Committee Kurrollu Movie Review | కమిటీ కుర్రోళ్లు సినిమా రివ్యూ {2.75/5}
Committee Kurrollu Movie Review: మెగా డాటర్ నిహారిక, నిర్మాతగా మారి తీసిన తొలి ఫీచర్ ఫిలిం కమిటీ కుర్రోళ్లు. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా.
చిత్రం: కమిటీ కుర్రోళ్లు
నటీనటులు - సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి తదితరులు
సమర్పణ - నిహారిక కొణిదెల
బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్
నిర్మాతలు - పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక
రచన, దర్శకత్వం - యదు వంశీ
సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు
మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్
ఎడిటర్ - అన్వర్ అలీ
రన్ టైమ్ - 2 గంటల 36 నిమిషాలు
సెన్సార్ - యు/ఏ
రిలీజ్ డేట్ - ఆగస్ట్ 9, 2024
రేటింగ్ - 2.75/5
నటీనటులంతా కొత్తోళ్లు. దర్శకుడు కూడా కొత్త. చివరికి నిర్మాత నిహారికకు కూడా ప్రొడక్షన్ కొత్త. ఇదే తొలి సినిమా. మరి ఇంతమందిని తనవైపు లాక్కున్న 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో అంత కొత్తదనం ఏముంది? తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ..
బేసిగ్గా 90ల్లో జరిగిన కథ ఇది. గోదావరి ప్రాంతంలోని ఓ గ్రామం. అందులో శివ, సూర్య, సుబ్బుం, విలియం, ఆత్రం రవి, రాంబాబు స్నేహితులు. వీళ్లు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే, వీళ్ల కులాలు, చదువులు, డబ్బు లాంటి అంశాలేం ఉండవు. అసలు అవేంటో కూడా వీళ్లకు తెలియవు. చిన్ననాటి స్నేహాలు ఇలానే ఉంటాయి మరి. అలా వీళ్లతో పాటు వీళ్ల స్నేహం కూడా పెరిగి పెద్దదవుతుంది.
ఇక్కడే అసలైన కాన్ ఫ్లిక్ట్ మొదలవుతుంది. అందరూ ఎంసెట్ లో ర్యాంకులు సాధిస్తారు. కానీ కొందరికే సీట్లు వస్తాయి. మరీ ముఖ్యంగా గ్యాంగ్ లో చాలా తెలివైన విద్యార్థికి సీటు రాదు. ఎందుకంటే వాడిది పెద్ద కులం. బ్యాచ్ లోని మరికొందరికి మాత్రం ర్యాంక్ తక్కువగా వచ్చినా, వాళ్ల కులం ఆధారంగా వచ్చిన రిజర్వేషన్ కారణంగా సీట్లు ఈజీగా వచ్చేస్తాయి.
ఫలితంగా వాళ్లలో వాళ్లకు గొడవ వస్తుంది. కొట్టుకునే వరకు వెళ్తారు. అదే సమయంలో జాతర, అందులో జరిగిన ఓ ఘటన వల్ల స్నేహితులంతా విడిపోతారు. మళ్లీ పుష్కరానికి అదే జాతర వస్తుంది. స్నేహితులందరికీ ఆహ్వానం అందుతుంది. సొంతూరుకు వచ్చిన వాళ్లు మళ్లీ కలుసుకున్నారా లేదా?
కథగా చెప్పుకుంటే ఎంత బాగుందో, తెరపై కూడా అంతేబాగా తీశాడు దర్శకుడు యదు వంశీ. చిన్ననాటి స్నేహాలు, వైరం, గోదారి పల్లె అందం, స్థానిక సంస్కృతి.. ఇలా ఎన్నో అంశాల్ని చక్కగా చూపించాడు. సినిమా స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతోందనే విషయం మనసుకు తెలుస్తుంటుంది కానీ, సన్నివేశాలతో మమేకం అవుతాడు ప్రేక్షకుడు. సెకెండ్ యాక్ట్ లో సినిమా బలం అంతా ఉంది.
స్నేహితులంతా రిజర్వేషన్ వ్యవస్థ, వారి కులాల గురించి తెలుసుకున్న క్షణం నుండి, చివరికి వారు విడిపోవడం, వారి స్నేహం విచ్ఛిన్నమయ్యే విషాద ఘటన వరకు సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా స్నేహితులందరూ కలిసి ఒక వ్యక్తిని కలుసుకుని క్షమాపణలు చెప్పే కీలక ఎపిసోడ్ ను దర్శకుడు మనసుకు హత్తుకునేలా తీశాడు.
అదే టైమ్ లో సినిమాను స్లో చేసిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ వీక్ గా ఉంది. గ్రామ రాజకీయాలపై తీసిన సన్నివేశాలు బలవంతంగా చొప్పించినట్టు అనిపిస్తాయి. ఇక్కడొచ్చే సాయికుమార్ పాత్రలో కూడా డెప్త్ లేదు. సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు అసహజంగా అనిపించడం కూడా మైనస్ గా చెప్పుకోవచ్చు.
ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ సినిమా మనల్ని కూర్చోబెడుతుంది. దీనికి కారణం కొత్త నటీనటుల అభినయం. అంతా చాలా బాగా చేశారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్, త్రినాధవర్మ.. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది చాలా బాగా చేశారు. దీనికితోడు సినిమాకు అందమైన విజువల్స్ సెట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ అంతకంటే బాగుంది. చాలా సన్నివేశాలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాస్ అయిపోయాయి. పాటలన్నీ సందర్భానుసారం బాగున్నాయి. కెరీర్ లో మొదటిసారి ఫీచర్ ఫిలిం తీసిన నిహారిక, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. జాతర ఎపిసోడ్స్ ను చాలా గ్రాండ్ గా, ఖర్చుకు వెనకాడకుండా తీశారు. ఎడిటింగ్ కాస్త వీక్ గా ఉన్నప్పటికీ ఓకే.
ఓవరాల్ గా కమిటీ కుర్రోళ్లు సినిమా చాలా చోట్ల మెరుస్తుంది. చిన్ననాటి స్నేహాలు, జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరు అనుభవించిన రిజర్వేషన్ వ్యవస్థలోని లోపాల్ని కళ్లకు కడుతుంది. సెకెండాఫ్ మరింత గ్రిప్పింగ్ గా ఉన్నట్టయితే ఈ సినిమాకు 'ఆంధ్రా బలగం' అనే పేరొచ్చి ఉండేది.
బాటమ్ లైన్ - కుర్రోళ్లు క్లిక్ అయ్యారు