Bhola Shankar Review: భోళా శంకర్ మూవీ రివ్యూ
Bhola Shankar Movie Review in Telugu: జనవరిలో ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సాహంతో వున్న మెగా స్టార్ నుంచి వెంటనే ఈ సంవత్సరం ‘భోళాశంకర్ అనే మరో మాస్ కమర్షియల్ విడుదల. ఇది తమిళ హిట్ ‘వేదాలం’ రీమేక్ అని తెలిసిందే.
చిత్రం: భోళా శంకర్
దర్శకత్వం : మెహర్ రమేష్
తారాగణం : చిరంజీవి, కీర్తీ సురేష్ తమన్నా, సుశాంత్, మురళీ శర్మ, సాయాజీ షిండే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్య తదితరులు
సంగీతం : మహతీ స్వరసాగర్, ఛాయాగ్రహణం : డడ్లీ
బ్యానర్స్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్,, క్రియేటివ్ కమర్షియల్స్
నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర, కెఎస్ రామారావు
విడుదల : ఆగస్టు 11, 2023
రేటింగ్: 2/5
జనవరిలో ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సాహంతో వున్న మెగా స్టార్ నుంచి వెంటనే ఈ సంవత్సరం ‘భోళాశంకర్ అనే మరో మాస్ కమర్షియల్ విడుదల. ఇది తమిళ హిట్ ‘వేదాలం’ రీమేక్ అని తెలిసిందే. దీనికి పదేళ్ళ గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకుడు. దర్శకత్వానికి పదేళ్ళ గ్యాప్, రీమేక్ కి ఎనిమిదేళ్ళ గ్యాప్ చాలా చెప్తాయి కాలదోషం పట్టిన సంగతులు. చిరంజీవికి కాలదోషం లేదు. ఆయన ప్రయత్నాలకే కాలీన స్పృహ కన్పించడం లేదు. ఈ కాలపు ప్రేక్షకులకి ఏ కాలపు సినిమాలు అందిస్తున్నారో చూసుకోకుండా కుమ్మేస్తున్నారు. ఆయన కుమ్మడం, ప్రేక్షకులు కుయ్యోమనడం ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం...
కథ
శంకర్ (చిరంజీవి) సోదరి మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ని తీసుకుని కోల్ కతా లో దిగుతాడు. ఆమెని కాలేజీలో చేర్పించి టాక్సీ డ్రైవర్ గా మారతాడు. అతడికి లాస్య (తమన్నా) అనే క్రిమినల్ లాయర్ పరిచయమవుతుంది. పోలీస్ కమీషనర్ నగరంలో ఆడవాళ్ళ అపహరణలు జరుగుతున్న దృష్ట్యా టాక్సీ డ్రైవర్లు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తాడు. దీంతో శంకర్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) అనే మాఫియా గ్యాంగ్ మెంబర్లని ఒకొక్కర్నీ చంపడం మొదలెడడు. అటు వైపు మహాలక్ష్మిని లాయర్ లాస్య సోదరుడు శ్రీకర్ (సుశాంత్) ప్రేమించడంతో లాస్య శంకర్ దగ్గరికి ఆ పెళ్ళి సంబంధం తెస్తుంది. శంకర్ ఒప్పుకుంటాడు. ఇంతలో లాస్యకి శంకర్ చేస్తున్న హత్యలు తెలిసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుంది. సోదరి పెళ్ళి ఆగిపోవడంతో శంకర్ ఇరకాటంలో పడతాడు.
అసలు శంకర్ ఎవరు? ఎందుకు మాఫియాల్ని హతమారుస్తున్నాడు? అతడి గతం ఏమిటి? చేస్తున్న హత్యల్ని ఎలా సమర్ధించుకుని ఆగిపోయిన సోదరి పెళ్ళి చేశాడు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
2015 లో తమిళంలో అజిత్ నటించిన ‘వేదాలం’ రీమేక్ కథ ఇది. తెలుగులో ‘ఆవేశం’ పేరుతో డబ్ అయి విడుదలైంది కూడా. యూట్యూబ్ లో ఫ్రీగా వుంది కూడా. అయినా తెలిసిన పాత కథనే రీమేక్ చేశారు. కోల్ కత బ్యాక్ డ్రాప్ లో ఇలాటిదే అన్నాచెల్లెలు కథతో 2021 లో రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) వచ్చి ఫ్లాపయ్యింది. ఇందులో కూడా చెల్లెలు కీర్తీ సురేషే. ఇంకోటేమిటంటే, ‘భోళా శంకర్’ లో తమన్నా లాగా, ఇందులో కూడా కోల్ కతాలో నయనతార లాయరే. ఇంకో అద్భుతమే మిటంటే, ఒకేలా వున్న ‘వేదాలం’, ‘అన్నాత్తే’ రెండు సినిమాలకీ దర్శకుడు శివయే! అంటే తెలుగు ప్రేక్షకులు ఒకేలా వున్న ‘ఆవేశం’, ‘పెద్దన్న’ రెండూ చూశాక, మళ్ళీ అలాటిదే ‘భోళా శంకర్’ కూడా చూడాలన్న మాట. ఇవి మామూలు బరువు బాధ్యతలు కావు. ప్రేక్షకులు నెరవేర్చుకుని విధేయత నిరూపించుకోవాలి. తీసిందే తీస్తూంటే చూసిందే చూస్తూ పోవాలి.
అయితే సమస్యేమిటంటే, 2013 లో ‘షాడో’ తర్వాత సినిమాలేని దర్శకుడు మెహర్ రమేష్, పదేళ్ళ తర్వాత అదే తన కాలం నాటి దర్శకత్వానికి సాహసించడం. పూర్తిగా ఔట్ డేటెడ్ మేకింగ్ కి పాల్పడడం. 1970-80 ల సినిమా అన్పించేలా తీయడం. టైటిల్స్ లో ‘స్టోరీ డెవలప్ మెంట్’ అని తన పేరు పడుతుంది. ‘వేదాలం’ సీన్ల వరసే దించేస్తే డెవలప్ మెంట్ ఏముందో అర్ధంగాదు. ఇలా ప్రేక్షకులకి తర్వాతేం జరుగుతుందో తెలిసిపోయే టెంప్లెట్ కథనం వాడేసి సినిమా చుట్టేసినట్టే వుంది.
మెగాస్టార్ ని ఎలివేట్ చేసే ఒక్క సిట్యుయేషన్ గానీ, హీరోయిజాన్ని నిలబెట్టే ఒక్క ఎమోషనల్ సీనుగానీ లేకుండా ఫ్లాట్ గా రన్ చేసేశారు. ఏ సన్నివేశం కూడా అజిత్ తో తమిళంలో లాగా మనసు పెట్టి తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత ఒక పదినిమిషాలు మాత్రమే బలం. మిగతా ఫస్టాఫ్, సెకండాఫ్ చిత్రీకరణ డొల్లగా వుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బావుందనుకునేంత లోనే బోరుగా మారిపోతుంది. భోళా శంకర్ గా చిరంజీవి అసలు క్యారక్టర్ వెల్లడయ్యే ఫ్లాష్ బ్యాక్ కూడా విఫల మైంది.
కేవలం చిరంజీవి యంగ్, స్టయిలిష్ లుక్, డాన్సులు, ఫైట్లు మాత్రమే అప్డేట్ అయి వున్నాయి. సినిమాలో విషయం, మేకింగ్ మాత్రం కాలానికి దూరంగా ఔట్ డేటెడ్ గా వున్నాయి.
నటనలు- సాంకేతికాలు
చిరంజీవికి మూస ఫార్ములా పాత్రలు కొత్త కాదు. అవి ఎన్నిసార్లు నటించినా, పాత్రల పరిధి అంతే కాబట్టి, నటన మార్పు లేకుండా రిపీట్ అవుతూ వుంటుంది. అయితే ఈసారి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. కమెడియన్ల గుంపుతో చేసిన కామెడీలు ఎవర్నీ నవ్వించలేక పోయాయి. ఎమోషన్లు చూద్దామంటే సిస్టర్ సెంటిమెంటు కూడా కృత్రిమంగా, అంతంత మాత్రంగా వుంది. ఒక్క యాక్షన్ సీన్లతో, పాటలకి స్టెప్పులతో మాత్రమే మెప్పించడానికి పరిమితమై పోయారు చిరంజీవి. ఫ్యాన్స్ కి కావాల్సింది ఇదే కాబట్టి వీటిని క్రమం తప్పకుండా సరఫరా చేస్తారు.
తమన్నా రొటీన్ ఫార్ములా హీరోయిన్. తమన్నాతో బాటు కీర్తీ సురేష్ పాత్ర కూడా అంతంత మాత్రమే. మొన్నే రజనీకాంత్ తో చెల్లెలిగా నటించి, మళ్ళీ ఇప్పుడు చిరంజీవితో చెల్లెలిగా నటించడం ఎంత ఎంబరాసింగ్ గా వుందో ఆమె మొహంలో చూస్తే తెలిసిపోతుంది. ఇక బోలెడు మంది కామెడియన్లు, విలన్లు రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయారు. సంగీతం, కెమెరా వర్క్, ఇతర టెక్నికల్ విభాగాలు ఎంత బాగా పని చేసినా దర్శకుడు కూడా పని చేయాలిగా? ఇది పూర్తిగా మెహర్ రమేష్ చెడ గొట్టుకున్న మెగా అవకాశం, మళ్ళీ రాదు.