Telugu Global
MOVIE REVIEWS

Mukhachitram Movie Review: 'ముఖచిత్రం' రివ్యూ {2/5}

Mukhachitram Movie Review: క్రైమ్ సినిమాలు విరివిగా వస్తున్న క్రమంలో ‘ముఖచిత్రం’ ఇంకో కొత్త దర్శకుడి ప్రయత్నంగా తెరపై కొచ్చింది.

Mukhachitram Telugu Movie Review and Rating
X

Mukhachitram Movie Review: ‘ముఖచిత్రం’ రివ్యూ {2/5}

చిత్రం : ముఖచిత్రం

దర్శకత్వం : గంగాధర్

తారాగణం: విశ్వక్సేన్, వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్, చైతన్య రావు, రవిశంకర్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సందీప్ రాజ్, సంగీతం: కాల భైరవ, ఛాయాగ్రహణం: శ్రీనివాస్ బెజుగం

బ్యానర్: పాకెట్ మనీ పిక్చర్స్

నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యెల్లా

విడుదల : డిసెంబర్ 9, 2022

రేటింగ్: 2/5

క్రైమ్ సినిమాలు విరివిగా వస్తున్న క్రమంలో 'ముఖచిత్రం' ఇంకో కొత్త దర్శకుడి ప్రయత్నంగా తెరపై కొచ్చింది. ఒకప్పుడు ఇవే క్రైమ్ సినిమాలు అన్ని భాషల్లో బి గ్రేడ్ సినిమాలుగా వచ్చి వెళ్ళి పోయేవి. ఇదే పరిస్థితి హార్రర్ సినిమాలది. హార్రర్ సినిమాల్ని ఈ శతాబ్దం ఆరంభం లో బాలీవుడ్ లో స్టార్స్ తో తీస్తూ బి గ్రేడ్ నుంచి అప్గ్రేడ్ చేయడంతో ప్రేక్షకులు పెరిగి మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగా రావడం మొదలెట్టాయి అన్ని భాషల్లో. క్రైమ్ సినిమాలతో ఇది జరగలేదు.

దీంతో చిన్న హీరో హీరోయిన్లతో, కొత్త హీరో హీరోయిన్లతో ఇప్పటికీ ఇవి మెయిన్ స్ట్రీమ్ లోకి రావడం లేదు. తెలుగులో ఎప్పుడో వచ్చే అడివి శేష్ క్రైమ్ సినిమాలు తప్ప స్టార్ స్టేటస్ కి అప్ గ్రేడ్ అవుతున్న దాఖలాల్లేవు. అయితే కొన్ని చిన్న సినిమాలు క్రైమ్ తో తీస్తే దృష్టినాకర్షించే కథాంశాలతో వుంటాయి. ఇది అరుదుగా జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళగలిగితే చిన్న క్రైమ్ సినిమాయే పెద్ద హిట్టయ్యే అవకాశముంటుంది. ఇలాటిదొక మెయిన్ స్ట్రీమ్ కథాంశం 'ముఖచిత్రం' ది. మరి ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోగలిగారా? దీనికి గంగాధర్ అనే అతను కొత్త దర్శకుడు. రచన చేసింది 'కలర్ ఫోటో' దర్శకుడు. ఈ ఇద్దరూ చేతిలో వున్న యూనివర్సల్ కథాంశాన్ని క్రైమ్ తో జోడించి ఏ మేరకు సద్వినియోగం చేసుకుని బాగు పడ్డారో చూద్దాం...

కథ

రాజ్ (వికాస్ వశిష్ట) కాస్మెటిక్ సర్జన్ హైదరాబాద్ లో. అతడ్ని మాయా ఫెర్నాండెజ్ (ఆయేషా ఖాన్) ప్రేమిస్తూంటుంది. ఈ చిన్నప్పటి ఫ్రెండ్ ని కాదనుకుని విజయవాడలో మహతి (ప్రియా వడ్లమాని) ని పెళ్ళి చేసుకుంటాడు. ఒక రోజు మాయా రోడ్డు ప్రమాదంలో మొహం చితికిపోయి కోమాలో కెళ్ళి పోతుంది. మరోవైపు మహతి మెట్ల మీంచి జారిపడి చనిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా చిన్ననాటి స్నేహితురాళ్ళే. ఇప్పుడు మొహం చితికి పోయిన మాయ కోమాలోంచి తేరుకున్నాక ఛూస్తే, తన ముఖం మహతిలా మారిపోయి వుంటుంది. మొహం చితికిన మాయాకి చనిపోయిన భార్య చర్మం తీసి ప్లాస్టిక్ సర్జరీ చేశానని చెప్తాడు రాజ్. ఇప్పుడు మహతిలా వున్న మాయా జీవితమేమిటి? ఆమె మహతి గురించి తెలిసుకున్న రహస్యమేంటి? దాంతో మహతితో రాజ్ పాల్పడిన నేరాన్ని ఎలా బయటపెట్టి శిక్షించింది? ... వీటికి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి..

ఎలావుంది కథ

ఈ క్రైమ్ కథతో వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్ కి సినిమాలో చెప్పిన అర్ధం) గురించి చెప్పాలనుకున్నారు. మంచి కథాంశం. దీని మీద కోర్టులు చెప్పిన తీర్పులు కూడా వున్నాయి. ఇది వరకు వరకట్నపు చావులు నిత్య వార్తలుగా వుండేవి. ఇప్పుడు మారిటల్ రేపులు రిపోర్టవుతున్నాయి. అయితే చాలా వరకూ ఇవి బయటికి తెలియకుండానే వుండి పోతున్నాయి. భార్యకిష్టం లేకుండా భర్త శృంగారానికి బలవంతం చేయడం రేప్ కిందికొచ్చే నేరంగా పరిగణించడానికి సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. ఇదింకా వివాదాస్పద అంశంగానే వుంది.

ఈ అంశంతో కథ చేశారు. దీనికి ముగింపులో కోర్టు సీనుంది. ఈ సీనులో నిందితుడికి పదేళ్ళు శిక్షవేసి సినిమాటిగ్గా ముగించేశారు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఇది మారిటాల్ రేప్ గురించిన కథ అని సెకండాఫ్ లో ఇరవై నిమిషాల వరకూ తెలియదు. తెలిశాక పెద్దగా కథే వుండదు. ముగింపులో కోర్టు వాదనల్లోనే కాసేపు వేడిపుట్టి పూర్తయి పోతుంది.

ఫస్టాఫ్ అంతా హీరో రాజ్ తో మాయ ప్రేమ, మహతితో రాజ్ పెళ్ళి, మాయ- మహతి లిద్దరికీ ప్రమాదాలు జరిగి మహతి చనిపోవడం, మాయా కోమాలోకి వెళ్ళడం జరిగి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్లో రాజ్ - 'మహతి బతకాలంటే మాయా కోమాలోంచి కోలుకోవాలి' అని సస్పెన్సుతో కూడిన డైలాగు చెప్తాడు. ఇలా ఇది మారిటల్ రేప్ గురించిన కథ అని ఇంటర్వెల్లో కూడా ఎస్టాబ్లిష్ కాదు. మరి దీని గురించి ఈ కథ అనేది కూడా అర్ధంగాడు ఇంటర్వెల్లో. రాజ్ మహతిని పెళ్ళి చేసుకున్నాక, రేప్ కి పాల్పడుతున్న దృశ్యాలు కూడా ఫస్టాఫ్ లో వుండవు.

సెకండాఫ్ లో ఇంకో ఇరవై నిమిషాలు గడిచాకే, మహతి రూపంలో వున్న మాయాకి మహతి ఫోన్లో రికార్ఢయిన కాల్స్ ద్వారానే మారిటల్ రేప్ విషయం బయటపడుతుంది. నిజానికి ఈ దృశ్యం ఇంటర్వెల్లో రావాలి. వస్తే, ఫస్టాఫ్ పాయింటు ఎస్టాబ్లిష్ అయి, ఫస్టాఫ్ కి బలంతో బాటు, సెకండాఫ్ లో కావలసినంత స్పేస్ వుండేది మారిటల్ రేప్ కథకి. ఇలా కాకుండా కథా కథనాల స్క్రీన్ ప్లే చెదిరి పోవడంతో ఎత్తుకున్న మారిటల్ రేప్ అనే బర్నింగ్ ఇష్యూ వృధా అయిపోయింది.

పైగా లాజిక్ కి సంబంధించిన సమస్యలు చాలా వున్నాయి. నిజానికి మహతి ప్రమాద వశాత్తూ చనిపోలేదు. రాజ్ చంపాడు. శవాన్ని మాయం చేసి, మహతి మొహాన్ని మాయాకి అతికించాడు. ఇది చట్ట విరుద్ధం, నేరం. దీని గురించి మాయ కంప్లెయింట్ చేసి వెంటనే రాజ్ ని పోలీసులకి పట్టించాలి. ఇది దాచిపెట్టి మహతిలాగా కోర్టుని ఏమార్చి ఆమె మీద మారిటల్ రేప్ కేసు పోరాడుతుంది. చివరికి రాజ్ కి మహతి హత్యలో శిక్షే పడదు. అసలు హత్యే రిపోర్టు కాదు. ఇలా చాలా గజిబిజిగా వుంటుంది మూవీ.

నటనలు - సాంకేతికాలు

ఇందులో విశ్వక్సేన్ ది ముగింపులో కోర్టులో లాయర్ గా వాదించే అతిధి పాత్ర మాత్రమే. ఈ పాత్ర, కోర్టు సీను ఏమీ బాగోకా అతను వృధా అయ్యాడు. మహతిగా నటించిన ప్రియా వడ్లమాని నటన ఒక్కటే చెప్పుకోదగ్గది. అయితే మహతిగా చనిపోయాక, మాయాకి తన రూపం వచ్చి, ఇంకా మహతిలాగే తను నటించడంలో లాజిక్ ఏమాత్రం లేదు. రూపం మారినంత మాత్రాన మహతి మాయ ఎలా అయిపోతుంది? మహతిగా రూపం మారిన ఆయెషా ఖానే మహతిగా నటించాలి. ఈ లాజిక్ కూడా వదిలేసి ఏదో కథ చుట్టేసి క్రైమ్ కథ అన్నారు.

ఆయేషా ఖాన్ ఫస్టాఫ్ లో అరగంట కనిపించి కోమాలో కెళ్ళిపోయే పాత్ర. సాధారణ నటన. హీరో రాజ్ గా, విలన్ గా వికాస్ వశిష్ట నటన కథా కథనాల ప్రమాణాల ప్రకారమే వుంది. లాజిక్ లేని పాత్ర. ఇతడి ఫ్రెండ్ గా, మరో డాక్టర్ గా చైతన్యా రావు నటించాడు. ఇంతే ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాల్సింది.

ఇక సంగీతం గానీ, సాంకేతిక విలువలుగానీ లో బడ్జెట్ కి తగ్గట్టుగానే వున్నాయి. ఇలా కొత్తదర్శకుడు, ఇంకో దర్శకుడు కలిసి- మారిటల్ రేప్ కథని రేప్ చేసి వదిలేశారని చెప్పాలి. ఎవరూ బాగుపడింది లేదు.

First Published:  11 Dec 2022 3:13 PM IST
Next Story