Telugu Global
MOVIE REVIEWS

Ghost Movie Review | ఘోస్ట్ మూవీ రివ్యూ {2.5/5}

Kannada actor Shiva Rajkumar's Ghost Movie Review | గత నెల దసరాకి కన్నడలో విడుదలైన ‘ఘోస్ట్’ రెండువారాల్లో రూ. 20 కోట్లు వసూలు చేసి హిట్టనిపించుకుంది. దీని బడ్జెట్ రూ. 15 కోట్లే. ఈ రోజు తెలుగు వెర్షన్ విడుదలైంది.

Ghost Movie Review | ఘోస్ట్ మూవీ రివ్యూ {2.5/5}
X

Ghost Movie Review | ఘోస్ట్ మూవీ రివ్యూ {2.5/5}

చిత్రం: ఘోస్ట్

రచన -దర్శకత్వం: ఎంజి శ్రీనివాస్

తారాగణం: శివరాజ్‌కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, దత్తన్న తదితరులు

సంగీతం: అర్జున్ జన్య, ఛాయాగ్రహణం : మహేంద్ర సింహా

బ్యానర్: సందేశ్ ప్రొడక్షన్స్, నిర్మాత : సందేశ్ నాగరాజ్

విడుదల: నవంబర్ 4, 2023

రేటింగ్: 2.5/5

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల ‘జైలర్’ లో ఒక పాత్రలో గ్యాంగ్ స్టర్ గా అతిధి పాత్ర నటించి ఆకట్టుకున్నాడు. ఈ ‘జైలర్’ ఫీవర్ ఇంకా వుండగానే శివరాజ్ కుమార్ మరో యాక్షన్ మూవీతో కన్నడ ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. గత నెల దసరాకి కన్నడలో విడుదలైన ‘ఘోస్ట్’ రెండువారాల్లో రూ. 20 కోట్లు వసూలు చేసి హిట్టనిపించుకుంది. దీని బడ్జెట్ రూ. 15 కోట్లే. ఈ రోజు తెలుగు వెర్షన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో దీని పరిస్థితేమిటో చూద్దాం...

కథ

కర్ణాటకలో జైళ్ళ ప్రయివేటీకరణ గురించి పదేళ్ళు పొరాడి విజయం సాధిస్తాడు మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్). భూమి పూజ చేయడానికి జైలుకెళ్తాడు. అదే సమయంలో ఒక ముసుగు వ్యక్తి, అతడి ముఠా జైలుని హైజాక్ చేసి ఖైదీలు సహా వామన్ శ్రీనివాస్ ని, జైలు అధికారుల్నీ బందీలుగా వుంచుకుంటారు. దీంతో వెంటనే సిటీ పోలీస్ కమీషనర్ చరణ్ రాజ్ (జయరాం) రంగంలోకి దిగుతాడు. జైలుని హైజాక్ చేసిన ముసుగు వ్యక్తి బిగ్ డాడీ (శివరాజ్ కుమార్) అనే క్రైమ్ బాస్ అని తెలుసుకుంటాడు.

బిగ్ డాడీ జైలులో దాచిపెట్టిన వెయ్యి కిలోల బంగారాన్ని దోచుకోవడానికి హైజాక్ చేశాడు. ఒక కుంభకోణంలో భారీ యెత్తున బంగారాన్ని పట్టుకున్న సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్, జైలర్ థామస్ తో కలిసి బంగారాన్ని జైల్లో దాచాడు. ఈ విషయం కనిపెట్టిన అసిస్టెంట్ ప్రభునీ, అతడి భార్యనీ చంపేశాడు. ఈ బంగారం గుట్టు బయటపడకుండా జైలుని ప్రవేటీకరణ చేయాలని రాజకీయ పార్టీతో కుమ్మక్కయి ప్రయత్నాలు మొదలెట్టాడు. వీళ్ళ ఎత్తుగడని చిత్తు చేస్తూ బంగారాన్ని దోచుకోవడానికి బిగ్ డాడీ ఎంటరయ్యాడు.

ఎవరీ బిగ్ డాడీ? తనలాగే వున్న ఆనందరావు చనిపోతే తనెవరు? ఆనందరావు ఎవరు? వామన్ శ్రీనివాస్ చంపేసిన ప్రభు, అతడి భార్య బిగ్ డాడీ కేమవుతారు? బంగారం ఎవరిది? బిగ్ డాడీ ఏం చేయాలనుకున్నాడు? అతను అంత కర్కశంగా ఎందుకు మారాడు?... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

పక్కా మాస్ కమర్షియల్ కథ. ఒక దోపిడీ, ఒక హైజాక్, కొన్ని హత్యలు, ప్రతీకారం వంటి బాక్సాఫీసు అప్పీలున్న ఎలిమెంట్స్ తో భారీ యెత్తున తలపట్టిన సూపర్ స్టార్ కి సూటయ్యే మసాలా కథ. 60 ఏళ్ళ సూపర్ స్టార్ తో ఎడాపెడా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో, కళ్ళు తిప్పుకోనివ్వని వేగవంతమైన కథనంతో సాగే మూసఫార్ములా కథ. హీరోయిన్, పాటలు, కామెడీలు లేని, ఎత్తిన ఆయుధం దించని రివెంజీ డ్రామా.

యువదర్శకుడు ఎంజి శ్రీనివాస్ సినిమా అంతటా ఒకే టెంపోని మెయింటెయిన్ చేస్తూ శరవేగంగా కథని పరుగులెట్టించిన విధానంలో అర్ధాలు, లాజిక్కులు, లింకులు, ప్రశ్నలు, కామన్ సెన్సు అన్నీ నలిగి చదును అయిపోయాయి. జైళ్ళని ప్రైవేటీకరించడమేమిటి? పాత్రల మధ్య సంబంధాలు, సెంటిమెంట్లు, భావోద్వేగలూ హాస్యాస్పదమయ్యాయి. అయితే ఇవి ఆలోచించేంత సమయం కూడా వుండదు ప్రేక్షకులకి. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడే ట్విస్టులతో బిజీగా వుండడమే సరిపోతుంది.

పైగా మానవాతీత ఇమేజిగల క్యారక్టర్ తో శివరాజ్ కుమార్ బ్రహ్మాండంగా మోస్తున్నట్టున్న కథతో ప్రేక్షకులు చిత్తైపోవడమే జరుగుతుంది - అతడి స్టార్ పవర్ కి సాష్టాంగపడి. శివరాజ్ కుమార్ కి డైలాగులు చెప్పేంత టైమ్ కూడా లేదు. అతడి కళ్ళు మాత్రమే మాట్లాడతాయి. ఎప్పుడో గానీ ఒక సింగిల్ లైను డైలాగు వదులడు. ఇలా శివరాజ్ కోసం కమర్షియల్ సినిమా అర్ధాలే మార్చేస్తున్న ఈ తరహా మేకింగ్ లో పరిపక్వత కనిపించదు. సినిమా అంతటా క్రౌడ్ సీన్లూ, హడావిడీ ఎక్కువే. అయితే ఇంత హంగామాతో చప్పున కేవలం రెండుంపావు గంటల్లో ముగిసిపోవడమే హాయి అన్పించే పాజిటివ్ అంశం.

నటనలు- సాంకేతికాలు

వివిధ భాషల్లో హిట్లు ఇస్తున్న 60 ప్లస్ స్టార్ల సరసన శివరాజ్ చేరిపోయాడు. ‘కేజీఎఫ్’ తో ప్రారంభమయిన గ్యాంగ్ స్టర్ పాత్రల ట్రెండ్ లో తనూ భాగమయ్యాడు. ఇప్పుడు చిరంజీవి కూడా హీరోయిన్లు, డాన్సులు, కామెడీలూ లేని సినిమాలు చేసి 60 ప్లస్ స్టార్స్ క్లబ్ లో సమానత్వం కోసం సమాయత్తమవున్న విషయం తెలిసిందే. కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్‌గా కొత్త అవతారంలో తిరిగి వచ్చిన శివరాజ్‌కుమార్, ఈ పాత్రని మంచి ధీమాతో పోషించాడు. తెలుగులో ఏమోగానీ, కన్నడలో అతడి హైపర్ హీరోయిజానికి ఈలలే పడుతున్నాయి. ఈలలు పడే సీన్లు తగినన్ని వుండేలా జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు. అసలు ఈ దర్శకుడే శివరాజ్ వీరాభిమాని. కాబట్టి సినిమాకూడా అభిమానుల లెవెల్లో వుంది, క్వాలిటీతో బాటు.

కన్నడ సూపర్ స్టార్ సొగసైన హేర్ స్టయిల్ తో, నీలి రంగు కాంటాక్ట్ లెన్సులతో, పాత్రకి తగ్గ సొగసైన కాస్ట్యూమ్స్ తో, తగినంత రిచ్ గా కనిపించేలా చూసుకున్నాడు. ఇక యాక్షన్ సీన్స్ లో వీరవిహారం కుర్ర హీరోలని తలదన్నేలా వుంది. యువరతంలో కొత్త అభిమానులూ పుట్టుకొచ్చేలా వుంది.

ఇక ఇతర ముఖ్యపాత్రల్లో జయరాంది పూర్తి నిడివిగల పాత్రయితే, అనుపమ్ ఖేర్ ది చివర్లో వచ్చే స్వల్ప పాత్ర. పాటలు లేని ఈ సినిమాలో అర్జున్ జన్య బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్పీడ్‌కి బాగా కలిసొచ్చింది. యాక్షన్ సీన్స్ లో చేతులకి బేడీలతో కూడిన ఒకటి ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే తెలుగు డబ్బింగ్ పట్ల శ్రద్ధ చూపించలేదు. మొత్తం మీద మాస్ ప్రేక్షకులకి ఈ కన్నడ డబ్బింగ్ మంచి కాలక్షేపం. మిగిలిన వారికి జస్ట్ టైమ్ పాస్ సినిమా.

First Published:  4 Nov 2023 3:14 PM IST
Next Story