Jailer Movie Review | జైలర్ మూవీ రివ్యూ {3/5}
Jailer Movie Review in Telugu | గత మూడేళ్ళుగా మూడు సినిమాలతో హిట్లు లేక డీలా పడిన సూపర్ స్టార్ రజనీ కాంత్ నాల్గో తాజా ప్రయత్నంగా ‘జైలర్’ విడుదలైంది.
చిత్రం: జైలర్
రచన - దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
తారాగణం : రజనీకాంత్, మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వసంత్ రవి, జాకీష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్, యోగిబాబు తదితరులు.
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కణ్ణన్
బ్యానర్ : సన్ పిక్చర్స్, నిర్మాత : కళానిధి మారన్
విడుదల : ఆగష్టు 10, 2023
రేటింగ్: 3/5
గత మూడేళ్ళుగా మూడు సినిమాలతో హిట్లు లేక డీలా పడిన సూపర్ స్టార్ రజనీ కాంత్ నాల్గో తాజా ప్రయత్నంగా ‘జైలర్’ విడుదలైంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇతను నయనతారతో ‘కొలమావు కోకిల’, శివ కార్తికేయన్ తో ‘డాక్టర్’ అనే రెండు హిట్లు తీసి, విజయ్ తో ‘బీస్ట్’ తో విఫలమయ్యాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఇది పెద్ద బాధ్యతే. పైగా సన్ పిక్చర్స్ వంటి పెద్ద బ్యానర్ సినిమా. అంతేగాక, నాలుగు భాషల నుంచి జాకీష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ ల కాంబినేషన్లతో రజనీకాంత్ పానిండియా స్థాయి మూవీ ఇది. దీన్ని నెల్సన్ ఎలా తీశాడు? రజనీ ఫ్యాన్స్ ని మెప్పించ గలిగాడా? రజనీకి ఇప్పుడొక హిట్ అందిందా? ఇవి తెలుసుకుందాం.
కథ
ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) భార్య విజయ (రమ్యకృష్ణ) తో, కొడుకు అర్జున్ (వసంత్ రవి)- కోడలు శ్వేత (మిర్నా మీనన్) - మనవడుతో రిటైర్మెంట్ జీవితాన్నిసంతోషంగా గడుపుతుంటాడు. మనవడికి యూట్యూబ్ ఛానెల్‌ని నడుపు కోవడంలో తోడ్పడుతూ వుంటాడు. కొడుకు అర్జున్ ఎవరికీ భయపడని నిజాయితీగల ఏసీపీ. ఇతనొక విగ్రహాల స్మగ్లింగ్ కేసు ట్రాక్ చేస్తూ మిస్సయి పోతాడు. మిస్సయిన కొడుకుని విగ్రహాల స్మగ్లర్ వర్మ (వినాయకన్) చంపేశాడని తెలుసుకుంటాడు. దీంతో పగబట్టిన ముత్తు స్మగ్లర్ వర్మతో తలపడతాడు.
ఇప్పుడు స్మగ్లర్ వర్మ పెట్టిన కండిషన్ ఏమిటి? దాని ప్రకారం ముత్తు ఓ ఆలయంలో విలువైన కిరీటాన్ని తస్కరించి వర్మ కిచ్చాడా? ఇందులో నార్త్ గ్యాంగ్ స్టర్ (జాకీష్రాఫ్) తో బాటు, మాథ్యూ (మోహన్ లాల్), నరసింహా (శివరాజ్ కుమార్), బ్లాస్ట్ మోహన్ (సునీల్) లు చేసిన సహాయం ఏమిటి? కామ్నా (తమన్నా) ఎవరు? ఆఖరికి ముత్తువేల్, వర్మ డిమాండ్ ని నెరవేర్చాడా లేదా? తీహార్ జైల్లో మాజీ జైలర్ గా పనిచేసిన అతడి గతమేమిటి? చివరికి కొడుకు గురించి తెలుసుకున్న ఒక నిజంతో ఎలాంటి భావోద్వేగాలకి లోనయ్యాడు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
కథ కొత్తదే కాదు. రజనీకాంత్ తో దాన్ని నడిపించిన విధానం కొత్తది. రజనీకాంత్ పెద్ద వయసు పాత్రకి తగ్గట్టుగా పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. రిటైరైన జైలర్ పోలీసుద్యోగంలో తన కొడుకు కూడా నిజాయితీగా విధినిర్వహణ చేసేలా విద్యాబుద్ధులు నేర్పినప్పుడు, ఆ కొడుకు ఎంతవరకు తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడనే తండ్రీ కొడుకుల సంబంధాల్ని చిత్రించే -భావోద్వేగాలతో కూడిన కథ. ఈ కథ రెండు గంటలా 45 నిమిషాలు సాగదీయకపోతే మరింత బలీయమైన కథగా వుండేది.
ఉపరితలంలో కొడుకు కోసం ముఠా మీద తండ్రి పగ లాంటి రొటీన్ కథగానే వుంటుంది. అయితే ఈ రొటీన్ గా అన్పించే కథ పొరలు పొరలుగా విడిపోతూ కొత్త కోణాలతో, మలుపులతో థ్రిల్ చేస్తుంది. ఇలా ఫస్టావ్ లో ఒక ట్విస్టు, సెకండాఫ్ లో మరో మూడు ట్విస్టులు మొత్తం రజనీ- నెల్సన్ ల బాక్సాఫేసు గేమ్ ని సక్సెస్ ఫుల్ గా మార్చేశాయి.
ఫస్టాఫ్ రజనీకాంత్ రిటైరైన వ్యక్తిగా కుటుంబ జీవితం గడపడంతో, మనవడితో కామెడీతో ప్రారంభమవుతుంది. ఒక చిన్నఇల్లు, ఇంట్లో సేంద్రీయంగా కూరగాయలు పండించుకోవడం, యూ ట్యూబర్ గా 96 మంది సబ్ స్రైబర్లున్న మనవడికి శిక్షణ నివ్వడం, వీధిలో కనిపిస్తే చాలు రజనీని దాదాపు గుద్దేసేంత పనిచేసే క్యాబ్ డ్రైవర్ తో చిరు తగాదాలు - ఇదే జీవితంగా సాగుతున్నప్పుడు, ఏసీపీ అధికారియైన కొడుకు అదృశ్యం జీవితాన్ని మలుపుతిప్పుతుంది. భార్యతో, కోడలితో ఈ బాధలో వుండగా, కొడుకు హత్య వార్త కూడా తెలుస్తుంది. దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొరికిన ముఠా వాళ్ళని చంపడం, ముఠా కుటుంబం మీద ఎదురు దాడికి దిగడం వంటి ఘటనలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్లో బ్యాంగులు గానీ, ట్విస్టులు గానీ ఏమీ వుండక -ఒక కుటుంబ సన్నివేశంతో ముగుస్తుంది. ఇది రొటీన్ కి భిన్నం.
సెకండాఫ్ రజనీ వేట కొనసాగుతుంది. ఈ వేటలో ఒకచోట ఒకప్పటి జైలర్ గా రజనీ ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంది. రజనీ మాజీ జైలర్ అని ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సాగదీయకుండా ఒకే జైలు సన్నివేశంతో ముగిసిపోవడం కూడా రొటీన్ కి భిన్నమే. ఆ తర్వాత కిరీటం కోసం స్మగ్లర్ పెట్టే డిమాండ్ తో సెకండాఫ్ కథ మలుపు తిరిగి వరుసగా బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, మలయాళ స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. తెలుగు కమెడియన్ సునీల్ తెరపై కొస్తూంటారు. ఒక పాటతో తమన్నా కూడా వస్తుంది. కిరీటాన్ని హైజాక్ చేసే కాన్సెప్ట్ తో సాగుతూ వుండే సెకండాఫ్ కొడుకుతో క్లయిమాక్స్ ట్విస్టుతో ముగింపుకి చేరుకుంటుంది.
కథ నీటుగా వుండడం, ఎలాంటి డాన్సులు, కామెడీలు లేకుండా రజనీకాంత్ పాత్ర ఫ్యామిలీమాన్ గా హూందాగా కొనసాగడం - అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆద్యంతం కూర్చోబెట్టేలా చేస్తాయి. సూపర్ స్టార్ సినిమా పేరుతో లిబర్టీ తీసుకుని వూర మాస్ కమర్షియల్ చేయకుండా, కాస్త అర్ధవంతమైన ఎంటర్ టైనర్ గానే తీశాడు దర్శకుడు. కాకపోతే నిడివి తగ్గాలి.
నటనలు - సాంకేతికాలు
కొన్ని సార్లు సూపర్ స్టార్ సినిమాలు వన్ మాన్ షోగా వుంటాయి. సూపర్ స్టార్ ఇప్పుడే కొత్తగా నటిస్తున్నట్టు బలవంతంగా ప్రేక్షకుల మీద రుద్దుతూ ఇతర తారాగణాన్ని వెనక్కి నెట్టేస్తుంటారు. రజనీతో ఇలా జరగలేదు. రజనీతో ఇంకో నాల్గు భాషల స్టార్లు వున్నారు. వాళ్ళు సెకండాఫ్ లో ఒక్కో ఎపిసోడ్ లో కనిపిస్తారు. సంక్షిప్తంగా కనిపించినా కథ అవసరాన్ని తీర్చేసి వెళ్ళిపోతారు. ఇలా కరివేపాకు పాత్రలు కాకుండా వుంటారు. వన్ మాన్ షో కూడా ఎలా వుండాలో బహుశా మొదటిసారి చూపించాడు దర్శకుడు.
అయితే రమ్య కృష్ణ, మిర్నా మీనన్ కుటుంబ పాత్రల్ని నిర్లక్ష్యం చేశాడు. కథకి అడ్డు వస్తున్నారనుకుని పక్కకు పెట్టేసినట్టున్నాడు. క్యాబ్ డ్రైవర్ గా రజనీతో యోగిబాబు కామెడీ మాత్రం నవ్వకుండా నవ్వించేదే. ఈ మధ్య సినిమాల్లో టూరిస్టు ఆర్టిస్టులా వచ్చిపోతున్న యోగిబాబుకి ఈసారి విషయమున్న పాత్ర దక్కింది. రజనీ కొడుకు పాత్రలో వసంత్ రవి పాత్ర తీరుతెన్నులకి సరిపోయాడు. నార్త్ గ్యాంగ్ స్టర్ గా జాకీష్రాఫ్, ముంబాయి మాఫియాగా మోహన్ లాల్, కర్ణాటక క్రిమినల్ గా శివరాజ్ కుమార్, తెలుగు సినిమా పిచ్చోడుగా సునీల్ తమ సంక్షిప్త పాత్రలతో సెకండాఫ్ ని నిలబెట్టారు. ఇక విలన్ వర్మగా మలయాళ నటుడు వినాయకన్ విలనీ అతి క్రూరంగా, రాక్షసంగా వుంది. ఈ పాత్రతో రక్త పాతం కూడా ఎక్కువే. చంపే దృశ్యాలు షాకింగ్ గా వున్నాయి. రజనీ కాంత్ సినిమా అంటే ఫ్యామిలీలు కూడా చూసే సినిమా. హింస ఇలా వుంటే జడుసుకు ఛస్తారు.
రజనీ కాంత్ తన ‘వన్ మాన్ షో’ తో ప్రేక్షకుల మెదళ్ళ లోకి చొచ్చుకుపోయే ఫ్యామిలీ- యాక్షన్ హీరోగా మళ్ళీ తన అగ్రస్థానాన్ని చాటుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ జైలర్ పాత్ర, దాంతో చేసిన కామెడీ పెద్దగా నిలబడవు. ప్రధాన కథలో ఫ్యామిలీ- యాక్షన్ హీరోగానే గుర్తుంటాడు. తండ్రీ కొడుకుల సంబంధాల కథని బయట పెట్టుకోలేని భావోద్వేగాలతో తన అనుభవంతో బాగా పండించాడు.
సాంకేతికంగా రజనీ స్థాయి విలువలతోనే వుంది. అయితే సాంకేతికాలే తప్ప రచన బావుండని సినిమాలే ఎక్కువ వస్తూంటాయి. దర్శకుడు నెల్సన్ ఈ రెండూ సమం చేశాడు. నిగ్రహం తప్పకుండా కథా కథనాల్ని క్వాలిటీ రైటింగుతో కొనసాగించడమే గాక, నటింప జేసుకోవడం, సంగీతం, ఛాయాగ్రహణం, సెట్స్, లొకేషన్స్ వంటి సర్వ హంగుల్నీ ద్విగుణీకృతం చేశాడు. రజనీ స్టార్ డమ్ ని కాపాడుతూ.