Telugu Global
MOVIE REVIEWS

Devil Movie Review: డెవిల్- మూవీ రివ్యూ{2.25/ 5}

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 21 సినిమాల్లో మూడే హిట్టయ్యాయి.

Devil Movie Review: డెవిల్- మూవీ రివ్యూ{2.25/ 5}
X

చిత్రం: డెవిల్

నిర్మాత- దర్శకుడు : అభిషేక్ నామా

తారాగణం : కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్, సీత, సత్య, అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే మాటలు : శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఛాయాగ్రహణం : సౌందర్ రాజన్

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్

విడుదల : డిసెంబర్ 29, ౨౦౨౩

2.25/ 5

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 21 సినిమాల్లో మూడే హిట్టయ్యాయి. అతనొక్కడే (2005), పటాస్ ( 2015), బింబిసార (2022). రెగ్యులర్ మూస సినిమాలు కాకుండా కాస్త భిన్నమైన సినిమాలు చేయదానికి ముందు కొస్తున్నట్టు కన్పిస్తున్న కళ్యాణ్ రామ్ ‘డేవిల్’ తో వచ్చాడు. చరిత్రతో ఓ కాల్పనిక ప్రయోగం చేద్దామని చేసిన ప్రయత్నానికి ఓ వివాదం తోడైంది. మధ్యలో దర్శకుడు నవీన్ మేడారం ని తొలగించి తనే దర్శకత్వం వహించుకున్న నిర్మాత అభిషేక్ నామా సినిమా పూర్తి చేసిన విధం ఎలావుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాబట్టి ముందు ఈ విషయం తెలుసుకునేందుకు కథ లోకి వెళ్దాం...

కథ

1945 లో బ్రిటిష్ జనరల్ మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడులో ఓ జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య కేసుని ని పరిశోధించమని బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) ని ఆదేశిస్తాడు. ఈ కేసులో డెవిల్ జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్) ని అనుమానించి ఆమెని ప్రేమిస్తున్నట్టు నటించడం మొదలెడతాడు. ఇలా వుండగా, డెవిల్ కి ఇంకో ఆపరేషన్ అప్పజెప్తాడు జనరల్. దాని ప్రకారం ఇండియాకి వస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ని, అనుచరుడు త్రివర్ణనీ పట్టుకునే బాధ్యత డెవిల్ మీద పడుతుంది. జమీందారు ఇంట్లోంచి సుభాష్ చంద్రబోస్ కి సందేశాలు వెళ్తున్నాయన్న అనుమానంతో డెవిల్ జమీందారు హత్య కేసు తీసుకోవడం, నైషధని ప్రేమలోకి దింపడం జరిగాయన్న ప్లాను ఇప్పుడు వెల్లడవుతుంది.

ఈ నేపథ్యంలో డెవిల్ నేతాజీని పట్టుకున్నాడా? నైషధకి, నేతాజీకీ సంబంధం ఏమిటి? ఇందులో రాజకీయ నాయకురాలు మణిమేఖల (మాళవికా నాయర్) పాత్ర ఏమిటి? నేతాజీ అనుచరుడు త్రివర్ణ ఎవరు?

ఎలావుంది కథ

కళ్యాణ్ రామ్ వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. 2022 లో ‘బింబిసార’, 2022 లోనే ‘అమిగోస్’ తర్వాత, ఇప్పుడు 2023 లో ‘డెవిల్’. ‘బింబిసార’ లో క్రీ.పూ. 5వ శతాబ్దంలో త్రిగర్త రాజ్యానికి చెందిన రాజు బింబిసారుడు టైమ్ ట్రావెల్ ద్వారా నేటి ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టే ద్విపాత్రాభినయపు కథ అయితే, ‘అమిగోస్’ లో మనిషిని పోలిన మనుషులుండే డపుల్ గ్యాంగర్ అనే దృష్టాంతంతో త్రిపాత్రా

భినయ కథ చేశాడు. దీని మేకింగ్ బాగాలేక అట్టర్ ఫ్లాపయ్యింది. ఇక ‘డెవిల్’ వచ్చేసి స్పై గా నటిస్తూ బ్రిటిష్ కాల నేపథ్య కథ చేశాడు. ఇలా ఇంతకి ముందు నటిస్తూ వచ్చిన మూస సినిమాల నుంచి తనని తాను విముక్తి చేసుకున్నాడు.

అయితే దర్శకులు మారినంత మాత్రాన ‘డెవిల్’’ కి జరిగిన మేలు ఏమీ లేదు. కథ ఐడియా కొత్తగా వున్నా దాన్ని తెర మీద నిలబెట్టడంలో సరైన కృషి చేయలేదు. ఇండియన్ అయిన బ్రిటిష్ ఏజెంట్, ఇండియనే అయిన నేతాజీ అంతటి స్వాతంత్ర్య పోరాట యోధుడ్ని పట్టుకుని బ్రిటిష్ పాలకులకి అప్పజెప్పడమంటే నైతికంగా చాలా పరీక్ష పెట్టే ఆపరేషన్. ఈ పరీక్ష నెదుర్కొంటున్న పాత్రగా కళ్యాణ్ రామ్ ని చూపకపోవడంతో బాటు, ఒక థ్రిల్లర్ గా చూపించిన కథకి కూడా తగిన బలం, భావోద్వేగం లేకుండా ఫ్లాట్ గా తెరకెక్కించేశారు.

ప్రారంభంలో ఫిష్ ఫైట్ ద్వారా డెవిల్ ని బాగానే ప్రవేశపెట్టారు. జమీందారు కూతురి హత్యతో ఇన్వెస్టిగేషన్ జానర్ కథనంగా సాగే కథలో పెద్దగా విషయం లేక, మలుపుల్లేక, ఒకదాని తర్వాత ఒకటి పాత్రల్ని పెంచుకుంటూ పోయారు. ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో మన బుర్రకెక్కదు. జస్ట్ ఇంటర్వెల్లో ఏదో ట్విస్టు ఇచ్చి కథని మార్చేయడానికి ఇలా టైమ్ పాస్ చేస్తున్నారనిపిస్తుంది. ఇలాగే వస్తున్నాయి సినిమాలు. ఇంటర్వెల్ వరకూ విషయం లేకుండా టైమ్ పాస్ చేయడం, దీనికి ఇంటర్వెల్లో ఏదో కథ కలపడం. ఈ డబుల్ ఇంజన్ స్క్రీన్ ప్లేలు ఫ్లాపవుతున్నాయన్న విషయం మాత్రం తెలుసుకోవడం లేదు. ఇంకోటేమిటంటే ఈ ఫస్టాఫ్ ఇన్వెస్టిగేషన్లో రెండు పాటలు అర్ధం లేకుండా వచ్చి అడ్డుతగలడం!

ఇక ఇంటర్వెల్ దగ్గర ఒక మిస్టరీ మొదలవడంతో సెకండాఫ్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ సెకండాఫ్ లో ట్విస్టులు మొదలవుతాయి. చివరి వరకూ ఈ ట్విస్టులు నేతాజీ, త్రివర్ణల చుట్టే వుంటాయి. ఈ త్రివర్ణ ఎవరనేది హైపాయింటుగా వుంటుంది. త్రివర్ణ పాల్పడే విధ్వంసం హైలెట్‌గా వుంటుంది. డెవిల్ యాక్షన్ సీన్లు టాప్ రేంజిలో వుంటాయి. సముద్ర తీరంలో యాక్షన్ సీనుతో ముగుస్తుంది. మధ్యలో దోపిడీ ముఠాతో ఫైట్, బ్రిటీష్ జైలులో యాక్షన్ సీన్స్ బావుంటాయిగానీ లాజిక్ వుండదు. బ్రిటిష్ బరీ మందుగుండు సామగ్రితో వుంటే డెవిల్ కేవలం ఒక తుపాకీ పట్టుకుని ఒక్క గుండు దెబ్బ తగలకుండా పోరాటం చేస్తాడు.

ఈ యాక్షన్లో లెక్కలేనన్ని పాత్రలవల్ల, ట్విస్టులు బావున్నా ఆ తర్వాత కథలో బలం, హవోద్వేగం లేకపోవడం వల్ల, ఓ యావరేజీ సినిమాగా ఇది మిగిలిపోయింది.

నటనలు- సాంకేతికాలు

కళ్యాణ్ రామ్ నటనని చాలా సీరియస్ గా తీసుకుని డెవిల్ పాత్ర నటించాడు. ఆహార్యంతో, డైలాగ్ డెలివరీతో బ్రిటిష్ స్పైకి సరీగ్గా సరిపోయాడు. యాక్షన్ సీన్సులో వి యాక్షన్ సీన్సులో ఈలలు పడేట్టు విజృంభించాడు. యాక్షన్ పరంగా మాత్రం మాస్ ప్రేక్షకులకి ఏ లోటూ అన్పించకుండా క్యారక్టర్ ని చూసుకున్నాడు.

హీరోయిన్ సంయుక్తా మీనన్ కి మంచి విషయమున్న పాత్రే లభించింది. నటన పర్వాలేదు. ఓ పాటలో కళ్యాణ్ రామ్ కి సరైన జోడీ అన్పించుకుంది. మాళవికా నాయర్ రాజకీయ పాత్ర కూడా మంచిదే. నటన కూడా ఫర్వాలేదు. చాలా రోజుల తర్వాత హీరోయిన్లకి విషయమున్న పాత్రలు దక్కాయి. ఇంకో పాటలో ఎల్నాజ్ నోరౌజీ కన్పిస్తుంది. ఇక సత్య, షఫీ, మహేష్, అజయ్, సీత, శ్రీకాంత్ అయ్యంగార్, వశిష్ఠ సింహా, మౌనికా రెడ్డి,లతోబాటు ఫారిన్ ఆర్టిస్టులు- వీళ్ళంతా సినిమాకి బరువై పోయారు.

సాంకేతికంగా బాగా ఖర్చు పెట్టారు. బ్రిటీష్ కాలాన్ని తలపించేందుకు క్యాస్టూమ్స్, సెట్స్, కెమెరా వర్క్ అన్నిటినీ ఉన్నతంగా నిర్వహించారు. వీటి విషయంలో చాలా రీసెర్చి చేసినట్టు వైదొలగిన దర్శకుడు చెప్పుకున్నాడు. అయితే యాక్షన్స్ సీన్సులో గ్రాఫిక్స్ మాత్రం క్వాలిటీతో లేవు. ఇక ‘యానిమల్’ సంగీత దర్శకుడు హర్ష వర్ఢన్ రామేశ్వర్ పాటలతో నిరాశపరుస్తాడనే చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా ఓ మోస్తరు.

మొత్తానికి ‘డెవిల్’ కళ్యాణ్ రామ్ చేసిన వినూత్న ప్రయత్నమే గానీ, ఒక చారిత్రక అంశంతో వుండాల్సిన బలమైన ప్రయత్నం చేసి వుండాల్సింది.

First Published:  29 Dec 2023 5:36 PM IST
Next Story