Telugu Global
Cinema & Entertainment

మోస్ట్ వాంటెడ్ : నార్త్ లో తెలుగు, తమిళం సినిమాలు!

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, సూర్య ‘కంగువ’, ధనుష్ ‘రాయన్’, విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, రజనీకాంత్ ‘వెట్టాయన్’ ...’పుష్ప 2’ తో కలిపి 10 సినిమాలు రాబోయే ఆరునెలల్లో బాక్సాఫీసు కుంభ మేళాకి సరిపోతాయి.

మోస్ట్ వాంటెడ్ : నార్త్ లో తెలుగు, తమిళం సినిమాలు!
X

తెలంగాణ లో వున్న 400 సింగిల్ స్క్రీన్ థియేటర్లని పది రోజులపాటు మూసివేయడానికి ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇది రేపు శుక్రవారం 17 వ తేదీనుంచి అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వున్న 800 సింగిల్ స్క్రీన్ థియేటర్లు యధావిధిగా కొనసాగుతాయని అక్కడి ఎగ్జిబిటర్లు ప్రకటించారు. వేసవి ఎండలకి కావచ్చు, ఎన్నికల వల్ల కావచ్చు, క్రికెట్ కారణంగా కావచ్చు, తెలంగాణలో ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని, నష్టాలతో థియేటర్లు నడపలేమనీ తెలంగాణ ఎగ్జిబిటర్ల వివరణ. ఇవే కారణాలు చెప్పి పెద్ద సినిమాల సమ్మర్ విడుదలల్ని ఆయా నిర్మాతలు వాయిదా వేశారు. ఇక జూన్, జులై మాసాల్లో వరుస కట్టి విడుదలయ్యే పెద్ద సినిమాలతోనే థియేటర్ల వ్యాపారం మెరుగయ్యే పరిస్థితి వుంది.

నార్త్ లో కూడా ఇదే పరిస్థితి. ఎండలు, ఎన్నికలు, క్రికెట్. అయితే ఈ హడావిడి ముగిసిన తర్వాత అక్కడి ఎగ్జిబిటర్లు పెద్ద బడ్జెట్ హిందీ సినిమాల మీద నమ్మకం పెట్టుకోవడం లేదు. ఎందుకంటే ఎందరు స్టార్స్ తో ఎన్ని మల్టీస్టారర్లుగా తీసినా ఢమాల్మంటున్నాయి. ప్రేక్షకుల నుంచి దూరమైపోయిన వీటి కథా కథనాలు బాక్సాఫీసుని బ్రతకనీయడం లేదు. అందుకని నార్త్ ఎగ్జిబిటర్లు కూడా సౌత్ నుంచి వచ్చే హిట్ గ్యారంటీ స్టార్ సినిమాల వైపు చూస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. అంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లోనైనా, అటు హిందీ రాష్ట్రాల్లో నైనా సినిమాలంటే ఇక సౌత్ స్టార్ -పానిండియా సినిమాలే అన్నట్టుగా తయారయింది పరిస్థితి.

ఇది సౌత్ సినిమాలకి మంచి అవకాశమే. ఎలాగంటే, భారతీయ సినిమాలంటే బాలీవుడ్ హిందీ సినిమాలేనని ఇంతవరకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వుంది. ఈ గుర్తింపుని నిస్సహాయంగా వున్న బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాలు లాక్కుని, ఇండియన్ సినిమాలంటే సౌత్ సినిమాలేనని ప్రపంచం ముందుకు తీసికెళ్ళవచ్చు.

నార్త్ లో ప్రేక్షకుల గైర్హాజరీని తీవ్రంగా ఎదుర్కొంటున్నది దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు నిర్వహిస్తున్న పీవీఆర్- ఐనాక్స్ కంపెనీయే. మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో హిందీ సినిమాల కారణంగా రూ. 130 కోట్లు నష్టపోయింది. ఇక ఏప్రెల్, మే నెలల్లో ఎండలు, ఎన్నికలు, క్రికెట్ నష్ట ఉష్ణోగ్రతని మరింత పెంచుతున్నాయి. ఇవి ముగిశాక చూస్తే కొత్తగా వచ్చే పెద్ద హిందీ సినిమాలైతే చాలానే వున్నాయి. వీటి నాణ్యత మీదే నమ్మకం లేదు. పైగా ప్రేక్షకుల అభిరుచులకి దూరంగా వుంటున్నాయి. అందుకని సౌత్ సినిమాల వైపు చూస్తోంది కంపెనీ. ముఖ్యంగా ఆగస్టులో విడుదలయ్యే అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ అతి పెద్ద హిట్ అవగలదని నమ్ముతోంది కంపెనీ.

ఇక ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, సూర్య ‘కంగువ’, ధనుష్ ‘రాయన్’, విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, రజనీకాంత్ ‘వెట్టాయన్’ ...’పుష్ప 2’ తో కలిపి 10 సినిమాలు రాబోయే ఆరునెలల్లో బాక్సాఫీసు కుంభ మేళాకి సరిపోతాయి.

హిందీలో చూస్తే జూన్ -డిసెంబర్ ల మధ్య- అక్షయ్ కుమార్ ‘సర్ఫిరా’, అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’, అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’, అక్షయ్ కుమార్ ‘వెల్కం టు ది జంగిల్’, అజయ్ దేవగణ్ -అక్షయ్ కుమార్ ‘సింగం ఎగైన్’, అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’, జాన్ అబ్రహాం ‘వాదా’, షాహిద్ కపూర్ ‘దేవా’, అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ మొదలైన 9 సినిమాలున్నాయి. అయితే కంటెంట్ పరంగా చూసినా, మేకింగ్ పరంగా చూసినా, స్టార్స్ ని చూపించే విధానంలో చూసినా హిందీ సినిమాలకి హాలీవుడ్ అంత దూరంలో వుంటున్నాయి సౌత్ సినిమాలు. హిందీ స్టార్స్ ని చూసి చూసి వున్న హిందీ ప్రేక్షకులకి తెలుగు స్టార్స్ నీ, తమిళం స్టార్స్ నీ చూస్తే కిక్కు వస్తోంది. పైగా వీళ్ళు బీసీ సెంటర్ల మాస్ ప్రేక్షకులకి దగ్గరగా కూడా వుంటారు. కొన్నేళ్ళుగా హిందీ డబ్బింగ్ సినిమాలతో చానెళ్ళల్లో ఇంటింటా పాపులరై పోయిన పరిస్థితి కూడా వుంది.

ఇలా సంక్షోభంలో వున్న మొత్తం దేశంలో సినిమా రంగానికి సౌత్ సినిమాల పవర్ తోనే మోక్షం లభించేలా వుందని చెప్పుకోవచ్చు. నార్త్ లో రాబోయే సౌత్ సినిమాల వైపు ఆశగా చూస్తూ, ఈలోపు యే జవానీ హై దీవానీ , జబ్ వి మెట్ , వీర్-జారా , దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, మొహబ్బతే, రబ్ నే బనా ది జోడీ వంటి హిందీ పాత హిట్స్ తో పాటు, డూన్, ఒపెన్‌హైమర్, టైటానిక్ వంటి హాలీవుడ్ హిట్స్ ని ప్రదర్శిస్తూ పీవీఆర్ -ఐనాక్స్ కాలక్షేపం చేస్తోంది.

First Published:  16 May 2024 12:22 PM IST
Next Story