Telugu Global
MOVIE REVIEWS

Pareshan Movie Review: పరేషాన్ మూవీ రివ్యూ!

Pareshan Telugu Movie Review and Rating: రానా దగ్గుబాటి మరో చిన్న సినిమా సమర్పించాడు. దీనికి రూపక్ రోనాల్డ్సన్ కొత్త దర్శకుడు.

Pareshan Movie Review: పరేషాన్ మూవీ రివ్యూ!
X

చిత్రం: పరేషాన్

రచన- దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్

తారాగణం : తిరువీర్, పావనీ కరణం, బన్నీ అభిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత తదితరులు

సంగీతం : యశ్వంత్ నాగ్

ఛాయాగ్రహణం : వాసు పెండమ్

సమర్పణ : రానా దగ్గుబాటి (సురేష్ ప్రొడక్షన్స్)

నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి

విడుదల : జూన్ 2, 2023

రేటింగ్: 1.75/5

రానా దగ్గుబాటి మరో చిన్న సినిమా సమర్పించాడు. దీనికి రూపక్ రోనాల్డ్సన్ కొత్త దర్శకుడు. ఇటీవలి హార్రర్ ‘మసూద’ హీరో తిరువీర్ ఇందులో కథానాయకుడు. తెలంగాణ నేపథ్యపు సినిమా. ఈ మధ్య తెలంగాణ నేపథ్యపు సినిమాలు బాగానే వస్తున్నాయి. అయితే వీటిని హిట్టయిన ‘జాతిరత్నాలు’ టైపులోనే తీస్తున్నారు. ఒక తెలంగాణ టౌను లేదా పల్లె, అక్కడ నల్గురు కుర్రాళ్ళు, వాళ్ళ కామెడీలు, అవే కథలూ వగైరా. ఇలాటి సినిమాలు తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగా విపరీతంగా వచ్చేసి ఆ అధ్యాయం ముగిసిపోయింది. ముగిసి పోయిన మెయిన్ స్ట్రీమ్ అధ్యాయాన్ని తెలంగాణ సినిమా ఎత్తుకుంది. మొన్న విడుదలైన ‘మేమ్ ఫేమస్’ కూడా ఈ కోవకి చెందిందే. ఇప్పుడు ‘పరేషాన్’ దీని సరసన చేరింది. ఇలాటి సినిమాల్ని నిర్మాతల సొమ్ములు, ప్రేక్షకుల సమయం వృధా చేయాడానికే తీస్తున్నారేమో తెలీదు. ‘పారేషాన్’ కి ఇంతకి మించి వేరే ఆశయమున్నట్టు కనపడదు.

కథ

మంచిర్యాలలో ఐజాక్ (తిరువీర్) ఐటీఐ ఫెయిలై ఫ్రెండ్స్ తో తాగి ఆవారాగా తిరుగు తూంటాడు. ఇతడి తండ్రి సమర్పణ్ (మురళీధర్ గౌడ్) సింగరేణి ఉద్యోగి. ఈ తండ్రి ఆవారాగా తిరుగుతున్న కొడుక్కి తన ఉద్యోగం ఇప్పిద్దామని ఆఫీసర్ తో రెండు లక్షలకి మాట్లాడుకుంటాడు. ఆ డబ్బులు భార్య బంగారం అమ్మి కొడుకు చేతికిచ్చి, ఆఫీసర్ కి ఇమ్మంటాడు. ఇంతలో ఫ్రెండ్స్ కి ఏవో అవసరాలొచ్చి ఆ డబ్బు వాళ్ళ కిచ్చేస్తాడు కొడుకు ఐజాక్. ఇతడితో ప్రేమలో వున్న శిరీష (పావనీ కరణం) గర్భవతవుతుంది. టౌన్లో పరీక్షలు చేయిద్దామంటే ఐజాక్ దగ్గర డబ్బులుండవు. ఫ్రెండ్స్ ని అడిగితే ఇవ్వరు. ఇంతలో కొడుకు డబ్బు పాడు చేశాడని తండ్రికి తెలుస్తుంది. ఇప్పుడేం జరిగిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

పైన చెప్పుకున్నట్టు ఈ తెలంగాణ సినిమా కూడా ముగిసి పోయిన తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాల అధ్యాయాన్నే తిరిగి ప్రేక్షకులకి వడ్డించింది. అయితే తెలంగాణ యాసతో, తెలంగాణ పాత్రలతో, తెలంగాణ కల్చర్ తో తీసే ఇలాటి సినిమాలు కామెడీ ప్రధానంగా వుంటున్నాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్ తర్వాత కామెడీ కూడా లేదు. కథలో విషయం లేక కామెడీ పుట్టలేదు. ఫస్టాఫ్ అంతా దాదాపు పాత్రల్ని పరిచయం చేయడానికే సరిపోయింది. ఈ పరిచయాల వరకే కామెడీ చేష్టలు సరిపోయాయి. తీరా కథలోకి ప్రవేశించాక- తండ్రి ఇచ్చిన డబ్బు తిరిగి హీరో ఫ్రెండ్స్ నుంచి వసూలు చేసుకునే కథే కావడంతో- సినిమాగా నిలబడడానికి కాన్ఫ్లిక్ట్ సరిపోక- కాన్ఫ్లిక్ట్ సరిపోక పోయేసరికి దాని తాలూకు కామెడీ లేక, సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాలతో దారితప్పి భారంగా పరిణమించింది.

కథ లేనప్పుడు వున్న కథని కాంప్లికేట్ చేయాలన్నది హాలీవుడ్ పాటించే రూలు. పోను పోనూ కామెడీ కథని కామెడీతో పరమ సంక్లిష్టంగా మార్చేస్తూ, చివర్లో చిక్కు ముడి విప్పుతారు. ఈ సంక్లిష్టతకి, చిక్కుముడి సస్పెన్సుకి ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోయి కామెడీని ఎంజాయ్ చేస్తారు. ‘హేపీ భాగ్ జాయేగీ’ అని హిందీలో కథలేని కామెడీ సినిమాని ఇలాగే తీసి హిట్ చేశారు. రోహిత్ శెట్టి హిందీ ‘

ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా కథా సౌలభ్యం కోసం వుందే తప్ప కథలోంచి పుట్టలేదు. తాగి ఆవారాగా తిరిగే కొడుకుతో గొడవ పడే తండ్రి, అతడి చేతికే రెండు లక్షలిచ్చి ఆఫీసర్ కిచ్చి రమ్మనడమేమిటి?

కామెడీ అంటే జోకులు పేల్చడమే అన్నట్టుంది. యూత్ కోసం తీసిన ఈ సినిమాలోని జోకులకి యూత్ కైనా నవ్వొచ్చే పరిస్థితి లేదు. సెకండాఫ్ లో మాత్రం రెండు చోట్ల పిచ్చి జోకులు నవ్విస్తాయి. పోతే ‘దసరా’ లో లాగా ఈ సినిమాలో కూడా తాగుడు సీన్లు అదుపు తప్పాయి. సమస్య వచ్చినా, సంతోషమేసినా, డబ్బు లేకపోయినా తాగుడే. హీరో దగ్గర డబ్బు తీసుకున్న ఫ్రెండ్స్ ఆ రెండు లక్షలు తాగుడుకే పెట్టేసే కథ ఇది.

హీరోయిన్ తో ప్రేమ కథ కూడా కుదర్లేదు. హీరోతో ఒకసారి పడుకోగానే వెంటనే గర్భం వచ్చేసిందని కంగారు పడే సిల్లీ హీరోయిన్ పాత్ర. ఇది నమ్మి టెస్టుల కోసం డబ్బులేక పాట్లు పడే హీరో పాత్ర. లాజిక్ లేని కథ, లాజిక్ లేని పాత్రలు, సిల్లీ జోకులతో కామెడీ - ప్రేక్షలకి చాలా పరేషాన్!

నటనలు- సాంకేతికాలు

‘మసూద’ లో తిరువీర్ కీ, ‘పరేషాన్’ లో తిరువీర్ కీ పోలిక లేదు. ఇలాటి సినిమాలో నటించి తనకున్న ఫాలోయింగ్ ని దెబ్బ తీసుకోవడమే. తనని చూసి ఓపెనింగ్ కి వచ్చిన యువ ప్రేక్షకులు అసహనంతో ఈ సినిమా చూస్తున్న దృశ్యాలు థియేటర్లో కన్పిస్తాయి. దమ్ములేని సినిమాలో ‘మసూద’ లోలాంటి దమ్మున్న యాక్టింగ్ కి అవకాశం లేకుండా పోయింది. గెటప్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే అతడ్ని చూసేలా చేస్తాయి.

హీరోయిన్లు పావనీ కరణం, సాయి ప్రసన్నల పాత్రలు, నటనలు జీరో అయినా వాళ్ళని తగినంత గ్లామరస్ గా చూపించడానికైనా ప్రొడక్షన్ విలువలు సరిపోలేదు. కెమెరా వర్క్, సంగీతం విఫలమయ్యాయి.

2019 లో సంపూర్ణేష్ బాబు నటించిన కామెడీ ‘కొబ్బరిమట్ట’ కి అసిస్టెంట్ గా పనిచేసిన దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ తన తొలి ప్రయత్నంతో ఎలాటి జాగ్రత్తలూ తీసుకోక పోవడం విచారకరం. లేకపోతే ముగిసిపోయిన ఇలాటి మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా అధ్యాయాన్ని రీసైక్లింగ్ చేస్తే తెలంగాణ సినిమా అయిపోతుందని నమ్మే దర్శకుల్లో తనూ ఒకడు కావడం నిజమైన కామెడీ అనుకోవాలేమో.



First Published:  2 Jun 2023 3:26 PM IST
Next Story