Kuttey Movie Review: ‘కుత్తే’- హిందీ మూవీ రివ్యూ {2.5/5}
Kuttey Movie Review: విశాల్ భరద్వాజ్ కుమారుడు ఆస్మాన్ భరద్వాజ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ తన తరహా థ్రిల్లర్ తీయించాడు. విదేశాల్లో శిక్షణ పొంది వచ్చిన ఆస్మాన్ భరద్వాజ్ క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్, గై రిచీలని ఫాలో అవుతూ ‘కుత్తే’ (కుక్కలు) మేకింగ్ చేశాడు.
చిత్రం: కుత్తే
రచన -దర్శకత్వం : ఆస్మాన్ భరద్వాజ్
తారాగణం : టబు, అర్జున్ కపూర్, కొంకణా సేన్ శర్మ, నసీరుద్దీన్ షా, రాధికా మదన్, కుముద్ మిశ్రా, శార్దూల్ భరద్వాజ్ తదితరులు
పాటలు : గుల్జార్, ఫైజ్ అహ్మద్ ఫైజ్; సంగీతం : విశాల్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : ఫర్హాద్ అహ్మద్ డెహ్ల్వి
బ్యానర్స్ : లవ్ ఫిల్మ్స్, టీ- సిరీస్ ఫిల్మ్స్, విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్
నిర్మాతలు : విశాల్ భరద్వాజ్, లవ్ రంజన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్
విడుదల : జనవరి 13, 2023
రేటింగ్ : 2.5/5
విశాల్ భరద్వాజ్ కుమారుడు ఆస్మాన్ భరద్వాజ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ తన తరహా థ్రిల్లర్ తీయించాడు. విదేశాల్లో శిక్షణ పొంది వచ్చిన ఆస్మాన్ భరద్వాజ్ క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్, గై రిచీలని ఫాలో అవుతూ ‘కుత్తే’ (కుక్కలు) మేకింగ్ చేశాడు. ఈ కుక్కలకి ఒకే బొక్క (ఎముక) కావాలి. దానికోసం కాల్చి చంపుకుంటారు. చివరికి ఏ కుక్కకి బొక్క దొరికిందన్నది కథ. ఆ కుక్కలు గడ్డితినే పోలీసులు, డ్రగ్ స్మగ్లర్లు, నక్సల్స్. ఆ బొక్క ఏటీఎం వ్యానులో నోట్ల కట్టలు. ముంబాయి శివారులో రాత్రి పూట వేట.
ఈ మగ కుక్కల మధ్య ఓ ఖతర్నాక్ ఆడ కుక్క వుంటుంది టబు రూపంలో. ఇది ప్రధానంగా టబు సినిమా. క్వెంటిన్ టరాంటినో ‘రిజర్వాయర్ డాగ్స్’ తరహా పాత్రలు, కోయెన్ బ్రదర్స్ శైలి నోయర్ మేకింగ్, గై రిచీ టైపు డార్క్ కామెడీ కలగలిపి ఓ దేశీ హాలీవుడ్ ని సింగారించాడు దర్శకుడు.
ఈ కథ మూడు చాప్టర్లుగా వుంటుంది. ఫస్టాఫ్ లో రెండు, సెకండాఫ్ లో ఒకటి. ఈ మూడు చాప్టర్లకి ప్రారంభంలో నాంది వుంటుంది. చాప్టర్ల తర్వాత ఉపసంహారం వుంటుంది. అసలు కథ సెకండాఫ్ లో మొదలవుతుంది. కుక్కల మీద మార్క్సిస్టు కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘యే గలియోమే ఆవారా బేకార్ కుత్తే’ గీతంతో బాటు, గుల్జార్ రాసిన ‘ఆజాదీ’ సాంగ్ తో ఈ సినిమా ఏ నేపథ్యంలో ఐడియాలజీ చెప్తోందో అర్ధం జేసుకోవచ్చు. ఇదంతా ఎలా మొదలవుతుందంటే...
నాంది – లక్ష్మీ బాంబు
2003 లో నక్సలైట్ నాయకురాలు లక్ష్మీశర్మ (కొంకణా సేన్ శర్మ) మహారాష్ట్ర లోని గడ్చిరోలీలో ఒక ఠాణాలో బందీ అయి వుంటుంది. పోలీసు హింసని భరిస్తుంది. తెల్లారే నక్సల్ దళం ఠాణామీద దాడి చేసి ఆమెని విడిపించుకు పోతారు. పోతూ లక్ష్మీశర్మ ఒక అధికారి చేతిలో బాంబు పెట్టి, అతడికి తర్వాత పనికొచ్చే ముక్క చెప్పి పోతుంది.
మొదటి చాప్టర్ – సబ్ కా మాలిక్ ఏక్ హై
పదమూడేళ్ళ తర్వాత 2016 లో- ముంబాయిలో భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే (నసీరుద్దీన్ షా) ఎదుట ఇద్దరు పోలీసు అధికారులు గోపాల్ (అర్జున్ కపూర్), పాజీ (కుముద్ మిశ్రా) వుంటారు. వీల్ చైర్ లో వున్న భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే, ‘అసలు డ్రగ్ డీలర్ సూర్తితో మీరెందుకు రిలేషన్ పెట్టుకున్నారురా?’ అని అడుగుతాడు. వాడిని ఖతం చేయమని ఆర్డరేస్తాడు. గోపాల్, పాజీలు సూర్తిని చంపి అతడి దగ్గరున్న కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకుని పారిపోవాలని ప్లానేస్తారు.
అలా సూర్తిని చంపామనుకుని డ్రగ్స్ తీసుకుని పారిపోతూ సూర్తి అందించిన సమాచారంతో పోలీసులకి దొరికిపోతారు. తమ సీనియర్ రాజీవ్ మిశ్రా (దర్శకుడు ఆస్మాన్ భరద్వాజ్) కి తాము కోవర్ట్ ఆపరేషన్ చేశామని బొంకుతారు. అబద్ధాలు చెల్లవని రాజీవ్ ఇద్దర్నీ సస్పెండ్ చేస్తాడు. విధిలేక ఇద్దరూ ఇన్‌స్పెక్టర్ పమ్మీ(టబు) దగ్గరి కెళ్ళి సాయం కోరుతారు.
రెండో చాప్టర్ - ఆతా క్యా కెనడా
సాయం అడిగిన ఇద్దరికీ కోటి రూపాయలిస్తే సస్పెన్షన్లు ఎత్తివేయిస్తానని చెప్తుంది ఇన్స్ పెక్టర్ పమ్మీ. ఇంతలో పమ్మీ పాత కొలీగ్ హేరీ (ఆశీష్ విద్యార్థి) వస్తాడు. ఇతనిప్పుడు ముంబాయి, నవీ ముంబాయిలలో ఏటీఎంలకి డబ్బు సరఫరా చేసే వ్యానుకి సెక్యూరిటీగా వుంటున్నాడు. ప్రతి రాత్రి వ్యాన్‌లో 4 కోట్ల డబ్బు సరఫరా అవుతుందని చెప్తాడు. దీంతో గోపాల్ టెంప్ట్ అవుతాడు. ఇక వ్యాను పని బట్టాలని ప్లానేస్తాడు షాజీతో కలిసి.
పోలీసుల్లో తనలాంటి డర్టీ డాగ్స్ ని పోగేసి ఒక నకిలీ చెక్ పోస్టు ఏర్పాటు చేస్తాడు. డర్టీ డాగ్స్ ని కనిపెట్టిన హేరీ, నకిలీ చెక్ పోస్టుదగ్గర పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్సి చంపుతాడు. తెలివైన కుక్క గోపాల్ అంత త్వరగా చావక ఏటీఎం వ్యానుతో ఉడాయిస్తాడు. ఈ వ్యాను కోసమే వేర్వేరు ప్లానులు వేసుకున్న భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే కూతురు లవ్లీ ఖోబ్రే (రాధికా మదన్), ఆమె బాయ్ ఫ్రెండ్; నక్సల్ లక్ష్మీ శర్మా వచ్చి పడతారు.
పై రెండు చాప్టర్ల పేర్లు సబ్ కా మాలిక్ ఏక్ హై, ఆతా క్యా కెనడాల తర్వాత ఇక మూడో చాప్టర్ మూంగ్ కీ దాల్ (పెసర పప్పు) లో మిగతా కథ చూడొచ్చు. ఈ కథలో డబ్బు వేటలో డబ్బు చివరికి ఎవరికి చేజిక్కిందనేది క్రూరమైన ఆటగా వుంటుంది. ఈ ఆటలో ఇన్స్ పెక్టర్ పమ్మీ డామినేటింగ్ పాత్ర ఏంటో తెలుస్తుంది.
అనైతిక పాత్రలు -అద్భుత నటనలు
తండ్రి విశాల్ భరద్వాజ్ తో కలిసి ఆస్మాన్ భరద్వాజ్ తయారు చేసిన స్క్రిప్టు డార్క్ కామెడీకి ఎక్స్- రేట్ పంచ్ లతో వుంది. ‘పైవాడు ఆడంగి వెధవల్ని తయారు చేయడం మానేశాడు. ఇప్పుడు చిన్నవెర్రి పువ్వు (బూతు), పెద్ద వెర్రి పువ్వు (బూతు), మహా వెర్రి పువ్వుల్ని (బూతు) తయారు చేసి పంపున్నాడు - టబు డైలాగు. ‘న్యాయానికి రోజులు కావు. నీ...(బూతు) అందరికందరూ కుక్క నా కొడుకులే’ -అర్జున్ కపూర్ డైలాగు. ‘మార్కెట్లో నా వేల్యూ కంటే వాడి వేల్యూ ఎందుకు తక్కువ (బూతు) రా?- నసీరుద్దీన్ షా డైలాగు. విశాల్ భరద్వాజ్ రాసిన డైలాగులు గత సినిమాలకంటే మితిమీరిన డైరెక్టు తిట్లతో వున్నాయి.
అయితే నటనలు ఖతర్నాక్ గా వున్నాయి. ఓవరాక్షన్ లేని ఖతర్నాక్. ఇందులో టబుది ప్రథమ స్థానం. ఈ హార్డ్ కోర్ సీరియస్ క్రైంలో ఆమె ఒక్కటే నవ్వించే పాత్ర. ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వంలో సాంకేతిక - సృజనాత్మక విశేషాలున్నాయి. రెండు కీలక సన్నివేశాల్లో రెడ్ సిల్హౌట్ తో దృశ్యపరమైన మూడ్ ని క్రియేట్ చేశాడు. రాత్రి పూట దృశ్యాలన్నీ ఎల్లో టింట్ తో వున్నాయి. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సైకలాజికల్ గా ఒకలాంటి మత్తులోకి తీసికెళ్తాయి.
అయితే డబ్బుకోసం మూడు ముఠాల విచ్చలవిడి కాల్పులు, చావులూ కథ మీద పట్టు తప్పేలా చేశాయి. యాక్షన్ వుంటుంది గానీ కథా పరమైన సస్పెన్స్, థ్రిల్, ఇప్పుడేం జరుగుతుందన్న మలుపులూ లేవు. చిత్రీకరణలో వున్న సృజనాత్మకత సెకండాఫ్ కథ చెప్పడంలో లేదు. అయితే సాగదీయకుండా గంటా 45 నిమిషాల్లో ముగించడం రిలీఫ్. ముగింపులో ఉపసంహారం ఫన్నీగా వున్నా, దానికి డార్క్ కామెడీతో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ లాజికల్ గా వుండదు - లాజిక్ క్యాహై అని ప్రశ్న వేసి తప్పించుకుంటాడు.
మొత్తానికి తండ్రి అడుగు జాడల్లో తండ్రిలాగా తీసిన ఆస్మాన్ భరద్వాజ్, ఇకపైన తనలాగా తీసి నిరూపించుకోవాలి. పైన చెప్పుకున్న హాలీవుడ్ దర్శకుల్ని అనుసరించడం కూడా ఈ రోజుల్లో వర్కౌట్ కాదు. అందులో గై రిచీ తప్ప క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్ తమ బ్రాండ్ నుంచి దూరం జరిగి శైలిని మార్చుకున్నారు.