Telugu Global
MOVIE REVIEWS

18 Pages Movie Review: '18 పేజెస్' – మూవీ రివ్యూ {2.5/5}

Nikhil Siddhartha's 18 Pages Movie Review: సుకుమార్ రైటింగ్స్ సపరేట్ సెక్షన్ సినిమా వచ్చింది. సుకుమార్ రాస్తే ఏడేళ్ళ క్రితం ‘కుమారి 21 ఎఫ్’ హిట్ తీసిన దర్శకుడు సూర్యప్రతాప్, ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ‘18 పేజెస్’ తో వచ్చాడు.

18 Pages Movie Review
X

18 Pages Movie Review: '18 పేజెస్' – మూవీ రివ్యూ {2.5/5}

చిత్రం: 18 పేజెస్

స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్

తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్, అజయ్ తదితరులు

కథ: సుకుమార్, మాటలు : శ్రీకాంత్ విస్సా, సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం : ఎ వసంత్, సమర్పణ : అల్లు అరవింద్, బ్యానర్స్ : జిఎ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: బన్నీ వాస్

విడుదల : డిసెంబర్ 23, 2022

రేటింగ్ : 2.5/5


సుకుమార్ రైటింగ్స్ సపరేట్ సెక్షన్ సినిమా వచ్చింది. సుకుమార్ రాస్తే ఏడేళ్ళ క్రితం 'కుమారి 21 ఎఫ్' హిట్ తీసిన దర్శకుడు సూర్యప్రతాప్, ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి '18 పేజెస్' తో వచ్చాడు. 'కార్తికేయ 2' తో సక్సెస్ మీద వున్న హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తో జతకట్టి (సినిమాలో ముగింపులో తప్ప జత కట్టడం వుండదు) ప్రేమ కథతో వచ్చాడు. సుకుమార్ ప్రేమ కథ రాస్తే అది రాడికల్ గా వుంటుందని ప్రతీతి. ఇప్పుడు కూడా ఈ రాడికల్ గా రాసిన ఈ ప్రేమ కథ అల్లు అరవింద్ సమర్పణలో ఏ విధంగా తెరకెక్కిందో చూద్దాం.

కథ

హైదరాబాద్ లో సిద్ధార్థ్ (నిఖిల్) సాఫ్ట్ వేర్ కంపెనీలో యూత్ కి రిలేషన్ షిప్ యాప్ డెవలపర్ గా పని చేస్తూంటాడు. ప్రేమించిన ప్రీతి బ్రేకప్ చెప్పి వేరే బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోవడంతో దెబ్బతిని తాగుడు, తిరుగుడు పన్లు చేస్తూంటే ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ విజయనగరం జిల్లాలో నందిని (అనుపమ) కి చెందింది. ఆమె రాసుకున్న డైరీ చదివితే, ఆమె డిజిటల్ ప్రపంచానికి దూరంగా వుండాలనుకుని ఫోన్ కూడా వుంచుకోదనీ, మనుషులతో ముఖా ముఖీ మాట్లాడడానికే ఇష్ట పడుతుందనీ వగైరా వగైరా చాలా విషయాలు చదువుతూ ప్రేమలో పడిపోతాడు. 2019 నాటి ఆ డైరీలో 18 పేజీలే రాసి అసంపూర్ణంగా వుండడంతో ఆమెని కలుసుకోవాలని ఆమె వూరెళ్తాడు.

అక్కడ రెండేళ్ళ క్రితం ఆమె హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో చనిపోయిందని నాయనమ్మ చెప్తుంది. తాతగారిచ్చిన కవరు హైదరాబాద్ లో వెంకట్రావుకి అందజేయడానికి వెళ్ళి మరణించింది. దీంతో తన ప్రేమ బలంతో ఆమె బ్రతికే వుందని నమ్మిన సిద్ధార్థ్ ఆమెని వెతకడం ప్రారంభిస్తాడు. ఆమె దొరికిందా? యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ కవరులో ఏముంది? నిజాలేమిటి, అబద్ధాలేమిటి? తెలుసుకుని ఏం చేశాడు సిద్ధార్థ్? ఇవి తెలియాలంటే 19 వ పేజీనుంచి సుకుమార్ నింపిన కథ వెండి తెరమీద చూడాలి.

ఎలావుంది కథ

పరస్పరం చూసుకోకుండా ఉత్తరాల ద్వారానో, ఆన్ లైన్లోనో ప్రేమించుకునే కోవకి చెందిన కథ. అయితే ఇందులో సుకుమార్ బ్రాండ్ రాడికల్ ప్రేమికుల పాత్రల్లేవు. ప్రేమ కథ జానర్నే రాడికలైజ్ చేశారు. సగం వరకూ ప్రేమ కథగా సాగుతున్న విషయాన్ని అకస్మాత్తుగా క్రైమ్ ఎలిమెంట్ తో సస్పెన్స్- ఇన్వెస్టిగేటివ్ - థ్రిల్లర్ లాగా మార్చేయడంతో ప్రేమకథ ఆవిరైపోయింది. ప్రేమకథని క్రైమ్ తో చెప్పాలనుకుంటే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హిట్టయిన నితిన్ - నిత్యా మీనన్ లు నటించిన 'ఇష్క్' (2012) లాగా వుండొచ్చు కథ. క్రైమ్ ఎలిమెంట్ తోనే 'ఇష్క్' లో ప్రేమకథ బలపడిన విషయం గమనించాలి.

'18 పేజెస్' లో నిఖిల్ పాత్ర కూడా అలా వుండాల్సింది కాదు. యూత్ కోసం రిలేషన్ షిప్ యాప్ డెవలపర్ గా వుంటున్న అతడి పాత్ర చిత్రణ రెండు విధాలా కనెక్ట్ కాలేదు. ఓ డైరీ దొరికితే అది చదివేయడమన్నది ఏ రకమైన రిలేషన్ షిప్ మర్యాదో తెలియదు. అలాగే డైరీ చదివి ప్రేమలో పడిపోవడం కూడా. డైరీని ఆమెకి చేరేయకుండా, లేదా భద్రంగా పెట్టేయకుండా మానసిక చాంచల్యానికి పాల్పడినప్పుడే వృత్తిపరంగా, వ్యక్తిత్వపరంగా, పాత్ర చిత్రణ పలచన బారిపోయింది.

ఆమె ఫోను వాడదని తెలుసుకుని ఫోను వాడక పోవడం, ఆమె భేల్ పూరీలో రెండు చుక్కలు నిమ్మరసం వేసుకుంటుందని చదివి తానూ అలాగే చేసి ఎంజాయ్ చేయడం, పేజీపేజీకి ఆమెని వూహించుకుని పాటలు పాడడం మానసిక వ్యభిచారమో, లేకపోతే ఒక కథలో దాస్తొయెవ్‌స్కీ చెప్పినట్టు సైకో లక్షణమో అయివుండాలి తప్ప, యూత్ కి రిలేషన్ షిప్ యాప్ డెవలపర్ క్యారక్టర్ లా అన్పించదు. ఇతను యాప్ డెవలప్ చేస్తే ఎలా వుంటుందో వూహించ వచ్చు.

ఎందుకు ప్రేమిస్తున్నాడో అతడి ఫీల్ ని ఆడియెన్స్ ఫీల్ కాలేక పోవడం ఈ ప్రేమ కథని బోనులో నించోబెట్టింది. అతడిదో దారైతే ఆడియెన్స్ దో దారి. ఆమె ప్రేమ కోసమే ఆమె వూరికెళ్ళడం కూడా కన్విన్సింగ్ గా వుండదు. ఆమెని కలిసి, నీ డైరీ చదివి నీతో ప్రేమలో పడ్డానంటే- ఆ డైరీ లాక్కుని ఆమె కొడితే ఏం చేస్తాడు. అతను రిపోర్టర్ అయివుంటే వృత్తిపరమైన ఆసక్తితోనో, డ్యూటీ అనుకునో డైరీని అందించాలని ప్రయత్నించవచ్చు- అదికూడా చదివి ప్రేమించకుండా.

'మెసేజ్ ఇన్ ఏ బాటిల్' (నాగార్జునతో పూరీ జగన్నాథ్ 'శివమణి') లో మాజీ రిపోర్టర్ రాబిన్ రైట్ కి బీచిలో కొట్టుకు వచ్చిన బాటిల్లో ప్రేమ లేఖ దొరికినప్పుడు, కేథరిన్ అనే యువతి రాసిన ఆ లేఖ చదివి కొలీగ్స్ కి చూపిస్తే, కొలీగ్స్ ఆమెకి చెప్పకుండా ప్రచురిస్తారు. దీనికి స్పందనగా అనేక జవాబులొస్తాయి. ఒక జవాబు ఆకర్షించి అది రాసిన టైప్ రైటర్ నీ, నోట్ ప్యాడ్ నీ ట్రాక్ చేసి, ఎక్కడో ఒంటరిగా జీవిస్తున్న కెవిన్ కాస్ట్నర్ గురించి చెబితే, రాబిన్ రైట్ అక్కడికెళ్ళి అతడ్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పరస్పరం ప్రేమలో పడతారు. కేథరిన్ చనిపోవడం ఆమె చేసిన క్షమించరాని తప్పుగా ఫీలవుతూంటాడు కాస్ట్నర్.

బీచిలో బాటిల్లో లెటర్ కొట్టుకు వచ్చిందంటే అదెవరో ప్రపంచానికి తెలియాలని పంపిన సందేశం అన్పించింది కాబట్టే మాజీ రిపోర్టర్ గా చదివింది రాబిన్ రైట్. తను ఇప్పుడు రిపోర్టర్ కాదు కాబట్టి కొలీగ్స్ కిచ్చేసింది. కొలీగ్స్ దాన్ని ప్రచురించి, కూపీలాగి కాస్ట్నర్ గురించి చెప్తే, రాబిన్ రైట్ కి తనలోని రిపోర్టర్ అతడ్ని కలుసుకునేలా చేసింది తప్ప ప్రేమలో పడి వెళ్ళలేదు, వెళ్ళాక ప్రేమలో పడింది. ఇదీ పాత్రచిత్రణ. ఇది నికోలస్ స్పార్క్స్ నవలకాధారం. నికోలస్ స్పార్క్స్ ప్రేమ నవలలు ఎన్నో హిట్ సినిమాలుగా వచ్చాయి.

నిఖిల్ పాత్రతో ప్రేమ కథ ఇలా వుంటే, క్రైమ్ ఎలిమెంట్ కి దారితీసే అనుపమ పాత్ర కథ ఇంతే అసహజంగా వుంది. ఆమె తాత ఎక్కడో హైదరాబాద్ లో వెంకట్రావుకి కవరు కొరియర్ లో పంపకుండా మనవరాలికిచ్చి అంతదూరం పంపడమేమిటి? కథ కోసం అన్నట్టు వుంది. నిఖిల్ ఆమెకోసం వెళ్ళినప్పుడు, రెండేళ్ళ క్రితం యాక్సిడెంట్ లో చనిపోయిందని అంటుంది నాయనమ్మ. చనిపోతే డెడ్ బాడీ ఏమైంది? ఈ విషయం కథ కోసం దాట వేశారు. డెడ్ బాడీ తెచ్చుకోకుండా నాయనమ్మ ఎలా వుంటుంది?

నిఖిల్ పోలీస్ స్టేషన్ కెళ్ళి యాక్సిడెంట్ కేసు గురించి తెలుసుకుంటే వెంటనే కథ అయిపోతుంది. అందుకని ఎక్కడెక్కడో 'ఇన్వెస్టిగేట్' చేస్తూంటాడు. రియల్ ఎస్టేట్ కుంభకో

ణానికి సంబంధించిన ఆ కవరులో విషయం కూడా సహజంగా వుండదు. నిఖిల్ తో ప్రేమ కథ, అనుపమతో క్రైమ్ ఎలిమెంట్ రెండూ ఏ ఫీలూ పుట్టించని అసహజ, అసాధ్య చిత్రణలయ్యాక, ముగింపు మాత్రం కదిలించేదిగా వుంటుంది.

డైరీ దొరికిన ప్రారంభం, కదిలించే ముగింపూ రెండూ తీసుకుని మధ్యలో 1996 లో అజిత్ నటించిన 'కాదల్ కొట్టై' (తెలుగులో ప్రేమ లేఖ') లాగా కథ చేసుకుని వుంటే సుకుమార్ రైటింగ్స్ కి బావుండేది.

నటనలు- సాంకేతికాలు

నిఖిల్ గ్లామర్ పరంగా, నటనాపరంగా బెస్ట్ అవుట్ పుట్టిచ్చాడని చెప్పొచ్చు. అయితే బాడీ షేపు అక్కడక్కడా హెచ్చు తగ్గులుగా వుంటుంది. అంతటా ఒకే షేపులో వుండాల్సింది. ఒకే షేపులో వుండరనే 'అవతార్' 3,4 సీక్వెల్స్ ఒకే సారి గబగబా షూట్ చేస్తున్నాడు జేమ్స్ కామెరూన్. ఇక నిఖిల్ పాత్రకి మొదట్లో బ్రేకప్ ఎపిసోడ్ కూడా కనెక్ట్ కాలేదు. ఎవరో అమ్మాయిని చూపించి బ్రేకప్ అంటే ఆడియెన్స్ ఏమీ ఫీలవ్వరు. పోతే పోయిందనుకుంటారు. పైగా ఇది ఎలాగూ బ్రేకప్ అయ్యే ప్రేమని ముందే తెలుస్తుంది. ఆ అమ్మాయి రశ్మికనో, పూజా హెగ్డేనో లాంటి హీరోయిన్ అయివుంటే, నిఖిల్ తో బాటు ఆడియెన్స్ కూడా ఆ బ్రేకప్ బాగా ఫీలయ్యి బాధపడుతూ వుంటారు. యూత్ అప్పీల్ డైనమిక్స్. ముగింపు సీను మాత్రం నిఖిల్ కి ఆణిముత్యం లాంటిది.

అనుపమ గ్లామర్, నటన కూడా విజువల్స్ కి వన్నె తెస్తాయి. మంచి నటి. పాత్ర కూడా మంచిదే, కాకపోతే కథకుడు సరిగ్గా నడపలేదు. తాత ఎటు పోయాడో, నాయనమ్మ ఎటు పోయిందో కూడా పట్టనట్టు వుంటుంది. తర్వాత నిఖిల్ కొలీగ్ భాగ్యగా తెలంగాణా క్యారక్టర్ వేసిన ఆర్టిస్టు చెప్పుకోదగ్గది.

చాలా హైలైట్ ఏమిటంటే గోపీ సుందర్ సంగీతంలోని పాటలు, వాటికి కెమెరామాన్ వసంత్ చిత్రీకరణ, శ్రీకాంత్ విస్సా మాటలు. మాటలు లేని ముగింపు సన్నివేశం దర్శకుడు సూర్యప్రతాప్ మేధస్సుకి అద్దం పడుతుంది. ఏ ప్రేమ సినిమాలోనూ చూడని ముగింపు దృశ్యం క్లాసిక్ దృశ్యాల లిస్టులో చేరిపోతుంది.

చివరిగా, ఏదో వొక ప్రేమ కథలా ఒప్పించే ప్రయత్నం చేస్తూ సాగుతున్న సినిమాని మధ్యకి విరిచి, సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడేసినట్టు, క్రైమ్ కథ తెచ్చి అతికించడంతో, ఒకలా మొదలై ఇంకోలా ముగిసిన సినిమాగా ఇది గుర్తుంటుంది. ముగింపు వెంటాడుతూంటే మాత్రం పోనీలే అని చూసిన అక్రమాల్ని మర్చిపోతాం.

First Published:  24 Dec 2022 7:38 AM GMT
Next Story