Telugu Global
MOVIE REVIEWS

Mama Mascheendra Review | మామా మశ్చీంద్ర –రివ్యూ {1.5/5}

Mama Mascheendra Movie Review | 2015 లో ‘భలేమంచి రోజు’ హిట్టయిన తర్వాత మరో హిట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్న హీరో సుధీర్ బాబు కి ఏకంగా త్రిపాత్రాభినయం చేసే అవకాశం దక్కింది. రచయిత హర్షవర్ధన్ దర్శకుడుగా మారి తీసిన ‘మామా మశ్చీంద్ర’ సుధీర్ బాబుకి ఈ అవకాశాన్నిచ్చింది.

Mama Mascheendra Review | మామా మశ్చీంద్ర –రివ్యూ {1.5/5}
X

Mama Mascheendra Review | మామా మశ్చీంద్ర –రివ్యూ {1.5/5}

చిత్రం: మామా మశ్చీంద్ర

రచన- దర్శకత్వం: హర్షవర్ధన్

తారాగణం: సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళినీ రవి, హర్షవర్ధన్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు.

సంగీతం: చైతన్ భరద్వాజ్, నేపథ్య సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం : పీజీ విందా

నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

విడుదల: అక్టోబర్ 6, 2023

రేటింగ్: 1.5/5

2015 లో ‘భలేమంచి రోజు’ హిట్టయిన తర్వాత మరో హిట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్న హీరో సుధీర్ బాబు కి ఏకంగా త్రిపాత్రాభినయం చేసే అవకాశం దక్కింది. రచయిత హర్షవర్ధన్ దర్శకుడుగా మారి తీసిన ‘మామా మశ్చీంద్ర’ సుధీర్ బాబుకి ఈ అవకాశాన్నిచ్చింది. అయితే అవకాశమిచ్చిన హర్షవర్ధన్ అసలు ఎంతవరకు దర్శకుడుగా తన కొచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడన్నది ప్రశ్న. తనకే సీను లేకపోతే హీరో కేం సీనుంటుంది. ఇది తెలుసుకుందాం...

కథ

పరశురామ్ (సుధీర్ బాబు) బాల్యంలో తండ్రి క్రూరత్వం వల్ల తల్లి చనిపోతుంది. ఆస్తిని మేనమామ (అజయ్) కాజేస్తాడు. ఆ ఆస్తిని ఎలాగైనా లాక్కోవాలని పరశురామ్ నిర్ణయించుకుంటాడు. మామకి వరసైన కూతురిని పెళ్ళి చేసుకుని ఆస్తిని సొంతం చేసుకుంటాడు. కానీ భార్య కూతురికి జన్మనిచ్చి చనిపోవడంతో ఆస్తులు అమ్మేసుకుని కూతురితో విదేశాలకి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇలా వుండగా అతడి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు తన రూపు రేఖలతోనే దుర్గా (సుధీర్ బాబు2), డీజే (సుధీర్ బాబు 3) అనే ఇద్దరు కవలలుంటారు. వీళ్ళెవరు? ఈ ఇద్దరిలో తనమీద హత్యా ప్రయత్నం చేసిందెవరు? వీళ్ళిద్దర్నీ చంపాలని పరశురామ్ ముందే ఎందుకు నిర్ణయించుకున్నాడు? వైరల్ విశాలాక్షి (ఈషా రెబ్బా), మీనాక్షీ (మృణాలినీ రవి) లలో తన కూతురెవరు? ఈ మొత్తం నేపథ్యంలో పరశురామ్ చెల్లెలెవరు?

ఇవన్నీ పరశురామ్ ముందున్న ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఎలా దొరికాయన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది పాత మోడల్ ఫ్యామిలీ యాక్షన్ కథ. దర్శకుడు చాలా చిక్కు ప్రశ్నలేసుకుని వాటిని విప్పలేక గజిబిజి గందరగోళం చేసుకున్న అయోమయపు సినిమా. ఎన్నో కోణాల్లో ఈ కథని చెప్పబోతాడు. ఏ కోణంలో ఈ కథని విశ్లేషిస్తే అసలు కథ బయటపడుతుందో తెలుసుకోవాలంటే భారీ యెత్తున పరిశోధనలు చేపట్టాలి. 2014 లో సూపర్ హిట్ ‘మనం’ కి మాటల రచయితగా పనిచేసిన తను, అలాటి సంక్లిష్ట కథని సృష్టించాలనుకుని వుండొచ్చు. కానీ తాత (అక్కినేని నాగేశ్వరరావు), తండ్రి (నాగార్జున), మనవడు (నాగ చైతన్య) లతో ‘మనం’ ఎంత సంక్లిష్టంగా వున్నా, సులభంగా అర్ధమయ్యే మాస్టర్ పీస్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అనితరసాధ్యమైన కమర్షియల్ ప్రయోగం.

‘మనం’ లాగా ఏదో చేయబోతే ఇంకేదో అయి సుధీర్ బాబు త్రిపాత్రాభినయం మరో అట్టర్ ఫ్లాప్ కి బాట వేసింది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ చిక్కు ప్రశ్నలతో ట్విస్టులు, షాకులు, లాజిక్ లేని దృశ్యాలూ కథని అర్ధం కాకుండా చేస్తాయి. ఇంత ఫ్యామిలీ కథలో ఎక్కడా భావోద్వేగాలనేవి కూడా వుండవు. ఒక కథకి వుండే ఏ బేసిక్స్ కూడా ఈ కథకి వుండవు. హర్షవర్ధన్ మంచి మాటల రచయితేమోగానీ కథా రచయిత కాదని మాత్రం దీంతో తేలిపోతోంది.

నటనలు- సాంకేతికాలు

సుధీర్ బాబు మామూలుగా మంచి నటుడు. 2202 లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఫ్లాపయినా అందులో కనబర్చిన నటన విశిష్ట మైనది. అలాటిది ఇప్పుడు ఒకటి కాదు మూడు పాత్రల్లో అపహాస్యం పాలయ్యాడు. పరశురామ్ గా పెద్ద వయస్సు పాత్రలో విగ్గు, గడ్డం బడ్జెట్ లేని బి గ్రేడ్ సినిమాలో విలన్ టైపులో వున్నాయి. ఈ సినిమా కథతో ఇద్దరు బాగా డిస్టర్బ్ అయి వుంటారు- మేకప్ మాన్, ఎడిటర్. ఈ పాత్రకి వాయిస్ కూడా సుధీర్ బాబుది కాదు.

ఇక మిగిలిన రెండు పాత్రల్లో ఒకటి రౌడీ, మరొకటి డీజే. రెండూ ఆకట్టుకోవు. ఆకట్టుకునే అవకాశాన్ని కథా కథనాలు ఇవ్వవు. ఈషా రెబ్బా, మృణాళినీ రవి పాత్రలు, నటనలు రొటీన్. ఇతర పాత్రల్లో నటీనటులు కూడా రొటీనే. రామ్ గోపాల్ వర్మగా 'షకలక' శంకర్ కామెడీ కాస్త నవ్వించే ప్రయత్నం చేస్తుంది.

పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేవు. పీజీ విందా కెమెరా వర్క్ లో నాణ్యత లోపించింది. కానీ ఇంతకంటే చిన్న బడ్జెట్ సినిమాల్లో విందా కెమెరా వర్క్ ఒక ఎసెట్ గా వుండేది. ఈ సినిమాకి తనుకూడా మనసు పెట్టి చేయనట్టుంది. ప్రొడక్షన్ విలువలు సుధీర్ బాబు గత సినిమాల స్థాయిలో లేవు.

చివరిగా తేలిందేమిటంటే, హర్షవర్ధన్ మాటల రచయితగా, నటుడుగా తప్ప కథా రచయితగా, దర్శకుడుగా రాణించలేడని. ‘మామా మశ్చీంద్ర’ తనకీ, సుధీర్ బాబుకీ ఒక చేదు అనుభవం!



First Published:  6 Oct 2023 11:25 AM GMT
Next Story