Telugu Global
MOVIE REVIEWS

Dasara Movie Review: దసరా మూవీ రివ్యూ {2.75/5}

Nani's Dasara Movie Review: నాని హీరోగా నటించిన దసరా సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఏంటో చూద్దాం.

Dasara Movie Review: దసరా మూవీ రివ్యూ {2.75/5}
X

చిత్రం: దసరా

నటీనటులు : నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహబ్ తదితరులు

దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్

డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ

సంగీతం: సంతోష్ నారాయణన్

ఎడిటర్: నవీన్ నూలి

నిడివి : 156 నిమిషాలు

విడుదల తేదీ: 30 మార్చి 2023

రేటింగ్ - 2.75/5

కథలు కొత్తగా పుట్టవు. ఉన్న కథల్నే, కొత్త నేపథ్యంలో ఎంత కొత్తగా చూపించామనేది ముఖ్యం. ఉదాహరణకు రంగస్థలం సినిమానే తీసుకుంటే, అందులో కథ పరమ రొటీన్. అన్నయ్యను చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునే హీరో కథ అది. కానీ దాని నేపథ్యం చాలా కొత్త. అందుకే పెద్ద హిట్టయింది. ఇప్పుడీ రంగస్థలం ప్రస్తావన ఎందుకంటే, ఈరోజు వచ్చిన దసరా కూడా ఇదే ఛాయల్లో సాగింది కాబట్టి.

రంగస్థలం సినిమాలో గోదావరి బ్యాక్ డ్రాప్ ను తీసుకొని రివెంజ్ డ్రామాను నడిపిస్తే, దసరా సినిమాలో సింగరేణి బ్యాక్ డ్రాప్ ను తీసుకొని అదే రివెంజ్ డ్రామాను పండించారు. అది హిట్టయినట్టుగానే, ఇది కూడా హిట్టయింది. చిన్న చిన్న లోపాలు మాత్రం అలానే ఉండిపోయాయి. ఇంతకీ కథ ఏంటంటే..

సింగరేణి బొగ్గుగనులకు సమీపంలో వీర్లపల్లి గ్రామంలో ఉండే మనుషులంతా తాగుడుకి బానిసలు. మందు కొట్టడం సంప్రదాయంగా ఫీలవుతుంటారు. ఆ ఊర్లో ఉండే సిల్క్ బార్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆదేశాల మేరకు మద్యపాన నిషేధం కారణంగా మూత పడుతుంది. ఆ బార్ మూసివేత ఆ ఊరి రాజకీయకీయాల్లో పెను మార్పు తీసుకొస్తుంది. అదే టైమ్ లో సర్పంచ్ ఎన్నికలొస్తాయి. చిన్న నంబి (మలయాళ నటుడు టామ్ చోకా) పోటీ చేస్తాడు. అతడికి వ్యతిరేకంగా ధరణి (నాని) గ్యాంగ్, రాజన్న (సాయికుమార్)కు మద్దతిస్తుంది. ధరణి గ్యాంగ్ మద్దతుతో రాజన్న గెలుస్తాడు. దీంతో ఆ ఊరిలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. అప్పటివరకు ఆడుతూపాడుతూ సాగిపోతున్న ధరణి, సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తిసురేష్) జీవితాలు మొత్తం మారిపోతాయి. చివరికి తమ జీవితాలతో పాటు, ఊరి పరిస్థితుల్ని ధరణి ఎలా మార్చాడన్నది స్టోరీ.

ఇదీ సింపుల్ గా దసరా స్టోరీ. సినిమాలో కథ సింపుల్ గానే ఉన్నప్పటికీ దర్శకుడు శ్రీకాంత్ మాత్రం ఈ కథ కోసం భారీ సెటప్ పెట్టుకున్నాడు. ఏకంగా వీర్లపల్లి గ్రామం సెట్ వేశాడు. ధరణి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. తెలంగాణ యాస, భాషకు కట్టుబడి సినిమా తీశాడు. సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ను పూర్తిస్థాయిలో వాడుకున్నాడు. ఈ అంశాలు దసరాను హిట్ సినిమాగా మార్చేశాడు.

సినిమా ప్రథమార్థం రొటీన్ గానే ఉంది. ఊరిని పరిచయం చేయడం, పాత్రల తీరుతెన్నులు అన్నీ రొటీన్ గానే సాగిపోయాయి. ఎప్పుడైతే ధరణి ఎంటరయ్యాడో, అక్కడ్నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో గూడ్స్ రైలు నుంచి బొగ్గు దొంగిలించడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తాయి. అదే ఫ్లోలో ప్రేమ, స్నేహం లాంటి ఎలిమెంట్స్ ను దర్శకుడు ఎస్టాబ్లిష్ చేశాడు.

ఇక ఇంటర్వెల్ కు వచ్చేసరికి అసలైన ట్విస్ట్ పడుతుంది. సినిమా సెకండాఫ్ పై భారీ అంచనాల్ని పెంచేస్తుంది. ఇక్కడ్నుంచి నాని విశ్వరూపం మొదలవుతుంది. ప్రీ-ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు నానిలో నటుడు మనకు కనిపించడు. కేవలం ధరణి అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అతడి నటవిశ్వరూపం సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ కూడా దర్శకుడు చిన్న తప్పటడుగు వేశాడు.

సెకండాఫ్ నుంచి సినిమాను పూర్తిగా రివెంజ్ డ్రామా టర్న్ తిప్పాడు దర్శకుడు. అక్కడే ఈ సినిమా రొటీన్ కథ అనే ఫీలింగ్ ను తెప్పిస్తుంది. అలా కాకుండా ధరణి-వెన్నెల పాత్రల మధ్య మరింత సంఘర్షణ, డ్రామాను పెంచింతే బాగుండేదనిపిస్తుంది. ఎందుకంటే, ఇద్దరు మంచి నటులు పోటాపోటీగా నటిస్తే చూడాలని ఏ ప్రేక్షకుడికైనా ఉంటుంది కదా. ఆ అవకాశాన్ని దర్శకుడు తగ్గించేశాడు. ఇక ఫస్టాఫ్ లో కనిపించిన పాలిటిక్స్ కూడా సెకెండాఫ్ లో కనిపించవు. పూర్తిగా రివెంజ్ డ్రామా నడుస్తుంది.

మొత్తానికి క్లయిమాక్స్ కు వచ్చేసరికి ప్రేక్షకుడ్ని సంతృప్తి పరుస్తారు హీరో-దర్శకుడు. ఈ మొత్తం సినిమాలో నాని వన్ మేన్ షో చూడొచ్చు. ఈ కథను, ఈ పాత్రను నాని ఎందుకు ఇంతలా నమ్మాడో.. ఎందుకు ఇంత ప్రచారం చేశాడో.. ఎందుకు పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లాడో సినిమా చూస్తే అర్థమౌతుంది. ధరణి పాత్రతో నానికి ప్రశంశలే కాదు, అవార్డులు కూడా రావడం గ్యారెంటీ. ఇక వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ చక్కగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సూరిగా దీక్షిత్ శెట్టి, సపోర్టింగ్ రోల్ లో సరిగ్గా సరిపోయాడు. ఇతర పాత్రల విషయానికొస్తే, సముద్రఖనికి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు దర్శకుడు. సాయికుమార్ తో పాటు మిగతా నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా సినిమా అదిరింది. తెరపై నాని ఎంత కష్టపడ్డాడో.. తెరవెనక డీవోపీ, మ్యూజిక్ డైరక్టర్ అంతకంటే ఎక్కువ కష్టపడ్డారనిపిస్తుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సెకెండ్ హీరో. అతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ లో ఉంది. ఇక సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ ఈ సినిమాకు మూడో హీరో. వీర్లపల్లి గ్రామాన్ని కూడా కథలో భాగం చేస్తూ అతడు తీసిన సన్నివేశాలు మెప్పిస్తాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఫస్ట్ టైమ్ డైరక్టర్ లా అనిపించడు. అతడు కథ రాసుకున్న తీరు, అందులో డీటెయిలింగ్ మనల్ని మెప్పిస్తాయి.

ఓవరాల్ గా దసరా సినిమా ఓ మంచి ఎమోషనల్ రైడ్ అందిస్తుంది. కథనం అక్కడక్కడ రొటీన్ అనిపించినప్పటికీ నాని కోసం ఈ సినిమాను తప్పకుండా ఓసారి చూడాల్సిందే.

First Published:  30 March 2023 10:06 AM GMT
Next Story