Bharateeyudu 2 Movie Review: భారతీయుడు 2- రివ్యూ! {2/5}
Bharateeyudu 2 Movie Review: 1996 నాటి బ్లాక్‌బస్టర్ ‘భారతీయుడు’ (ఇండియన్) కి 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ గా కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ తీశాడు దర్శకుడు శంకర్.
చిత్రం: భారతీయుడు 2
దర్శకత్వం : ఎస్. శంకర్
తారాగణం : కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, ఎస్.జె సూర్య, బాబీ సింహా తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : రవి వర్మ
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్
నిర్మాతలు : సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్
విడుదల : జులై 12, 2024
రేటింగ్: 2/5
1996 నాటి బ్లాక్‌బస్టర్ ‘భారతీయుడు’ (ఇండియన్) కి 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ గా కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ తీశాడు దర్శకుడు శంకర్. ఇది 2017 నుంచీ నిర్మాణంలో అగ్నిప్రమాదం సహా అనేక అవాంతరా లెదుర్కొంటూ పూర్తయి నేటికీ విడుదలైంది. దీన్ని ఐమాక్స్ ఫార్మాట్ లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ నిడివి 6 గంటలు వుండడంతో, రెండు భాగాలు చేసి రెండవ భాగం 2025 లో విడుదల చేసేందుకు నిర్ణయించారు. అయితే దర్శకుడు శంకర్ మంచి ఫాంలో వున్నప్పుడు దాదాపు మూడు దశాబ్దాల క్రితం ‘భారతీయుడు’ తో సృష్టించిన మ్యాజిక్‌ని తిరిగి ఇప్పుడు రిపీట్ చేయగలిగాడా అన్నదే అభిమానుల్లో వున్న సందేహం. ఇది తెలుసుకునేందుకు రివ్యూ లోకి వెళ్దాం...
కథ
చిత్రా అరవిందన్ (సిద్ధార్థ్), అతడి ఫ్రెండ్స్ యూట్యూబ్ లో బార్కింగ్ డాగ్స్ అనే చానెల్ నడుపుతూ అవినీతిని రట్టు చేస్తూంటారు. దీంతో జైలు పాలవుతారు. జైలు నుంచి విడుదలయ్యాక సేనాపతి అలియాస్ భారతీయుడు ( కమల్ హాసన్) ఒక్కడే ఈ ఆవినీతిని రూపుమాపగలడని నిర్ణయించుకుని, ‘కమ్ బ్యాక్ ఇండియన్’ అని హ్యాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తారు. తైపై లో అజ్ఞాతంగా జీవిస్తున్న భారతీయుడు దీనికి స్పందించి స్వదేశానికి తిరిగి వచ్చి అవినీతి అధికారుల, వ్యాపారుల భరతం పట్టడం మొదలెడతాడు. పడుతూంటాడు. దీంతో అతడ్ని ప్ట్టుకోవాలని సీబీఐ అధికారులు వెంటపాడుతూంతారు.
ఇండియాకి వచ్చిన భారతీయుడు ఎవరెవరినీ చంపాడు? దీంతో యూట్యూబర్ బృందానికి ఎలాటి సమస్యలు ఎదురయ్యాయి. వీళ్ళని భారతీయుడు ఎప్పుడు కలిశాడు? కలిస్తే ఏం జరిగింది? సీబీఐ అధికారి (బాబీ సింహా) భారతీయుడిని అరెస్ట్ చేయగలిగాడా? అంతిమంగా భారతీయుడు తీసుకున్న నిర్ణయం ఏమిటి? వీటికి సమాధానాలు మిగతా సినిమాలో తెలుస్తాయి.
ఎలావుంది కథ
1993 లో ‘జంటిల్మన్’ నుంచి 2010 లో ‘రోబో’వరకూ ఉధృతంగా కొనసాగిన శంకర్ సినిమాల ట్రెండ్ (10 సినిమాలు) ఆ తర్వాత మూడు సినిమాలతో పట్టుకోల్పోయి దాదాపు ముగింపు దశకి వచ్చినప్పుడు, కింకర్త్యవ్యం ఆలోచించి ఒకప్పటి సూపర్ హిట్ క్లాసిక్ ‘భారతీయుడు’ కి సీక్వెల్ తీస్తేనే తనకి మనుగడగా భావించుకుని ‘భారతీయుడు 2’ ని ప్రయత్నించాడు. సమస్య కొత్త కంటెంట్ ని సృష్టించలేక పోవడం కాదు. సమస్య దర్శకత్వం మీద పట్టు కోల్పోవడంగా రుజువవుతోంది.
‘భారతీయుడు 2’ ఏ విధంగా చూసినా బలహీన సినిమా. కథ కథనాలకి, పాత్ర చిత్రణలకి, నటనలకి, భావోద్వేగాలకి, ఆఖరికి సంగీతానికీ ఏ మాత్రం చోటు లేనిది. ఇవన్నీ 1996 నాటి ‘భారతీయుడు’ లో మైమరిపిస్తాయి. కానీ ఇప్పుడు కృత్రిమత్వపు బారిన పడి వికర్షిస్తాయి. క్లాస్ ప్రేక్షకులే కాదు, మాస్ మాస్ ప్రేక్షకులు కూడా ఈ భారీ బడ్జెట్ సినిమాతో కనెక్ట్ కాలేక ఇబ్బంది పడతారు.
ఫస్టాఫ్ లో భారతీయుడి ఎంట్రీ ఆలస్యంగా జరిగినా కొన్ని వినోదాత్మక సీన్లున్నాయి. అయితే వేరే పాత్రల ఉపకథలతో భారతీయుడికి స్పేస్ తగ్గి స్లో అయిపోతుంది ఫస్టాఫ్. అవినీతి పరులకి శిక్షలు వేసే దృశ్యాలు కూడా అంతంత మాత్రంగానే. ఇక సెకండాఫ్ అయితే లక్ష్యం లేకుండా సాగుతుంది. కథ కేవలం అవినీతి పరుల్ని చంపడం, సీబీఐ నుంచి తప్పించుకోవడం చుట్టే తిరిగినా, దీన్నైనా థ్రిల్లింగ్ గా చూపించలేదు. పైగా కథ లోతుల్లోంచి పలకని భావోద్వేగాలు, సాగదీసిన నాటకీయ సన్నివేశాలూ, గందరగోళంగా సుదీర్ఘంగా సాగే క్లయిమా క్స్ ఛేజింగ్స్ ...ఇవన్నీ సుదీర్ఘకాలం నిర్మాణంలో వుండడంతో జరిగిన లోపాలేమో. నాటి ‘భారతీయుడు’ లోని ఉదాత్తత కోల్పోయిన పాత్ర కేవలం ఒక యాక్షన్ హీరోగా మిగిలి పోయింది.
నటనలు- సాంకేతికాలు
భారతీయుడిని ఇప్పుడు 106 ఏళ్ళ వ్యక్తిగా చూపించారు. 1996 నాటి ‘భారతీయుడు’ లో అతను స్వాతంత్ర్య పోరాటం చేసిన నేపథ్యంగల దేశ భక్తుడు. అందుకే దేశంలో అవినీతికి అంతలా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ ఆవేశం, ఉద్రేకం, దేశాన్ని రక్షించాలన్న భావం లేని బలహీన వ్యక్తిగా మిగిలాడు. ఈ పాత్రని కమల్ హాసన్ నటన కూడా నిలబెట్టలేకపోయింది. పాత్రకిచ్చిన మేకప్ చాలా హాస్యాస్పదంగా వుంది. విషయం లేని పాత్రతో కేవలం ఒక రొటీన్ యాక్షన్ సినిమాగా తీసి సరిపెట్టేశారు.
సిద్ధార్థ్ నటించిన యువ పాత్ర కూడా యూత్ కి ఎక్కని కృత్రిమ పాత్రే. కేవలం ఒకే ఒక్క సన్నివేశంలో అతడికి నటించే అవకకాశం లభించింది. మిగిలినదంతా కాలక్షేపమే. ఇక రాకుల్ ప్రీత్ సింగ్ పాత్ర కయితే చోటే లేదు. ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా ఫర్వాలేదు. మళ్ళీ చిన్న పాత్రలో కన్పించే ఎస్ జె సూర్య కూడా వృథానే. బోలెడు మందితో తారాగణ బలం వున్నా లాభం లేకుండా పోయింది.
సాంకేతికంగా శంకర్ టైపు బ్రహ్మాండమైన విజువల్స్ ఆద్యంతం మైమరిపిస్తాయి. కెమెరామాన్ రవివర్మ కృషికి నిదర్శనం. అయితే అతడి కృషికి తగ్గట్టు శంకర్ కంటెంట్ ని అందించలేక పోవడం విచారకరం. అలాగే అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం అన్ని విధాలా విఫలమైంది.
పైన చెప్పుకున్నట్టు, కథ కథనాలకి, పాత్ర చిత్రణలకి, నటనలకి, భావోద్వేగాలకి, ఆఖరికి సంగీతానికీ ఏ మాత్రం చోటు లేని, ‘భారతీయుడు’ లోని రసాస్వాదనని అందించలేని నీరస భారతీయుడు ఈ సినిమా.