Telugu Global
MOVIE REVIEWS

Naa Saami Ranga Movie Review: నా సామి రంగ మూవీ రివ్యూ {2.5/5}

Naa Saami Ranga Movie Review: సంక్రాంతి సినిమాల పోటీలో చివరిదైన ‘నా సామి రంగ’ పండుగ ప్రేక్షకుల ముందుకొచ్చింది. విలేజి సినిమాల సంక్రాంతి స్పెషల్ హీరో నాగార్జున నేతృత్వంలో యువహీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు దర్శనమిచ్చారు.

Naa Saami Ranga Movie Review: నా సామి రంగ మూవీ రివ్యూ {2.5/5}
X

చిత్రం: నా సామి రంగ

దర్శకత్వం: విజయ్ బిన్నీ

తారాగణం: అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా మీనన్, బషీర్ కల్లరక్కల్, రావురమేష్, నాజర్ తదితరులు

సంగీతం: ఎంఎం. కీరవాణి, ఛాయాగ్రహణం : దాసరి శివేంద్ర

బ్యానర్: శ్రీనివాసా పిక్చర్స్, నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి

విడుదల: జనవరి 14, 2024

రేటింగ్: 2.5/5

సంక్రాంతి సినిమాల పోటీలో చివరిదైన ‘నా సామి రంగ’ పండుగ ప్రేక్షకుల ముందుకొచ్చింది. విలేజి సినిమాల సంక్రాంతి స్పెషల్ హీరో నాగార్జున నేతృత్వంలో యువహీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు దర్శనమిచ్చారు. ముగ్గురూ మార్కెట్ తగ్గిన హీరోలే. ముగ్గురికీ కొత్త ఉత్సాహం అవసరం. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ ఈ ఉత్సాహాన్ని నింపేందుకు బరువు బాధ్యతలు మీదేసుకుని ఈ పండుగ సినిమాని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాడా లేదా చూద్దాం...

కథ

1960 లలో చిన్నప్పుడు కిష్టయ్య (నాగార్జున) అనాధగా అంజి(అల్లరి నరేష్) వాళ్ళింట్లో వుంటాడు. కట్టాల్సిన అప్పుకోసం వడ్డీ వ్యాపారి దౌర్జన్యం చేస్తే పెద్దయ్య (నాజర్) ఆ బాకీకట్టి కాపాడతాడు. దీంతో కిష్టయ్య పెద్దయ్య పట్ల విశ్వాసంతో వుంటాడు. 1980 లకి వస్తే, భాస్కర్(రాజ్ తరుణ్) వేరే గ్రామ సర్పంచ్ కూతురు కుమారి (రుక్సార్ ధిల్లాన్) ని ప్రేమించాడని చంపడానికి వస్తే కిష్టయ్య కాపాడతాడు. కిష్టయ్య చిన్నప్పటి నుంచి వరాలు(ఆషికా రంగనాధ్) ని ప్రేమిస్తాడు. అయితే తండ్రి వరదరాజులు (రావురమేష్) ఆత్మహత్య చేసుకోవడంతో, తన ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మ హత్య చేసుకున్నాడని కిష్టయ్యకి దూరంగా వుండిపోతుంది వరాలు.

ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చిన పెద్దయ్య కొడుకు దాస్ (షబ్బీర్) వరాలు మీద కన్నేస్తాడు. ఇది చూసి దాస్ తో అంజి గొడవకి దిగడంతో- అంజిని, కిష్టయ్యనీ చంపి వరాలుని సొంతం చేసుకోవాలని దాస్ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇంకోవైపు పక్కూరి సర్పంచ్ భాస్కర్ ని చంపే పథకంతో వుంటాడు. ఈ నేపథ్యంలో కిష్టయ్య ఏం చేశాడు? ప్రేమ శత్రువులకి బుద్ధి చెప్పి వరాలుని పెళ్ళి చేసుకున్నాడా, అంజి- భాస్కర్ లని కాపాడుకున్నాడా అన్నది మిగతా కథ.



ఎలావుంది కథ

మలయాళం ‘పోరింజు జోస్ మరియమ్’ (2019)కి ఇది రీమేక్. దీన్ని సంక్రాంతి పండగ వాతావరణం నేపథ్యంలో తెలుగు నేటివిటీకి మార్చారు. నృత్యదర్శకుడైన విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెర కెక్కించారు. పల్లె వాతావరణం, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు, అనుబంధాలు, గౌరవాలు, స్నేహాలు, ప్రేమలూ సంసార పక్షంగా చూపిస్తూ- ప్రేమల కారణంగా తలెత్తిన పగా ప్రతీకారాల వైపు కథని మళ్ళించి, రక్తసిక్తం చేశారు.

సంక్రాంతికి ఒక విలేజి కథతో సినిమా వుండాలని నాగార్జున చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మూడోది. కానీ ముందు తీసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ లా ఒరిజినల్ కథతో కాకుండా వేరే భాష కథని తెచ్చుకుని సంక్రాంతి పండగ సినిమాలగా మార్చడానికి చేసిన ప్రయత్నంలో ముందు రెండు సినిమాల రేంజిలో కథా కథనాలు, కమర్షియల్ ఎలిమెంట్స్, దర్శకత్వమూ సాధ్యంకాక ఓ బలహీన సినిమాగా మిగిలింది.

నాగార్జునకి తోడుగా అల్లరినరేష్, రాజ్ తరుణ్ లాంటి యువ హీరోలు ఉన్నప్పటికీ ఈ ముగ్గురితో ప్రేక్షకులాశించే వినోదం, అల్లరి అంతగా వుండవు. కానీ కింగ్ నాగార్జున- హీరోయిన్ ఆషికా రంగనాథన్ ల మధ్య రోమాన్స్ మాత్రం సరదాగా కాలక్షేపాన్నిస్తుంది. పల్లెటూరి పాత్రల్ని పోషించడం కొట్టిన పిండి అయిన నాగార్జునకి, ఆయన నటనకి తగినంత వేగంతో కూడిన కథలేక బ్రేకులు వేసింది.

దర్శకత్వం ఔట్ డేటెడ్ గా వుండడం కొట్టొచ్చినట్టు వుండే లోపం. ఫస్టాఫ్ లో 1960 లలో నాగార్జున పాత్ర బాల్యం చూపించడంలో అర్ధం కనిపించదు. 1980 లలోనే కథ ప్రారంభించి రెండు మాటల్లో బాల్యం గురించి చెప్పేస్తే సినిమా నిడివి, బడ్జెట్ తగ్గుతాయి. ఈ కాలం ప్రేక్షకులకి బాల్యం నుంచీ కథ ఎత్తుకుని స్పూన్ ఫీడింగ్ చేయనవసరం లేదు.

తర్వాత ఫస్టాఫ్ లో నాగార్జున లవ్ స్టోరీ, అల్లరి నరేష్ తో ఫ్రెండ్ షిప్, రుక్సార్ తో రాజ్ తరుణ్ రోమాన్స్, ఆతర్వాత విలన్ పాత్రలతో ఘర్షణ సాగి ఇంటర్వెల్ వస్తుంది. అయితే తర్వాత సెకండాఫ్ కథ బలంగా సాగడానికి ప్రత్యర్ధులతో కన్ఫ్లిక్ట్ బలంగా లేకపోవడంతో, సెకండాఫ్ భావోద్వేగాలు కొరవడి బలహీనంగా సాగుతుంది. ఇక క్లయిమాక్స్ లోనే కింగ్ నాగ్ విజృంభణ. ఫస్టాఫ్ లో ఎక్కువగా నవ్వించే ప్రయత్నం చేసి నిలబెట్టినట్టు, సెకండాఫ్ ని సంఘర్షణతో నిలబెట్టలేకపోవడం బలహీనత.


నటనలు- సాంకేతికాలు

విలేజ్ పాత్ర,యాస నాగార్జునకి మరోసారి బాగానేవున్నా ఆయన స్పీడుతో సినిమా పోటీపడలేకపోయింది. వేరే సమర్ధుడైన దర్శకుడు వుంటే ఈ పాత కథ వేరే లెవెల్లో వుండేది. కేవలం దర్శకత్వ లోపం వల్లే అన్ని సమస్యలూ చుట్టు ముట్టాయి. ప్రేమ కోసం తపన ఓవైపు, స్నేహం కోసం పోరాటం మరో వైపు నాగార్జున పాత్రకున్న బలాలైతే, ఈ రెంటినీ ఆయన స్టయిల్ ని దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దలేదు.

అల్లరి నరేష్ ది నాగ్ తో సమానమైన పాత్ర. ఓ పక్క కామెడీ, మరోపక్క ఏడ్పించడం తన పాత్ర పనయితే, ఈ రెండిటిలో రాణించాడు. అయితే క్లయిమాక్స్ లో పాత్రని సరిగ్గా ఉపయోగించుకోలేదు దర్శకుడు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ పాత్రకి కూడా రెండు షేడ్స్ వున్నాయి- మొదట ప్రేమకథలో ప్రేమికగా, తర్వాత విరాగినిగా. రెండూ బాగా నటించింది. ఈ సినిమాతో కొత్త ఆఫర్స్ వచ్చినా రావచ్చు.

అల్లరి నరేష్ భార్య పాత్రలో మిర్నా మీనన్, రాజ్ తరుణ్ లవర్ పాత్రలో రుక్సార్ థిల్లాన్, రాజ్ తరుణ్, విలన్ బషీర్, నాజర్, హాస్యాస్పదంగా ఉత్తుత్తిగానే ఆత్మహత్య చేసుకునే రావురమేష్ అందరూ నట సమర్ధులే, కాకపోతే కథా కథనాలు అలా వున్నాయి.

ఇక 60లలో, 80లలో లొకేషన్స్ ని రీక్రియేట్ చేస్తూ కళాదర్శకత్వం, కెమెరా వర్క్ ఉన్నతంగానే వున్నాయి. ఇదే వారం కెమెరామాన్ దాశరధి శివేంద్రకిది రెండో సినిమా. మొదటిది ‘హనుమాన్’. ఇక కీరవాణి సంగీతంలో పాటలు ఒక ఆకర్షణ. చాలా కాలం తార్వాత తెలుగుదనమున్న సంగీతం. యాక్షన్ దుశ్యాలు సహా ఇతర ప్రొడక్షన్ విలువలు నాగార్జున స్థాయిలో వున్నాయి.

First Published:  14 Jan 2024 12:24 PM GMT
Next Story