కరెంట్ - హిందీ ఆర్ట్ మూవీ రివ్యూ!
1992 లో రైతు కరెంట్ కష్టాలతో ‘కరెంట్’ అనే అతి స్వల్ప బడ్జెట్ వాస్తవికం తీశాడు. ఇందులో ఆర్ట్ సినిమా నటులు ఓంపురి, దీప్తీ నావల్ లు నటించారు.
సమాంతర సినిమా దర్శకుడు కె హరిహరన్ తండ్రి ఈస్ట్ మన్ కోడక్ ముడి ఫిలిం కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కావడంతో, చిన్ననాటి నుంచే సినిమా నేపథ్యం నీడలా వుంటూ వచ్చింది. అయితే అభిరుచి సమాంతర సినిమాల వైపు వుండడంతో, పుణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో దాన్ని సాన బట్టుకున్నాడు. 1976 లో పుణె ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్థులుగా మణికౌల్, సయీద్ అఖ్తర్ మీర్జా, కమల్ స్వరూప్ లతో కలిసి మరాఠీలో ప్రయోగాత్మకంగా ‘ఘాసీరామ్ కొత్వాల్’ తీసి దర్శకుడయ్యాడు. ఇది విజయ్ టెండూల్కర్ రాసిన నాటకం. ఓంపురి ఇందులో నటించాడు.
దీని తర్వాత 1982 లో ‘ఎళవతు మణిథన్’ అనే తమిళ వాస్తవికం తీసి జాతీయ అవార్డు నందుకున్నాడు. ఇది పర్యావరణ కాలుష్యం - పారిశ్రామిక కార్మికుల వెతలు అనే కథాంశంతో తీశాడు. ఇందులో సినిమా తెరకి రఘువరన్ పరిచయమయ్యాడు. 1992 లో రైతు కరెంట్ కష్టాలతో ‘కరెంట్’ అనే అతి స్వల్ప బడ్జెట్ వాస్తవికం తీశాడు. ఇందులో ఆర్ట్ సినిమా నటులు ఓంపురి, దీప్తీ నావల్ లు నటించారు. ఉచిత విద్యుత్ లేని రోజుల్లో రైతులకి కరెంట్ కష్టాలు ఇంకే రూపంలో ముంచుకు రావచ్చో ఒక హెచ్చరికలాంటిది ఈ సినిమాతో చేశాడు. దీని వివరాల్లోకి వెళ్దాం....
కథ
ఆ గ్రామంలో వేలు (ఓంపురి) మూడెకరాల చెరుకు పండించే సన్నకారు రైతు. సీత (దీప్తీ నావల్) పొలం పనుల్లో తోడ్పడే భార్య. వీళ్ళకి ఒక కొడుకు. వేలు చాలా అమాయక రైతు. తన లాంటి రైతులు పండించే చెరకుని చక్కెర మిల్లు యజమాని కొంటాడని, ఆ యజమాని మంత్రికి ముడుపు లిస్తాడనీ, ఆ ముడుపులు మంత్రి ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెడతాడనీ, కాబట్టి ఈ చక్రం తిరగాలంటే రైతు సంక్షేమం వాళ్ళకి చాలా ముఖ్యమనీ, అందుకని కరెంటు తీసేసి ఇక్కట్ల పాలు చెయ్యరనీ, ఒకళ్ళు చెప్తేగానీ వేలుకి తెలియదు. ఇప్పుడు తెలిసినా నమ్మని వ్యక్తి.
మూడెకరాల్లో పండిస్తున్న చెరుకు పంటకి మోటారు బావే ఆధారం. ఓ పొద్దున్నే కరెంటు బిల్లు కట్టలేదని గుర్తు చేసి సీత పరుగులు పెట్టిస్తే, ఆదరాబాదరా బస్సెక్కి టౌనుకి చేరుకుంటాడు. అక్కడ కరెంటు బిల్లాఫీసులో బోర్డు పెట్టేస్తారు- తన వూరి విద్యుత్ చెల్లింపులు సోమవారం మాత్రమే తీసుకుంటారని బోర్డు మీద రాసి వుండడంతో కంగారు పడి పోతాడు.
దీంతో సోమవారం రాలేననీ, పొలం పనులు చూసుకోవాలనీ, లేకపోతే చాలా నష్టపోతాననీ అధికారిని బతిమాలుకుంటాడు. అధికారి విన్పించుకోడు. రెండు రోజులయ్యాక సోమవారం తిరిగొస్తాడు. వచ్చేటప్పుడు బస్సు ఆలస్యమై టైములోగా చేరుకోలేకపోతాడు. మళ్ళీ సోమవారం రమ్మంటారు. సోమవారం లోగా గడువు తీరిపోతుందనీ, కరెంటు తీసేస్తారనీ, కావాలంటే 10 రూపాయలు కలిపి ఇస్తాననీ బతిలాడుకుంటాడు.
అధికారికి ఆ పది రూపాయల లంచం అసంతృప్తి కల్గించి, ఇంజనీర్ ని కలిసి అప్లికేషన్ పెట్టుకో మంటాడు. అప్లికేషన్ తో బాటు కాస్త పత్రం పుష్పం సమర్పించుకో మంటాడు. వేలు సమర్పించుకున్న దాంట్లో తమిళ అయ్యర్ ఇంజనీరుకి పత్రం పుష్పం మాత్రమే కనపడి, వాటి మధ్య నుంచి పొడుచుకొచ్చి ఎంచక్కా పచ్చ నోట్లు కనపడక పోయేసరికి - సరేలే కరెంటు తీయంలే అని చెప్పి పంపేస్తాడు.
ఇది నమ్మిన వేలు హాయిగా ఇంటికి చేరుకుని, ధారాళంగా పొలానికి నీళ్ళు పెట్టుకుంటాడు. ఓ తెల్లారి పొద్దునే మోటారాగిపోయి పంపు నోరు తెర్చుకుంటుంది. ఠారెత్తి పోతాడు. కరెంటు పీకేశారు! దీంతో నీళ్ళు సరఫరా చేసే బండి వాణ్ణి అడుగుతాడు. నీళ్ళ కాంట్రాక్టు సర్పంచి తీసుకున్నాడని వాడంటాడు. ఆ సర్పంచ్ దగ్గరికి సీత వెళ్ళి నీళ్ళడుగుతుంది. ఇంకేం వ్యవసాయం చేస్తారు, పొలం అమ్ముకుని పట్టణం వెళ్ళిపోయి బాగుపడండని సర్పంచ్ సలహా ఇస్తాడు. కావాలంటే పొలానికి మంచి ధర ఇస్తానంటాడు.
ఇక లాభం లేదని బిందెలు తీసుకుని పరిగెడతాడు వేలు. దూరంగా వున్న బావి నీళ్ళు తోడి, బిందెలతో నీళ్ళు తెచ్చి పోస్తూంటాడు. ఎన్ని బిందెలు ఇలా తోడి పోస్తావని సీత కోప్పడినా విన్పించుకోకుండా నీళ్ళు మోసి మోసి తెచ్చి పోసి కుప్ప కూలిపోతాడు.
ఎలావుంది కథ
1990 ల నాటి రైతు స్థితికి అద్దం పట్టే కథ. విధ్యుత్ తో రైతుకి రకరకాల కష్టాలు. విధ్యుత్ సరఫరా కష్టాల నుంచీ బకాయిల కష్టాల వరకూ ఎన్నో పేచీలు ప్రభుత్వాలతో. అయితే బిల్లు కడతానన్నా కట్టించుకోక పెట్టే కష్టాలు కూడా వుంటాయని వేలు కొత్తగా తెలుసుకున్నాడు ఈ కథలో. రైతు పండించే చెరుకు కొనే చక్కెర మిల్లు యజమానికీ, ముడుపులు తీసుకునే మంత్రికీ మధ్య వుండే సంబంధం సజావుగా సాగాలంటే, మధ్యలో విధ్యుత్ సిబ్బందికి చిరుతిళ్ళు అవశ్యమని ఎవరు గుర్తించాలి? తన అవసరం కొద్దీ వేలు లాటి రైతే గుర్తించాలి. విద్యుత్ సిబ్బంది అనే ఇరుసుకి తను చమురు పోస్తే గానీ, పై స్థాయిలో వ్యవస్థ అనే అవినీతి మహా చక్రం గిర్రున రంగుల రాట్నంలా తిరగదన్న మాట. ఇంత పౌర బాధ్యత వుంచుకుని వేలు పత్రం పుష్పం పులిహోరా పెట్టేస్తే ఎలా? అవినీతి అనే మహా చక్రంలో రైతు తానూ భాగస్వామ్య వ్యాపారి కాకపోతే నలిగిపోవాల్సిందేనని వ్యంగ్యాస్త్రం విసిరాడు ఈ కథతోదర్శకుడు.
తక్కువ పాత్రలు – ఎక్కువ కథ
ఓంపురి, దీప్తీ నావల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ కథలో సహాయ పాత్రలూ తక్కువే. ఇందువల్ల ఓం, దీప్తీ పాత్రల కష్టాల కథ ఏకాగ్రతని దెబ్బతీయకుండా మనకి సూటిగా చేరుతుంది. ఈ రెండు పాత్రల్లో ఇద్దరూ కష్టపడి నటించారు. పొలానికి నీళ్ళు మోసే దృశ్యాలు రైతు సినిమాల్లో ఇదే కావడంతో, కలిసి వచ్చిన అవకాశంతో ఇద్దరూ ఈ దృశ్యాలతో ప్రత్యేక ముద్ర వేయగల్గారు. ముగింపులో మంత్రి పర్యటన, ఆ మంత్రికి ఓంపురి వినతి పత్రం అందించాలనుకోవడం లోని అమాయకత్వం పూర్తి వినోదాత్మకంగా, వ్యంగ్యంగా వుంటాయి. ఇంకో పాత్రలో సవితా ప్రభునే కన్పిస్తుంది. వూరంతా ఈమె శీలాన్ని అనుమానిస్తూంటారు. చివరికి ఈమె ఓంపురి కష్టాలు తీర్చి వెళ్ళిపోతుంది.
అయితే బడ్జెట్ చాలా తక్కువ కావడం వల్లనేమో సాంకేతికంగా ఆ బడ్జెట్ మేరకే వుంది. ఎల్. వైద్యనాథన్ సంగీతం, ధర్మా ఛాయాగ్రహణం ఓ మాదిరిగా వుంటాయి. కానీ విషయం మాత్రం ఆలోచనాత్మకంగా, గంభీరంగా వుంటుంది. ఇది యూట్యూబ్ లో అందుబాటులో వుంది.