'ఓదెల రైల్వే స్టేషన్' రివ్యూ!
దర్శకుడు సంపత్ నంది కథ రాసి అశోక్ తేజ కిచ్చాడు దర్శకత్వానికి. ఇది లాక్ డౌన్ కి పూర్వం థియేటర్ కోసం తీసిన సీరియల్ కిల్లర్ సినిమా. కానీ థియేటర్ రిలీజ్ కి బిజినెస్ కాక ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలైంది.
దర్శకత్వం : అశోక్ తేజ
తారాగణం : హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నాడ, వశిష్ట ఎన్ సింహా తదితరులు
రచనా : సంపత్ నంది, సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : సౌందర రాజన్-
నిర్మాత : కేకే రాధామోహన్
విడుదల : ఆగస్టు 26, 2022 (ఆహా ఓటీటీ)
రేటింగ్ : 1.5/5
దర్శకుడు సంపత్ నంది కథ రాసి అశోక్ తేజ కిచ్చాడు దర్శకత్వానికి. ఇది లాక్ డౌన్ కి పూర్వం థియేటర్ కోసం తీసిన సీరియల్ కిల్లర్ సినిమా. కానీ థియేటర్ రిలీజ్ కి బిజినెస్ కాక 'ఆహా' ఓటీటీ ద్వారా విడుదలైంది. గంటన్నర నిడివి ఉండటం వల్ల, విషయం బలహీనంగా ఉండటం వల్ల థియేటర్ కి దూరమైందని సులభంగా చెప్పొచ్చు. దీనికి నిజంగా జరిగిన కథ అని ట్యాగ్ ఇచ్చారు, కానీ ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ జరిగిన ఒక ఉదంతం మనకి గుర్తొస్తుంది. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఇందులో హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించింది. 'కేజీఎఫ్' సినిమాల నటుడు వశిష్ట సింహాతో పాటు పూజితా పొన్నాడ, సాయి రోనక్‌లు ఇతర పాత్రల్లో నటించారు.
ఇలా తారాగణం ఆకర్షణీయంగా ఉంది. రచన సంపత్ నందితో పాటు, సంగీతం అనూప్ రూబెన్స్, కెమెరా సౌందర రాజన్ కూడా పెద్ద పేర్లే. మరి ఇంత మంది హేమాహేమీలు కలిసి ఎలాంటి సరుకు అందించారు? ఇలాటి సినిమా తీయడానికి హేమాహేమీలు అవసరం లేదా? కొత్తవాళ్ళు సరిపోతారా? ఈ విషయం తెలుసుకుందాం..
కథ
అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ ట్రైనీగా ఓదెల (కరీంనగర్ - పెద్దపల్లి జిల్లా) పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. హైదారాబాద్‌లో ఇతడికో గర్ల్ ఫ్రెండ్ (పూజితా పొన్నాడ) ఉంటుంది. ఓదెలలో రాధ (హెబ్బా పటేల్) అనే యువతి భర్త తిరుపతి (వశిష్ట సింహ) తో ఇస్త్రీ షాపు నడుపుతూంటుంది. పెళ్ళయి తొమ్మిదేళ్ళయినా వీళ్ళకి పిల్లలు పుట్టరు. భర్తకున్న లైంగిక సమస్యతో డాక్టర్ ని కూడా సంప్రదిస్తుంది రాధ. ఇలా వుండగా గ్రామంలో ఆకస్మాత్తుగా హత్యలు మొదలవుతాయి. శోభనం జరిగిన మర్నాడే ఒక పెళ్ళి కూతురు హత్యకి గురవుతుంది. ఇంకోరోజు ఇంకో పెళ్ళి కూతురూ ఇలాగే హత్యకి గురవుతుంది. వెంటనే ఐపీఎస్ అనుదీప్ ఈ కేసులు చేపడతాడు. శోభనం తర్వాత అత్యాచారం చేసి చంపుతున్నాడంటే వీడెవడో సైకో కిల్లర్ అనుకుని దర్యాప్తు మొదలెడతాడు. ఇంతలో ఇంకో హత్య జరుగుతుంది. ఇలాటి పరిస్థితుల్లో అనుదీప్ వద్దన్నా సర్పంచ్ కూతురి పెళ్ళిచేయడంతో, ఆ పెళ్ళి కూతుర్ని ఓదెల రైల్వే స్టేషన్ నుంచి అపహరించి చంపుతాడు హంతకుడు.
ఎవరీ సీరియల్ కిల్లర్? ఎందుకు చంపుతున్నాడు? ఎంత మందిని చంపాడు? వీడ్ని పట్టుకోవడానికి అనుదీప్ ఏ వ్యూహం పన్నాడు? పోలీస్ స్టేషన్ కి మొండెం లేని తల పట్టుకుని వచ్చిందెవరు? అనుదీప్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఎలా ప్రమాదంలో పడింది? ఇవి తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.
ఎలావుంది కథ
2019 లో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో పట్టుబడ్డ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు ఈ కథకి మూలమని చెప్పొచ్చు. మెకానిక్ శ్రీనివాసరెడ్డి వరసగా ముగ్గురమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపి పాడుబడ్డ బావిలో పడేశాడు. ఈ కేసులో అతడికి ఉరిశిక్ష పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని శోభనం పెళ్ళి కూతుర్ల కథ అల్లాడు కథకుడు. ఇందులో కూడా పాడుబడ్డ బావే హత్యాస్థలం. అయితే కథా కథనాలు కుదర్లేదు. మొత్తం గంటన్నర కూడా సిల్లీగా ఉంటుంది కథనం. సీరియల్ కిల్లర్ కథకి ఆ జానర్ మర్యాదలే ఉండవు. థ్రిల్, సస్పెన్స్, టెన్షన్ మొదలైన వాటికి స్థానమే ఉండదు. మొదటి పది నిమిషాల్లోనే సీరియల్ కిల్లరెవరో క్లూ ఇచ్చేస్తున్నట్టు కూడా గ్రహించకుండా, హెబ్బా పటేల్ నపుంసక భర్తతో డాక్టర్ దగ్గరి కెళ్ళే సీను వేసేశారంటే ఏమనాలి.
ఇక దీనికో కథా ప్రయోజనం కల్పించారు. చివర్లో తేల్చిందేమిటంటే- ఇంపీరియా ఇంపోటెన్సీ సిండ్రోమ్ అనే అంగస్తంభన వైఫల్య రుగ్మతొకటి ఉందనీ, తల్లిదండ్రుల వల్ల, తోబుట్టువుల వల్ల, సమాజం వల్లా ఇది వస్తుందనీ, ఏటా 12 వేలమంది దీని బారిన పడుతున్నారనీ...ఇలా జరగకుండా ఉండాలంటే మనమే బాధ్యత తీసుకోవాలనీ ఏమేమో అర్ధంగాకుండా చెప్పారు. మనమేం బాధ్యత తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి ఇలా అర్ధం పర్ధం లేకుండా తీస్తే? ముందు తను బాధ్యత తీసుకుని కథ సరిగ్గా తీయాలి. ఇంపీరియా ఇంపోటెన్సీ సిండ్రోమ్ ఏమిటో గూగుల్లో ఎంత కొట్టినా దొరికి చావడం లేదు. ఈ కథకి సీక్వెల్ కూడా రాబోతున్నట్టు చివర్లో హెచ్చరిక ఒకటి! కథలో ఇన్వెస్టిగేషన్లో డీఎన్ఏ ద్వారా వయసు తెలుసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు అందుబాటులో కొచ్చిన ఆధునిక డీఎన్ఏ ఏజ్ టెస్టింగ్ ద్వారా ఇది సాధ్యమే. ఇలాటి శాస్త్రీయ సమాచారమివ్వడం బాగుంది.
నటనలు- సాంకేతికాలు
ఈ కథ ప్రధాన పాత్ర ఎవరో అర్ధం కాకుండా ఉంటుంది. దర్యాప్తు అధికారిగా ట్రైనీ ఐపీఎస్ ప్రధాన పాత్ర అనుకుంటాం. లేకపోతే ట్రైనీ ఐపీఎస్ లెవెల్ అధికారి అవసరం లేదు, ఎస్సై ఉంటే సరిపోతుంది. కానీ హత్యల్ని పరిశోధించే ట్రైనీ ఐపీఎస్ అనుదీప్ గా సాయి రోనక్ చాలా వీక్, పాసివ్ క్యారెక్టర్. ఏం చేస్తాడో అతడికే తెలీదు. ఆరు వేల జనాభా ఉన్న గ్రామంలో సీరియల్ కిల్లర్ ని పట్టుకోలేక పోవడం అతడి అసమర్ధతని తెలుపుతుంది.
సాయి రోనాక్ ఒక పోలీసుగానే ఉండడు, మొహంలో ఎక్స్ ప్రెషన్సే ఉండవు. చివరికి కిల్లర్ ని పట్టుకునే ప్లాన్ గర్ల్ ఫ్రెండ్ పూజితా పొన్నాడేదే ఇస్తుంది. పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుందాం, తెల్లారి వచ్చే కిల్లర్ ని ట్రాప్ చేసి పట్టుకుందామంటుంది. అలాగే పెళ్ళి చేసుకుని ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసి కాఫీ తాగుతూంటాడు. సీరియల్ కిల్లర్ వచ్చేసి భార్యని ఎత్తుకు పోతాడు! సీరియల్ కిల్లర్ కాదు ఇంపోటెంట్, పెద్ద ఇంపోటెంట్ ఈ ఐపీఎస్ ట్రైనీయే!!
ఐపీఎస్ ట్రైనీ భార్యని ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. ఐపీఎస్ ట్రైనీ కారెక్కి తీరుబడిగా ఎటో పోతాడు. కిల్లర్ గురించి హెబ్బా పటేల్ ఫోన్లు చేస్తూంటే వచ్చేస్తున్నానంటాడు. ఇక లాభం లేదన్నట్టు- ఈ ఐపీఎస్ ట్రైనీ శుద్ధ వేస్ట్ ఫెలో అన్నట్టు, హెబ్బా పటేలే 'హీరో' గా బయల్దేరి సీరియల్ కిల్లర్ ని చంపి, ట్రైనీ ఐపీఎస్ భార్యని కాపాడి తెచ్చి ముందు పడేస్తుంది!కొత్త భార్యతో ఎక్కడికో పోతున్న ట్రైనీ ఐపీఎస్ ని గ్రామ ప్రజలు మెచ్చుకుని, మళ్ళీ ఎప్పుడొస్తారని అంటారు. 'గట్టిగా కాచుకోండి, ఎస్పీగా వస్తాను' అంటాడు! ఏం పీకాడనో ఇంకా ఎస్పీగా ఓదెల రైల్వే స్టేషన్ 2 తో వస్తాడట! ఇలాటి కథలు రాయకపోతే సంపత్ నంది కొంపలు మునిగిపోతాయా?
అంటే ఇక హెబ్బా పటేలే ప్రధాన పాత్రనుకోవాలి. ఇంకో ముఖ్య పాత్ర ప్లాన్ ఇచ్చిన పూజితా పొన్నాడ. పోలీస్ స్టేషన్లో అందర్నీ వెళ్ళగొట్టి వీళ్ళిద్దరికీ అప్పజెప్పాలి. ఇక సాంకేతికంగా చూస్తే అనూప్ రూబెన్స్ సంగీతం, సౌందర రాజన్ కెమెరా ఇలాంటి సినిమాని చూడండి, చూడండి - అని ఉత్తేజపరుస్తూంటాయి. ఓదెల రైల్వే స్టేషన్ టైటిల్ తో పెద్దగా సంబంధమే ఉండదు. 'శోభనం రాత్రి హంతకుడు' సరైన టైటిల్. ఇదీ హేమాహేమీల ఉమ్మడి శ్రమ దాన ఎపిసోడ్!