Telugu Global
MOVIE REVIEWS

Alipiriki Allantha Dooramlo Movie Review: 'అలిపిరికి అల్లంత దూరంలో' రివ్యూ {2/5}

Alipiriki Allantha Dooramlo Movie Review: బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, స్వామి రారా మొదలైన రాబరీ సినిమాల శ్రేణిలో ‘అలిపిరికి అల్లంత దూరంలో’ కొత్త చేరిక. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త నేపథ్యం.

Alipiriki Allantha Dooramlo Movie Review: ‘అలిపిరికి అల్లంత దూరంలో’ రివ్యూ
X

Alipiriki Allantha Dooramlo Movie Review: ‘అలిపిరికి అల్లంత దూరంలో’ రివ్యూ

చిత్రం: అలిపిరికి అల్లంత దూరంలో

రచన -దర్శకత్వం : ఆనంద్ జె

తారాగణం: రావణ్ రెడ్డి, శ్రీ నిఖిత, లహరీ గుడివాడ, రవీంద్ర బొమ్మకంటి, అమృత వర్షిణి తదితతరులు

సంగీతం: ఫణి కళ్యాణ్, ఛాయాగ్రహణం :

బ్యానర్ : కాస్కేడ్ పిక్చర్స్,

నిర్మాతలు: డి. రమేష్ , రెడ్డి రాజేంద్ర

విడుదల : నవంబర్ 18, 2022

రేటింగ్ : 2/5

బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, స్వామి రారా మొదలైన రాబరీ సినిమాల శ్రేణిలో 'అలిపిరికి అల్లంత దూరంలో' కొత్త చేరిక. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త నేపథ్యం. ఇన్ని కొత్తలున్నాక చూడ్డానికి కొత్త ఉత్సాహమే వస్తుంది. ఈ ఉత్సాహం సినిమా చూస్తూంటే వుంటుందా లేదా అన్నది సందేహం. ఈ సందేహం తీర్చుకోవడానికి విషయమెలా వుందో చూద్దాం...

కథ

తిరుపతిలో వారధి (రావణ్ రెడ్డి) దేవుడి పటాలు అమ్మే షాపు నడుపుకుంటూ వుంటాడు. తల్లి (లహరీ గుడివాడ) నర్సుగా పనిచేస్తూ వుంటుంది. తండ్రి పక్షవాత రోగి. బోలెడు అప్పులుంటాయి. అవితీర్చే భారం వారధి మీద వుంటుంది. అలాంటిది అతను కీర్తి (శ్రీ నిఖిత) ని చూసి ప్రేమిస్తాడు. డబ్బున్న కుటుంబానికి చెందిన కీర్తి గోశాలలో వాలంటీరుగా పని చేస్తూంటుంది. కూతురు వారధి ప్రేమలో పడిందని తెలుసుకున్న కీర్తి తండ్రి, డబ్బు లేని వారధిని కూతురి జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. దీంతో వాళ్ళిద్దరి ప్రేమకి బ్రేకుపడుతుంది. ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి కీర్తిని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు వారధి.

హైదరాబాదుకి చెందిన గౌతమ్ రెడ్డి (రవీంద్ర బొమ్మకంటి) తిరుపతిలో టూ స్టార్ హోటల్ యజమాని. అతను భార్యతో కూతురితో తిరుపతి వస్తాడు. భార్య (అమృతవర్షిణి) మొక్కు తీర్చుకోవాల్సి వుంది. వారధి కారు డ్రైవర్ కమ్ గైడ్ గా కూడా పని చేస్తూంటాడు. గౌతమ్ రెడ్డి కారుకి డ్రైవరుగా వచ్చిన అతను, గౌతమ్ రెడ్డి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి తెచ్చుకున్న బ్లాక్ మనీ రెండు కోట్ల రూపాయలున్నాయని తెలుసుకుని ఆ డబ్బు కొట్టేస్తాడు.

దీంతో గౌతమ్ రెడ్డి భార్య గోలగోల చేస్తుంది. అది ముడుపు కట్టిన డబ్బు అనీ, ఆ డబ్బు తప్ప వేరే డబ్బు ముట్టుకోననీ, అదీ రేపు వైకుంఠ ఏకాదశికి పొద్దున్న బ్రహ్మ ముహూర్తం లోపు హుండీ లో వేయాలనీ పట్టు బడుతుంది.

దీంతో ఆ డబ్బుకోసం వేట మొదలవుతుంది. ఇప్పుడేం చేశాడు వారధి? ఆ డబ్బుతో దొరక్కుండా ఏ ప్రయత్నాలు చేశాడు? ఈ మొత్తం వ్యవహారంలో ఏడు కొండలవాడు చూపిన లీలలు ఏమిటి? చివరికి ఈ డబ్బు దోపిడీ కథ ఎలా ముగిసింది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

కర్మ సిద్ధాంతం గురించి చెప్పే కథ. పూర్వం వారధి తండ్రి ఒక దొంగతనం చేసి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ఇప్పుడు వారధి గౌతమ్ రెడ్డి డబ్బు కొట్టేస్తే అది వెళ్ళి ఆనాడు తండ్రి వల్ల దోపిడీకి గురైన వ్యక్తికే చేరుతుంది. ఇది బాగానే వుంది. మరి డబ్బు పోగొట్టుకున్న గౌతమ్ రెడ్డికి డబ్బెలా దొరికింది? వారధి ప్రేమిస్తున్న కీర్తి తండ్రి పోలీసుల భయంతో దాచుకున్న బ్లాక్ మనీ పారేస్తే ఆ డబ్బే దొరికింది. ఐతే బ్లాక్ మనీ పోగొట్టుకున్న గౌతమ్ రెడ్డికి బ్లాక్ మనీయే వచ్చేలా చేసి, తన హుండీలో బ్లాక్ మనీయే ఎలా వేయించుకుంటాడు ఏడుకొండల వాడనేది ప్రశ్న. బ్లాక్ మనీ ఆయనకి అలవాటై పోయిందా?

శ్రీ విష్ణు నటించిన 'రాజరాజ చోర' లో లాగా ఒక ఆలయంలో పూజారి ప్రవచనం చెబుతూ ఈ కథ మొదలెట్టి-కర్మ సిద్ధాంతం, ఏడుకొండలవాడి లీలలు వగైరా ఉద్బోధిస్తాడు. కానీ దర్శకుడి రచన, దర్శకత్వం మొదలైన వాటికి ఏడుకొండల వాడి అండ లభించలేదు. దీంతో సినిమా గుది బండలా తయారైంది. ప్రారంభం నుంచీ ముగింపు వరకూ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, చిత్రీకరణ అనేవి సహన పరీక్ష పెడతాయి. అంత పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది.

రెండు గంటల పది నిమిషాల సినిమాలో తొలి గంటా పది నిమిషాలు హీరో కష్టాలు, హీరోయిన్ తో ప్రేమ, ఈ ప్రేమకి ఒక ఫ్లాష్ బ్యాకు, ఇంట్లో తల్లి దండ్రులతో తగాదాలు, హీరోయిన్ తండ్రితో సమస్య -ఇవే సాగుతూ కథే ప్రారంభం కాదు. ఆఖరికి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు దోపిడీ ఇంటర్వెల్లో జరిగి కథ ప్రారంభమవుతుంది.

ఇక సెకండాఫ్ కథ దోపిడీ జరిగిన రాత్రి తెల్లార్లూ జరుగుతుంది. ఇది కూడా నీరసంగా సాగుతుంది. గౌతమ్ రెడ్డి మనుషులు వెంటాడ్డం, వారధి తప్పించుకోవడం - అనే ట్రాకుతో భావోద్వేగ రహితంగా ఫ్లాట్ గా సాగుతుంది. సెకండాఫ్ లో హీరోయిన్ కనిపించదు. ఇదొక లోపం. కనీసం కథ కోసం, నేను డబ్బుతో వస్తాను- నువ్వు కొండ పైన వెయిట్ చెయ్, అక్కడే పెళ్ళి చేసుకుందాం కొండపైనే – అని చెప్పివుంటే- ప్రేమికుల కథగా యూత్ అప్పీల్ తో, కథకి బలం వచ్చి భావోద్వేగాలుండేవి. ఒక థ్రిల్, సస్పెన్స్ అనేవి వుండేవి. తమిళంలో 2019 లో వెట్రి నటించిన 'జీవి' ఇలాటిదే కథ చాలా అర్ధవంతంగా, థ్రిల్లింగ్ గా తీశాడు కొత్త దర్శకుడు విజే గోపీనాథ్. ఇందులో ఒక ఇంటి యజమానురాలితో బాటు, ఆమె తమ్ముడి జీవితంలో సంఘటనల్లాంటివి హీరో వెట్రి జీవితంలోనూ ప్రారంభమవుతాయి. ఆ యజమానురాలి ఇంట్లో ఇప్పుడు తను చేసిన దొంగతనం లాగే, గతంలో ఇంకొకడు చేసిన దొంగతనం వుంటుంది. ఆ గతమేంటో పూర్తిగా తెలుసుకుంటే తప్ప పరిష్కార మార్గం వుండదు. ఇంకోటేమిటంటే, గతంలో ఆ యజమానురాలి జీవితంలో జరిగిన విషాద సంఘటలే, ఇప్పుడు వెట్రీ చెల్లెలికీ జరుగుతూండడంతో- దీన్నాపడానికి- ఈ చట్రాన్ని త్రుంచెయ్యడానికి - చేసే ప్రయత్నమే విధితో సాగే ఈ పోరాట కథ.

ప్రస్తుత కొత్త దర్శకుడు తను చేపట్టిన కాన్సెప్ట్ కి సంబంధించిన రీసెర్చ్ చేసుకోకుండా, ఈ జానర్ లో వచ్చిన ఇతర సినిమాలు పరిశీలించకుండా- తోచిన విధంగా ఈ సినిమా తీసేసినట్టుంది. పైన చెప్పుకున్నట్టు రెండు గంటలే అయినా భరించడం కష్టం.

నటనలు- సాంకేతికాలు

కొత్త దర్శకుడు తన ప్రయత్నంలో విఫలమైనా, కొత్త హీరో రావణ్ రెడ్డిలో విషయముంది. అతడికి సహజంగా నటించడం వచ్చు. హావభావ ప్రకటనలు తెలుసు, దుఖం అభినయించడం తెలుసు. అయితే కథా కథనాలే అతడికి సహకరించలేదు. కథా కథనాలని పక్కన పెట్టి కేవలం అతడి నటన కోసం చూడాలనుకుంటే చూడొచ్చు.

హీరోయిన్ నిఖిత కూడా ఇంట్రెస్టింగ్ నటి. కానీ ఎక్కువ సన్నివేశాలు లేవు, సెకండాఫ్ లో ఒక సీనులో తప్ప కంపించదు. ఇంకో చెప్పుకోదగ్గ పాత్ర, నటి హీరో తల్లిగా నటించిన లహరీ గుడివాడ. ఇక హైదరాబాద్ క్యారక్టర్స్ రవీంద్ర బొమ్మకంటి, అమృత వర్షిణి ఫర్వాలేదు. హీరో ఫ్రెండ్ గా నటించిన ఆర్టిస్టు కూడా ఫర్వాలేదు.

సాంకేతికాల విషయానికొస్తే చెప్పుకోవడానికేమీ లేదు. కెమెరా, సంగీతం, కూర్పు క్వాలీటీతో లేవు. తిరుపతి లొకేషన్స్ మాత్రం విస్తృతంగా చూపించారు. బడ్జెట్ ని బాగా కుదించి ఈ సినిమా తీసినట్టుంది. ఈ బాపతు కథా కథనాలకి ఇంత కంటే బడ్జెట్ కూడా అవసరం లేదు.

First Published:  20 Nov 2022 3:44 PM IST
Next Story