Telugu Global
MOVIE REVIEWS

Poacher Movie Review: పోచర్ -వెబ్ సిరీస్ రివ్యూ

Poacher Movie Review in Telugu: ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్ రూపకర్త, దర్శకుడు రిచీ మెహతా కొత్త సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. యాంటీ-పోచింగ్ టీమ్‌ కేరళలో ఏనుగు దంతాల స్మగ్లర్లని పట్టుకునే కథతో ‘పోచర్’ అనే ఈ వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లతో వుంది.

Poacher Movie Review: పోచర్ -వెబ్ సిరీస్ రివ్యూ
X

చిత్రం: పోచర్

రచన- దర్శకత్వం : రిచీ మెహతా

తారాగణం : నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య, అంకిత్ మాధవ్ తదితరులు

సంగీతం: ఆండ్రూ లాకింగ్టన్, ఛాయాగ్రహణం : జోహన్ హుర్లిన్ ఎయిడ్ట్

నిర్మాతలు: అలియా భట్, ప్రేరణా సింగ్

స్ట్రీమింగ్ : అమెజాన్ ప్రైమ్

రేటింగ్: 3/5

‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్ రూపకర్త, దర్శకుడు రిచీ మెహతా కొత్త సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. యాంటీ-పోచింగ్ టీమ్‌ కేరళలో ఏనుగు దంతాల స్మగ్లర్లని పట్టుకునే కథతో ‘పోచర్’ అనే ఈ వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లతో వుంది. వెబ్ సిరీస్‌లలో సాధారణంగా వుండే ఉగ్రవాదులు, పోలీసులు, గూఢచారులు, గ్యాంగ్‌స్టర్లు, దేశద్రోహులు, దేశభక్తులు అనే అర్థంలేని ధైర్యసాహసాలతో కూడిన కాల్పనిక కథలకి భిన్నంగా, ‘పోచర్’ వాస్తవ సమస్యని చిత్రిస్తుంది. కేరళ అడవుల్లో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించాడు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏనుగుల వధ కేసుకి సంబంధించి చిత్రణ ఎలా వుందో చూద్దాం...

కథా కథనాలు

నీల్ బెనర్జీ (దిబ్యేందు భట్టాచార్య) మాజీ ‘రా’ (రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్ -భారత గూఢచార సంస్థ) ఏజెంట్. ఇతడికి ఏనుగు దంతాల స్మగ్లర్లని పట్టుకునే బాధ్యతని అప్పగిస్తుంది ప్రభుత్వం. స్మగ్లర్లు విలువైన దంతాల కోసం 18 ఏనుగుల్ని చంపేశారు. నీల్ బెనర్జీ పక్షి అభయారణ్యం అధికారి మాలా (నిమిషా సజయన్) ని, ఫారెస్ట్ అధికారి బాబు (అంకిత్ మాధవ్) ని, ఎస్ హెచ్ ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) దిన (కనీ కస్రుతి) నీ పిలిచి వాళ్ళ సాయం తీసుకుంటాడు. ఈ గ్రూపుతో ఈ సిరీస్ కేరళ అడవుల నుంచీ ఢిల్లీలో పూనం వర్మ (సప్నా సంద్) అనే ఏనుగు దంతాల ప్రధాన స్మగ్లర్ ని కనుగొనే దాకా సాగుతుంది.

దర్యాప్తు పరిధి సిరీస్ మొదటి భాగంలో వివరణాత్మకంగా వుంటుంది. మొదటి నాలుగు ఎపిసోడ్లు వ్యూహాత్మక సమావేశాల పరంపరతో, ఆపైన దాడులూ విచారణల తర్వాత, మరిన్ని సమావేశాలూ దాడులతో సాగుతుంది. ఇదంతా చాలా శ్రద్ధ తీసుకుని నైపుణ్యంతో చిత్రీకరించారు. నటీనటుల పని తీరు దృశ్యాలు విస్ఫోటించేలా వుంటుంది. ఇలాంటిది ఏ సినిమాలోనూ చూడం.

ఐదవ ఎపిసోడ్ కాస్త ఫన్నీగా సాగుతుంది. ఈ ప్రమాదకర ఆపరేషన్ గురించి భార్యకి, కొడుక్కి చెప్పకుండా దాచిన అలన్ జోసెఫ్ (రోషన్ మాథ్యూ), వాళ్ళని తీసుకుని ఓ పెళ్ళికి వెళ్తున్నప్పుడు, వెంటనే వచ్చేసి ఆపరేషన్లో పాల్గొనమని మాలా నుంచి కాల్ వస్తుంది. ఈ విషయం భార్యకి చెప్తే గొడవకి దిగుతుందని, పెళ్ళి జరుగుతున్న ప్రాంగణం నుంచి బయటికొచ్చేసి, డ్రైవర్‌ జేబు తడిపి- వాహనంలో వెళ్ళిపోయి ఆపరేషన్లో పాల్గొని, గుట్టు చప్పుడవకుండా పెళ్ళికి తిరిగి వచ్చేస్తాడు. దీన్ని కాస్త ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ఆరవ ఎపిసోడ్ ఇంకా మెరుగ్గా వుంటుంది. ఇది రెండు టైమ్‌లైన్‌లలో సాగుతుంది. ఒకటి నీల్ బెనర్జీ దళం పోచర్స్ (మృగాంతకులు) ని అనుసరిస్తుంది, మరొకటి అటవీ అధికారులు కొన్ని నెలల తర్వాత నేరస్థలాన్ని పరిశీలించడంతో వుంటుంది. అరుకు (సూరజ్ పాప్స్) అనే ఆదివాసీ వీళ్ళని ఇక్కడికి తీసుకొస్తాడు. పోచింగ్ గురించి ఇతను సమాచారమందించడంతోనే ఈ వెబ్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు టైమ్‌లైన్‌ల సాహస యాత్రలకి కేంద్రబిందువుగా అరుకు పాత్ర ఆసక్తికరంగానే కాదు, అద్భుతంగానూ వుంటుంది.

అయితే కథ ఢిల్లీ చేరినప్పుడు పకడ్బందీ కథనమంతా పలచనబారి పోతుంది. ఈ లోపం నుంచి దృష్టి మళ్ళించడానికి కాబోలు, ఇక ప్రతీ పాత్రా మాటలకి ఒక బూతు పదం తగిలించుకుంటుంది. ఒక పోలీసు అధికారి స్త్రీవాదం వచ్చేసి అన్నింటినీ నాశనం చేస్తోందని బాధపడినప్పుడు, నార్త్ -సౌత్ తేడాల గురించి ఎత్తి చూపునట్టు అనిపిస్తుంది. నార్త్ ఇండియన్స్ కంటే సౌత్ ఇండియన్స్ (మలయాళీలు) ప్రబుద్ధులని అన్పించేలా. ఒక దృశ్యంలో అలన్ జోసెఫ్, మాలా పాత్రలు అమీర్‌జాత్ (బలిసినవాళ్ళ సంతానం) అని, మర్యాదగా దారికి రమ్మని, లేదా దొబ్బేయమనీ చెప్తారు.

సందేశం స్పష్టం

ఎపిసోడ్లు ఏకత్వంతో, సమగ్రతతో వుంటే బావుండేది. పోచర్ల క్రూరత్వాన్ని చిత్రీకరించిన విధానం మాత్రం దర్శకుడు రిచీ మెహతా ఈ సమస్యపై విస్తృతంగా అధ్యయనం చేసినట్లు స్పష్టం చేస్తుంది. జంతువుల వధ అనేది వన్యప్రాణుల పరిరక్షణావశ్యకతకి సంబంధించిన ఒక సంక్లిష్ట సామాజిక-రాజకీయ సమస్య అనీ చెప్పాడు. ఈ తీవ్రమైన జీవుల దుస్థితి పట్ల వీక్షకులు సానుభూతి చెందేలా చేయడంలో సఫలమయ్యాడు.

‘పోచర్’ వంటి పరిశోధనాత్మక సిరీస్ లు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి అవగాహన కల్పించడంలో సహాయ పడతాయి. ఏనుగుల వేట జాతీయ పార్కుల లోపల కాకుండా, రక్షిత ప్రాంతాల వెలుపల జరుగుతోంది. కాబట్టి రక్షిత ప్రాంతాల వెలుపల సహా అన్ని ఆవాసాలనూ పరిరక్షించడం అవసరమని ఈ వెబ్ సిరీస్ నొక్కి చెప్తోంది.

సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా, నటనల పరంగానూ ఉన్నత ప్రమాణాలతో కూడుకుని వున్న ఈ వెబ్ సిరీస్ కి బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ సహ నిర్మాత.

First Published:  17 March 2024 12:48 PM IST
Next Story