Telugu Global
MOVIE REVIEWS

Rangabali Movie Review | రంగబలి - మూవీ రివ్యూ! {2/5}

Rangabali Movie Review | కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి చేతిలో నాగశౌర్య నటించిన ఈ ‘రంగబలి’ ఏవిధంగా వుందో చూద్దాం.

Rangabali Movie Review | రంగబలి - మూవీ రివ్యూ! {2/5}
X

Rangabali Movie Review | రంగబలి - మూవీ రివ్యూ! {2/5}

చిత్రం: రంగబలి

రచన- దర్శకత్వం: పవన్ బాసంశెట్టి

తారాగణం: నాగశౌర్య, యుక్తీ తరేజా, సత్య, గోపరాజు రమణ, మురళీశర్మ, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు

సంగీతం: పవన్ సిహెచ్

ఛాయాగ్రహణం: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు

బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

విడుదల: జులై 7, 2023

రేటింగ్: 2/5

2019 లో ‘ఓహ్ బేబీ’ విజయం తర్వాత నాగశౌర్య నటించిన 5 సినిమాలూ (అశ్వత్థామ, వరుడు కావలెను, లక్ష్య, కృష్ణా వ్రిందా విహారీ, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి) వరసగా పరాజయాల పాలయ్యాయి. రోమాంటిక్ కామెడీల మీద ఆసక్తి పెంచుకుని వాటినే నటిస్తూ పోతున్న తను వైవిధ్యానికి ఏ మాత్రం స్థానమిస్తున్నాడో తెలుసుకోవాలంటే తాజా ‘రంగబలి’ ని చూడాలి. కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి చేతిలో నాగశౌర్య నటించిన ఈ ‘రంగబలి’ ఏవిధంగా వుందో చూద్దాం...

కథ

రాజవరం అనే వూళ్ళో శౌర్య (నాగశౌర్య) పనీపాటా లేకుండా తిరుగుతూ తండ్రికి సమస్యగా మారతాడు. శౌర్య పుట్టి పెరిగిన వూరే బలమని నమ్ముతాడు. ఈ బలమే తనకి గుర్తింపు నిస్తుందనుకుంటాడు. ఇలాటి అవగాహనతో ఇతను పాల్పడే చేష్టలు భరించలేకపోతాడు తండ్రి. దీంతో మెడికల్ షాపు నడిపే తండ్రి విశ్వం (గోపరాజు రమణ), ఫార్మసీ కోర్సు చేసి వచ్చి షాపు చూసుకోమని శౌర్యని వైజాగ్ పంపేస్తాడు. వైజాగ్ లో కోర్సులో చేరిన శౌర్య అక్కడ సహజ (యుక్తీ తరేజా) తో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమని సహజ తండ్రి (మురళీ శర్మ) అంగీకరిస్తాడు. అయితే శౌర్య వూరి పేరు తెలుసుకున్న అతను శౌర్య ప్రేమని వ్యతిరేకిస్తాడు. రాజవరంలో రంగబలి సెంటర్ అంటే అతడికి పడదు. అందుకని ఆ వూరు వదిలి వైజాగ్ వచ్చేస్తే ప్రేమని అంగీకరిస్తానంటాడు.

రంగబలి సెంటర్ తో సహజ తండ్రికున్న సంబంధమేమిటి? ఎందుకు ఆ పేరు విని శౌర్యని తిరస్కరిస్తున్నాడు? సొంత వూరు వదిలి రాలేని శౌర్య తన ప్రేమకి అడ్డుగా వున్న రంగబలి సెంటర్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నాడు? ఆ వూళ్ళో వుంటున్న ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో) కీ, సహజ తండ్రికీ మధ్య వున్న సంబంధమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

ప్రేమ కోసం వూరి సెంటర్ పేరు మార్చేందుకు హీరో చేసే ప్రయత్నాలతో ఎదురయ్యే ప్రతిఘటనల గురించి ఈ కథ. ఈ కథని ప్రేక్షకులకి వినోదాత్మకంగా చెప్పాలా, లేక సీరియస్ గా చెప్పాలా - ఎలా చెప్తే ఆకట్టుకుంటుందన్నది మొదటి పాయింటు. కథ కోసం తీసుకున్న విషయంలో తగినంత సంఘర్షణ వున్నదా, లేదా అన్నది రెండో పాయింటు. ఈ రెండు పాయింట్లతో స్పష్టత, దాంతో నిర్వహణా సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందన్నది మూడో పాయింటు.

కొత్త దర్శకుడు వినోదాత్మకంగానే కథని మొదలుపెట్టి దాన్ని సీరియస్ గా మార్చేయడంతో, సీరియస్ గా మార్చివేశాక సంఘర్షణని బలంగా తీర్చిదిద్దక పోవడంతో- మొత్తానికే ఎసరు వచ్చింది. నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ జమ పడింది. రిలీజ్ చేసిన ట్రైలరే చప్పగా వున్నప్పుడు, సినిమా గొప్పగా వుండే అవకాశం లేదు. కనీసం ముగింపయినా అర్ధవంతంగా లేదు, ఇంటర్వెల్ మలుపు సహా. ఫస్టాఫ్ ని కామెడీతో లాక్కొచ్చినా, హీరోకి రంగబలి సమస్య ఎదురయ్యాకా, కథ ఎలా నడపాలో అర్ధంగాక, గజిబిజి చేసేయడంతో సెకండాఫ్ బోల్తా పడింది.

ఫస్టాఫ్ లో వూళ్ళో నాగ శౌర్య ఆవారా తనం, తండ్రితో చీవాట్లు వందల సినిమాల్లో వచ్చేసిన అరిగిపోయిన విషయమే. అలాగే వైజాగ్ లో హీరోయిన్ యుక్తితో లవ్ ట్రాక్ లోనూ కొత్తదనం లేదు. నాగశౌర్యతో ఫస్టాఫ్ లాగలేక పోతున్నప్పుడు, కమెడియన్ సత్యని ప్రవేశపెట్టి ఫస్టాఫ్ కి అతడ్ని హీరోగా చేశాడు దర్శకుడు. ఈ సినిమా గురించి ఏదైనా చెప్పుకుంటే సత్య చేసిన కామెడీ గురించే చెప్పుకుంటారు ప్రేక్షకులు- ఇది అద్భుతమైన కామెడీ ఏమీ కాదు- చీప్ కామెడీయే బూతుతో కలిసి.

హీరోయిన్ తండ్రితో హీరోకి సమస్య ఎదురయ్యాక సెకండాఫ్ లో పడుతుంది కథ. ఇక్కడ్నించే రంగబలి పేర్చు మార్చే కథనం సీరియస్ యాక్షన్ సినిమాలాగా మారిపోయి- అర్ధం పర్ధం లేకుండా దారితప్పి పోయింది కథ. రంగబలి కాదు, ప్రేక్షకులు బలి అన్నట్టు తయారయ్యింది. ఈ తయారీలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో- ఇటీవలి ‘దసరా’ లో తను చేసిన విలనీ లాగా, మరోసారి హాస్యాస్పదంగా తయారయ్యాడు.

వూళ్ళో ఒక సెంటరు పేరు మార్చే కథనే రాజకీయ విలన్ పాత్రతో రాజకీయ సెటైర్లతో, చురకలతో కొత్త కథగా చేసి నడపొచ్చు. స్థలాల పేర్లు రాజకీయ అవసరాల కోసం వివాదాస్పదమవుతున్న వైనాన్ని చిత్రించి- ఒక మెసేజితో ఈ బలహీన రోమాంటిక్ కామెడీని బలంగా నిలబెట్టి, బాక్సాఫీసు ప్రయోజనాలు పొంది వుండొచ్చు.

నటనలు- సాంకేతికాలు

నాగశౌర్యకి నటన వచ్చనడంలో ఎలాటి సందేహం లేదు. ఆ టాలెంట్ ఇలాటి సినిమాలతో వృధా అయిపోతోంది. ఆరు వరస ఫ్లాపులివ్వడానికి సరిపోతోంది. ఫస్టాఫ్ లో తండ్రి పాత్ర గోపరాజు రమణతో కామెడీ బాగా చేశాడు. అయితే ఏ సీనుకా సీనే. విషయంలేని ఫస్టాఫ్ లో ఈ కామెడీలతో తనేమీ నిలబెట్టలేదు. సత్య నిలబెట్టాడు. ఇక సెకండాఫ్ లో ఎటుపోతోందో అర్ధంగాని గజిబిజి సీరియస్ కథతో, చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకుతో, తను పూర్తిగా చేతులెత్తేశాడు. రంగబలి స్థల పురాణం గురించి చెప్పే చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఏం చెప్పారో అర్ధంగాదు. హీరోయిన్ తో లవర్ బాయ్ నటన అంతంత మాత్రమే.

కమెడియన్ సత్య మాత్రం ఎవరైనా సంతోషంగా వుంటే ఓర్వలేని పాత్రలో చేసిన కామెడీతో సినిమాకి తనవంతు న్యాయం చేశాడు. హీరోయిన్ యుక్తి రొటీనే. చెప్పుకోదగ్గ పాత్ర కాదు. తండ్రుల పాత్రల్లో గోపరాజు రమణ, మురళీ శర్మ ప్యాడింగ్ కి నిండుదనం తెచ్చారు. విలన్ ఎమ్మెల్యేగా మలయాళ నటుడు షైన్ చాకో ఆటలో అరటిపండు.

అరడజను ఫ్లాపుల తర్వాత ‘దసరా’ తీసి హిట్ అన్పించుకున్న అగ్ర నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమా ప్రొడక్షన్ విలువలకి బాగా ఖర్చు పెట్టారు. అయితే కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి తన క్రాఫ్టుకి ఇంకా చాలా సానబెట్టు కోవాల్సిన అవసరం వుంది.



First Published:  7 July 2023 3:29 PM IST
Next Story