Telugu Global
MOVIE REVIEWS

Malayalee from India Movie Review: మలయాళీ ప్రమ్ ఇండియా- తెలుగు రివ్యూ! {2/5}

Malayalee from India Movie Review: ఈ పూర్వరంగంలో 'మలయాళీ ఫ్రమ్ ఇండియా' అనే కామెడీ గత మే నెలలో విడుదలై జులై 6 నుంచి సోనీలివ్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

Malayalee from India Movie Review: మలయాళీ ప్రమ్ ఇండియా- తెలుగు రివ్యూ! {2/5}
X

చిత్రం: మలయాళీ ప్రమ్ ఇండియా

దర్శకత్వం: డిజో జోస్ ఆంటోనీ

తారాగణం : నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్, మంజు పిల్లై, దీపక్ జెథీ, సలీం కుమార్, షైన్ టామ్ చాకో, సంతోష్ జి. నాయర్ తదితరులు

రచన : శరీష్ మహ్మద్, సంగీతం : జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం : సుదీప్ ఎలామన్

బ్యానర్ : మ్యాజిక్ ఫ్రేమ్స్, నిర్మాత: లిస్టిన్ స్టీఫెన్

స్ట్రీమింగ్ : జులై 6, 2024 (సోనీ లివ్)

రేటింగ్: 2/5

2024 లో తొలి ఐదు మాసాల్లో 10 మలయాళం సినిమాలు హిట్టయ్యాయి. దేశంలో ఇదొక రికార్డు. ఇవి వరుసగా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవడంతో మలయాళం ఓటీటీ మార్కెట్ కూడా పెరిగింది. కేరళలో 85% ఇంటర్నెట్ రీచ్ వుండడంతో, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌ కి అతుక్కుపోతున్నారు. మలయాళంలో అత్యంత స్థానికీకరించిన డిజిటల్ కంటెంట్‌పై దృష్టి పెట్టడం వల్లే కేరళలో ఈ అభివృద్ధి కనిపిస్తోంది. కంటెంట్ వీలైనంత స్థానికంగా వుండేలా, స్థానిక ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీయడంతో ఈ సంవత్సరం ఎక్కువ హిట్లు కనిపిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో 'మలయాళీ ఫ్రమ్ ఇండియా' అనే కామెడీ గత మే నెలలో విడుదలై జులై 6 నుంచి సోనీలివ్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి 'క్వీన్', 'జనగణమన' అనే రెండు సినిమాలు తీసిన డిజో జోస్ ఆంటోనీ దర్శకుడు. మరి ఈ మూడవ ప్రయత్నం హిట్టయ్యిందా లేదా అనేది తెలుసుకుందాం...

కథ

కేరళలోని ముల్లకర్ లో గోపీ (నివిన్ పౌలీ), మల్ఘోష్ (ధ్యాన్ శ్రీనివాసన్) ఇద్దరూ బాధ్యతలు పట్టకుండా అవారాగా తిరుగుతూంటారు. గోపీకి తల్లీ చెల్లెలు వుంటారు. వీళ్ళిద్దరి సంపాదన మీద ఆధారపడి బతికేస్తూంటాడు. క్రికెట్ పిచ్చి, రాజకీయాల పిచ్చి వుంటుంది. రాజకీయాల్లో రైట్ వింగ్ పార్టీని సపోర్టు చేస్తాడు. ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలో కొస్తామని ప్రచారం చేస్తూ తిరుగుతూంటాడు. ఆ పార్టీ కాస్తా ఓడి పోతుంది. ఇక క్రికెట్ మీద పడతాడు. ఆ బాల్ వెళ్ళి అపోజిషన్ పార్టీ వాళ్ళ కిటికీ అద్దాలు పగులగొట్టడంతో ఘర్షణ జరుగుతుంది. ఇంతలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అందులో ఇండియా ఓడిపోయి పాకిస్తాన్ గెలుస్తుంది. దీంతో కొందరు ముస్లిం పిల్లలు టపాకాయలు కాల్చడంతో, అసలే రైట్ వింగ్ సపోర్టరు అయిన గోపి వాళ్ళ ఇళ్ళ మీద బాంబు విసురుతాడు. పోలీసులు పట్టుకోబోతే గల్ఫ్ లో వున్న మేన మామ ద్వారా ఉద్యోగం సంపాదించుకుని గల్ఫ్ కి పారిపోతాడు. అక్కడ మోసపోయి ఎడారిలో ఒంటెల శాలలో పడి, పిల్లిలాటి పాకిస్తానీ మేనేజర్ జలాల్ రషీద్ (దీపక్ జెథీ) కి ఎలుకలా చిక్కుతాడు.

ఇలా రైట్ వింగ్ గోపీ, పాకిస్తానీ జలాల్ చేతిలో పడితే ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏ మలుపులు తిరిగింది? స్వదేశం పారిపోవాలన్న గోపీ ప్రయత్నం ఫలించిందా? చివరికతనేమయ్యాడు? తానూ పాకిస్థానీ ఏం నేర్చుకుని కథ ముగించారు? ఇదీ విషయం.

ఎలావుంది కథ

ఈ కథలో గోపీకి పాకిస్తానీకి మధ్య జరిగే కథ నిజ కథ అని దర్శకుడు పేర్కొన్నాడు. అంటే గోపీ ఆ పాకిస్తానీ కోసం పాకిస్తాన్ కూడా వెళ్తాడన్నమాట. స్థూలంగా ఇది మత సామరస్యం గురించి కథ. విషయం పాతదే. ఈ పాత విషయానికి తగ్గట్టు కథా కథనాలు, సెంటిమెంట్లు, మెలోడ్రామాలు కొత్త సినిమా చూస్తున్నట్టు వుండవు. పైగా ఒకే సినిమాలో ఎన్నో కథలు చెప్పదలిచాడు. ఫస్టాఫ్ లో రాజకీయ కథ ముగించి క్రికెట్ కథ, మత అల్లర్ల కథ, సెకండాఫ్ లో గల్ఫ్ లో ఎడారిలో బందీ అయిన 'ఆడు జీవితం' లాంటి కథ, దీంట్లో మళ్ళీ కరోనా మహమ్మారి కథ, చివరిగా ఇండియా- పాకిస్తాన్ కథ! అంతా ఏమిటేమిటోగా వుంటుంది.

మొత్తంగా ఇన్ని కథలు పొందికగా లేవు. ఒక సమస్య నుంచి మరొక సమస్యకి మారే డాక్యుమెంటరీ టైపు కథనంగా, అస్తవ్యస్తంగా వుంటుంది. ఫస్టాఫ్ లో హీరో ఆవారాతనం ఎప్పుడో అరిపోయిన టెంప్లెట్. పేరుకే కామెడీ సినిమా గానీ ఆ కామెడీ పాతదే. ఫస్టాఫ్ లో గోపీ రాజకీయాల్లో పాల్గొనడం, కృష్ణ (అనస్వర రాజన్)తో రోమాన్స్ చేయడం చూస్తాం. కొన్ని నిమిషాల తర్వాత థీమ్ పూర్తిగా మారిపోయి హీరోయిన్ కృష్ణ కూడా సినిమా నుంచి అదృశ్యమై పోతుంది.

గల్ఫ్ లో పాకిస్తానీకి వంటవాడిగా మారిన తర్వాత ఇద్దరి మధ్య సెంటిమెంట్లు మొదలవుతాయి. ఇక ఫార్ములా ప్రకారం పాకిస్తానీ ఫిదా అయ్యేలా గోపీ హీరోయిజం పెరిగిపోతుంది. అయితే పాకిస్తానీ కోసం పాకిస్తాన్ కి ఎందుకెళ్ళాడనేది మాత్రం సినిమాలో చూడాల్సిందే.

బలహీన, బహుళ కథా కథనాలు, హత్తుకోకుండా సాగే కథా కథనాలు, సాధారణంగా వుండే దర్శకత్వం, ఈ కామెడీకాని కామెడీని హిట్ కి దూరంగా వుంచేశాయి.

నటనలు సాంకేతికాలు

హీరో నివిన్ పౌలీ మాస్ లుక్ తోనే వుంటాడు సినిమా అంతటా. ఫ్రెష్‌గా ఏమీ కనిపించడు. కంగారుకంగారుగా పాత్ర నటించుకుంటూ పోయాడు. ఎక్కడా కాస్తాగి ప్రేక్షకుల్లో ముద్రవేసేలా సన్నివేశాల్లో నటించే ప్రయత్నం చేయలేదు. తోటి పాత్ర ధ్యాన్ శ్రీనివాసన్ తో కెమిస్ట్రీ మాత్రం మాస్ కోసం బాగానే వుంది. ఇద్దరి మధ్య కామెడీ మాస్ కి వర్కవుట్ అవుతుంది. ఇక హీరోయిన్ అనస్వర ఫస్టాఫ్ లో రెండు రోమాన్స్ సీన్లు, ఓ పాట నటించి ఎటు వెళ్ళిపోయిందో తెలీదు.

పాటలు క్యాచీగా వున్నాయి. అయితే అవి మలయాళంలోనే వున్నాయి. కెమెరా వర్క్ అతి మామూలుగా వుంది. సాంకేతికంగా చెప్పుకోవడానికేమీ లేదుగానీ, నిడివి మాత్రం రెండున్నర గంటలుంది!

First Published:  6 July 2024 1:01 PM GMT
Next Story