Telugu Global
MOVIE REVIEWS

Baby movie review: బేబీ- మూవీ రివ్యూ! {2.25/5}

Baby movie review: ఆనంద్ దేవరకొండ నటించిన నాల్గు సినిమాల్లో ఒకటే హిట్ (మిడిల్ క్లాస్ మెలోడీస్) అయిన నేపథ్యంలో ‘బేబీ’ అనే ప్రేమ కథలో నటించాడు.

Baby movie review: బేబీ- మూవీ రివ్యూ! {2.25/5}
X

Baby movie review: బేబీ- మూవీ రివ్యూ! {2.25/5}

చిత్రం: బేబీ

రచన -దర్శకత్వం: సాయి రాజేష్

తారాగణం : ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం : బాల రెడ్డి

నిర్మాత: ఎస్కే ఎన్

విడుదల: జులై 14, 2013

రేటింగ్: 2.25/5

ఆనంద్ దేవరకొండ నటించిన నాల్గు సినిమాల్లో ఒకటే హిట్ (మిడిల్ క్లాస్ మెలోడీస్) అయిన నేపథ్యంలో ‘బేబీ’ అనే ప్రేమ కథలో నటించాడు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ కామెడీలు తీసిన సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. సాయి రాజేష్ ‘కలర్ ఫోటో’ సినిమా రచయిత కూడా. కాబట్టి ప్రేక్షకుల్లో కొన్ని ఆసక్తులు క్రియేట్ చేసిన ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా తోడయ్యాయి. సినిమా తీయడమే కల్ట్ సినిమా తీశామని ప్రచారం చేసుకున్నారు. కల్ట్ సినిమా ముందే తీస్తారా? ఈ సినిమా ఎలా తీశారు? యూత్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రేమ కథతో ఏం చెప్పారు? ఇవి తెలుసుకుందాం..

కథ

ఒకే బస్తీలో నివసించే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవీ చైతన్య) ఒకే స్కూల్లో చదివి ప్రేమలో పడతారు. ఆనంద్ టెన్త్ ఫెయిలై ఆటో డ్రైవర్ గా మారతాడు. వైష్ణవి ఇంటర్ కి సిటీ కెళ్ళిపోయి అక్కడే ఇంజనీరింగ్ చేస్తూంటుంది. సీత అనే తోటి క్లాస్ మేట్ తో తిరిగి తాగుడు, సిగరెట్లు మరుగుతుంది. పబ్బులకి తిరుగుతుంది. అదే కాలేజీలో చదువుతున్న డబ్బున్న విరాజ్ (విరాజ్ అశ్విన్) ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఆమె మనసులో ఆనందే వుంటాడు. అయినా విరాజ్ తో తిరుగుతుంది. ఇది ఆనంద్, వైష్ణవీల మధ్య విభేదాల్ని సృష్టిస్తుంది. వీళ్ళిద్దర్నీ వైష్ణవి ఎలా డీల్ చేసింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

రెగ్యులర్ ముక్కోణ ప్రేమ కథని బోల్డ్ గా చూపించి యూత్ ని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ కథ. దీంతో ఇది కల్ట్ సినిమా అని ప్రచారం చేశారు. కానీ కామెడీ సినిమా తీశామనో, సస్పెన్స్ సినిమా తీశామనో జానర్స్ గురించి చెప్పుకున్నట్టు కల్ట్ సినిమా అని ప్రచారం చేసుకోలేరు. కల్ట్ క్లాసిక్ అనేది జానర్ కాదు. ఒక సినిమా విడుదలైనప్పుడు అంతగా ఆడకపోయినా, తర్వాత్తర్వాత దానికి ప్రత్యేక వర్గం ప్రేక్షకులు ఏర్పడుతూ విలువని సంతరించుకుంటుంది. అప్పుడది పాతబడినా, కాలక్రమంలో ప్రత్యేక వర్గం ప్రేక్షకుల్ని ఆకర్షించే కల్ట్ క్లాసిక్ అవుతుంది. ఇవి ప్రధాన స్రవంతి సినిమాలుగా కాకుండా, సమాంతర సినిమాలుగా వుంటాయి. హిందీలో ‘జానేభీ దో యారో’ (1983), ‘కభీ హా కభీ నా’ (1994) ఈ విధంగా కల్ట్ స్టేటస్ ని సాధించాయి. కాబట్టి ఓ పదేళ్ళ తర్వాత కూడా ఓ ప్రత్యేక వర్గం ప్రేక్షకులు మోసే సినిమాగా ‘బేబీ’ నిలబడితే, అప్పుడది కల్ట్ క్లాసిక్ అవుతుంది. ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయనవసరం లేదు.

ప్రేమలో ఇద్దరబ్బాయిలతో ఒకమ్మాయి ప్రవర్తన ఈ కథ. అమ్మాయిలకి మెసేజ్. దురలవాట్లకి లోనై జీవితం పాడు చేసుకోకూడదని. ఈ కథ రియలిస్టిక్ పాత్రలతో చెప్పడంతో పరిధులు దాటి బోల్డ్ గా చూపించేందుకు అవకాశం తీసుకున్నారు. ఇది అశ్లీల ప్రవర్తనల, పచ్చిబూతు డైలాగులు పలికే బోల్డ్ నెస్. ఈ పచ్చి డైరెక్టు బూతు డైలాగులు మ్యూట్ అయ్యాయి. కానీ అమెరికాలో సెన్సార్ కాకపోవడంతో అక్కడి తెలుగు ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ కథ ప్రేమ కథ కాదు. అవి ప్రేమలు కావు, మోహం మాత్రమే. దర్శకుడు ఉపరితలంలో దురలవాట్లు వద్దని చెప్పి వదిలేశాడేగానీ, అవి ప్రేమలు కావనీ, మోహం అనీ స్పష్టత నివ్వలేకపోయాడు. ఈ విషయంలో అతడికే అవగాహన లేనట్టు పాత్ర చిత్రణలు, కథాకథనాలూ వుంటాయి. పాత్ర చిత్రణలకి అర్ధం కూడా కనిపించదు. వూళ్ళో మామూలుగా వుండే వైష్ణవి సిటీకెళ్ళగానే బరితెగించిన అమ్మాయిగా మారిపోవడం కన్విన్సింగ్ గా వుండదు.

ఇది టీనేజర్స్ గురించిన కథయినప్పుడు దీన్ని కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కిందికి తీసుకొచ్చి- గోథే రాసిన ‘విల్హమ్ మిస్టర్స్ అప్రెంటీస్ షిప్’ క్లాసిక్ నవల లాగానో లేదా, త్వరలో విడుదల కానున్న హాలీవుడ్ ‘బార్బీ’ దర్శకురాలు తీసిన ‘లేడీ బర్డ్’ అనే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీలాగానో తీసి వుంటే ‘బేబీ’ సార్ధక మయ్యేది.

సార్ధకత లేకుండా యూత్ ని మరింత పరిపక్వతలేని వర్గంగా తయారు చేసేందుకు అన్నట్టుగా రాంగ్ రూట్లో, పూర్తిగా చీప్ టేస్టుతో, చివరికి షాకింగ్ కాని షాకింగ్ జడ్జిమెంటుతో సరిపుచ్చిన కథ ఇది. ప్రేమల గురించి ఆలోచనలు పెట్టుకోకుండా, బోల్డ్ నెస్ ని, రెచ్చగొట్టే హీరోయిన్నీ చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది ఈ సినిమా.

నటనటు- సాంకేతికాలు

ఈసారి ఆనంద్ దేవరకొండ నటనలో ఇంప్రూవ్ అయ్యాడు. పాత్ర చిత్రణకి అర్ధం లేకపోయినా, రియలిస్టిక్ పేరుతో ఎంత పాత మూసగా వున్నా, దాంట్లో ప్రాణం పోశాడు. ఈ పాత్రతో యూత్ కి ఎంత కనెక్ట్ అయ్యాడనేది అనవసరం. విఫల ప్రేమికుడుగా మందుబాబు పాత్రలో ఈత కొట్టాడు.

హీరోయిన్ వైష్ణవీ చైతన్య యాంటీ హీరోయిన్ పాత్రలో కుర్రకారుకొక ఎట్రాక్షన్. ఈమె కోసం ఎన్నిసార్లయినా చూస్తారు సినిమా. అయితే అమ్మాయిలకి సందేశాన్నిచ్చే ఈ బోల్డ్ సినిమాని ఎందరు అమ్మాయిలు వచ్చి చూస్తారనేది ఒక ప్రశ్న.

మూడో పాత్ర విరాజ్ గా విరాజ్ అశ్విన్ కూడా యూత్ ని ఆకర్షిస్తాడు. ఇతను వైష్ణవిని ప్రేమిస్తున్నాడా లేదా, అసలు తనకేం కావాలో తెలుసా స్పష్టత లేని పాత్ర తనది. ఈ సినిమాకి సంగీతం బాగా కలిసి వచ్చింది. విజయ్ బల్గామీ కూర్చిన పాటలు సినిమాకి బలం. సీనియర్ కెమెరామాన్ బాలరెడ్డి ఛాయాగ్రహణం, నిర్మాత ఎస్కే ఎన్ సమకూర్చిన ప్రొడక్షన్ విలువలు ఉత్తమంగా వున్నాయి.

అయితే దర్శకుడు సాయి విజయ్ ఈ సినిమాని సుమారు మూడు గంటలు సాగదీయడంతో ప్రేక్షకులు హాహాకారాలు చేశారు. ఫస్టాఫ్ హీరోహీరోయిన్ల ప్రేమలు, తర్వాత సిటీలో హీరోయిన్ హల్చల్, సెకెండ్ హీరోతో ఎఫైర్ ఇవన్నీ ఇబ్బంది లేకుండా సాగిపోయి నా, సెకండాఫ్ షరా మామూలుగా ప్రతీ తెలుగు సినిమాల్లో లాగే కథని మెలిదిప్పి, కలియదిప్పి, అక్కడక్కడే ముగ్గురి మధ్య సమస్యని మునకలేయించి- ముగిపుకి తీసుకురావడానికి సాగదీసి, సాగదీసి- ప్రేక్షకులు అలసిపోయేలా చేశాడు. అయినా బోల్డ్ నెస్ తో యూత్ కిది ఓకేనే! ‘ప్రేమిస్తే’, ‘7జి/బృందావన్ కాలనీ’ తమిళ సినిమాల సరసన చేరేందుకు చేసిన ఒక ప్రయత్నమిది.



First Published:  14 July 2023 4:53 PM IST
Next Story