Telugu Global
MOVIE REVIEWS

Gaandeevadhari Arjuna Movie Review: గాండీవధారి అర్జున - మూవీ రివ్యూ!{1.5}

Gaandeevadhari Arjuna Movie Review | 2017 లో రాజశేఖర్ తో ‘గరుడవేగ’ అనే హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, 2022 లో అక్కినేని నాగార్జునతో ‘ది ఘోస్ట్’ అనే ప్లాపైన మరో యాక్షన్ థ్రిల్లర్ తీసి, ప్రస్తుతం యంగ్ హీరో వరుణ్ తేజ్ తో ‘గాండీవధారి అర్జున’ అనే స్పై యాక్షన్ ని తెలుగు ప్రేక్షకులకి అందించాడు.

Gaandeevadhari Arjuna Movie Review: గాండీవధారి అర్జున - మూవీ రివ్యూ!{1.5}
X

Gaandeevadhari Arjuna Movie Review: గాండీవధారి అర్జున - మూవీ రివ్యూ!{1.5}

చిత్రం: గాండీవధారి అర్జున

రచన - దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

తారాగణం : వరుణ్ తేజ్, సాక్షీ వైద్య, విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్, అభినవ్ గోమఠం, రవివర్మ తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఛాయాగ్రహణం : ముఖేష్ జీ

బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర సినీచిత్ర, నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్

విడుదల : ఆగస్టు 25, 2023

రేటింగ్: 1.5

2017 లో రాజశేఖర్ తో ‘గరుడవేగ’ అనే హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, 2022 లో అక్కినేని నాగార్జునతో ‘ది ఘోస్ట్’ అనే ప్లాపైన మరో యాక్షన్ థ్రిల్లర్ తీసి, ప్రస్తుతం యంగ్ హీరో వరుణ్ తేజ్ తో ‘గాండీవధారి అర్జున’ అనే స్పై యాక్షన్ ని తెలుగు ప్రేక్షకులకి అందించాడు. గత సంవత్సరం ‘గని’ అనే ఫ్లాపైన స్పోర్ట్స్ డ్రామాలో నటించిన వరుణ్ తేజ్, ఇప్పుడు గూఢచారి వేషధారణతో విచ్చేశాడు. ఈ సంవత్సరం గూఢచారి వేషాలు వేసిన యంగ్ స్టార్స్ అక్కినేని అఖిల్, నిఖిల్ లు (ఏజెంట్, స్పై) ఫ్లాపులతో సరిపెట్టుకుని తెలుగు స్పై సినిమాలింతే అని తేల్చారు. మరి వరుణ్ తేజ్ సక్సెస్ అవడానికి చూపించిన తేడా ఏమిటి? ప్రవీణ్ సత్తారు దీన్ని నిలబెట్టడానికి చేసిన కృషి ఏమిటి? అసలు కృషి ఏమైనా జరిగిందా, లేక ఖుషీ కోసం ఈ సినిమా తీశారా? దీనికీ తమిళంలో సూర్య నటించిన ‘సింగం 3’ కీ సంబంధమేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

కేంద్రమంత్రి ఆదిత్యా రాజ్ బహదూర్ (నాజర్) పర్యావరణ సదస్సులో పాల్గొన డానికి లండన్ వెళ్తాడు. అతడికి ఓ పెన్ డ్రైవ్ అందించాలని అక్కడున్న శృతి (రోషిణీ ప్రకాష్) ప్రయత్నిస్తుంది. అప్పుడు రాజ్ బహదూర్ మీద దాడి జరుగుతుంది. అతడి సెక్యూరిటీ చీఫ్ గాయపడి, లండన్ లోనే వున్న ఫ్రెండ్ అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) కి రాజ్ బహదూర్ ని కాపాడే బాధ్యత అప్పగిస్తాడు. రాజ్ బహదూర్ పర్సనల్ సెక్రటరీ అయిన ఐఏఎస్ అధికారిణి ఐరా (సాక్షీ వైద్య), అర్జున్ వర్మ గతంలో ప్రేమికులు. వీళ్ళ గతం ఏమిటి? రాజ్ బహదూర్ ని చంపాలని చూస్తున్నదెవరు? అర్జున్ వర్మ ఎలా కాపాడేడు? విదేశాల నుంచి ఇండియాకి తరలిస్తున్న మెడికల్ వ్యర్ధాల డంప్ కీ, కి రాజ్ బహదూర్ మీద హత్యా ప్రయత్నాలకీ సంబంధమేమిటి? రణవీర్ (వినయ్ రాయ్) అనే అతను ఎవరు? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ వెండితెరపై చూడాలి.

ఎలావుంది కథ

2017 లో తమిళంలో హరి దర్శకత్వంలో సూర్య నటించిన ‘సింగం 3’ లో కథ పర్యావరణానికి సంబంధించిందే. సమస్త జీవులకీ, పర్యావరణానికీ ప్రాణాంతకమైన, భూమిలో కలిసిపోయే గుణం లేని బయోమెడికల్ వ్యర్ధాలు, ఈ- వ్యర్ధాలూ, ప్రత్యేక ప్లాంట్లలో నిర్వీర్యం చేయకుండా, ఆసియా దేశాలకి తరలించి డంప్ చేస్తున్న అంతర్జాతీయ పరిశ్రమల కుట్రని భగ్నం చేసే కథ. ‘సింగం’ సిరీస్ సినిమాల్లో ఇది కూడా హిట్టయింది.

అయితే ఆ నాన్ బయో డీగ్రేడబుల్ వేస్ట్స్ తో అంతర్జాతీయ కుట్ర ఇక్కడ స్థానికంగా ఎంతమంది స్కూలు పిల్లల్ని బలిగొందో చెబుతూ వచ్చిన ఆ దయనీయ కథని అలాగే కొనసాగిస్తూ, దాంతో ముడిపెట్టి బాధిత కుటుంబాల సమక్షంలో విలన్స్ ని శిక్షించాల్సింది పోయి- ఎత్తుకున్న ఈ పాయింటుని వదిలేసి రొటీన్ హీరో- విలన్ యాక్షన్ కథగా చూపించి వదిలేశారు.

ప్రవీణ్ సత్తారు సినిమాలో కూడా ఇదే జరిగింది. పేరుకే వ్యర్ధాలతో అంతర్జాయ కుట్ర కథ, చూపించిందంతా కేంద్రమంత్రిని గాండీవధారి అర్జున కాపాడడం గురించే. చేతిలో ధరించిన గాండీవానికే విషయం లేదు. దీంతో విషయం లేక డొల్లగా, ఫ్లాట్ గా సాగుతుంది సినిమా. పర్యావరణ సమస్యతో బాధితుల్ని చూపించి అందులోంచి హీరో రియాక్టయి వుంటే కథ భావోద్వేగాలతో కూడి వుండేది. కేవలం కేంద్ర మంత్రిని కాపాడే చర్యల్లో ఎమోషన్స్ లేవు. ఇలా ఎమోషనల్ అప్పీల్ లేకుండా ఎన్ని యాక్షన్ సీన్లు- అదీ విదేశాల్లో భారీ యెత్తున స్టయిలిష్ యాక్షన్ సీన్లు తీసినా - అదంతా వ్యర్ధమే. నిజానికి తీసిన ఈ వ్యర్ధాన్నే ప్రేక్షకుల మీద డంప్ చేశారు. ఉదయం నుంచీ ప్రేక్షకులు ఎక్స్ అనే ట్విట్టర్ లో హాహాకారాలు చేస్తున్నారు.

ఇందులో వరుణ్ తేజ్ సహా ఎవరి పాత్రకీ లాజిక్ లేదు. లావ్ ట్రాక్ సాగదీయడమే తప్ప ఓ పట్టాన కొలిక్కి రాదు. యాక్షన్ సీన్సు తప్ప టాకీ పార్టు సీన్సు ఔట్ డేటెడ్ గా వున్నాయి. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ వరకూ నత్తనడకతో వుంటుంది ఈ యాక్షన్ కథ. సెకండాఫ్ లో మరీ పతనావస్థకి చేరుకుంటుంది కథ. కేంద్ర మంత్రిని కాపాడే ట్రాకే సాగి సాగీ, హీరోకీ- విలన్ కీ మధ్య అవే పోరాటాలు రిపీటవుతూ సెకండాఫ్ కుప్పకూలింది. ఈ యాక్షన్ కథ ఎక్కడా సస్పెన్స్, ట్విస్టులు, థ్రిల్స్ వంటివి లేకుండా పేలవంగా సాగి, చివరికి పర్యావరణం గురించి మెసేజ్ ఇస్తుంది!

నటనలు - సాంకేతికాలు

స్పై హీరో వేషం తప్ప, విషయంలేని క్యారక్టర్ పోషించాడు వరుణ్ తేజ్. ఫ్లాపైన స్పై హీరోలు అఖిల్, నిఖిల్ ల సరసన చేరాడు. కథలో బలం లేక పోవడంతో కాదు, అసలు కథే లేకపోవడంతో పాత్ర కాని పాత్రతో, యాక్టింగ్ కాని యాక్టింగ్ చేసి వదిలేశాడు.

హీరోయిన్ సాక్షీ వైద్య గ్లామరు ప్రదర్శనతో సినిమా సాంతం కన్పిస్తుందిగానీ, పాత్రకి పనిలేక పోతే ఎందుకు కనిపిస్తోందో అర్ధం గాదు. కమెడియన్ అభినవ్ గోమఠం ‘స్పై’ లో చేసిన కుదరని కామెడీ లాంటిదే ఇప్పుడు కూడా చూశాడు. కేంద్రమంత్రిగా నాజర్, విలన్ గా విమల్ రాయ్ పాత్రల్లో పసలేక పోయినా ఎంతోకొంత నటించారు.

మిక్కీ జె మేయర్ సంగీతమే కాస్త ఊరట. ముఖేష్ కెమెరా వర్క్ కూడా అగ్రనిర్మాత నుంచి మంచి బడ్జెట్ లభించడంతో బడ్జెట్ కి తగ్గ కృషి చేశాడు. యాక్షన్ డైరెక్టర్స్, మిగతా సాంకేతిక శాఖల నిపుణులూ అంతే కృషి చేశారు. కానీ అంత బడ్జెట్ అందిస్తున్న నిర్మాతకి తగ్గట్టు మేకింగ్ చేసే పని మాత్రం చేయలేదు దర్శకుడు. ముందు దర్శకుడుగా తాను అప్డేట్ అవ్వాల్సిన అవసరం చాలా కన్పిస్తోంది.



First Published:  25 Aug 2023 4:12 PM IST
Next Story