Telugu Global
MOVIE REVIEWS

HIT 2 Review: 'హిట్ 2' - మూవీ రివ్యూ {2.5/5}

Adivi Sesh's HIT 2 Movie Review: 2020 లో శైలేష్ కొలను విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ కి సీక్వెల్ గా విడుదలైన ‘హిట్ 2’ లో హీరో మారి అడివి శేష్ నటించాడు.

HIT 2 Movie Review and Rating in Telugu
X

HIT 2 Review: ‘హిట్ 2’ - మూవీ రివ్యూ

చిత్రం: హిట్ 2

రచన- దర్శకత్వం : శైలేష్ కొలను

తారాగణం : అడివి శేష్, మీనాక్షీ చౌదరి, కోమలీ ప్రసాద్, రావు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, మాగంటి శ్రీనాథ్ తదితరులు

సంగీతం ; ఎంఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి, జాన్ స్టీవార్ట్ ఏడూరి: ఛాయాగ్రహణం : ఎస్ మణికందన్

బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా

నిర్మాతలు : తిపిరినేని ప్రశాంతి, నాని

విడుదల : డిసెంబర్ 2,2022

రేటింగ్ : 2.5/5


2020 లో శైలేష్ కొలను విశ్వక్ సేన్ నటించిన 'హిట్' కి సీక్వెల్ గా విడుదలైన 'హిట్ 2' లో హీరో మారి అడివి శేష్ నటించాడు. 'హిట్' సిరీస్ లో మొత్తం ఆరుగురు హీరోలతో ఆరు సినిమాలు తీయాలని ప్రణాళికట. ఈ రెండో ఇన్ స్టాల్ మెంట్ కి కూడా నిర్మాతలు తిపిరినేని ప్రశాంతి, నాని నిర్మాతలు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ గా తీయాలని సమకట్టిన ఈ సిరీస్ లో 'హిట్' కి హిందీ రీమేకుగా రాజ్ కుమార్ రావ్ తో తీసిన 'హిట్-ది ఫస్ట్ కేస్' ఫ్లాపయ్యాక, దర్శకుడు 'హిట్ 2' తెలుగు సీక్వెల్ తీశాడు. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్) చేపట్టే నేర దర్యాప్తు కథ ఈసారి ఎలా వుందో చూద్దాం...

కథ

కృష్ణ దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్) వైజాగ్ హిట్ టీంలో ఎస్పీగా వుంటాడు. దీనికి బాస్ గా డిజిపి నాగేశ్వర రావు (రావు రమేష్), మెంబర్లుగా హర్ష (కోమలీ ప్రసాద్), అభిలాష్ (మాగంటి శ్రీనాథ్) వుంటారు. ఆర్య( మీనాక్షీ చౌదరి) అనే అమ్మాయితో కేడీ సహజీవన సంబంధంలో వుంటాడు. ఆర్య ఏమీ చేయకుండా ఇంటి పట్టున వుంటుంది. ఒక రోజు ఒక హత్య కేసు రిపోర్టవుతుంది, కేడీ వెళ్ళిచూస్తే కాళ్ళు, చేతులు, మొండెం, తల వేరు చేసిన అమ్మాయి శవం పడుంటుంది. తల ఆధారంగా హతురాలెవరని దర్యాప్తు చేస్తూంటే, తల ఒక్కటే ఆమెదనీ, మిగిలిన శరీర భాగాలు వేరే ముగ్గురమ్మాయిలవనీ బయట పడుతుంది. దీంతో సీరియల్ కిల్లింగ్స్ కోణంలో దర్యాప్తు మొదలెడతాడు. ఇప్పుడు ఎవరీ సీరియల్ కిల్లర్- నల్గురమ్మాయిల్ని ఎందుకు చంపాడు - ఈ అమ్మాయిలెవరు- కేడీ ఈ కేసుని ఎలా ఛేదించి సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నాడూ అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ

రొటీన్ కథే. రొటీన్ ప్రేమ సినిమాలెలా వస్తున్నాయో, అలా రొటీన్ గా టెంప్లెట్ లో వస్తున్న క్రైమ్ సినిమాల్లో ఇదొకటి. రొటీన్ గా అదే ఎండ్ సస్పెన్స్ కథ. ఎండ్ సస్పెన్స్ సినిమా కథ అంటేనే కత్తి మీద సాములాంటిది. చివరి వరకూ హంతకుడ్ని చూపించకుండా, ఎంత సేపూ వాడి కోసం హీరో చేసే దర్యాప్తుతో వన్ వే గా సాగే కథని రక్తి కట్టించడం చాలా కష్టం. అంటే హీరోకీ, హంతకుడికీ మధ్య ఎలుకా పిల్లీ చెలగాటంగా, ఒక గేమ్ గా ఇలాటి కథలు వుండవు. అంటే, వెండి తెర కోరుకునే సీన్ టు సీన్ సస్పెన్సు తో ఇవి వుండవు. పైగా చిట్ట చివర్లో హంతకుడ్ని రివీల్ చేసినప్పుడు, వాడు చెప్పే ఏ కారణమూ కథని ఇంకో లెవల్ కి తీసికెళ్ళక తేలిపోవడమే జరుగుతోందింత కాలమూ ఇలాటి సినిమాలతో. ఇందులో 'హిట్ 2' కూడా ఒకటి.

కథ ఎంత రొటీనో కథనమూ అంత సాధారణంగా వుంది- సస్పెన్సు, ఎత్తు పల్లాలు, స్ట్రగుల్, థ్రిల్, టెన్షన్ వంటి ఎలిమెంట్స్ లేకుండా. చివర్లో హంతకుడెవరనే దానికి దగ్గరయ్యే కొద్దీ పది నిమిషాలు సస్పెన్సు కన్పిస్తుంది. తీరా హంతకుడ్ని పట్టుకుంటే –అతను రాంగ్ ఛాయిస్. పర్సనాలిటీ లేని, హైటూ లేని ఆర్టిస్టుని రివీల్ చేసి ఇంకో తప్పిదం చేశారు. పైగా అతను చిన్నప్పుడు కుటుంబంలో జరిగిన సంఘటనలు తను సైకోగా మారడానికి కారణమని రొటీన్ విషయమే వెల్లడించేసరికి, ముగింపు వీగిపోయింది. ఈ ఘట్టాన్ని దర్శకుడు తురుపు ముక్కగా ప్లాన్ చేసుకుని, షాకింగ్ గా వుండేట్టు వాడుకుని వుండాలి, అది జరగలేదు.

ఇక ముందు ఒకే అమ్మాయి శరీర భాగాలని చెప్పి, తర్వాత కాదు నల్గురమ్మాయిల శరీర భాగాలనీ చెప్పడంతో షాక్ వేల్యూ కూడా కరిగిపోయింది. శవాన్ని చూడగానే ఒకమ్మాయి కాదు, నల్గురమ్మాయిల శరీరభాగాలని ఇన్వెస్టిగేటర్ అయిన హీరో అక్కడే చెప్పేసి వుంటే- ఆ సన్నివేశం బ్లాస్ట్ అయి భావోద్వేగాలతో వెంటాడే ఆపరేటివ్ ఇమేజిగా వుండేది. ఆ ఇమేజితో అతను నిద్రపోలేడు. చీటికీ మాటికీ హీరోయిన్ తో రోమాన్సు చేయలేడు. ఆ ఇమేజి వెంటాడుతూంటే హంతకుడి కోసం బర్నింగ్ ఎమోషన్ తో ఇన్వెస్టిగేట్ చేయాలి.

పాత్ర పరంగా కూడా ఈ బర్నింగ్ ఎమోషన్ లేకపోవడం ఇంకో లోపం. హీరోని కేసుల్ని తేలిగ్గా తీసుకునే రకంగా, హంతకుల్ని సీరియస్ గా తీసుకోకుండా ఆడుతూ పాడుతూ పట్టేసుకుంటాడనీ పరిచయం చేశారు. అంటే హత్యకి గురయ్యే వాళ్ళ పట్ల కూడా అతడికి ఫీలింగ్స్ వుండవు. అలాగే నల్గురమ్మాయిల శరీర భాగాలు చూసి కూడా చలించడు. బాధితుల పట్ల ఏ స్పందనా లేకుండా ఎవరి కోసం, ఎందుకోసం పనిచేస్తున్నాడో తెలీదు.

'హిట్' లో అనాధ శరణాలయం బ్యాక్ డ్రాప్. ఇందులో స్త్రీ సంక్షేమ సంఘం నేపథ్యం. 'హిట్' లో ఇన్వెస్టిగేషన్ పేరుతో తెలివితేటల వాడకం అధికం కావడంతో గజిబిజిగా తయారయ్యింది. ఏదో హడావిడీ జరుగుతూ వుంటుంది- ఆ హడావిడిని విశ్లేషిస్తే లాజుక్కులే వుండవు. ప్రతీదానికీ ఫోరెన్సిక్ సైన్స్ ని లాగడం. ఈ సారి ఫోరెన్సిక్ సైన్స్ ఓవరాక్షన్ లేదు, నామ మాత్రంగా వుంది. అయితే లాజిక్కులు వుండవు. ఉదాహరణకి హంతకుడు నల్గురమ్మాయిల శరీర భాగాల్ని హోటల్ గదికి ఎలా తెచ్చి పేర్చి పోయాడనే దానికి వివరణ వుండదు.

ఈ హిట్ టీంని పోలీసు శాఖ గర్వించదగ్గ అత్యుత్తమ విభాగంగా కథలో హైలైట్ చేయకుండా- మళ్ళీ 'హిట్' లోలాగే అవినీతి అధికారుల్ని చూపించి విలువలేకుండా చేశారు. ఇంటర్వెల్ సీనుతో ఇంపాక్ట్ ఏమీ లేదు. ఎందుకంటే ఇలాటి సినిమాల్లో మొదట అమాయకుణ్ణి హంతకుడుగా చూపించడం రొటీనే.

'హిట్ 2' ని పెద్దగా ఆలోచించకుండా, తెర మీద జరుగుతున్న హడావిడికి పైపైన థ్రిల్ ఫీలై చూసేస్తే ఇది హిట్టే!

నటనలు- సాంకేతికాలు

'క్షణం', 'ఎవరు' లాంటి పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో నటించిన అడివి శేష్- ఈ సారి స్క్రిప్టులో ఇన్వాల్వ్ కాలేదేమో, తన పాత్ర చిత్రణ దగ్గర్నుంచీ కథాకథనాల వరకూ ఉదాశీనంగా వుండిపోయినట్టు ఫలితం చెప్తోంది. అయినా హిట్టే, హిట్ హిట్టు కాకపోతే ఎలా? అవతల నల్గురమ్మాయిలు ముక్కలైవుంటే, ఎప్పుడు పడితే అప్పుడు సహజీ వనం చేస్తున్న అమ్మాయితో సరసం, సంగీతం, ప్రెగ్నెన్సీ వగైరా ఎంజాయ్ చేసే పోలీసు పాత్రలో అడివి శేష్ భేష్ అనాలి. ఇంకా పెళ్ళి గురించి కాబోయే అత్తగారితో కామెడీ. ఇక యాక్షన్ సీన్స్ చూస్తే విలనే (హంతకుడు) చివరివరకూ కనిపించకపోతే ఏముంటాయి. పూర్తిగా యాక్షన్ రహిత ఇన్వెస్టిగేషన్ కథ కావడంతో ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్సుల ఎసెస్మెంట్ ఎవరు ఫాలో అవగలరు. అడివి శేష్ ప్రేక్షకుల్లో తనకున్న ఫాలోయింగ్ తో ఈ సినిమా గట్టెక్క వచ్చు.

హీరోయిన్ మీనాక్షీ చౌదరిని పైన చెప్పుకున్న అవసరాల కోసమే, సంసార పక్షంగా ఇంటి పట్టున వుండే చదువుకున్న అమ్మాయి పాత్ర. స్త్రీసంక్షేమ సంఘంలో ఆడవాళ్ళు చేసే స్వయంకృషి, పనీ పాటలు ఆమెకి పట్టవు. టీం మెంబర్ గా కోమలీ ప్రసాద్ కి హీరోయిన్ కంటే ఎక్కువ పాత్ర వుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక అవినీతి పరుడైన టీం బాస్ గా రావురమేష్ యాక్టివ్ పాత్ర కాడు. కూర్చుని హీరోకి వ్యతిరేకంగా చక్రం తిప్పే శకుని పాత్ర. దర్శకుడు సృష్టించిన 'హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం' ని ఒక ఆదర్శ సంస్థగా ప్రేక్షకులు అభిమానించే ఇమేజిని క్రియేట్ చేయాలను కోకపోవడం చాలా విచారించాల్సిన విషయం. దర్శకుడు తన టీంని తనే అవమానించుకుంటున్నాడు –అప్పుడు హిట్, ఇప్పుడు హిట్ 2, ఇంకా రాబోయే సీక్వెల్స్ లో కూడా ఇదే ఆశించాలేమో. ఇక హిట్ 3 కి హింట్స్ ఇస్తూ ముగింపులో నేచురల్ స్టార్ నానీ ఎంట్రీ. సినిమాలో ఎక్కడా ఈలలు వెయ్యని ప్రేక్షకులు ముగింపులో మాత్రం నానిని చూసి దద్దరిల్లేలా ఈలలు వేయడం గమనార్హం.

First Published:  2 Dec 2022 11:01 AM GMT
Next Story