Telugu Global
MOVIE REVIEWS

Baak Movie Review: బాక్ మూవీ రివ్యూ! {1.75/5}

Baak Telugu Movie Review: తమిళంలో దర్శకుడు సుందర్ సి తీస్తూ వస్తున్న ‘అరుణ్మణై’ హార్రర్ కామెడీల సిరీస్ సినిమాల్లో నాల్గోది ‘బాక్’ పేరుతో తెలుగులో విడుదలైంది. సుందర్ సి హీరోగా నటించాడు. తమన్నా భాటియా, రాశీ ఖన్నా ఇతర పాత్రల్లో నటించారు.

Baak Movie Review: బాక్ మూవీ రివ్యూ! {1.75/5}
X

చిత్రం: బాక్

రచన- దర్శకత్వం : సుందర్ సి

తారాగణం : సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా, దేవ నందా, కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ ప్రతాప్, రామచంద్ర రాజు, జయప్రకాష్ తదితరులు

సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : ఇ.కృష్ణ సామి

బ్యానర్స్ : అన్వీ సినిమాస్, బెంజ్ మీడియా ప్రై. లి; నిర్మాతలు : ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్

విడుదల : మే 3, 2024

రేటింగ్: 1.75/5

తమిళంలో దర్శకుడు సుందర్ సి తీస్తూ వస్తున్న ‘అరుణ్మణై’ హార్రర్ కామెడీల సిరీస్ సినిమాల్లో నాల్గోది ‘బాక్’ పేరుతో తెలుగులో విడుదలైంది. సుందర్ సి హీరోగా నటించాడు. తమన్నా భాటియా, రాశీ ఖన్నా ఇతర పాత్రల్లో నటించారు. అసలు ‘బాక్’ అంటే ఏమిటి? ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? టైటిల్ కీ సినిమాకీ ఏమైనా సంబంధముందా? ఈ ప్రశ్నలతో విషయంలోకెళ్ళి తెలుసుకుందాం.

కథ

కొన్నేళ్ళ క్రితం అస్సాంలో ఒక పూజారి కూతురితో పడవలో ప్రయాణిస్తూంటే నదిలో బాక్ అనే క్షుద్ర శక్తి ఆమెని చంపి ఆమె రూపాన్ని పొందుతుంది. పూజారి ఆ క్షుద్ర శక్తిని ఒక పాత్రలో బంధిస్తాడు. ప్రస్తుతానికొస్తే లాయర్ శివ శంకర్ అత్త (కోవై సరళ) తో నివసిస్తూ వుంటాడు. గతంలో అతడి చెల్లెలు శివానీ (తమన్నా భాటియా) ఇంట్లో వ్యతిరేకించి, ప్రేమించిన వాడ్ని (సంతోష్ ప్రతాప్) ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్న ఆమె ఆత్మహత్య చేసుకుందని, భర్త గుండె పోటుతో మరణించాడనీ కబురొస్తుంది. శివ శంకర్ వెళ్ళి చూస్తే పదేళ్ళ మేనకోడలు శక్తి (దేవ నందా) గాయపడి కోమాలో వుంటుంది. ఆమెని డాక్టర్ మాయ (రాశీ ఖన్నా) పర్యవేక్షణలో వుంచి చెల్లెలి ఆత్మహత్య వెనుక, అలాగే బావ గుండెపోటు వెనుకా కారణాల్ని తెలుసుకునేందుకు సమకడతాడు శివశంకర్. ఆ భవనంలో కొన్ని భయానక సంఘటనలు జరుగుతూంటాయి.

అసలేం జరిగింది? శివశంకర్ చెల్లెలు, బావ ప్రచారంలో వున్న కారణాలతో కాకపోతే మరెలా చనిపోయారు? ఎవరైనా చంపారా? ఎందుకు? అస్సాం క్షుద్ర శక్తి బాక్ ఈ పని చేసిందా? ఎందుకు? ఈ రహస్యాల్ని శివశంకర్ ఎలా విప్పాడు? అప్పుడు బయటపడిన నిజాలేంటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

అస్సామీ జానపద కథల్లో బాక్ అనే క్షుద్ర శక్తిని తీసుకుని ఈ కథ చేశామన్నారు. ఏమిటా బాక్ అని గూగుల్ చేస్తే, బాక్ అంటే అస్సామీలో క్షుద్ర శక్తి అని అర్ధం. ఇది అస్సామీ జానపద కథల్లో ఒక జీవి. ఇది నీటి వనరుల సమీపంలో నివసిస్తుందని నమ్ముతారు. ఇది మత్స్యకారుల్ని ఇబ్బంది పెడుతుంది . దీనికి చేపలంటే చాలా ఇష్టం. ఇది మనుషుల్ని చంపవచ్చు. చంపినప్పుడు ఆ హతుడు లేదా హతురాలి రూపం ధరిస్తుంది. తర్వాత వాళ్ళ కుటుంబంతో కలిసి జీవిస్తూ ఆ కుటుంబాన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ బాక్ ప్రా ణమంతా దాని దగ్గరుండే పర్సులో వుంటుంది. ఆ పర్సు లాగేసుకుంటే చస్తుంది.

అయితే ఈ కథని తమిళ సినిమాలోకి లాగి కంగాళీ చేశారు. 2016 లో ‘కొథా నొది’ (కథల నది) అనే అస్సామీ సినిమా భాస్కర్ హజారికా తీశాడు. ఇది యూట్యూబ్ లో వుంది. దీనికి ఉత్తమ అస్సామీ జాతీయ చలన చిత్రం అవార్డు పొందాడు. 20 వివిధ దేశాల్లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించాడు. అస్సాంలో ప్రసిద్ధి పొందిన బాలల కథా పుస్తకంలో నాలుగు కథల్ని తీసుకుని సినిమా చేశాడు. కవి, రచయిత లక్ష్మీకాంత్ బేజుబారువా 1911 లో సేకరించి రాసిన ఈ 30 అస్సామీ జానపద కథలు ఇతర భాషల్లో కూడా అనువాదమై అమ్ముడుపోతున్నాయి. ఇవి నీతి కథలు. ఆదివాసీలు మౌఖికంగా చెప్పిన ఈ కథల్ని రచయిత అక్షరీకరించాడు. ఈ కథలతో సినిమాలు, నాటకాలు, టీవీ సీరియల్స్ వచ్చాయి.

అయితే బాలల కథలతో ఇది బాలల సినిమా కాదు. కథలుగా వినడానికి బాలలకి బావుంటాయి. చూడడానికి కాదు. ఇందులో బాలల పాత్రల్లేవు. పెద్ద పాత్రలతో చూసి ఈ జానపద కథల అంతరార్ధాన్ని గ్రహించడానిది పెద్దల సినిమా. హార్రర్ -ఫాంటసీ దృశ్యాలతో యూత్ సినిమా కూడా. ఆదివాసీల దృష్టిలో హార్రర్ ఎలా వుంటుందో తెలుసుకునే ఒక అవకాశం.

ఈ సినిమా కథాకాలం కూడా 1900 ప్రారంభం నాటిదే. ఆ నేపథ్య వాతావరణంతో పాత్రలు, జీవనం కన్పిస్తాయి. ఈ కథల్లో నాయికలు, ప్రతినాయికలు స్త్రీలే. స్త్రీల పరాధీనత (మాలతి), కక్ష సాధింపు (స్నేహి), మమకారం (కేతకి), దురాశ (ధోనేశ్వరి) మొదలైన మానసిక వికార వికాసాలకి ప్రతీకలుగా వుంటారు. అంతిమంగా ఈ కథలు ఏం చెప్తాయంటే, ఆడపిల్లే అడవికి ప్రాణమని. అంటే జనారణ్యంలో జంతుసమానమని అర్ధం. ఇదే కదా ఇప్పుడు మనం చూస్తున్న నిజం. ఈ హార్రర్ కథల్లో వింత జేవులు, వికృత జీవులుంటాయి. ఈ మొత్తం చిత్రీకరణ అద్భుతంగా, కళాత్మకంగా వుంటుంది.

దర్శకుడు సుందర్ ఈ సినిమా చూశాడో లేదోగానే, చూస్తే ‘బాక్’ ని ఇంత బేకార్ గా తీసేవాడు కాదు. అసలు అస్సామీ క్షుద్ర శక్తి బాక్ కీ, సినిమాలో చూపించిన బాక్ కీ సంబంధమే లేదు. ప్రారంభంలో పూజారీ కూతుర్ని చంపి ఆమె రూపం ధరించిన బాక్ తర్వాత రూపాలు మార్చుకునే ప్రక్రియ కూడా చూపించలేదు. లాయర్ శివ శంకర్ చెల్లెల్నీ, బావనీ చంపిన బాక్ వాళ్ళ రూపాలు ధరించి వాళ్ళలాగా నటించిందీ లేదు. సర్పంచ్ కొడుకుని చంపినప్పుడు కూడా ఇంతే. అసలు పూజారీ కూతురి రూపం ధరించిన బాక్ తర్వాత ఆ రూపం లోనే కనిపించదు. మరెందుకు గొప్పగా చెప్పుకుని అస్సామీ బాక్ ని వాడుకున్నట్టు?

ఇది లేకపోగా, చచ్చిపోయిన లాయర్ చెల్లెలు శివానీ ఆత్మగా వచ్చి తన పిల్లలిద్దర్నీ కాపాడుకుంటూ వుంటుంది. ఈ ఆత్మకి బాక్ దుష్టాత్మతో పోరాటం అనుకుంటే ఇది కూడా లేదు. అసలు ఫస్టాఫ్ ముగిసిపోయినా కథేమిటో అర్ధం గాదు.

ఈ ఫస్టాఫ్ లో గానీ, సెకండాఫ్ లో గానీ కామెడీ హార్రర్ తో వుండదు. భవనంలో పనివాళ్ళ పాత్రలు వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డిలు వాళ్ళ డబ్బు గడించాలన్న వేరే పాట్లతో వేరే కామెడీ సీన్లు వచ్చి పోతూంటాయి. కథతో సంబంధముండదు. హార్రర్ కామెడీలో కామెడీ ఇలా వుండగా, ఇక హార్రర్ కథలో హార్రర్ కూడా వుండదు. అసలు బాక్ లాయర్ చెల్లెల్నీ, బావనీ ఎందుకు చంపిందనే ఫ్లాస్ బ్యాక్ లో కారణం కూడా సబబుగా వుండదు. మధ్యలో బాక్ ని అంతమొందించేందుకు ఒక సాధువు పాత్ర, తిరునాళ్ళు, తిరునాళ్ళలో ‘కాంతారా’ టైపు పాట, దుష్టాత్మ ఖతం! ఈ ‘కాంతారా’ కాపీ పేస్టు వ్యవహారం ఇప్పట్లో సినిమాల్లో వదిలేలా లేదు.

బాక్ తో సరైన కథ లేదు, శివానీ ఆత్మతో సరైన కథ లేదు, హీరోతో సరైన కథ లేదు. వీటిని డామినేట్ చేస్తూ వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళల కామెడీ ట్రాకు సీన్లు మాత్రం నిండి పోయాయి. దీన్ని హార్రర్ కామెడీగా చెప్పుకుని రిలీజ్ చేశారు.

నటనలు- సాంకేతికాలు

హీరోగా సుందర్ సి ఎప్పుడు కనపడతాడో- కనపడ్డప్పుడు ఓహో ఈయన కూడా వున్నాడా అని గుర్తొస్తాడు. బహుశా దర్శకుడుగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ పాత్ర నటిస్తున్న విషయం మర్చిపోయాడేమో. ఆత్మగా తమన్నా ఎందుకుందో అర్ధం గాదు. డాక్టర్ గా రాశీ ఖన్నా కోమా పేషంట్ ని చూసుకుంటూ వుంటుంది. ఈ పనికి నర్సుంటే సరిపోదా అనిపిస్తూ. చివర్లో తిరునాళ్ళ పాటలో సినిమా విజయం కోసం కృషి చేస్తూ అలనాటి హీరోయిన్లు ఖుష్బూ, సిమ్రాన్ వచ్చేసి నృత్యాలు చేస్తారు.

ఇక ఈ సినిమా ఎవరిదంటే సపరేట్ కామెడీలు చేసుకున్న వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, కోవై సరళలది. వీళ్ళ కామెడీల్ని పూర్తిగా తీసేయలేం. చాలా సీన్లలో మేస్త్రీగా వెన్నెల కిషోర్, వడ్రంగిగా శ్రీనివాస రెడ్డి వాళ్ళ స్కిల్స్ తో నవ్వించకుండా వదలరు.

ఇంత కంగాళీగా వున్న ఈ సినిమాకి టెక్నికల్ వేల్యూస్ అద్భుతంగా వున్నాయి. దర్శకుడు సుందర్ సి సినిమాని టెక్నీషియన్లకి ఔట్ సోర్సింగ్ ఇచ్చేసి తను విశ్రాంతి తీసుకున్నట్టుంది.



First Published:  4 May 2024 2:04 PM GMT
Next Story