Telugu Global
Cinema & Entertainment

పాత హిట్ సినిమాల ప్రదర్శనలకు పెరిగిన కలెక్షన్లు

కొత్త ట్రెండ్ కి తెర లేచింది. నేటి స్టార్స్ నటించిన పాత హిట్స్ ని తిరిగి రిలీజ్ చేయడం మొదలెట్టారు. ఒకే ఒక్కరోజు మాత్రమే ఆటలు. ఫ్యాన్స్ షో అని దానికి పేరు. మొదట మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9 న 2006 నాటి సూపర్ హిట్ పోకిరిని తెలుగు రాష్ట్రాలతో బాటు ఓవర్సీస్ లో ప్రదర్శించారు. ఆ ఒక్కరోజు కోటీ 73 లక్షలు కలెక్షన్లు రావడంతో దిమ్మెరబోయారు.

పాత హిట్ సినిమాల ప్రదర్శనలకు పెరిగిన కలెక్షన్లు
X

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది...స్టార్స్ నటించిన పాత హిట్లు బైటికి తీసి ఒకరోజు ప్రదర్శించే ట్రెండ్. ఫ్యాన్స్ కోసం వేసే ప్రత్యేక ఆటలు హౌస్ ఫుల్స్ కావడం. పాత హిట్స్ రీ రీలీజులు లాభసాటి బేరంగా మారడం. ఏడాదికో రెండేళ్ళకో ఓ కొత్త సినిమాతో ముందుకు రాని స్టార్స్ తో ఫ్యాన్స్ నిరీక్షణ తగ్గించే మార్గం. టీవీలు లేని కాలంలో సినిమాలు తరచూ మరోసారి తెచ్చుకుని ప్రదర్శించునే వాళ్ళు థియేటర్ల ఓనర్లు. వీటిలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా వుండేవి. అలా పాత సినిమాలు చూడలేక పోయిన తరం ప్రేక్షకులకి ఇది మంచి అవకాశంగా వుండేది. దేవదాసు, మాయబజార్ లు కూడా అలా విరగబడి చూశారు. ఇక చిరంజీవి నటించిన ఖైదీ లాంటివి ఏడాదికి రెండు మూడు సార్లు వేస్తూనే వుండేవాళ్ళు థియేటర్ల యజమానులు.

తర్వాత '90 ల నుంచి వీడియో టేపులు, సీడీలూ, టీవీ ప్రసారాలూ వచ్చాక ఈ విధానం కనుమరుగైంది. పాత సినిమాలు, కొంత కాలం తర్వాత కొత్త సినిమాలూ ఇంట్లోనే చూసుకునే వీలు కలిగింది. 1996 లో ఈటీవీ ప్రారంభించినప్పుడు 1800 పాత సినిమాలు కొనేశారు రామోజీ రావు. రాత్రి పదిన్నరకి ఇవే ప్రసారమయ్యేవి. ఇలా గృహాల్లోకే పాత సినిమాలు చేరాక, థియేటర్లలో ప్రదర్శించడం విరమించుకున్నారు ఎగ్జిబిటర్లు.

ఇక థియేటర్లు కొత్త సినిమాలకే పరిమిత మయ్యాయి. రెండు దశాబ్దాలుగా కొత్తగా విడుదలయ్యే సినిమాలతోనే నడుస్తున్నాయి థియేటర్లు. పూర్వం నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లవంటి స్టార్స్ సినిమాలు ఏడాదికి మూడు నుంచి నాల్గు విడుదలయ్యేవి. ఒక సంవత్సరం కృష్ణ నటించిన సినిమాలు 18 విడుదలయ్యాయి! అలా థియేటర్లు సందడిగా వుండేవి. థియేటర్ల మనుగడకి తోడ్పడే స్టార్ సినిమాల కొరత వుండేది కాదు.

కానీ ఎప్పుడైతే 2000 నుంచి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్, నాని, శర్వానంద్ వంటి నవతరం స్టార్లు ఏడాదికి ఒక్క సినిమా అనే నియమం పెట్టుకున్నారో, అప్పట్నుంచీ థియేటర్ల కళ తగ్గింది. స్టార్ సినిమాలు విడుదలయ్యే లాంగ్ గ్యాప్ లో విడులయ్యే చిన్న చిన్న సినిమాల మీదే ఆధారపడక తప్పని పరిస్థితి. చిన్న సినిమాలు థియేటర్ల ఫీడింగ్ కి పనికొస్తున్నాయన్న మాటేగానీ, ప్రేక్షకాదరణ లేక థియేటర్లు వెలవెల బోవడమే. ఇప్పటికీ ఇదే పరిస్థితి.

ఈ పరిస్థితికి సమాధానం అన్నట్టు కొత్త ట్రెండ్ కి తెర తీశారు. నేటి స్టార్స్ నటించిన పాత హిట్స్ ని తిరిగి రిలీజ్ చేయడం మొదలెట్టారు. ఒకే ఒక్కరోజు మాత్రమే ఆటలు. ఫ్యాన్స్ షో అని దానికి పేరు. ఫ్యాన్స్ ని రప్పించడానికి ఒక ఈవెంట్ ని క్రియేట్ చేయడం. అది స్టార్స్ పుట్టిన రోజు కావడం. అలా కాకతాళీయంగానే మొదట మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9 న 2006 నాటి సూపర్ హిట్ పోకిరిని తెలుగు రాష్ట్రాలతో బాటు ఓవర్సీస్ లో ప్రదర్శించారు. ఆ ఒక్కరోజు కోటీ 73 లక్షలు కలెక్షన్లు రావడంతో దిమ్మెరబోయారు. ఫ్యాన్స్ థియేటర్ల మీద దండెత్తి క్రిక్కిరిసి పోయారు. మళ్ళీ థియేటర్లలో పోకిరిని పూనకాలు పూనినట్టు చెలరేగి ఎంజాయ్ చేశారు.

ఇక సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వచ్చింది. 2008 నాటి జల్సాని రెండు రోజులు వదిలారు. దీనికీ ఫ్యాన్స్ బాక్సాఫీసు ని బద్దలు కొట్టి వదిలారు. ఏకంగా 3 కోట్ల పాతిక లక్షలు సమర్పించుకున్నారు. నిర్మాతలు కంగు తిన్నారు. టాలీవుడ్ కళ్ళు తెర్చింది. మహేష్ బాబు పోకిరిని యుఎస్‌లో 4కె టెక్నాలజీలో రీమాస్టర్ చేసి రీ-రిలీజ్ చేయడంతో ప్రారంభమైన ఈ ట్రెండ్ లో, ఇతర నిర్మాతలూ పాలుపంచుకోవడం మొదలెట్టారు.

ఇక సెప్టెంబర్ 24 న బాలకృష్ణ బర్త్ డేకి 2002 నాటి చెన్నకేశవ రెడ్డి ని 4కే లో రీమాస్టర్ చేసి విడుదల చేశారు. దీని కలెక్షన్స్ జల్సాని బద్దలు కొట్టాయి. ఇక క్యూలో ప్రభాస్ బర్త్ డే కి అక్టోబర్ 23న 2009 నాటి బిల్లా వేచి వుంది. అమెరికాతో బాటు ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కే ఈ రీ రిలీజులు హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి!

ఈ కొత్త బిజినెస్ కి పెట్టుబడీ తక్కువే. సినిమాని డిజిటల్ గా రీమాస్టర్ చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు ఐదారు లక్షలే అయితే, రిటర్న్స్ అధిక మొత్తాల్లో కోట్లలో వుంటున్నాయి. ఇంకా ఎన్నో రీ-రిలీజ్‌లు లైన్‌లో ఉండడంతో టాలీవుడ్ హుషారుగా వుంది. త్వరలో మళ్ళీ విడుదలకి సిద్ధమవుతున్న సూపర్ హిట్స్ లో చిరంజీవి ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి, కృష్ణ నటించిన సింహాసనం, అల్లూరి సీతారామరాజు, జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి, మహేష్ బాబు ఒక్కడు, అతడు, ఖలేజా, దూకుడు, వెంకటేష్ నటించిన క్షణ క్షణం మొదలైనవి ఇప్పటికున్నాయి. దీంతో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. పెద్ద సినిమాల విడుదలలు షెడ్యూల్ చేయనప్పుడు, కనీసం ఒక వారం పాటు పాత హిట్స్ ని ప్రదర్శించాలని నిర్మాతల్ని కోరుతున్నాయి.

చిన్న సినిమాల వల్ల థియేటర్లకి వస్తున్న నష్టాల్ని తీర్చడానికి ఇదొక మార్గంగా కన్పిస్తోంది. అయితే ఎందుకు ఫ్యాన్స్ ఈ రీ రిలీజులకి విరగబడుతున్నారంటే, 15-20 ఏళ్ళ క్రితం విడులైన తమ అభిమాన స్టార్స్ సూపర్ హిట్స్ ని తాము థియేటర్ లో పెద్ద తెరమీద చూడలేదు. టీవీలోనే చూసుకుంటున్నారు. కనుక పెద్ద తెరమీద అనుభవాన్ని పూర్తి స్థాయిలో చవి చూడాలనే ఇలా విరగబడుతున్నారు. ఇప్పుడు తమ వంతుగా బ్రహ్మరధం పడుతున్నారు. ఇంకా విచిత్రాతి విచిత్రమేమిటంటే, తమిళ స్టార్ ధనుష్ నటించిన 2012 నాటి '3' ని ధనుష్ తండ్రి గారి పుట్టిన రోజు సెప్టెంబర్ 8న తెలుగులో విడుదల చేస్తే, ఒక్క హైదరాబాదు లోనే 30 లక్షల కలెక్షన్లు రావడం చూసి ముక్కున వేలేసుకున్నారు ట్రేడ్ పండిట్లు. ఈ సినిమాలో హిట్టయిన 'వై దిస్ కొలవరి' ఒక పాట తప్ప ఏమీ లేదు. ఈ పాట కోసమే విరగబడ్డారంటే, పెద్ద తెర మీద పాత హిట్స్ చూడాలన్న పిచ్చి ఎంత పీక్ లో వుందో అర్ధం జేసుకోవచ్చు.

First Published:  4 Oct 2022 1:31 PM IST
Next Story