Telugu Global
MOVIE REVIEWS

India Lockdown Movie Review: 'ఇండియా లాక్ డౌన్' – సండే స్పెషల్ రివ్యూ

India Lockdown Movie Review: 'చాందినీ బార్' (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు), 'పేజ్ త్రీ' (ఉన్నత వర్గాల ), 'కార్పొరేట్' (కార్పొరేట్ రంగం చీకటి కోణాలు), 'ఫ్యాషన్' (ఫ్యాషన్ రంగం తళుకులు)...

India Lockdown Movie Review: ఇండియా లాక్ డౌన్ – సండే స్పెషల్ రివ్యూ
X

India Lockdown Movie Review: 'ఇండియా లాక్ డౌన్' – సండే స్పెషల్ రివ్యూ

'చాందినీ బార్' (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు), 'పేజ్ త్రీ' (ఉన్నత వర్గాల ), 'కార్పొరేట్' (కార్పొరేట్ రంగం చీకటి కోణాలు), 'ఫ్యాషన్' (ఫ్యాషన్ రంగం తళుకులు)... ఇలా ఒక్కో రంగం లోపలి సంగతుల్ని కథా వస్తువులుగా తీసుకుని, 12 రీసెర్చి సహిత సినిమాలు తీసిన దర్శడుడు మధుర్ భండార్కర్, 13వ సినిమాగా 'ఇండియా లాక్ డౌన్' అందించాడు. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి 2020 మార్చి 24 న విధించిన 21 రోజుల దేశవ్యాప్త మొదటి లాక్ డౌన్ అందరికీ గుర్తుంటుంది. ఈ లాక్ డౌన్ కాలంలో ఎదుర్కొన్న ఇక్కట్లు తిరిగి గుర్తుచేస్తూ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశాడు. హిందీలో జీ5 ఓటీటీ ద్వారా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ రెండు గంటల డాక్యూ డ్రామా, ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో వుంది.

ఇందులో ప్రతీక్ బబ్బర్, శ్వేతా బసు ప్రసాద్, ఆహానా కుమ్రా, ప్రకాష్ బెలవాడి వంటి తెలిసిన నటులతో బాటు, సాయి తంహన్కర్ , తాహురా మన్సూరీ, జరీన్ షిహాబ్, ఆయీషా అయిమన్ నటించారు. అమిత్ జోషీ, ఆరాధనా సా రచన చేశారు. పలాస్ దాస్ ఛాయాగ్రహణం. దీనికి సంగీత దర్శకుడు లేదు. నిర్మాతలు జయంతీలాల్ గడా, మధుర్ భండార్కర్, ప్రణవ్ జైన్. ఇక ఈ లాక్ డౌన్ లో ఏం జరిగిందో చూద్దాం...

నాలుగు కథల ఆంథాలజీ

ముంబాయిలో మూన్ (ఆహానా కుమ్రా) ఒక పైలట్. రిలేషన్ షిప్స్ కి సమయం లేనంత పని రాక్షసి. లాక్ డౌన్ తో విమానాలాగి పోయి ఇంటి ముఖం పడుతుంది. అదే అపార్ట్ మెంట్లోని ఒక ఫ్లాట్లో తనకంటే చిన్నవాడైన స్టూడెంట్ ఆకాష్ పరిచయమవుతాడు. అతడికి దగ్గరవడానికి ప్రయత్నిస్తూంటుంది. అతను వేరే గర్ల్ ఫ్రెండ్ ని లాక్ డౌన్ లో కలవలేక వీడియో కాల్స్ మాట్లాడుతూంటాడు.

ముంబాయిలోనే ఒక పోష్ సొసైటీలో కుక్కతో ఒంటరిగా నివసిస్తూంటాడు నాగేశ్వరరావు (ప్రకాష్ బలెవాడి) అనే రిటైర్డ్ తెలుగు వ్యక్తి. హైదరాబాద్ లో డెలివరీ దగ్గర పడ్డ కూతురు దగ్గరికి వెళ్దామనుకుంటే లాక్డౌన్ తో బందీ అయిపోయాడు. పని మనిషి ఫూల్మతి (సాయి తంహన్కర్) కి నెల జీతం అడ్వాన్సు ఇచ్చేసి, ఇంటి పట్టున జాగ్రత్తగా వుండమని చెప్పి పంపించేస్తాడు.

ఫూల్మతి భర్త మాధవ్ (ప్రతీక్ బబ్బర్) తోపుడు బండి మీద తినుబండారాలు అమ్మే అప్పుల్లో వున్న వలస కార్మికుడు. లాక్ డౌన్ తో ఆ ఉపాధి కూడా కోల్పోయి, కుటుంబాన్ని తీసుకుని కాలినడకన బీహార్లో స్వగ్రామానికి బయల్దేరతాడు.

ఇదే ముంబాయి కామాటీ పురాలో మెహరున్నీసా (శ్వేతా బసు ప్రసాద్) సెక్స్ వర్కర్. లాక్ డౌన్ తో ఉపాధికోల్పోయి, తోటి సెక్స్ వర్కర్స్ తో కొత్త ఆదాయ మార్గాన్ని కనిపెడుతుంది. కస్టమర్లతో ఫోన్ సెక్స్ ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం మొదలెడుతుంది.

ఇలా నాల్గు భిన్న వర్గాలకి చెందిన వ్యక్తుల అనుభవాలే ఈ నాల్గు కథలు. నిర్బంధ పరిస్థితుల్లో కూడా మనుషుల స్వభావం మారదనడానికి ఆర్ధికంగా స్థిరపడ్డ పాత్రల్ని చూపించాడు. ఆర్ధికంగా స్థిరపడ్డ వర్గాలకి లాక్ డౌన్ నిర్బంధంలో అప్రమత్తత కాదు, ఆరోగ్యమూ కాదు. సరదాలు కోరికలూ ఎలా తీర్చుకోవాలనే తాపత్రయం. మూన్, ఆకాష్, అతడి గర్ల్ ఫ్రెండ్ పాత్రలు దీనికి చెందుతారు.

అదే ఉపాధి కోల్పోయిన వర్గాలకి బ్రతుకు పోరాటమే తప్ప సరదాలు కోరికలూ కాదు. సెక్స్ వర్కర్ మెహరున్నీసా, ఆమె తోటి వర్కర్లు; పనిమనిషి ఫూల్మతి, ఆమె భర్త మాధవ్. ఇక రిటైర్డ్ వ్యక్తులకి బంధువర్గం గురించి ఆందోళన. నిజమే, 70, 80 దాటిన వాళ్ళు కూడా ఎక్కడో బంధువుల ఫంక్షన్ కి వెళ్ళక పోతే వుండలేని అసహనాన్నిచూశాం. ఈ కథలో కూతురి డెలివరీకి రిస్కు చేసి వెళ్ళాలనుకునే నాగేశ్వరరావు పాత్ర. వెళ్ళక పోతే కొంపలేమీ అంటుకోవు. కూతురే రావద్దని చెప్తున్నా, ముంబాయి నుంచి హైదరాబాద్ కి కారు డ్రైవ్ చేస్తూ బయల్దేరతాడు!

నాలుగు కథల కథ కాదు

అయితే ఈ నాల్గు కథలూ చివర్లో ఒక బిందువు దగ్గర కలిసే రొటీన్ ఇందులో వుండదు. అంటే నాల్గు కథలూ ఒక కథగా కలిసిపోవు. కేవలం నాగేశ్వరరావు, ఫూల్మతి కుటుంబం మార్గంలో ఎదురుపడతారు. ఇక్కడే ఇద్దరి కథలు కొలిక్కి వస్తాయి. అయితే నాగేశ్వరరావు ముంబాయి నుంచి వెళ్తున్నది హైదరాబాద్ కి. ముంబాయి నుంచి ఎక్కడో అటు ఉత్తరాన బీహార్ కాలినడకన వెళ్తున్న ఫూల్మతి కుటుంబం ఇటు దక్షిణాని కెలా వస్తుంది? సినిమాకోసం లాజిక్ ని లాక్ డౌన్ చేశాడేమో రియలిస్టిక్ సినిమాల రీసెర్చి స్పెషలిస్టు భండార్కర్.

నాగేశ్వరరావనే తెలుగు పాత్రతో కథకి ప్రయోజనం కూడా ఏమీ లేదు. నాందేవ్ సిన్హాగా మార్చి అటు బీహార్ పంపి వుంటే ఆ రూట్లో ఫూల్మతి కలిసేది. నాగేశ్వరరావుతో నేటివిటీ కోసం ఓ రెండు చోట్ల తెలుగు కూడా మాట్లాడించారు. 'అప్పా రాత్రి భోజనం చేసరా?' (చేశారా కాదు) అని కూతురు అడుగుతుంది. అప్పా అని ఏ తెలుగామె పిలుస్తుందో! సౌత్ అంటే మద్రాసీలే అనే హిందీవాళ్ళ జనరల్ నాలెడ్జి కి తమిళ అప్పానే తెలుసు.

ఇక నాగేశ్వరరావంటాడు, 'ఇంటి పని ఏమి అని ఈ లాక్ డౌన్ సమయంలో నేను కట్బన్నాను'… అంటే ఏమిటో! తెలుగు వాడిని అడిగి డైలాగు రాయించుకోవచ్చుగా?

వలసల చరిత్రకి మచ్చ

కాలి నడకన వెళ్తున్న వలస కార్మికులు ఓ ఇరవై మంది వుంటారు. కానీ విజువల్స్ అప్పట్లో మనం టీవీల్లో, యూట్యూబ్ లో చూసినట్టుగా హృదయవిదారకంగా వుండవు. నడక వేగం కూడా వుండదు. ఇరవై మంది కలిసి సైట్ సీయింగ్ కి వెళ్తున్నట్టు నిదానంగా నడుస్తూంటారు. బాధ, ఆయాసం, అనారోగ్యం ఏవీ వుండవు. ఫూల్మతి కుటుంబానికి మాత్రమే నడవలేని బాధ, ఆకలిదప్పులు వుంటాయి. అయితే మధ్యలో ఒక అభ్యంతరకర సీను వస్తుంది. ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న అతను, ఫూల్మతి మీద కన్నేయడం, రాత్రికి పిలవడం అసభ్యంగా వుంటుంది.

ఆర్ధికంగా స్థిరపడ్డ వాళ్ళ కోరికలు, ఊపాధి కోల్పోయిన వాళ్ళ క్షుద్బాధా అని స్పష్టంగా వర్గీకరణ చేసిన తర్వాత, వలస కార్మికుల ఈ విపత్కర పరిస్థితుల్లో కామ కోరికలేమిటి? ఇలా ఎప్పుడైనా జరిగిందా? లాక్ డౌన్ వలసల్లో అత్యాచారాలు జరిగినట్టు కూడా వినలేదు. ఇలా చూపించి ఆ వలసల చారిత్రక ఇమేజికి చేటు చేసినట్టే దర్శకుడు.

దీంతో గొడవ జరిగి ఫూల్మతి కుటుంబం విడిపోతారు. అంటే తర్వాత నాగేశ్వర

రావుతో విడిగా కలపడానికే బృందంనుంచి ఫూల్మతిని విడగొట్టే మార్గాన్ని ఇలా కల్పన చేశాడన్నమాట దర్శకుడు!

ఇక ఈ నాల్గు కథలూ ఎలా ముగిశాయన్నది మూవీ చూడాల్సిందే. ఇందులో ఫూల్మతిగా నటించిన సాయి తంహన్కర్, సెక్స్ వర్కర్ గా నటించిన శ్వేతా బసు ప్రసాద్ లవి ఎక్కువ ప్రభావం చూపే పాత్రలు, నటనలు. సాయిది విషాదమైతే, శ్వేతాది మగాళ్ళని రెచ్చగొట్టే సెక్సీతనం. దేన్నీ కేర్ చేయని,, జీవితాన్ని ఎంజాయ్ చేసే (సెక్స్) వర్కింగ్ వుమన్. సినిమాలో సంగీతం లేదు. ఆ లోపం కన్పించదు. టెక్నికల్ గా భండార్కర్ స్థాయిలో వుంది.

First Published:  4 Dec 2022 2:00 PM IST
Next Story