Telugu Global
MOVIE REVIEWS

'పోన్నియిన్ సెల్వన్' రివ్యూ!

మణిరత్నం ఎంతో వూరించిన డ్రీమ్ ప్రాజెక్టు హేమా హేమీలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది - కెనడాలో తప్ప. అక్కడ బాయ్ కాట్ చేశారు. తమిళనాడులో చోళ రాజుల చరిత్ర ప్రపంచానికి చెప్పాలన్న తమిళ ఆత్మాభిమానంతో ఈ మెగా బడ్జెట్ మూవీ తీశారు.

పోన్నియిన్ సెల్వన్ రివ్యూ!
X

పోన్నియిన్ సెల్వన్  రివ్యూ

చిత్రం: పోన్నియిన్ సెల్వన్

రచన - దర్శకత్వం : మణిరత్నం

తారాగణం : విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ప్రకాష్ రాజ్, రెహమాన్, పార్తిబన్ తదితరులు

సంగీతం : ఏఆర్ రెహమాన్

ఛాయాగ్రహణం : రవి వర్మ

బ్యానర్స్ : మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్

పంపిణీ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ)

విడుదల : సెప్టెంబర్ 30, 2022

రేటింగ్ : 2.5 /5


మణిరత్నం ఎంతో వూరించిన డ్రీమ్ ప్రాజెక్టు హేమా హేమీలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది - కెనడాలో తప్ప. అక్కడ బాయ్ కాట్ చేశారు. తమిళనాడులో చోళ రాజుల చరిత్ర ప్రపంచానికి చెప్పాలన్న తమిళ ఆత్మాభిమానంతో ఈ మెగా బడ్జెట్ మూవీ తీశారు. అయితే ఇది ప్రపంచానికి చాటుతున్నట్టుగా వుందా, లేక తమిళులకే పరిమితమా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న తలెత్తడానికి కారణమేమిటో చూద్దాం...

కథ

ఒక తోకచుక్క ఆకాశంలో కన్పిండంతో కీడుని శంకిస్తుంది చోళరాజ వంశం. చోళ రాజు సుందర చోళ (ప్రకాష్ రాజ్) అనారోగ్యంతో వుంటాడు. అతడి పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ని యువరాజుగా ప్రకటిస్తాడు. అయితే, చోళ రాజ్యంలోని ప్రజలతో బాటు, సుందర చోళ కుమార్తె అయిన కుందవై (త్రిష), యువరాజు అయ్యే అర్హత తన తమ్ముడు అరుణ్మోళి వర్మ( జయం రవి) కి వుందని భావిస్తుంది. వల్లవరాయన్ వందేయ దేవన్ (కార్తీ) ఆదిత్యకి మంచి స్నేహితుడు. ఇతడికి ఒక సందేశమిచ్చి కడంబూర్‌ కి పంపుతాడు ఆదిత్య . సుందర చోళ సోదరుడి కుమారుడు మధురాంతకర్ (రెహ్మాన్) కూడా సింహాసనంపై దృష్టి సారించడంతో అధికార పోరాటం మొదలవుతుంది. మరో వైపు పెరియ పజువెట్టరైయర్ (శరత్‌కుమార్) భార్య నందిని (ఐశ్వర్యరాయ్ బచ్చన్) వుంటుంది. ఈమె తన భర్త వీర పాండియన్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి చోళ వంశంలో పెళ్ళి చేసుకుంది. ఇలా ఇందరి వ్యూహాల మధ్య చివరికి చోళరాజ్యం ఎవరి వశమైందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రసిద్ధ కాల్పనిక చారిత్రక నవల పొన్నియిన్ సెల్వన్' (పొన్నియిన్ కుమారుడు). ఇది 5 భాగాలతో 2000 పేజీల నవల. దీన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మణిరత్నం ప్రకటించారు. మొదటి భాగం ప్రయత్నం 1994 లో ఒకసారి, 2010 లో ఇంకోసారి చేసి, చివరికి 2022 లో ప్రేక్షకుల ముందుంచారు. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఉనికిలో వున్న చోళ రాజ్యపు గొప్పతనాన్ని కీర్తించే ఈ కథ హిస్టారికల్ ఫిక్షన్ జానర్ కిందికొస్తుంది.

అయితే సమస్యేమిటంటే, దీన్ని పానిండియా లేదా యూనివర్సల్ మూవీగా తలపెట్టినప్పుడు సరైన కథా పరిచయం చేయకుండా, ఇది తమిళులకి తెలిసిన చోళుల చరిత్రే కాబట్టి, తమిళ ప్రేక్షకుల కుద్దేశించినట్టుగా కథా రచన సాగింది. దీంతో ఇతరులకి ఈ కథ, పాత్రలు ఏ మాత్రం అర్ధంగాకుండా పోయాయి. మ్యాపు వేసి చూపిస్తూ, ఫలానా చోళ రాజ్యం ఫలానా ఈ కాలంలో, తమిళనాడులో ఫలానా ఈ ప్రాంతంలో వుండేదన్న అవగా హన ఏర్పర్చకుండా, చోళ వంశాన్ని వర్ణించకుండా, ఏ వివరాలూ అందించకుండా, నేరుగా కథలో కెళ్ళిపోతే ఏమర్ధమవుతుంది?

తోక చుక్క వల్ల చోళ రాజ వంశానికి ప్రమాదం పొంచి వుందని అంటూ చిరంజీవి వాయిసోవర్ తో ప్రారంభమవుతుంది. నిజానికీ వాయిసోవర్ పైన చెప్పిన కథా పరిచయంతో వుండాల్సింది. సరే, ఇక కథా కథనాలు ఎలా వున్నాయంటే దీన్ని కథ అనడానికి వీల్లేదు. ఎందుకంటే కథ అనేది పాత్ర- సమస్య- సమస్యతో సంఘర్షణ- పరిష్కారమనే ఏర్పాటుతో వుంటుంది. ఇదే సినిమాని నిలబెడుతుంది. ఇలా లేదు.

పోనీ గాథలా వుందా అంటే గాథ కూడా కాదు. గాథ పాత్ర- సమస్య- సమస్యతో సంఘర్షణ లేని కథనంగా ముగిసి పోతుంది. మరెలా వుంది? ఎపిసోడిక్ గా వుంది. ఒక పాత్రతో ఒక సమస్య పుట్టడం తగ్గిపోవడం, మళ్ళీ ఇంకో పాత్రతో ఇంకో సమస్య పుట్టడం తగ్గిపోవడం - ఇలా రిపీట్ అవుతూ వుంటుంది ఎపిసోడిక్ కథనం. ఇదే దెబ్బ తీసింది. ఫస్టాఫ్ ప్రధాన కథలేదు, సెకండాఫ్ దాని కొనసాగింపూ లేదు. ఎన్నో పాత్రలు, ఎందరో నటీనటులు, భారీ హంగామా, విషయం మాత్రం శూన్యం. ఏం చెబుతున్నాడో, ఏం చూస్తున్నామో మూడు గంటలూ అర్ధం గాదు. కనీసం శత్రువుల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు.

2010 లో ప్రకాష్ ఝా తీసిన హిందీ 'రాజనీతి' గుర్తుకొస్తుంది. మహాభారతాన్ని నేటి రాజకీయాలకి అన్వయిస్తున్నానని చెప్పి తీసిన ఈ భారీ మల్టీ స్టారర్ లో, ఎందరో పాత్రల బక్వాస్ (వాగుడు) తప్ప ఏమీ లేక అట్టర్ ఫ్లాపయ్యింది.

నటనలు -సాంకేతికాలు

ఫస్టాఫ్ కార్తీతోనే వుంటుంది. వీరత్వంతో బాటు అల్లరి, రోమాన్స్, హాస్యంతో కాస్త కాలక్షేపం అందిస్తాడు. విక్రమ్ ది విఫల ప్రేమతో సీరియస్ పాత్ర. వీళ్ళిద్దరితో బాటు ఐశ్వర్యారాయ్, త్రిష ప్రతీ సీనునీ ఆకర్షణీయంగా మార్చి రక్తి కట్టించడం కన్పిస్తుంది. వీళ్ళ గ్లామర్ ని మణిరత్నం పదిరెట్లు చేసి చూపించాడు. ఈ నల్గురుతప్ప ఇతర పాత్రల్లో వచ్చి పోతూ వుండే ఏ నటులూ, పాత్రల పేర్లూ గుర్తుండవు. ఇంత మంది ఎవరు ఎవరి కేమవుతారో గుర్తుపెట్టుకోవాల్సిన అదనపు శ్రమ వుంటుంది.

టెక్నికల్ గా, మ్యూజికల్ గా మాత్రం ఉన్నతంగా వుంది. కోటలూ రాజభవనాలూ, ఇతర లొకేషన్స్, యాక్షన్ సీన్స్ రవివర్మ ఛాయాగ్రహణంలో తారాస్థాయిలో వున్నాయి. కళా దర్శకత్వం, కాస్ట్యూమ్స్ మొదలైనవి ఉత్తమంగా వున్నాయి. సెకండాఫ్ ప్రారంభంలో సముద్రం మీద యుద్దానికి తరలి వచ్చే ఓడల దృశ్యాలు, సముద్రపు టొడ్డున యుద్ధమూ అద్భుత చిత్రీకరణ. అలాగే ఫస్టాఫ్ ప్రారంభంలో విక్రమ్ –కార్తీలు కలిసి చేసే యుద్ధం.

ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సాధారణంగా అన్పిస్తుంది. ఎపిసోడిక్ కథనం వల్ల ఎలివేషన్స్, థ్రిల్స్, ఎమోషన్స్ కొరవడ్డంతో రెహమాన్ చేయడానికి కూడా ఏమీ లేదు. పాటలు మాత్రం వాటి కొరియోగ్రఫీతో చూస్తున్నంత సేపు బావున్నాయి.

చివరికేమిటి

ఒక మహోజ్వల నవలని తెరానువాదం చేయడంలో రాణించక పోవడానికి కారణం నవల్లో కథ ని పట్టుకోలేక పోవడం కావచ్చు. మరొకటి, కథని సార్వజనీనం చేయకుండా ప్రాంతీయం చేస్తున్నట్టు గుర్తించకపోవడం. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాలు యూనివర్సల్ గా అర్ధమయ్యేట్టు, సింపుల్ కథతో వుంటాయి. దీని మీద హై యాక్షన్ డ్రామా క్రియేట్ చేస్తారు. 'బ్రహ్మాస్త్ర' లో ఇది కన్పిస్తుంది. ఈ మెగా బడ్జెట్ మూవీలో ఆరే ఆరు పాత్రలతో, సూటిగా వుండే సింపుల్ కథతో, యాక్షన్ హెవీగా వుంటుంది. మణిరత్నం సినిమాలో ఇది రివర్స్ అయింది. ఇంత బృహత్ కథ చెప్పినప్పుడు అదైనా కథలా కాకుండా చిన్న చిన్న ఎపిసోడ్లుగా వుండడం చాలా మైనస్ ఈ డ్రీమ్ ప్రాజెక్టుకి.

First Published:  30 Sept 2022 3:14 PM IST
Next Story