Telugu Global
MOVIE REVIEWS

Prem Kumar Movie Review: ప్రేమ్ కుమార్ మూవీ రివ్యూ {1.5/5}

Prem Kumar Movie Review | దర్శకుడు శోభన్ కొడుకుగా, 2011 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన 11 సినిమాల్లో ఏదీ హిట్ కాక, 12 వ సారి దండ యాత్ర చేసిన యంగ్ హీరో సంతోష్ శోభన్ - ‘ప్రేమ్ కుమార్’ ని ప్రేక్షకుల ముందుంచాడు.

Prem Kumar Movie Review: ప్రేమ్ కుమార్ - మూవీ రివ్యూ {1.5/5}
X

Prem Kumar Movie Review: ప్రేమ్ కుమార్ - మూవీ రివ్యూ {1.5/5}

చిత్రం: ప్రేమ్ కుమార్

రచన- దర్శకత్వం : అభిషేక్ మహర్షి

తారాగణం : సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, రాజ్ మాదిరాజు తదితరులు

సంగీతం : అనంత్ శ్రీకర్, ఛాయాగ్రహణం : రాంపీ నందిగం

బ్యానర్ : సారంగ క్రియెషన్స్, నిర్మాత : శివప్రసాద్ పన్నీరు

రచన, దర్శకత్వం : అభిషేక్ మహర్షి

విడుదల : ఆగస్టు 18, 2023

రేటింగ్: 1.5/5

దర్శకుడు శోభన్ కొడుకుగా, 2011 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన 11 సినిమాల్లో ఏదీ హిట్ కాక, 12 వ సారి దండ యాత్ర చేసిన యంగ్ హీరో సంతోష్ శోభన్ - ‘ప్రేమ్ కుమార్’ ని ప్రేక్షకుల ముందుంచాడు. మూడేళ్ళు నిర్మాణంలో వుండి ఈ వారం విడుదలైన ఈ మూవీకి అభిషేక్ మహర్షి అనే నటుడు దర్శకుడు. కొత్త దర్శకుడితో సంతోష్ శోభన్ చేసిన ఈ ప్రయత్నం ఎలా వుంది? ఈ సంవత్సరం ఇది తను చేసిన నాలుగో సినిమా. దీంతో నైనా దండయాత్ర ముగిసిందా? ఇంకా ప్రేక్షకుల్ని దండించే కార్యక్రమం కొనసాగించాడా? ఇవి తెలుసుకుందాం...

కథ

ప్రేమ్‌ కుమార్‌ అలియాస్ పీకే (సంతోష్‌ శోభన్‌) పెళ్ళి పీటల మీదే ఆగిపోతుంది. సినిమా హీరో, రైజింగ్ స్టార్ రోషన్ బాబు (చైతన్య కృష్ణ) వచ్చేసి పెళ్ళి ఆపేస్తాడు. పెళ్ళి కూతురు నేత్ర (రాశీ సింగ్) తానూ ఫ్రేమించుకున్నామని, నేత్రనిచ్చి పెళ్ళి చేయమని కోరతాడు. నేత్ర తండ్రి (రాజ్ మాది రాజు) ఒప్పుకుంటాడు. దీంతో నేత్రా రోషన్ తో వెళ్ళి పోతుంది. దిగాలు పడ్డ పీకే ఇంకో పెళ్ళి ప్రయత్నం చేస్తే అది కూడా ఇలాగే అవుతుంది. పెళ్ళిచూపులు, పెళ్ళి ప్రయత్నాలు ఏవీ కలిసి రావు.

దీంతో ఫ్రెండ్ తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. భర్తల్ని అనుమానిస్తున్న భార్యల కేసుల్ని, భార్యల్ని అనుమానిస్తున్న భర్తల కేసుల్ని తీసుకుని, నిఘా పెట్టి విడగొడుతూ బాగా డబ్బు సంపాదిస్తూంటాడు. ఇంతలో నేత్ర వచ్చి అడ్డుపడుతుంది. ఈమె మ్యారేజి ఈ వెంట్స్ వ్యాపారం చేస్తూంటుంది. పీకే నడిపే డిటెక్టివ్ ఏజెన్సీ వల్ల తన వ్యాపారం దెబ్బ తింటోందని గొడవ పడుతుంది. ఇలా వుండగా, నేత్రని తీసుకు వెళ్ళిపోయిన రోషన్, అంగన (రుచితా సాదినేని) అనే వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకునే ప్రయత్నాల్లో వుంటాడు.

ఈ పెళ్ళిని నేత్ర ఆపాలనుకుంటుంది. పీకే ఈ పెళ్ళి చేయాలనుకుంటాడు. నేత్రాని రోషన్ ఎందుకు వదిలేశాడు? రోషన్ కి అంగనతో పెళ్ళి జరిపించాలనుకున్న పీకే ఉద్దేశమేమిటి? ఈ పెళ్ళిని ఆపాలనుకున్న నేత్రా ప్రయత్నం నెరవేరిందా? పీకే- నేత్ర ఇద్దర్లో ఎవరు నెగ్గారు? పీకే పెళ్ళి ఈసారైనా జరిగిందా? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

రోమాంటిక్ కామెడీ కథ. ఐడియా బావుంది. హీరోయిన్ పెళ్ళి జరుగుతూంటే హీరో వచ్చి పీటల మీంచి హీరోయిన్ ని తీసికెళ్ళి పోయే కథలతో సినిమాలు వస్తూంటాయి. అలా హీరో హీరోయిన్ల కథ సుఖాంతమవుతుంది. మరి ఆ పెళ్ళి కొడుకు ఏమయ్యాడు? అతడి పరిస్థితి ఏమిటి? ఇది ప్రేక్షకులు ఆలోచించరు. ఇలాటి పెళ్ళికొడుకు కథ తీసుకుని సినిమా తీశాడు దర్శకుడు. ఈ ఆలోచన బావుంది. ఇలాటి పెళ్ళి కొడుకుని హీరోగా చేసి తీసిన ఈ రోమాంటిక్ కామెడీ మాత్రం కామెడీకే ఏడ్పొచ్చేలా వుంది.

కామెడీకి పాత్రలే నవ్వుకుంటాయి గానీ ప్రేక్షకులకి నవ్వురాదు. పైగా కథ వరుసగా సీన్లు అతికించుకు పోయినట్టుందే తప్ప అల్లినట్టిలేదు. కథలో కాన్ఫ్లిక్ట్ బావుందిగానీ ఆ తర్వాత దాని నిర్వహణ చేత గాలేదు. రోషన్- అంగనల పెళ్ళి ఆపాలని హీరోయిన్, పెళ్ళి జరిపించాలని హీరో అనుకోవడంతో పుట్టే కాన్ఫ్లిక్ట్ ని సరిగా ఉపయోగించుకుని కథ నడపలేదు. తోచిన సీన్లు పేర్చుకుంటూ పోవడమే తప్ప కథ ఎలా వస్తోందన్న ఆలోచన లేదు. ఫస్టాఫ్ లో హీరో డిటెక్టివ్ ఏజెన్సీ చుట్టూ సాగే, జంటల్ని విడదీసే కామెడీ అయితే ఎబ్బెట్టుగా వుంది.

కథ హీరోయిన్ నడిపే ఈవెంట్ (మ్యారేజి) మేనేజ్ మెంట్ కంపెనీకి డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే హీరో పెళ్ళిళ్ళు చెడగొట్టే ఎత్తుగడతో కథ బాగానే ప్రారంభమవుతుంది. హీరో ఎందుకిలా చేస్తున్నాడన్న సస్పెన్స్ క్రియేటవుతుంది. అయితే ఈ సస్పెన్స్ తో కథ ముందుకెళ్ళకుండా, ఫ్రెండ్ తో హీరో తాగుడు సీన్లతో, అర్ధం లేని కామెడీలతో అతుకుల బొంతలా ఎక్కడేసిన గొంగళిలా వుంటుంది. తర్వాత స్వయంగా హీరోయిన్ రోషన్- అంగనల పెళ్ళి చెడగొట్టమనే హీరోకి చెప్పే ఆసక్తికర ట్విస్టు కూడా కథకి సరిగ్గా ఉపయోగపడక వేస్టయి పోయింది.

హీరో హీరోయిన్ల మధ్య శతృత్వానికి కారణమేంటని ఓపెనయ్యే ఫ్లాష్ బ్యాక్ లో పీటల మీద హీరోయిన్ తో హీరో పెళ్ళాగి పోయే కథ వస్తుంది. ఇక్కడ హీరో బాధని, అవమానాన్ని సీరియస్ గా చూపకుండా కామెడీ చేయడంతో ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా వీగిపోయింది.

ఇలా అడుగడుగునా కథ కొత్త దర్శకుడి అవగాహనా రాహిత్యంతో బెడిసి కొట్టి సినిమా రిస్కులో పడింది. కథే కాదు, దర్శకత్వం కూడా దారుణంగా వుంది. వరస ఫ్లాపులు చవిచూస్తున్న హీరో సంతోష్ శోభన్ ఇంకా సినిమాల గురించి ఏమీ నేర్చుకోనట్టే రుజువవుతోంది.

నటనలు- సాంకేతికాలు

గతంలో చాలా సార్లు చెప్పుకున్నట్టు సంతోష్ శోభన్ నటనలో అన్ని విభాగాల్లో సునాయసంగా చేసుకుపోగల టాలెంటెడ్ నటుడు. ఈసారి కూడా ఇది ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ప్రూవ్ చేసుకోవడానికి చేపట్టిన కంటెంట్ అతడి స్థాయికి తగింది కాదు. ప్రాణం లేని కంటెంట్ తో ఎంత నటించినా లాభం వుండదు. కనీసం ఒన్ మాన్ షోగా చేసుకుపోవాలన్నా తన పాత్రకి ఎంతోకొంత ప్రాణం వుండాలి. కామెడీలో టైమింగ్ బావున్నా ఆ కామెడీ నవ్వించకపోతే వృధా.

ఫ్రెండ్ పాత్రలో కృష్ణ తేజ, ఇంకో పాత్రలో సుదర్శన్ కొట్టే పంచ్ డైలాగులు మాత్రం ఫర్వాలేదనిపిస్తాయి. ఇద్దరు హీరోయిన్లు - రాశీసింగ్, రుచితా సింగ్ పాత్రలు, నటనలు కూడా సినిమాని కాపాడడానికి ఉపయోగపడలేదు.

ఇక సంగీతం, ఛాయాగ్రహణం, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ విలువలు, కాంప్రమైజ్ అయిన లొకేషన్స్ ‘బి’ గ్రేడ్ సినిమా స్థాయికి తగ్గట్టు వున్నాయి. సంతోష్ శోభన్ సినిమాల ఎంపిక విధానం ఇక ప్రేక్షకుల్ని టార్చర్ పెట్టే స్థితికి చేరుకుందని స్పష్టమైపోతోంది. ఈ సంవత్సరం నటించిన నాలుగు సినిమాలూ ఫ్లాపయినా అవకాశాలిచ్చి సినిమాలు తీస్తున్న నిర్మాతలు ధన్యులు.



First Published:  19 Aug 2023 1:40 PM IST
Next Story