Vyooham Movie Review: వ్యూహం –రివ్యూ {2/5}
Vyooham Review in Telugu: రాంగోపాల్ వర్మ రాజకీయ సినిమాల పరంపర కొనసాగుతోంది. వీటిని సినిమాలనేకంటే డాక్యుమెంటరీలనడం సబబు.
చిత్రం: వ్యూహం
రచన- దర్శకత్వం : రాంగోపాల్ వర్మ
తారాగణం : అజ్మల్ అమీర్, వాసు ఇంటూరి, కోట జయరాం, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి పార్వతి, తదితరులు
సంగీతం: బాలాజీ, ఛాయాగ్రహణం : సజీష్ రాజేంద్రన్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
విడుదల : మార్చి 2, 2024
రేటింగ్: 2/5
రాంగోపాల్ వర్మ రాజకీయ సినిమాల పరంపర కొనసాగుతోంది. వీటిని సినిమాలనేకంటే డాక్యుమెంటరీలనడం సబబు. రాజకీయ రంగంలో జరిగిన సంఘటనలని పేర్లు మార్చి నటులతో కలిపి చూపిస్తే, కొన్ని సెటైర్లువేస్తే సినిమా అయిపోతోంది. ఈ కోవలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ని తీసుకున్నాడు. ఇటీవల ‘యాత్ర 2’ పేరుతో జగన్మోహన్ రెడ్డి బయోపిక్ వచ్చింది. అది విఫలమైంది. ఇప్పుడు ‘వ్యూహం’ పేరుతో మరొకటి. ఇదెలా వుందో చూద్దాం...
కథ
14 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం వీరశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలోమరణిస్తాడు. ఈ సంఘటనకి వెలుగు దేశం అధ్యకుడు ఇంద్రబాబు నాయుడు ఆనందిస్తాడు. జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడ ప్రయోజనం పొందాలో ఆలోచనలు చేస్తూంటాడు. అధికార భారత్ పార్టీకి చెందిన 150 మంది నాయకులు తదుపరి సీఎం గా వీఎస్సార్ కుమారుడు మదన్ మోహన్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తూ సంతకాలు చేస్తారు. దీంతో భారత్ పార్టీ అధ్యక్షురాలు మేడమ్ ఆగ్రహించి కాశయ్యని సీఎంగా చేస్తుంది. దీంతో అసంతృప్తి చెందిన మదన్, భార్య మాలతి (మానస రాధాకృష్ణన్) ప్రోత్సాహంతో తండ్రి మృతికి తట్టుకోలేక చనిపోయిన మృతుల కుటుంబాల్ని పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతాడు. దీని మీద మేడమ్ మళ్ళీ అగ్రహిస్తుంది. మదన్ ఆగకుండా వేరేగా వీఎస్సార్ సీపీ పార్టీ పెడతాడు. ఇక మేడమ్ అవినీతి కేసులు మోపి జైల్లో వేస్తుంది. ఇలావుండగా సినిమా స్టార్ కిరణ్ జీవి ప్రారంభించిన మన రాజ్యం పార్టీని భారత్ పార్టీలో విలీనం చేస్తే తమ్ముడు శ్రవణ్ కళ్యాణ్ అడ్డం తిరుగుతాడు. ఇప్పుడు జైల్లో వున్న మదన్ ఏం చేశాడు? తండ్రి ఆశయాల్ని నెరవేర్చాలని తపిస్తున్న తనకి ఎదురవుతున్న అవాంతరాల్ని ఎలా దాటాడు? ఏ వ్యూహం రచించాడు? దీన్ని అడ్డుకుంటూ ఇంద్రబాబు నాయుడు పన్నిన ప్రతి వ్యూహాలేమిటి? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
2009 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి దగ్గర నుంచి, 2019 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకూ జరిగిన కొన్ని సంఘటనలని ఏకరువు పెట్టే కథ ఇది. పూర్తిగా జగన్ పక్షం వహిస్తూ ప్రత్యర్ధుల్ని జోకర్లుగా చూపించే ఎన్నికల ప్రచార సినిమా అనొచ్చు. ‘యాత్ర 2’ కథాకాలం కూడా ఇదే కాబట్టి అందులో చూపించిన సంఘటనలే ఇందులో వుంటాయి. ఓదార్పు యాత్రతో ప్రారంభమయ్యే జగన్ రాజకీయ ప్రయాణం పాద యాత్రతో ఎన్నికల్లో గెలిచి సీఎం అవడం వరకూ. అయితే ‘యాత్ర 2’ లో జగన్ పాత్రని తన లక్ష్యం కోసం సంఘర్షించే కథానాయక పాత్రగా సినిమాటిక్ గా చూపిస్తే, ‘వ్యూహం’లో అదేమీ లేకుండా ప్రత్యర్ధుల్ని జోకర్లుగా మార్చి, సెటైర్లు వేయడానికే చూపించడంతో, బలహీన సినిమాగా మారింది. ప్రత్యర్ధుల్ని బలంగా చూపిస్తేనే కదా కథానాయకుడికి సంఘర్షణ వుంటుంది. ఈ సంఘర్షణ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనల్ని పేర్చుకుంటూ పోవడంతో కథలా కాకుండా డాక్యుమెంటరీలా తయారయ్యింది.
వై ఎస్ బగన్, భారతి, విజయలక్ష్మి, షర్మిల, అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు, లోకేష్, కన్నా లక్ష్మీనారాయణ, కె. రోశయ్య, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ పాత్రలన్నీ పేర్లు మార్చి వుంటాయి. ఐతే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన వుండవు. ఇలాటి కీలక పరిణామాల్ని దాటవేస్తూ జంప్ చేస్తూంటుంది డాక్యుమెంటరీ. చంద్రబాబు సీఎం అయితే వేర్పడిన ఆంధ్రప్రదేశ్ సీఎం అని తెలియదు.
ఇక వై ఎస్ మదన్, వీఎస్సార్ సీపీ పార్టీ అని చెప్తూనే దృశ్యాల్లో జగన్ పేర, వైఎస్సార్ సీపీ పార్టీ పేర జెండాలు కనిపిస్తూంటాయి. ఒక పాట కూడా జగన్ ని కీర్తిస్తూ వుంటుంది. పాత్ర చూస్తే మదన్, పాటలు బ్యానర్లు చూస్తే జగన్. పాటలు బ్యానర్లు సరే, మరి ఈ మదన్ ఎవరు? – అని అడిగితే ఎన్నికల ప్రచార సినిమా కేం చెబుతారో తెలీదు.
ఒక పద్ధతి లేకుండా రాంగోపాల్ వర్మ తీసిన తన పద్ధతి సినిమా ‘వ్యూహం’.
నటనలు –సాంకేతికాలు
దాదాపు నటులందరూ అచ్చం నిజజీవిత పాత్రలకి తగ్గట్టే వుండేలా వెతికి పట్టుకోవడం వర్మ సాధించిన గొప్పదనం. జగన్ లాంటి అజ్మల్ అమీర్, చంద్రబాబులాంటి ధనంజయ్ ప్రభునే, భారతి లాంటి మానస రాధాకృష్ణన్...ఇలా అందరూ పోలికలు కుదిరి, అనుకరణలు కుదిరి దృశ్యాల్ని ఆసక్తికరంగా మారుస్తారు. లోకేష్ నటుడెవరో కనిపించడు. తిండిపోటుగా తింటున్న చేతులు మాత్రమే కనిపిస్తూంటాయి. చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తూంటాయి.
ఇంద్రబాబు నాయుడుని తోటి నాయకులే మెత్తగా దెప్పి పొడవడం, ముఖ్యంగా అవసరానికి ఎవరి కాళ్ళయినా పట్టుకునే దిగజారుడు మనిషిగా చెప్పడం వుంటాయి. ఇంద్రబాబు శ్రవణ్ కళ్యాణ్ ని అవసరానికి వాడుకుని, ఎన్నికల్లో ఓడించి మూలన కూర్చోబెట్టడం, రెండు లక్షల పుస్తకాలు చదివాననే చేగువేరా అరాధకుడు శ్రవణ్ కళ్యాణ్ పరమ జోకర్ లా బిహేవ్ చేయడం, అన్న కిరణ్ జీవి కూడా తెలివి తక్కువ రాజాకీయాలు మాట్లాడడంగా ఈ పాత్రలుంటాయి.
ఇన్నేసి పాత్రలున్నా సినిమా పేలవంగా వుంటుంది డాక్యుమెంటరీలా తీశారు కాబట్టి. ఇదే సినిమా కోడిరామకృష్ణ గనుక తీసి వుంటే ఒక ఊపు వూపేది. రాజకీయ సినిమాలు తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. బ్యాక్ గ్రౌండ్ రాజకీయ పాటలు కూడా వాటి దారిన అవి వచ్చి పోతూంటాయి- సన్నివేశాల్లో బలం వుండదు కాబట్టి. ఓదార్పు యాత్ర, పాద యాత్ర, మదన్ అరెస్టప్పుడు అడ్డుకునే కార్యకర్తల క్రౌడ్ దృశ్యాలు మాత్రం హెవీగా వుంటాయి.
ఇంతకీ మదన్ రాజకీయ భావజాలమేమిటి? మేనిఫెస్టో చూసి, ఇందులో సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి, అభివృద్ధి గురించి ఏది?- అంటుంది మాలతి. భవనాలూ రోడ్లతో మెరిసి పోయే అభివృద్ధికన్నా, సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధికి పాటుపడడమే నిజమైన అభివృద్ది- అంటాడు మదన్.
అయితే ఇది బలమైన ఎన్నికల ప్రచార సినిమా అవ్వాలంటే మొదట్నుంచీ సింగిల్ ఎజెండాతో మదన్ తన ఐడియాలజీ కోసం సంఘర్షించే బలమైన పాత్రగా చూపించుకు రావాలే తప్ప, చివర్లో సంక్షేమం- అభివృద్ధి గురించి ఓ మాట అనేస్తే సరిపోదు సినిమాకి.