Telugu Global
MOVIE REVIEWS

కన్జూరింగ్ కన్నప్పన్ –తెలుగు రివ్యూ! {2/5}

తమిళంలో హార్రర్ కామెడీ ‘కన్జూరింగ్ కన్నప్ప’ (మాయాజాలంలో కన్నప్ప) డిసెంబర్ 8 న విడుదలై యావరేజి రిజల్టు పొందింది. ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తెలుగు వెర్షన్ అందుబాటులో వుంది.

కన్జూరింగ్ కన్నప్పన్ –తెలుగు రివ్యూ! {2/5}
X

చిత్రం: కన్జూరింగ్ కన్నప్పన్

రచన- దర్శకత్వం : సెల్విన్ రాజ్ జేవియర్

తారాగణం : సతీష్, రేజీనా, శరణ్య, నాజర్, ఆనంద్ రాజ్, విటివి గణేష్, రెడిన్ కింగ్ స్లే తదితరులు

సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : యువ

బ్యానర్ : ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు: కలపతి ఎస్. అఘోరమ్, కలపతి ఎస్. గణేష్

విడుదల : 5.1.24 ( ఓటీటీ- నెట్ ఫ్లిక్స్)

రేటింగ్: 2/5

తమిళంలో హార్రర్ కామెడీ ‘కన్జూరింగ్ కన్నప్ప’ (మాయాజాలంలో కన్నప్ప) డిసెంబర్ 8 న విడుదలై యావరేజి రిజల్టు పొందింది. ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తెలుగు వెర్షన్ అందుబాటులో వుంది. కొత్త దర్శకుడు సెల్విన్ రాజ్ జేవియర్ హార్రర్ కామెడీలో కొత్త ఐడియాతో దీన్ని తీశాడు. కమెడియన్ సతీష్ హీరోగా నటించాడు. దర్శకుడు అందించిన కొత్త ఐడియా ఏమిటి? దాంతో ఎంతవరకు ఒప్పించాడు? ఒక ఆత్మ- దాంతో భయపడి కామెడీ పుట్టించడం బ్రాకెట్లోనే హార్రర్ కామెడీలుంటాయి. అయితే ఈ ఫార్ములాని కొత్త ఐడియాతో ఏ రకంగా విభిన్నం చేశాడు? ఇది తెలుసుకుందాం...

కథ

కన్నప్పన్ (సతీష్) గేమ్ డిజైనర్ గా ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటాడు. తండ్రి ఆంజనేయన్ (విటివి గణేష్) పెన్షన్ తో ఇల్లు గడుస్తూంటుంది. తల్లి లక్ష్మి (శరణ్య) యూట్యూబ్ వీడియోలు తీస్తూంటుంది. పెళ్ళి కాని మామ శేఖర్ (నమో నారాయణ్) ఇంట్లో పడి తింటూ వుంటాడు. ఒకరోజు ఇంట్లో నీళ్ళు రాకపోతే పక్కన పాడుబడి మూసిపెట్టిన బావి మీద రేకులు తీసి నీళ్ళు తోడుతాడు కన్నప్పన్. ఆ బకెట్టుకి చిక్కుకుని ఒక శిథిలావస్థలో వున్న డ్రీమ్ క్యాచర్ వస్తుంది. పీడ కలలు రాకుండా పడగ్గదిలో పెట్టుకునే దిష్టి బొమ్మ లాంటిది అది. దానికి ఈకలుంటే ఒక ఈక పీకుతాడు. అంతే, పీకల్లోతు ప్రమాదంలో ఇరుక్కుపోతాడు. రాత్రి నిద్రపోతే కలలో ఒక కోట కనిపిస్తుంది. ఆ కోటలో తనపాటు ఒక ఆడ దెయ్యం వుంటుంది. తప్పించుకుని బయటపడతాడు. మెలకువొఛ్చేస్తుంది. ఇలా ప్రతీరాత్రీ జరుగుతుంది. కలలో ఆడ దెయ్యం కొడితే ఆ దెబ్బ తెల్లారి వొంటి మీద కన్పిస్తుంది.

ఇలా వుండగా, డెవిల్ ఆర్మ్ స్ట్రాంగ్ (ఆనంద్ రాజ్) అనే రౌడీకి డబ్బులు బాకీ పడతాడు కన్నప్పన్. ఆ రౌడీ వేధిస్తూంటాడు. కన్నప్పన్ పీడకలలకి సంబంధించి ఎళుమలై (నాజర్) అనే భూత వైద్యుణ్ణి సంప్రదిస్తాడు. డ్రీమ్ క్యాచర్ వల్ల పీడకలలొస్తున్నాయంటే ఈ కోటలో ‘డ్రీమ్ కీ’ వెతికి పట్టుకోవడం ఒక్కటే మార్గమని చెప్తాడు ఎళుమలై. పీడకలలో ఆ కోట 1930లలో బ్రిటిష్ కాలపు నాటిదని, అందులో రాబర్ట్- మెక్డలీన్ అనే ప్రేమికులు హత్యకి గురయ్యారనీ, ఆ ఆడ దెయ్యం మెక్డలీన్ దేననీ చెప్తాడు.

ఇప్పుడు కన్నప్పన్ ఏం చేశాడు? పీడకలల్ని వదిలించుకోవడానికి కోటలో ‘డ్రీమ్ కీ’ ని వెతికి పట్టుకున్నాడా? ఆ ప్రయత్నంలో ఆడ దెయ్యంతో ఎన్ని ప్రమాదాలెదుర్కొన్నాడు? డెవిల్ ఆర్మ్ స్ట్రాంగ్ పీడ ఎలా వదిలించుకున్నాడు? డాక్టర్ జానీ (రెడిన్ కింగ్ స్లే) అనే సైకియాట్రిస్టు కూడా దిష్టి బొమ్మ ఈక పీకితే అతడికే జరిగింది? కన్నప్పన్ ఇంట్లో కూడా తెలియక అందరూ ఈకలు పీకితే వాళ్ళకేం జరిగింది? అంతా కలిసి పీడకలలో కోటలో దెయ్యం పాలబడ్డారా? ఈ కేసులో భూతవైద్యుడు ఎళుమలైకి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ డార్క్ డేవ్స్ (రేజీనా) ఎలా తోడ్పడింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది ఫాంటసీని మేళవించిన హార్రర్ కామెడీ కథ. పీడకలలు, పీడ కలల్లో కోట, కోటలో ఆడ దెయ్యం, పీడకలలకి విరుగుడుగా ‘డ్రీమ్ కీ’ ని సాధించడం ఇదంతా సబ్ కాన్షస్ మైండ్ లో చేసే సైకలాజికల్ జర్నీ. అరేబియన్ నైట్స్ కథ లాంటిది. విష్ణుపురాణంలో అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరపడం లాంటిది. అయితే ఈ సెన్స్ తో సినిమా తీయలేదు. నిగూఢార్ధాన్ని వదిలేసి కామెడీ కోసం కామెడీ అన్నట్టు పని కానిచ్చేశారు. దీంతో ఇది హార్రర్ కామెడీ షుగర్ కోటింగుతో ఆత్మిక దహాన్ని తీర్చే స్పిరిచ్యువల్ థ్రిల్లర్ అయ్యే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంది. హార్రర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ లో న్యాయం కోసం ఆక్రందించే రొటీన్ దెయ్యం కథగా మాత్రమే ఇది రూపొందింది.

పీడకలల్లో వచ్చే హార్రర్ సీన్లు కాసేపటికే తేలిపోతాయి. భయపెట్టే హర్రర్ కంటే కామెడీలు ఎక్కువుంటాయి. ఈ కామెడీలు భయం చుట్టే రొటీన్ గా వుంటాయి. రౌడీతో, సైకియాట్రిస్టుతో కామెడీలు కొన్ని నవ్వించినా- అసలు పాయింటు ‘డ్రీమ్ కీ’ రహస్యం గురించి కథ సాగదు. ఆ ‘డ్రీమ్ కీ’ కోసం పోటాపోటీలతో ఆడ దెయ్యంతో తలపడే కథగా వుంటే పాత్రలు నేర్చుకునే పాఠాలుగా వుండేది. రొటీన్ గా ఆడ దెయ్యానికి జరిగిన అన్యాయం గురించే కథ చేయడంతో- కొత్త ఐడియా కాస్తా పాత పచ్చడియే అయింది.

నటనలు- సాంకేతికాలు

కమెడియన్ సతీష్ కామెడీ అతిగా వుండదు. మొహంలో అమాయకత్వంతో ఫ్రెష్ నెష్ తీసుకొస్తాడు నటనకి. కమర్షియల్ హంగులు పెద్దగా వుండవు. ఈ సినిమా కంటే అతనే ఎక్కువ గుర్తుంటాడు. ఇక శరణ్య, గణేష్, నమో నారాయణ్ కుటుంబ కామెడీని రక్తి కట్టిస్తారు ఆయా సన్నివేశాల్లో. నాజర్, రెజీనా కసాండ్రా భూతవైద్యులుగా అదోలాంటి మ్యానరిజమ్స్ తో ఫారినర్స్ లా వుంటారు. రౌడీగా, సైకియాట్రిస్టుగా ఆనంద్ రాజ్, రెడిన్ కింగ్ స్లేలు మాత్రం పాత స్టయిల్ కామెడీకి కట్టుబడి వుంటారు.

ఈ మూవీ సౌండ్ డిజైన్, యువన్ శంకర్ రాజా సంగీతం, యువ సమకూర్చిన ఛాయాగ్రహణం హార్రర్ వాతావారణాన్ని సమృద్ధిగా సృష్టిస్తాయి. అయితే చూసి భయపడేంత కాదు. కొత్త దర్శకుడు జేవియర్ కొత్త ఐడియాలో వున్న నిగూఢార్ధాన్ని పట్టుకోగలిగివుంటే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా వుండేది. దీన్ని కొంచెం తేడాగా పీడ కలల్లో జరిగే కథగా రొటీన్ హార్రర్ కామెడీ అనుకుని పైపైన చూసేస్తే ఏ బాధా వుండదు.

First Published:  6 Jan 2024 2:37 PM GMT
Next Story