Telugu Global
MOVIE REVIEWS

'లూసిఫర్'- స్పెషల్ రివ్యూ!

మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సంచలన హిట్ 'లూసివర్' తెలుగులో ఇదే టైటిల్ తో 2019 లో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. ఆన్ లైన్లో ఇది అమెజాన్ లో, యూట్యూబ్ లో అందుబాటులో వుంది.

లూసిఫర్- స్పెషల్ రివ్యూ!
X

చిత్రం: లూసిఫర్

దర్శకత్వం : పృథ్వీ రాజ్ సుకుమారన్

తారాగణం : మోహన్ లాల్, సానియా అయ్యప్పన్, మంజూ వారియర్, వివేక్ ఒబెరాయ్, సచిన్ ఖెడేకర్, టోవినో థామస్, సాయికుమార్, ఇంద్రజిత్ సుకుమారన్, ఫ్రాంక్ ఫ్రీ తదితరులు

రచన : మురళీ గోపి, సంగీతం : దీపక్ దేవ్, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్

బ్యానర్ : ఆశిర్వాద్ సినిమాస్

నిర్మాత : ఆంటోనీ పెరంబవూర్

విడుదల : ఏప్రెల్ 12, 2019

రేటింగ్ : 3 / 5


మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సంచలన హిట్ 'లూసివర్' తెలుగులో ఇదే టైటిల్ తో 2019 లో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. ఆన్ లైన్లో ఇది అమెజాన్ లో, యూట్యూబ్ లో అందుబాటులో వుంది. వర్తమాన దేశ రాజకీయాలని కేరళ రాష్ట్ర నేపధ్యంలో పరోక్షంగా చిత్రించే ఈ రాజకీయ థ్రిల్లర్ కి దేశ విదేశ కేరళీయులు స్పందించి విశేషంగా కలెక్షన్లు కట్టబెట్టారు. బయోపిక్స్ పేరుతో, పోలిటిక్స్ పేరుతో 2019 నాటి ఎన్నికల సీజన్లో ఇతర భాషల్లో అప్పటికే అనేక సినిమా లొచ్చాయి. వాటిలాగా పార్టీ ఎన్నికల ప్రచార సాధనంగా గాక, ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నించే కుటిల రాజకీయ శక్తుల ప్రక్షాళనగా 'లూసిఫర్' ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవుడి కుడి భుజంగా వెలిగిన దేవదూత లూసిఫర్ ని సాతానుగా ముద్రవేసి స్వర్గం నుంచి బహిష్కరిస్తే ఏం జరిగిందనే హిబ్రూ పురాణ గాథని, వర్తమాన పరిస్థితులకి అన్వయించి నిర్మించిన ఈ భారీ ప్రయోగాత్మకం ఎలా వుందో ఒకసారి చూద్దాం...

కథ

ముఖ్యమంత్రి పీకే రాందాస్ (సచిన్ ఖెడేకర్) ఆకస్మిక మృతితో కథ ప్రారంభమవుతుంది. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలో పోటాపోటీలు మొదలవుతాయి. రాందాస్ కుమార్తె ప్రియ (మంజూ వారియర్), ఆమె కుమార్తె జాహ్నవి (సానియా అయ్యప్పన్) లతో బాటు కొడుకు జతిన్, అల్లుడు బాబీ అంత్యక్రియలకి వస్తారని ఎదురు చూస్తూంటారు. విదేశీ యాత్రలో వున్న రాందాస్ కుమారుడు జతిన్ రాందాస్ (టోవినో థామస్) ఇప్పట్లో రాలేనని కబురు పంపుతాడు. ముంబాయిలో బిజినెస్ పనుల్లో వున్న రాందాస్ అల్లుడు బాబీ (వివేక్ ఒబెరాయ్) కూడా తాత్సారం చేస్తూంటాడు. ఇక ప్రియ తనే తండ్రి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేస్తుంది. తర్వాత ఆమె భర్త బాబీ ముంబాయి నుంచి వచ్చి సీఎంగా జతిన్ పేరు ప్రతిపాదిస్తాడు. పార్టీలో నెంబర్ టూ వర్మ (సాయికుమార్) దీన్ని వ్యతిరేకిస్తాడు, ప్రియకి కూడా ఇది మింగుడుపడదు. ప్రతిపక్ష నేత ఇంకో కుట్రతో వుంటాడు. అయినా బాబీ మాట నెగ్గించుకుని, జతిన్ చేత పార్టీ శ్రేణులకి ప్రసంగ మిప్పిస్తాడు. దీంతో ఇతనే మా సీఎం అంటూ హర్షధ్వానాలు చేస్తాయి పార్టీ శ్రేణులు.

ఇదంతా గమనిస్తున్న స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్ లాల్) ఇందులో బాబీ చేస్తున్న భారీ కుట్రని పసిగడతాడు. ఎక్కడో కొండ ప్రాంతంలో దివంగత సీఎం రాందాస్ కి చెందిన అనాధాశ్రామాన్ని చూసుకుంటున్న ఇతను, ఇక దైవ సమానుడైన రాందాస్ కుటుంబాన్నీ, ఆయన రాజకీయ వారసత్వాన్నీ నిలబెట్టేందుకు కదిలి వస్తాడు. ఎవరీ స్టీఫెన్ గట్టు పల్లి? అతను లూసిఫర్ గా ప్రకటించుకుని ఎలా శత్రువినాశం గావించాడు? అతడికి తోడ్పడిన గ్రూపులెవరు?...అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది అంతరార్ధాలతో, సంకేతాలతో చెప్పిన కేరళ రాజకీయ కుట్రల కథ. అపారమైన డబ్బుతో ప్రభుత్వాల్ని మార్చెయ్యగల రిచ్ రాజకీయ శక్తికి వ్యతిరేకంగా పోరాడే కథ. ఇక్కడ మతాల గొడవేంటని ప్రశ్నించే కథ. ఇందులో ఓపెన్ గానే డైలాగు వుంది - 'నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వ్యాపించిన మతోన్మాదమనే కార్చిచ్చు, ఇప్పుడు ఈ రాష్ట్రానికి కూడా వ్యాపించి దహించడం మొదలెట్టింది. దీన్నెదుర్కోవడానికి మనక్కావాల్సింది డబ్బు' అని. కొన్ని పాత్రలు కూడా గుర్తించదగ్గ రాజకీయ వాసనేస్తూ వుంటాయి. చివరికి అన్నీ చక్కబడి, ప్రశాంతత నెలకొన్న వాతావరణంలో ముగింపు వాయిసోవర్ కూడా ఇలా వుంటుంది – ఈ ప్రాంతాన్ని స్వర్గ భూమి అని ఎందుకన్నారో చెప్పి, ఇంత కాలం ఇక్కడి ప్రజల్ని కాపాడింది దేవుడు కాదనీ చెబుతూ, 'ఇక ముందూ కాపాడ బోయేది దేవుడు కాదు...ఇది దేవుడి రాజ్యం కాదు...స్వర్గం నుంచి బహిష్కరింపబడిన దేవదూతల రాజ్యం...' అని సున్నితంగా వ్యాఖ్యానిస్తారు.

స్టీఫెన్ గట్టుపల్లి క్రిస్టియన్, అతడికి తోడ్పడే జయేద్ మసూద్ గ్రూపు (ఈ పాత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు) ముస్లిం, వీళ్ళు కాపాడే రాజకీయ కుటుంబం హిందూ. కేరళ సోషల్ స్ట్రక్చర్ మతసామరస్యంతో కూడి ఎంత బలంగా వుంటాయనడానికి ప్రతీకాలంకారాలుగా ఈ పాత్రలు.

ఇక్కడ ఇంకో ముఖ్యాంశమేమిటంటే, మసూద్ గ్రూపు నాయకుడు మసూద్, 'ఖురేషీ అబ్రాం' పేరుతో అంతర్జాతీయ 'ఇల్యుమినాటిస్ సొసైటీ' లో సభ్యుడుగా వుంటాడు. శతాబ్దాల చరిత్రగల 'ఇల్యుమినాటిస్ సొసైటీ' గురించి తెలిసిందే. ప్రపంచ ధనికుల దగ్గర్నుంచి, మేధావులు, సామాన్యులు కూడా ఈ సొసైటీలో ఎవరైనా చేరవచ్చు. వీళ్ళంతా సామాజిక న్యాయం కోసం, ప్రజానీక సామూహిక అభ్యున్నతి కోసం కార్యకలాపాలు నిర్వహిస్తూంటారు. ఇక్కడ నీతి ఏమిటంటే, మసూద్ టెర్రరిజం వైపుకెళ్ళకుండా, ఈ సొసైటీలో చేరడం. స్టీఫెన్ గట్టుపల్లి ఈ సొసైటీతోనే సంబంధాలు పెట్టుకోవడం. అధికారం కోసం అల్లుడు బాబీ వేల కోట్లు ఖర్చు పెట్టగల స్థాయిలో వుంటాడు, అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్ వర్క్ తో సంబంధాలు పెట్టుకుని. డ్రగ్ మాఫియాతో సంబంధాలంటే టెర్రరిస్టులతో సంబంధాలే అనుకున్న స్టీఫెన్ గట్టుపల్లి- ముగింపులో రష్యా వెళ్లి - బాబీతో సంబంధాలున్న రష్యన్ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ఫొయోడర్ ని అంతమొందిస్తాడు.

ఆ తర్వాత ముంబాయిలో ఓ అతి బడా పారిశ్రామిక వేత్తకి ఫోన్ వస్తుంది. క్రోనీ క్యాపటలిజం. ప్రభుత్వానికి ఆర్ధిక దన్ను. ఇతను 'ఎవడ్రా నువ్వు?' అని కొందరు మాఫియా డాన్ల పేర్లు, టెర్రరిస్టుల పేర్లు చెప్తాడు. అవతల ఫోన్ చేసిన మసూద్, ఫోన్ ని స్టీఫెన్ గట్టుపల్లి కిస్తాడు. స్టీఫెన్ గట్టు పల్లి, 'ఖురేషీ అబ్రాం' అని చెప్పి కట్ చేస్తాడు. అంటే ఇక స్టీఫెన్ గట్టుపల్లి ఇప్పుడు తను కూడా ఇల్యుమినాటిస్ లో చేరిపోయాడన్న మాట.

ఇదంతా నటుడు, గాయకుడు, రచయిత, జర్నలిస్టు మురళీగోపి నీటుగా రాసిన కథా, స్క్రీన్ ప్లేల గొప్పతనం. నడుస్తున్న చరిత్రని పరోక్షంగా చూపిస్తాడు. ఇంకొక మతిపోయే క్రియేషన్ ఏమిటంటే, కేరళ అడవుల్లో బాబీ తాలూకు డ్రగ్ మాఫియా ముఠా మొత్తాన్నీ (పదుల సంఖ్యలో వుంటారు) అంతమొందించి వచ్చేస్తాడు స్టీఫెన్ గట్టుపల్లి.

ఈ సంఘటనలో స్టీఫెన్ గట్టుపల్లిని పట్టుకోవడానికి సాక్ష్యాధారాల కోసం పోలీసులు వచ్చేస్తారు. అక్కడ శవాలు వుండవు, సెల్ ఫోన్లు వుండవు, ఫైరింగ్ జరిగినట్టు ఎక్కడా ఆనవాళ్ళూ వుండవు. అసలు సంఘటనే జరిగినట్టు వుండదు! ఇది బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ ని గుర్తుకు తెస్తుంది...

ఎవరెలా చేశారు

మోహన్ లాల్ చాలా అండర్ ప్లే చేస్తూ నటిస్తాడు పాత్రని. అతడి చర్యలే చెప్తూంటాయి పాత్ర మానసిక తీవ్రతని. హిబ్రూ పురాణ పాత్ర లూసిఫర్ ని పోలిన జీవిత చరిత్ర ఈ పాత్ర కుంటుంది. తను స్వర్గం నుంచి పతనమైనా, ప్రాణసమాన మైన స్వర్గవాసులైన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులని కాపాడి, వారి స్వర్గాన్ని పునఃస్థాపించే ఉదాత్త పాత్రగా, లోక రాక్షకుడుగా వుంటాడు. డైలాగులు చాలా తక్కువ. ఫైట్లు చాలా ఎక్కువ. లుంగీ కట్టుకునే ఇరగదీస్తూంటాడు ఎక్కడపడితే అక్కడ శత్రువుల్ని. క్లాస్ కథని సామాన్యులు మెచ్చేలా మాస్ పాత్రతో చెప్పడం ఇక్కడ వ్యాపార వ్యూహం. వారం తిరిగేసరికల్లా వసూళ్ళు వందకోట్లు దాటింది. అరవై దాటినా మోహన్ లాల్ ఇంకా బాక్సాఫీసుని కమాండ్ చేస్తున్నాడు.

సీఎం కూతురి పాత్రలో మంజూ వారియర్ ప్రేక్షకుల మీద అత్యంత బలమైన ప్రభావం చూపే మరో పాత్ర. ఈమె కూతురి పాత్రలో సానియా అయ్యప్పన్ బాధిత పాత్ర. సీఎం అల్లుడు బాబీ పాత్రలో ప్రధాన విలన్ గా క్లాస్ నటనతో వివేక్ ఒబెరాయ్. సీఎం హైఫై కొడుకుగా టోవినో థామస్ పాత్ర, నటన చాలా సర్ప్రైజింగ్ గా వుంటాయి. కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించే ఇతడి మీద ఇంటర్వెల్ సీను హైలైట్ గా వుంటుంది. ఎకాఎకీన వూడిపడే రాజకీయ వారసుల మీద సెటైర్ ఈ పాత్ర. మాతృభాష కూడా రాని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని, డబ్బా కొడుకుల రాజకీయ అరంగేట్రాలకి కొరడా దెబ్బ ఈసీను. కానీ ఇదే సీనులో తను ఎలా విదేశాల్లో సంస్కృతి మరవకుండా, రాజకీయ పరిజ్ఞానాన్ని జోడించుకుని పెరిగాడో మాతృభాషలో అనర్గళంగా చెప్పి ముగించే పాజిటివ్ టచ్ – రాజకీయ నాయకుల వారస రత్నాలకి పాఠంలా వుంటుంది.

చివరికేమిటి

నటుడు, గాయకుడు, నిర్మాత, పంపిణీదారుడు, దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకుడుగా ఈ తొలి ప్రయత్నంతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. అయితే ఒక్కటే లోపం. అతి స్లోగా సినిమా సాగడం. అయినా మలయాళంలో అంత హిట్టయిందంటే ఇది వాళ్ళ సినిమా, వాళ్ళ సూపర్ స్టార్. పరాయి ప్రేక్షకులకి ఇంత స్లో నడక ట్రెండ్ కి దూరంగా ఇబ్బందిగానే వుంటుంది. పైగా మూడు గంటల నిడివి.

ఐతే అవే రెండు మూడు రకాల కథలతో రొటీనై పోయిన రాజకీయ సినిమాలతో పోలిస్తే, విషయపరంగా చాలా భిన్నమైనది, బలమైనది. ఇంటర్వెల్ వరకూ సీఎం చనిపోయి, వారసుడెవరన్న ప్రశ్నతో, సీఎం పదవి కోసం ఎత్తుగడల మామూలు కథగానే వుంటుంది. ఐతే సీఎం కొడుకునే విలన్ ప్రతిపాదించడంతో కథ ఇక్కడి నుంచి మారిపోతుంది. సీఎం పదవికోసం కుట్రల కథల రొటీన్ ని ఛేదించి, అడ్డదారుల్లో అధికారాన్ని కైవసం చేసుకునే కుట్ర దారుల నిర్మూలనగా, డిఫరెంట్ గా టేకాఫ్ తీసుకుంటుంది. సీఎం చనిపోవడం, పదవి భర్తీ ఇదంతా షుగర్ కోటింగ్ లా పైకి కన్పించే కథ మాత్రమే. అంతర్లీనంగా చెప్పాలనుకున్న పరోక్ష కథ పూర్తిగా వేరు. ఇదేమిటనేది పైనే చెప్పుకున్నాం.

క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలకి హిందీ ఐటెం సాంగ్ బాగా కిక్కు నిస్తుంది. సినిమాలో వున్నది ఒకే పాట. ఇది చివర్లో సినిమానే పైసా వసూల్ చేస్తుంది. వినోదంతో బాటు విజ్ఞానం కోసం ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని చూడొచ్చు.

ఇది మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్ ఫాదర్' గా రీమేక్ అయింది. ఈ రీమేక్ లో మార్పు చేర్పులు జరిగే వుంటాయి. అయితే అంతరార్ధాలతో, సంకేతాలతో, ప్రతీకాలంకారాలతో, బలమైన పాత్రలతో చాలా డెప్త్ తో డిఫరెంట్ ఫీలింగ్ తీసుకొస్తూ రూపొందిన 'లూసిఫర్' స్థాయిలోనే ఇది వుంటుందా? దేవదూత లూసిఫర్ తో హిబ్రూ పురాణ నేపథ్యం వుంటుందా? ఇల్యూమినాటిస్ గోడచేర్పు వుంటుందా? తెలుగు నేటివిటీ కోసం, చిరంజీవి రొటీన్ ఇమేజి కొనసాగింపు కోసం, మరో రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ గా మారిపోయిందా? ఇవి అక్టోబర్ 5న తెలుసుకుందాం...

First Published:  29 Sept 2022 9:42 AM IST
Next Story