Bhaag Saale Review: భాగ్ సాలే- మూవీ రివ్యూ! {1.5/5}
Bhaag Saale Movie Review: న్యూవేవ్ థ్రిల్లర్స్ తో ప్రయోగాలు చేస్తున్న శ్రీసింహా నటించిన ‘మత్తువదలరా’ మొదటి సినిమా మాత్రమే 2019 లో హిట్ అన్పించుకుంది. తర్వాత నటించిన ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ రెండూ ఫ్లాపయ్యాయి.
చిత్రం: భాగ్ సాలే
రచనా- దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి
తారాగణం : శ్రీ సింహ కోడూరి, నేహా సోలంకీ, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, సత్య, సుదర్శన్, వైవా హర్ష, జాన్ విజయ్, వర్షిణీ సౌందర రాజన్, నందినీ రాయ్, వైవా హర్ష, పృథ్వీ రాజ్
సంగీతం : కాల భైరవ, ఛాయాగ్రహణం : రమేష్ కుషేందర్
బ్యానర్స్ : వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ అసోషియేషన్
నిర్మాతలు : అర్జున్ దాస్యన్, యశ్ రంగినేని, కళ్యాణ్ సింగనమల
విడుదల : జూలై 7, 2023
రేటింగ్: 1.5/5
న్యూవేవ్ థ్రిల్లర్స్ తో ప్రయోగాలు చేస్తున్న శ్రీసింహా నటించిన ‘మత్తువదలరా’ మొదటి సినిమా మాత్రమే 2019 లో హిట్ అన్పించుకుంది. తర్వాత నటించిన ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ రెండూ ఫ్లాపయ్యాయి. ఈ మూడూ కొత్త దర్శకులవే. తిరిగి ఇప్పుడు ఇంకో కొత్త దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లితో ‘భాగ్ సాలే’ నటించాడు. దీన్ని క్రైమ్ కామెడీగా తీశారు. ట్రైలర్ ఆసక్తికరంగానే వుంది. శ్రీ సింహా సినిమా అంటే ఇంకేదో కొత్తదనముంటుందనేలా ఉత్కంఠ పెంచింది. మరి నిజంగా అలా వుందా, లేక నిరాశ పర్చేలా వుందా? ఇది తెలుసుకుందాం..
కథ
అర్జున్ (శ్రీ సింహ) ఓ హోటల్ లో షెఫ్ గా పని చేస్తూంటాడు. అతడికి సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించి కోట్లు గడించాలని కలలుంటాయి. మాయ (నేహా సోలంకీ) అనే అమ్మాయి పరిచయమైతే, ఆమెకి తనకి చాలా బిజినెస్సులు, ఆస్తులూ వగైరా వున్నాయని బిల్డప్ ఇచ్చి ప్రేమించేలా చేసుకుంటాడు. ఇంకో వైపు శామ్యూల్ ( జాన్ విజయ్) అనే డ్రగ్ స్మగ్లర్ వుంటాడు. ఇతను చావకబారు సినిమాల్లో నటించే నళిని (నందినీ రాయ్) ని గాఢంగా ప్రేమిస్తూంటాడు. ఈమె గతంలో ఓ ఇంట్లో పని మనిషి. ఆ ఇంట్లో ఓ విలువైన ఉంగరం కొట్టేయాలని విఫల యత్నం చేస్తుంది. అది నిజాం కాలపు నాటి 25 కోట్లు చేసే వజ్రపు టుంగరం. ఆ ఉంగరం తెచ్చిస్తే ప్రేమిస్తానని శ్యామ్యూల్ కి కండిషన్ పెడుతుంది. ఆ ఉంగరం బిల్డర్ అయిన మాయ తండ్రి (సంజయ్ స్వరూప్) దగ్గర వుందని తెలుసుకుని అతడ్ని కిడ్నాప్ చేస్తాడు శామ్యూల్. దీంతో మాయ అర్జున్ సాయం కోరుతుంది.
అర్జున్ ఏం చేశాడు? మాయ తండ్రిని కాపాడేడా? ఉంగరం తిరిగి మాయ తండ్రికి దక్కిందా? తను బిజినెస్ మాన్ అని మాయాకి చెప్పిన అబద్ధం బయటపడిందా? బయట పడితే ఏం జరిగింది?... ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఇది క్రైమ్ కామెడీ జానర్ కి చెందిన కథ. అయితే ఇందులో క్రైము గానీ, కామెడీ గానీ లేకపోవడం ప్రత్యేకత. ఒక ఉంగరం కోసమో, విగ్రహం కోసమో, లేదా నిధి కోసమో వేట సాగించే ముఠాల సినిమాలు కొత్త కాదు. వీటిని కామెడీగా తీసినప్పుడు, ఆ కామెడీ మోతాదు మించినప్పుడు, అరిగి పోయిన ఈ కథలు కొత్తవై పోతాయి. హిందీలో ‘ఢమాల్’ సిరీస్ సినిమాలు ఇలాటివే. తెలుగులో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘అనగనగా ఒక రోజు’ (వీడియో టేపు కోసం వేట) ఇలాటిదే. ‘భాగ్ సాలే’ కొత్త దర్శకుడు ఇలాటి సినిమాలు చూసి వుంటే ఫలితం వేరేగా వుండేది.
కథ మొదటి మలుపు తీసుకునే మాయ తండ్రి కిడ్నాప్ సంఘటనతో బాటు, ఇంటర్వెల్లో ముఠా చేతినించి అర్జున్ ఉంగరాన్ని దక్కించుకునే రెండో మలుపు, క్లయిమాక్స్ లో ముఠా నాయకుడి ప్రేయసిని అర్జున్ కిడ్నాప్ చేసే మూడో మలుపూ – ఇలా కథ అనే పదార్ధానికి మూల స్తంభాలైన మూడు మలుపులూ- ఏదీ యాక్షన్ తో బిగ్ ఈవెంట్ గా ముద్రవేసే బలంతో లేక- మిగతా అన్ని సీన్లలాగే సాదాగా వెళ్ళి పోవడంతో, కథా కథనాల లక్షణాల పట్ల కొత్త దర్శకుడి పరిజ్ఞాన మేమిటో బయట పడి పోతోంది. సింపుల్గా చెప్పుకుంటే, అతడికి సినిమా కథంటే ఏమిటో తెలీదు.
ఇక ఉన్న కథ ఎంతకీ ముందుకు కదలక, అక్కడక్కడే ఉంగరం చేతులు మారే సీన్లు రిపీటవుతూ, సహన పరీక్ష పెట్టేస్తుంది. ఇక మలుపులే సరిగ్గా లేకపోవడంతో సస్పెన్స్, థ్రిల్ అనేవి సినిమాలోంచి అదృశ్యమైపోయాయి. చప్పగా సాగే, సమయం వృధా ప్రహసనంగా సినిమా మిగిలిపోయింది.
దీనికి తోడు ప్రేమ కథలోనూ విషయం లేదు. బిజినెస్ మాన్ గా మాయాకి బిల్డప్ ఇచ్చిన అర్జున్ అది బైట పడే సన్నివేశం, దాంతో ఆమె రియాక్షన్ అంతే చప్పగా వున్నాయి. అసలు పెద్ద రెస్టారెంట్ తెరిచి కోట్లు గడించాలనుకునే అర్జున్, ప్రేమలో డబ్బున్న వాడిలా బిల్డప్ ఇచ్చి మోసం చేయాలనుకునే వైరుధ్యంతోనే, అతడి రెస్టారెంట్ కలలో నిజాయితీ ఎంతో బయటపడి పోతోంది. ఇంతా చేస్తే ఈ కథలో ఒక్క క్రైమ్ కూడా జరగలేదు, కామెడీకి రెండు చోట్ల తప్ప ఎక్కడా నవ్వు రాదు.
నటనలు- సాంకేతికాలు
హీరో శ్రీసింహా ఎంపిక చేసుకుంటున్న సినిమాలతో అతను బి గ్రేడ్ హీరోగా ముద్ర వేసుకునే బాటలో పయనిస్తున్నట్టన్పిస్తాడు. ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడిగా తను ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో ప్రేక్షకుల్ని పెంచుకుంటాడో తెలియదు గానీ, ప్రస్తుత సినిమా పాత్రతో, నటనతో ఏ మాత్రం ముద్రవేయ లేకపోయాడు. ముఠా వెంట పరుగు దీయడమో, లేదా ముఠాని తప్పించుకుంటూ పరుగు దీయడమో ఇవే సరిపోయాయి. ఇది పరుగు పందేల సినిమాలాగా వుందేమిటని అనుమానం కూడా వచ్చి వుండదు. కొత్త దర్శకుడు యాక్షన్ చెప్పడం- అందరూ పరుగెత్తడం ఇవే పాత్రలు, ఇవే నటనలు. కొత్త దర్శకుడు పాపం హీరో పేరెంట్స్ ని కూడా వదిలి పెట్టకుండా పరుగులు తీయించాడు- హీరోయిన్ సరేసరి!
విలన్ గా వేసిన జాన్ విజయ్, అనుచరుడుగా వేసిన వైవా హర్షల అసభ్య కామెడీ, పోలీసు అధికారిగా సత్య వేరే కామెడీ, సుదర్శన్ అదో కామెడీ, తండ్రుల పాత్రల్లో సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, వడ్డీ వ్యాపారి పాత్రలో పృథ్వీ రాజ్ ఏం నటిస్తున్నామో అర్ధంగాక చేసిన అయోమయపు నటనలతో తామాషాగా మారిపోయింది సినిమా.
రెండు బిట్ సాంగ్స్ వచ్చి వెళ్ళి పోతాయి. కెమెరా వర్క్ బావుందిగానీ, న్యూవేవ్ థ్రిల్లర్ అన్పించే యాంగిల్స్ తో లేదు. ఇక ఎన్ని పాత్రల సమూహముందో అన్నీ లొకేషన్స్ వున్నాయి. పరుగెత్తడానికి లొకేషన్స్ చాల్లేదు. ‘భాగ్ సాలే’ అని ప్రేక్షకుల్ని కూడా లొకేషన్స్ లోకి తరిమి కొడుతున్నట్టుంది సినిమా!