Telugu Global
MOVIE REVIEWS

Madhi Movie Review: 'మది' -మూవీ రివ్యూ {1.25/5}

Madhi Telugu Movie Review: రాజమండ్రిలో అభిమన్యు(శ్రీరామ్ నిమ్మల), మధు (రిచా జోషీ) ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. చదువు పూర్తి చేసి వైజాగ్ లో ఉద్యోగం వస్తే మధుని వదిలి అయిష్టంగా వైజాగ్ వెళ్తాడు అభిమన్యు.

Madhi Movie Review: మది -మూవీ రివ్యూ
X

Madhi Movie Review: 'మది' -మూవీ రివ్యూ

రచన- దర్శకత్వం : నాగ ధనుష్‌

తారాగణం : శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషీ, రామ్‌ కిషన్‌, శ్రీకాంత్‌, బైరోజ్‌ తదితరులు

సంగీతం: పీవీఆర్‌ రాజా, ఛాయాగ్రహణం : విజయ్ టాగూర్

నిర్మాత: రామ్‌ కిషన్‌

విడుదల : నవంబర్ 11, 2022

రేటింగ్ : 1.25/5


డిమాండ్ లేకపోయినా వారం వారం ప్రేమ సినిమాలు కుప్పలా వచ్చి పడుతున్నాయి. యూత్ కోసం తీస్తున్న ఈ ప్రేమ సినిమాల్ని యూతే చూడడం లేదు. ఇన్ని ప్రేమ సినిమాలు ఫ్లాపవుతున్నా ప్రేమ సినిమాల్ని ఎలా తీసి నిలబెట్టుకోవాలో తెలుసుకునే ఆసక్తి గానీ, తీయగల నైపుణ్యంగానీ వుండడం లేదు. అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాత్రల చేత ప్రేమలో ఎదురయ్యే సమస్యలపై సందేశాలిస్తూ సినిమాలు తీసేయడం. కాలం మారిపోయినా ఇంకా పాతకాలపు ఫార్ములాలనే నమ్మి ఈ కాలపు ప్రేక్షకుల మీద రుద్దడం. ఆ సమస్యలు కూడా రెండో మూడో వుంటాయి. వాటిలో కుల సమస్య ఒకటి. కుల సమస్యతో మొట్టమొదటి 'మాలపల్లి' నుంచీ అడపాదడపా సినిమాలు వస్తూనే వున్నాయి. ఆ సినిమాలు వేరు, దాన్ని సక్సెస్ ఫార్ములాగా నమ్మి ఇప్పుడు తీస్తున్నవి వేరు. 1980 లలో కోడిరామకృష్ణ తీసిన 'అదిగో అల్లదిగో' లాంటి చెంపపెట్టు లాంటి సినిమాలు తీయాలంటే ఇప్పుడు భయం. అందుకని డిబేట్ జోలికిపోకుండా సులభంగా తప్పించుకునే మార్గంగా హింసని చూపించడం. హింసాత్మక కులాంతర ప్రేమలు తీసి బయటపడాలనుకోవడం. ఇలా అనుకుని తీసిందే 'మది' అనే మరో కులాంతర ప్రేమ సినిమా. ఇదెలా వుందో చూద్దాం...

కథ

రాజమండ్రిలో అభిమన్యు(శ్రీరామ్ నిమ్మల), మధు (రిచా జోషీ) ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. చదువు పూర్తి చేసి వైజాగ్ లో ఉద్యోగం వస్తే మధుని వదిలి అయిష్టంగా వైజాగ్ వెళ్తాడు అభిమన్యు. ఈ దూరం వాళ్ళ ప్రేమని ఇంకా పెంచుతుంది. ఇక పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కులాలు వేరని మధు తండ్రి వీళ్ళ పెళ్ళిని తిరస్కరిస్తాడు. మధుకి బలవంతంగా వేరే సంబంధం చూసి పెళ్ళి చేసేస్తాడు. ఇది తట్టుకోలేక పోతారు అభిమన్యు, మధు. ఇక ఏమయితే అయిందని తమ ప్రేమ సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయాని కొస్తారు. అలా పెళ్ళయిన మధు, మధుని పెళ్ళాడ లేకపోయిన అభిమన్యూ యథావిధిగా ప్రేమించుకోవడం మొదలెడతారు. ఇదెలాటి ప్రేమ? దీని పరిణామాలేమిటి? భవిష్యత్తేమిటి? ఇది ఏ ముగింపుకి దారి తీసింది? వీటిని తెలియజేసేదే ఈ కథ.

ఎలావుంది కథ

టైటిల్ ట్యాగ్ లైన్ లోనే 'ప్రేమ- విరహం- ప్రళయం' అని ట్రాజడీ వుంది. దీన్ని 'ప్రేమ- విరహం- ప్రణయం' గా యూత్ మార్చుకోలేరనే నెగెటివ్ మెసేజ్ వుంది. ఇలాటి ప్రేమల జోలికి పోకుండా యూత్ ని భయపెట్టించే కుల వాదంతోనే ఈ కథ వుందని కొత్త దర్శకుడు గ్రహించినట్టు లేదు. మానవ సంబంధాలపై కుల ప్రభావాన్ని చూపిస్తూ, మారుతున్న కాలంతో బాటు ఆలోచనలు మారాలని చెబుతూనే, ట్రాజడీగా ముగించి ఏం చెప్పాలనుకు

న్నాడో అర్ధంగాకుండా చేశాడు.

పాత కాలపు ఆలోచనల వల్ల అభిమన్యు, మధులు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో చూపించడమే, చూపించి ఆ సమస్యల్ని గెలవలేక పోవడమే ముగింపుగా సరిపెట్టేశాడు. పెద్దల పాత కాలపు ఆలోచనలకి తమ కొత్త కాలపు ఆలోచనలలేమిటో వాటితో చెక్ పెట్టి గెలిచే విజేతల కథ గాకుండా పరాజితుల కథ చేశాడు. చెక్ పెట్టాలంటే డిబేట్ అవసరం. కానీ డిబేట్ కన్నా హింసే సులభమనీ, సినిమాటిక్ గా వుంటుందనీ భావించాడు.

అభిమన్యు, మధులకి సమస్యని గెలిచే భావజాలం లేదు. ఉన్నదల్లా ప్రేమే. ఇంత బలంగా ప్రేమించుకుంటున్నాం, మా ప్రేమని ఆమోదించమనే ఆక్రందనే. తమకేం కావాలో ఆ స్వార్ధమే తప్ప, అవతలి వాళ్ళకేమిస్తే సాల్వ్ అవుతుందన్న -విన్ విన్ సిట్యుయేషన్ వుండాలన్న ఆలోచనలేదు.

అభిమన్యు- మధుల సమస్య మొదలైనప్పట్నుంచీ ట్రాజడీ కథనంతో ప్రేక్షకుల్ని టార్చర్ పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. సీన్లు, డైలాగులు పాత కాలానికి చెందినవి. వీటితో పిచ్చెత్తుతుంది. ఇది ఈ కాలపు సినిమా అన్పించడానికి గట్టిగా లిప్ లాకులు, వొత్తుగా హగ్గులు. ఇవి చూసి యూత్ పడిపోతారనా? ఈ సినిమాకి వాళ్ళు వుంటేగా? ఇలా ఎన్ని ప్రేమ సినిమాలు తీసినా యూత్ వుండనే వుండరు. వీటి సంగతి వాళ్ళకి బాగా తెలుసు. ముందు యూత్ 'మది' తెలుసుకుని 'మది' ని తీయాలి.

నటనలు -సాంకేతికాలు

ఉన్న కథాకథనాలైనా వేగంగా లేకపోతే నటనలేముంటాయి. ఉస్సూరన్పించే నటనలు. ఈ డల్ నెస్ ని లిప్ లాక్స్ తో, హగ్స్ తో తీర్చే ప్రయత్నం. ఇంకా పెద్ద బడ్జెట్ 'ఊర్వశివో రాక్షసివో' లో కూడా లిప్ లాక్సే, హగ్సే కాకుండా సెక్స్ ని కూడా కేర్ చేయలేదు ప్రేక్షకులు. ముందు అర్ధవంతమైన బలవంతమైన కథ- అది కూడా ఎంటర్ టైన్ చేస్తూ కావాలి. హీరో శ్రీరామ్ నిమ్మల పెళ్ళయిపోయిన హీరోయిన్ని ఎలా పొందాలనుకుం

టున్నాడో ఆ వ్యూహం లేకుండా, భగ్న ప్రేమికుడిగా ఎంత బాధ నటిస్తే ఎవరిక్కావాలి. అవతల హీరోయిన్ రిచా కూడా ఎంత ఏడుస్తూ వుంటే ప్రేక్షకులేం చేయగలరు.

ఇక ఇలాటి సమస్య వస్తే చంపాలనే అనుకోవడం. హీరోయిన్ తండ్రి హీరోని లేపేయాలనుకునే క్రూరత్వంతో విలన్ నటన. ఇలా నటీనటులు విఫలమయ్యాక, సంగీతం సెకండాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సాంగ్ తో మాత్రం బావుంది. విజయ్ టాగూర్ కెమెరా వర్క్ రాజమండ్రి, వైజాగ్ పరిసరాలతో బావుంది. మందకొడిగా సాగే ఈ సినిమా వేగం పెంచడానికి ఎడిటింగ్ కి అవకాశం లేదు. ఎందుకంటే ఎడిట్ చేస్తే మిగిలేదేమీ వుండదు. కొత్త దర్శకుడు నాగ ధనుష్ ముందు సినిమా రచన మీద పట్టు సాధించి, ఆ తర్వాత దర్శకత్వానికి పూనుకుంటే బావుంటుందేమో ఆలోచించుకోవాలి.

First Published:  12 Nov 2022 3:28 PM IST
Next Story