Butta Bomma Movie Review: ‘బుట్టబొమ్మ’ – మూవీ రివ్యూ {2/5}
Butta Bomma Movie Review: కొత్త హీరోయిన్ తో, కొత్త సంవత్సరంలో, కొత్తగా ఫ్రేమ కథ చూపిస్తూ, ప్రేక్షకుల్ని పరవశుల్నిచేయాలనుకున్నారు.
చిత్రం: బుట్టబొమ్మ
దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ టి రమేష్
తారాగణం : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్య స్వామి తదితరులు
స్క్రీన్ ప్లే- మాటలు : గణేశ్ రావూరి, సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
నిర్మాతలు : నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య
విడుదల : ఫిబ్రవరి 4, 2023
రేటింగ్ : 2/5
కొత్త హీరోయిన్ తో, కొత్త సంవత్సరంలో, కొత్తగా ఫ్రేమ కథ చూపిస్తూ, ప్రేక్షకుల్ని పరవశుల్నిచేయాలనుకున్నారు. దీనికి ఒరిజినల్ కంటెంట్ కాకుండా అరువు కంటెంట్ ఎంపిక చేసుకున్నారు. అరువు కంటెంట్ ఎప్పుడూ బరువే. అరువు లాగే తెలుగు కుదరాలని లేదు. పైగా అది ఓటీటీలో ప్రేక్షకులు చూసేసి వుంటే అస్సలు కుదరదు. అయినా చూద్దామని ప్రయత్నించారు. కొత్త దర్శకుడు అరువు కంటెంట్ తో వస్తున్నాడంటే ఆసక్తి ఏముంటుంది. అయినా ఆసక్తి కల్గించుకుని ఈ రీమేక్ ఎలా వుందో చూస్తే...
కథ
అరకులో దూది కొండ గ్రామానికి చెందిన సత్య (అనిఖా సురేంద్రన్) ఇంటి పట్టున కాలం గడుపుతూ వుంటుంది. టైలరింగ్ చేసే తల్లి, రైస్ మిల్లులో పనిచేసే తండ్రీ వుంటారు. ఒక చదువుకుంటున్న చెల్లెలు వుంటుంది. సత్యకి ఒక కెమెరా ఫోన్ కొనుక్కుని రీల్స్ చేసి పేరు తెచ్చుకోవాలని కోరిక వుంటుంది. ఉన్న ఫోన్ తో ఒకసారి తల్లి కోసం ఎవరికో ఫోన్ చేస్తే రాంగ్ కాల్ వెళ్ళి ఆటో డ్రైవర్ మురళి (సూర్య వశిష్ట) కి చేరుతుంది. కట్ చేస్తే అతను కాల్స్ చేస్తూ వెంటపడతాడు. ఆమె తగ్గి, అతడితో ఫోన్ రోమాన్స్ ప్రారంభిస్తుంది. తను చెప్పిన పొదుపు కథ విప్పాడని అతడ్ని ప్రేమిస్తుంది. ఈమె గొంతు బావుందని అతను ప్రేమిస్తాడు. గ్రామంలోనే చిన్ని అనే డబ్బున్న కుర్రాడు సత్య వెంట పడుతూంటాడు. అతడితో పెళ్ళి సంబంధం అనుకుంటారు సత్య తల్లిదండ్రులు. ఇది నచ్చని సత్య ఇక మురళిని కలుసుకుని పెళ్ళి చేసుకోవాలని వైజాగ్ వెళ్ళిపోతుంది. వైజాగ్ లో మురళి పోగొట్టుకున్న ఫోన్ ఆర్కే (అర్జున్ దాస్) అనే రౌడీకి దొరకడంతో, ఫోన్ చేసిన సత్య అతనే మురళి అనుకుని కలుసుకుంటుంది.
ఎవరీ ఆర్కే? తనతో పొరబడ్డ సత్యకి నిజం చెప్పకుండా ఏం చేశాడు? మురళి ఏమయ్యాడు? ఆర్కే ఎవరు? మురళి ఎవరు? సత్య ఎవర్ని నమ్మాలి? ఏం చేయాలి?.. వంటి ప్రశ్నలతో సాగేదే మిగతా కథ.
ఎలావుంది కథ
2020 లో మలయాళ నటుడు, దర్శకుడు మహ్మద్ ముస్తఫా తీసిన ‘కప్పెలా’ (చిన్నచర్చి) కి ‘బుట్టబొమ్మ’ రీమేక్ కథ. వాస్తవంగా జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో యూత్ సినిమాలు తీస్తున్న మలయాళ దర్శకుల కోవలో, ముస్తఫా కూడా ఒక రియలిస్టిక్ ఫిక్షన్ తీశాడు. అయితే అంతర్లీనంగా ఒక తిరోగమన భావజాలాన్ని షుగర్ కోటింగ్ వేసి తెలియకుండా అందించాడు. బాహ్య అందాలతో ఈ షుగర్ కోటింగ్ కి పడిపోయి తెలుగులోనూ అలాగే తీసేశారు.
ఇందులో హీరోయిన్ కి ఇంటా బయటా భావస్వాతంత్ర్యం వుండదు. గ్రామంలో డబ్బున్న ఒకడు ఏక పక్షంగా ఆమెని ప్రేమించుకుని పెళ్ళి చూపులు పెట్టుకుంటాడు. కూతురికి ఇష్టమా కాదా అడక్కుండా పేరెంట్స్ సంబంధం ఒప్పేసుకుంటారు. హీరోయిన్ తండ్రి కూతుళ్ళ పట్ల ఎంత కఠినంగా వుంటాడో చిన్న కూతుర్ని చావబాదుతున్నప్పుడు చూస్తే చాలు. వాళ్ళ మీద నిఘా వేసి వుంటాడు. తండ్రిగా కూతుళ్ళని సంరక్షించుకోవడం వేరు, సంరక్షణ పేరుతో పురుషాధిక్యం ప్రదర్శించడం వేరు. పెళ్ళి విషయంలో తండ్రికి తల్లి మీద పురుషాధిక్యమే.
ఇక హీరోయిన్ ఫోన్ ప్రేమాయణంతో కలిసిన ఆటో డ్రైవర్ ది ఆమెని వల్లో వేసుకుని అమ్మేసే దుర్మార్గం. హీరోయిన్ ని కాపాడే రౌడీ మంచి మగాడే గానీ, తను ప్రేమిస్తున్న టీచర్ అమ్మాయితో అతడిదీ మగ అహంకారమే. ఈ టీచర్ నా ఆస్తి అన్న ఇగోయే తప్ప, నా సమస్తం అన్న ప్రేమే వుండదు. పాఠాలు చెప్పే ఆ టీచరమ్మ పాపం అణిగిమణిగి వుంటుంది.
చివరికి ఎవరేమిటో తెలుసుకుని ఇంటి ముఖం పట్టిన హీరోయిన్, పేరెంట్స్ చూసిన సంబంధమే చేసుకుంటుంది. అంటే పెద్దలు చూసిన సంబంధమే తప్ప నీకంటూ నీ ఇష్టాలతో పనిలేదన్న పురుషాధిక్య భావజాలం ఉట్టి పడే సీన్లతో ఈ కథ ముగుస్తుంది. చివరికి ఆమె ఫ్రెండ్ కూడా ఆమెకి భావ స్వాతంత్ర్యమివ్వని మోరల్ పోలిసింగ్ తోనే మాట్లాడుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి నువ్వెందుకు ఇరుక్కుంటావ్, ఇంటికెళ్ళి పొమ్మంటుంది.
ఇది అమాయక అమ్మాయిల్ని మోటివేట్ చేసే సినిమాయే అయితే, అమ్మాయిల స్మగ్లర్ల గురించి తనే పోలీసులకి సమాచారమిచ్చి సాటి అమ్మాయిల్ని కాపాడాలి ఒక కథానాయిక పాత్రగా. ఇది చెయ్యక, ప్రేమించిన వాడితో మోసపోయి, ఇంకేం చేయాలన్పించక ఇంటి ముఖం పట్టి, అదే డబ్బున్న వాడు కన్పించి నవ్వితే, పెళ్ళికి తలూపడం తిరోగమనమే తప్ప అభ్యుదయంలా వుండదు. దీన్ని ఉన్నదున్నట్టు తెలుగులోకి దింపేశారు!! బుట్టబొమ్మని ఆటబొమ్మ చేశారు.
అయితే మలయాళంలో ఫాలోయింగ్ వున్న సాఫ్ట్ గా కన్పించే రోషన్ మాథ్యీవ్ నెగెటివ్ పాత్రగా రివీల్ అవడం, రఫ్ గా కన్పించే శ్రీనాథ్ భాసి పాజిటివ్ పాత్రగా రివీల్ అవడమనే డైనమిక్స్ సినిమాని నిలబెట్టుకోవడానికి బాగా వర్కౌట్ అయ్యాయి. తెలుగులో ఈ కాస్టింగ్ వ్యూహమైనా ఆలోచించలేదు. కళ్ళు మూసుకుని రీమేక్ చేసేశారు.
రీమేక్ ఒరిజినల్లో వున్న ఫీల్ తో ఎప్పుడూ వుండదు. రీమేక్ ని ఒరిజినల్ తో పోల్చి రేటింగ్ తగ్గించకూడదు. అయితే ఒరిజినల్లో వున్న ఒప్పించని కంటెంట్ తో రీమేక్ వుండకూడదు. ఒరిజినల్ ని ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు చాలామంది చూసేశారు. చూడని వాళ్ళకి బాహ్య అందాలతో షుగర్ కోటింగ్ వల్ల నచ్చ వచ్చు.