Telugu Global
MOVIE REVIEWS

హైవే మూవీ రివ్యూ

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన హైవే మూవీ, నేరుగా ఓటీటీలో రిలీజైంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

హైవే మూవీ రివ్యూ
X

నటీనటులు : ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు

కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌

నిర్మాత: వెంకట్‌ తలారి

బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌

సంగీతం: సైమన్‌ కె. కింగ్‌

రేటింగ్ : 2/5

ఆనంద్ దేవరకొండ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈసారి థియేటర్లలోకి కాకుండా, నేరుగా ఓటీటీలోకి ఎంటరయ్యాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన హైవే సినిమా ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి ఈ సినిమాతో ఆనంద్ హిట్ కొట్టాడా? తెలుగుగ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ చూద్దాం

విష్ణు (ఆనంద్ దేవరకొండ)ర్. బెంగళూరులో జాబ్ ఆఫర్ వస్తుంది. ఆ పనిమీద ఫ్రెండ్ (కమెడియన్ సత్య)తో కలిసి కారులో హైవేపై ప్రయాణం మొదలుపెడతాడు. ఓవైపు వీళ్ల కథ ఇలా నడుస్తుండగా, మరోవైపు తులసి (మానస రాధాకృష్ణన్)ది మరో వ్యథ. తల్లితో కలిసి ఓ పౌల్ట్రీలో కూలి పని చేసుకుంటుంది. యజమాని వేధింపులు భరించలేక, తల్లి సూచన మేరకు పారిపోతుంది. అలా ఆమె హైవే ఎక్కుతుంది. ఇక మూడో కథ ఓ సైకోది. ఈ సైకో (అభిషేక్ బెనర్జీ)కి మహిళల్ని చంపడం ఇష్టం. వరుస హత్యలు చేస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం అంబులెన్స్ తో హైవే ఎక్కుతాడు.

ఈ మూడు కథలు ఎక్కడ కలిశాయి? హీరోయిన్ ఎప్పుడు, ఎక్కడ సైకో కంట్లో పడుతుంది? హీరో, తన హీరోయిన్ ను ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా కథ. ఇలాంటి కథలో క్లైమాక్స్ ఏంటనేది అందరూ ఈజీగానే ఊహించుకుంటారు. బహుశా అందుకేనేమో దర్శకుడు క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ పెట్టాడు. అదేంటో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

ఇలా హైవేపై సాగే కథలకు స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటే సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. సీట్-ఎడ్జ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ బలమైన సన్నివేశాలు, టైట్ స్క్రీన్ ప్లే పడాలి. ఈ సినిమాలో అది మిస్సయింది. ఓవైపు కామెడీ, మరోవైపు ఫ్యామిలీ, ఇంకోవైపు సైకో హారర్, మరో వైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్.. ఇలా రకరకాల కోణాలన్నీ ఒకేసారి చూపించేయాలనే ఆత్రం దర్శకుడిలో బాగా కనిపించింది. ఆ తొందరే సినిమాకు ఇబ్బందికరంగా మారింది. ఏదో ఒక జానర్ కు ఫిక్స్ అయి, పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకొని ఈ సినిమా తీస్తే బాగుండేది. ఇలాంటి రోడ్ మూవీస్, థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. వాటిలో కొన్ని ఆకట్టుకున్నాయి. కనీసం వాటిని ఫాలో అయినా బాగుండేది.

కేవలం సైకో థ్రిల్లర్ గా కాకుండా.. లవ్, సెంటిమెంట్ చూపించాలనుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో హీరోను బాగా తగ్గించేశాడు. చివరికి క్లయిమాక్స్ లో హీరోకు ఫైట్ కూడా పెట్టకుండా, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను చేశాడు. హీరోయిన్ మానస తన పాత్ర మేరకు బాగానే నటించింది కానీ, ఆమెకు ఇది టాలీవుడ్ లో సరైన డెబ్యూ మాత్రం కాదు. సైకోగా నటించిన అభిషేక్ బెనర్జీ మాత్రం అదరగొట్టాడు. అతడి మేనరిజమ్స్ కొన్నిచోట్ల భయపెట్టిస్తాయి. కమెడియన్ సత్య అక్కడక్కడ కామెడీ చేశాడు. పోలీసాఫీసర్ గా నటించిన సయామీ ఖేర్ బాగా చేసింది. మిగతా పాత్రలు వేటికీ పెద్దగా స్కోప్ ఇవ్వలేదు.

ఉన్నంతలో ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ముందుగా చెప్పుకోదగ్గది ఓ లొకేషన్ సాంగ్. ఈ సాంగ్ లో లొకేషన్స్ ను బాగా చూపించారు. సైమన్ కింగ్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సన్నివేశాలు, సైకోకు సంబంధించిన ఎపిసోడ్లు థ్రిల్లింగ్ అనిపిస్తాయి. ఆనంద్ దేవరకొండ మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

టెక్నికల్ గా సినిమా బాగుంది. గుహన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. గుహన్ స్క్రీన్ ప్లే మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. దర్శకుడిగా కూడా అతడిలో పరిణతి కనిపించలేదు. 118 లాంటి హిట్ సినిమా తీసిన గుహన్ నుంచి హైవే లాంటి సినిమా వచ్చిందంటే నమ్మలేం. నిర్మాతగా వెంకట్ తలారి, ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా చూసుకుంటే హైవే సినిమా ఓటీటీకే కరెక్ట్. స్లో అయిన ప్రతిసారి ఫాస్ట్ ఫార్వార్డ్ కొడుతూ సినిమాను పూర్తిచేయొచ్చు.

First Published:  19 Aug 2022 11:54 AM
Next Story