాగ్రహణం చాలా పెద్ద ఆకర్షణ ఈ సిరీస్ కి.
మొత్తం మీద ఈ సిరీస్ సాధారణ యుద్ధ కథలా కాకుండా, యుద్ధానికి ముందు వ్యూహాలతో వార్ రూమ్ డ్రామాని కూడా కొత్తగా చూపిస్తుంది. బాలాకోట్ పై దాడికి ముందు అధికారుల వార్ రూమ్ లో ఏం జరిగిందనేది ఇంతవరకూ చూపించని దృశ్యాల్ని చూపిస్తుంది. ఇదే దీని ప్రత్యేకత. ఈ సిరీస్ హిందీతో బాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వుంది.