Telugu Global
MOVIE REVIEWS

Aa Okkati Adakku Review: ఆ ఒక్కటీ అడక్కు రివ్యూ! {1.75/5}

Aa Okkati Adakku Movie Review: కామెడీ హీరోగా జోరు తగ్గాక సీరియస్ సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ తిరిగి కామెడీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. మ్యాట్రిమోనీ సైట్స్ చేసే మోసాల మీద ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేసేందుకు కొత్త దర్శకుడు అంకం మల్లికి అవకాశమిచ్చాడు.

Aa Okkati Adakku Review: ఆ ఒక్కటీ అడక్కు రివ్యూ! {1.75/5}
X

చిత్రం: ఆ ఒక్కటీ అడక్కు

రచన -దర్శకత్వం : మల్లి అంకం

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు

సంగీతం : గోపి సుందర్, ఛాయాగ్రహణం : సూర్య

బ్యానర్ : చిలక ప్రొడక్షన్స్, నిర్మాత : రాజీవ్ చిలక

విడుదల : మే 3, 2024

రేటింగ్: 1.75/5

కామెడీ హీరోగా జోరు తగ్గాక సీరియస్ సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ తిరిగి కామెడీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. మ్యాట్రిమోనీ సైట్స్ చేసే మోసాల మీద ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేసేందుకు కొత్త దర్శకుడు అంకం మల్లికి అవకాశమిచ్చాడు. 1992 లో అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్ తో ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే హిట్ కామెడీ తీశారు. ఈ టైటిల్ ని వాడుకుని ఇప్పుడు నరేష్ ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చాడు. ఈ కామెడీ ఎలా వుంది? కామెడీలా వుందా? కామెడీనే కామెడీ చేసేలా వుందా? దీన్ని సినిమాగా తీయకపోతే నష్టం ఎవరికి? అల్లరి నరేష్ కా, దర్శకుడికా? ఇవి తెలుసుకుందాం...

కథ

గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగి. అతడి తమ్ముడు (రవికృష్ణ) కి పెళ్ళయి పదేళ్ళ కూతురుంటుంది. గణ వయసు ఎక్కువ కావడంతో బాటు తమ్ముడి పెళ్ళయి పోవడంతో సంబంధాలు రావు. అలా పెళ్ళి కోసం చాలా ప్రయత్నాలు చేసి ఓ మ్యాట్రిమోనీ సైట్ ని ఆశ్రయిస్తాడు. ఈ సైట్ ద్వారా సిద్ధ (ఫరియా అబ్దుల్లా) పరిచయమవుతుంది. ఆమె అతడి ప్రేమని తిరస్కరించి ఫ్రెండ్స్ గా వుందామంటుంది. తర్వాత అనుమానాస్పదంగా కన్పిస్తుంది. అసలు ఈ సిద్ధ ఎవరు? మ్యాట్రిమోనీ మోసాలతో ఈమెకేం సంబంధం? ఇవి తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

పూర్వం మ్యారేజి బ్యూరోలు వుండేవి. తర్వాత మ్యాట్రిమోనీ సైట్స్ వచ్చాక మోసాలు మొదలయ్యాయి. ఈ మోసాలు మానసిక క్షోభ, ఆర్థిక నష్టం, గుర్తింపు తస్కరణ, బ్లాక్‌మెయిల్... ఇలా చేసే నేరాల లిస్టు పెద్దదే. ఈ నేరగాళ్ళు ఆకర్షణీ వర్ణనలతో నకిలీ ప్రొఫైల్స్ ని సృష్టించి, వితంతువుల్ని, విడాకులు తీసుకున్న వ్యక్తుల్ని, ఆర్థికంగా ఉన్నతంగా వున్న వారినీ మోసాలు చేస్తూంటారు. ఈ కథలో యువకుల్ని టార్గెట్ చేసి చూపించారు. అయితే దీన్ని ప్రేక్షకులు ఆశించే కామెడీ కథగా చేయలేక మెసేజిలిచ్చే సీరియస్ కథ చేశారు. ఈ సీరియస్ కథ కూడా కథలా లేకపోవడంతో మొత్తంగా కుప్పకూలింది సినిమా. అల్లరి నరేష్ కి నష్టమేం లేదుగానీ, కొత్త దర్శకుడికే నష్టం.

ముందుగా పెళ్ళి కాని హీరో పాత్రే పాతది. దీన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేయలేదు. దీంతో పెళ్ళి సంబంధాల సీన్లు కూడా పాతవే, వీటినీ నేటి జీవన విధానంతో కొత్తగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ చాలా నీరసంగా సాగుతూ, అక్కడక్కడా ఒక జోకు పేల్చడమే కామెడీ. ఫస్టాఫ్ లో హీరోయిన్ పెద్దగా కనిపించదు. ఇంటర్వెల్లో ఆమెతో కథకిచ్చిన మలుపు కూడా మెప్పించదు.

సెకండాఫ్ నకిలీ పెళ్ళి కూతురు పాయింటు తో రన్ చేయాలని చూశారు గానీ, దీంతో ఏదో కామెడీ చేయబోతే అదీ బెడిసి కొట్టింది. తమ్ముడికి ముందు పెళ్ళి చేసి తాను ఎందుకు చేసుకోలేదనే దానికి చూపించిన ఫ్లాష్ బ్యాక్కూడా మెప్పించే పరిస్థితి లేదు. చివర్లో మాత్రం ఒక మెసేజితో ముగిస్తే అదే గ్రేట్ అనుకుని సినిమాని ముగించారు. చాలా నాసి రకం ప్రమాణాలతో కూడుకున్న ఇందులో నరేష్ భాగం కావడం శోచనీయం.

నటనలు- సాంకేతికాలు

పెళ్ళి కాని హీరో పాత్రలో అల్లరి నరేష్ డల్ గా వుంటాడు. తన బ్రాండ్ కామెడీ పంచ్ లేదు, టైమింగ్ లేదు. ఎందుకో గౌరవం గా కనపడాలని ప్రయత్నిస్తాడు. సీరియస్ సినిమాలు నటిస్తున్నాక కామెడీ టచ్ కోల్పోయినట్టున్నాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి ‘జాతిరత్నాలు’ తప్ప ఇంకో హిట్ అందకూడదని ఈ సినిమా కూడా అడ్డుపడింది. సినిమాలు ఫ్లాప్, నటిస్తున్న పాత్రలూ ఫ్లాప్. పృథ్వీ, గోపరాజు రమణ, ప్రవీణ్, గౌతమి వంటి ఆర్టిస్టు లెందరో వున్నారు నామ మాత్రపు పాత్రలతో. హీరో మరదలి పాత్రలో జెమీ లివర్ కామిక్ సెన్స్ బావుంది. పైకొచ్చే టాలెంట్ వుంది కామెడీ పాత్రలతో. అల్లరి నరేష్ సంగతలా వుంచి నవ్వించే ఆర్టిస్టులు ఇంకెవరున్నారాని చూస్తే, ఇద్దరు కరుడుగట్టిన కమెడియన్లు వెన్నెల కిశోర్, వైవా హర్ష కన్పిస్తారు.

చాలా కాలం తర్వాత గోపీసుందర్ నుంచి 'రాజాధి రాజా’ అనే ఫర్వాలేదన్పించే పాట వచ్చింది. మిగిలిన పాటలు మామూలే. సూర్య కెమెరా వర్క్, ప్రొడక్షన్ విలువలూ అల్లరి నరేష్ గౌరవానికి తగ్గట్టున్నాయి. కొత్త దర్శకుడు అంకం మల్లి మాత్రం మళ్ళీ ఇలా భయపెట్టేలా రెండో సినిమాతో రాకూడదని కోరుకోవడం తప్ప చేసేదేమీ లేదు.



First Published:  3 May 2024 5:51 PM IST
Next Story