మాలీవుడ్ @ రూ. 1000 కోట్ల పండుగ!
ఎవరు నమ్మినా నమ్మక పోయినా, 2024 సంవత్సరం మాత్రం మాలీవుడ్ కి ఆల్ టైమ్ రికార్డు సంవత్సరం! ఈ ఏడాది ఏప్రిల్ కల్లా నాలుగు నెలల్లోనే మలయాళం బాక్సాఫీసు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టేసింది.
ఎవరు నమ్మినా నమ్మక పోయినా, 2024 సంవత్సరం మాత్రం మాలీవుడ్ కి ఆల్ టైమ్ రికార్డు సంవత్సరం! ఈ ఏడాది ఏప్రిల్ కల్లా నాలుగు నెలల్లోనే మలయాళం బాక్సాఫీసు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టేసింది. ఫాహద్ ఫాజిల్ ‘ఆవేశం’, కొత్త వాళ్ళతో ‘మంజుమ్మల్ బాయ్స్’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ఈ వెయ్యి కోట్ల బాక్సాఫీసు బలిమికి దోహదం చేశాయి. ఇక మే 16 న విడుదలైన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ అయితే ఈ నాలుగు రోజుల్లోనే రూ. 40 కోట్లు వసూలు చేసింది. మలయాళ సినిమాలు ఉమ్మడి రూ. 500 కోట్ల క్లబ్ ని ఎప్పుడో దాటేశాయి. పైన పేర్కొన్న మొదటి మూడు సినిమాలు ప్రపంచవ్యాప్త బాక్సాఫీసు కలెక్షన్‌లో 57% వాటాని కైవసం చేసుకున్నాయి. ఈ మొత్తం రూ. 556.08 కోట్లుగా తేలుతోంది. ఇందులో దేశీయ బాక్సాఫీసు వాటా రూ. 311.52 కోట్లు.
జనవరి- ఏప్రిల్ మధ్య 9 టాప్ మలయాళ సినిమాలని గమనిస్తే, 1. మంజుమ్మల్ బాయ్స్ రూ. 241.56 కోట్లు, 2. ఆడుజీవితం రూ. 159.83 కోట్ట్లు, 3. ఆవేశం రూ. 154.69 కోట్లు, 4. ప్రేమలు రూ. 132.79 కోట్లు, 5. వర్షంగల్కు శేషం రూ. 81.69 కోట్లు, 6. భ్రమయుగం రూ. 80.70 కోట్లు, 7. అబ్రహాం ఓజ్లర్ రూ. 40.85 కోట్లు, 8. మలైకోట్టై వాలిబన్ రూ. 29.90 కోట్లు, 9. అన్వేషిప్పిన్ కండెత్తు రూ. 40 కోట్లు... ఈ మొత్తం రూ. 962.01 కోట్లు. అంటే సగటున ఒక్కో సినిమా 106 కోట్లు వసూలు చేసినట్టు. ఈ 9 సినిమాల మొత్తం బడ్జెట్ రూ. 225.11 కోట్లు అయింది.
దేశంలోనే ఈ వసూళ్ళు ఆశ్చర్య పరుస్తున్నాయి. తిరిగి 1980 లనాటి వైభవాన్ని చూస్తున్నామని మాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. 1980 లలో మలయాళ సినిమాల చరిత్ర మలుపు తిరిగింది. ఆ కాలంలో తమిళంలో లాగానే మలయాళ సినిమా రంగంలోకి కొత్త తరం దర్శకులు, రచయితలు ప్రవేశించి ఒక న్యూవేవ్ ట్రెండ్ ని సృష్టించారు. ఈ సమయంలోనే ఇద్దరు వర్ధమాన సూపర్‌స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ ల శకం ప్రారంభమైంది. ఇది నేటి వరకూ సుదీర్ఘంగా కొనసాగుతోంది. వీరు కొత్త దర్శకుల్ని ప్రోత్సహించి ఆఫ్ బీట్ సినిమాలు నటించారు. ఇతర భాషలకి చెందిన సూపర్ స్టార్లు చేయని పాత్రలతో ప్రేక్షకుల్ని బలంగా ఆకర్షించారు. వీళ్ళిద్దరూ ఇప్పటికీ మలయాళ సినిమాకి బ్రాండ్ అంబాసిడర్‌లుగా వెలుగుతున్నారు.
1990ల్లో ప్రారంభంలో, తమిళనాడులోని ప్రేక్షకులంతా ఈ ఇద్దరు స్టార్లకి ఫ్యాన్స్ గా మారిపోయారు. తమిళంలో మణిరత్నం ‘దళపతి’ (1991) లో మమ్ముట్టి, తమిళంలోనే మణిరత్నం ‘ఇరువర్’ (1997) లో మోహన్‌లాల్ పాత్రల్ని పోషించినప్పుడు, మలయాళ సినిమా స్టార్‌డమ్‌ని తాకింది. ఈ రెండు సినిమాలూ కేరళ వెలుపల మలయాళ సినిమాలకి బాక్సాఫీసు బాట వేశాయి.
చరిత్ర పునరావృతమవుతోంది. ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త దర్శకులతో మలయాళ సినిమాలు 1980 నాటి విజయాలనే చూస్తున్నాయి. ఈ విజయాలు చాలా భారీ విజయాలు. ఎందుకంటే అప్పుడు లేని ప్రపంచవ్యాప్త విడుదలలు ఇప్పుడున్నాయి. ఇంకా అప్పుడు లేని ప్రపంచ ప్రేక్షకుల్ని ఆకర్షించే యూనివర్సల్ కథలతో సినిమాలు తీస్తున్నారు. ఇలా వ్యాపారాత్మకంగానే కాదు, కళాత్మకంగానూ ప్రపంచ మేధావుల దృష్టి నాకర్షిస్తున్నారు. ప్రస్తుతం కేన్స్ లో జరుగుతున్న సుప్రసిద్ధ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి ఒక మలయాళ సినిమా ఎంపిక కావడమే ఇందుకు నిదర్శనం.
అంతర్జాతీయ సినిమాలు పోటీ పడే కేన్స్ లో ప్రవేశం దక్కడమంటే మామూలు విషయం కాదు. ఈ చలన చిత్రోత్సవాల్లో ప్రేక్షకులు టికెట్ పొందాలంటేనే రూ. 5 లక్షల నుంచీ రూ. 20 లక్షల వరకూ అవుతుంది. మలయాళం మూవీ 'వడక్కన్' (పైన ఇమేజి చూడండి) కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక ఫిలిం ఫెంటాస్టిక్ పెవిలియన్‌లో గౌరవనీయ స్థానాన్ని సంపాదించింది. ఆఫ్‌బీట్ స్టూడియోస్ బ్యానర్ నిర్మాణంలో సాజీద్ ఎ దర్శకత్వంలో కిషోర్, శృతీ మీనన్ నటించారు. ఇందులో అతీంద్రియ అంశాలతో ఉత్తర మలబార్ జానపద కథల్నికలుపుతూ కళాత్మక ఆవిష్కరణ చేశారు.
ఇలా మలయాళ సినిమాలు కళకి కళా, డబ్బుకి డబ్బూ సంపాదించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. కేన్స్ లో ప్రదర్శన తర్వాత 'వడక్కన్' తెలుగు, తమిళం, కన్నడలతో బాటు, మరి కొన్ని ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదలవబోతోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే రూ. 1000 కోట్లు బాక్సాఫీసుని కొల్లగొట్టాయంటే, ఇంకా 8 నెలల్లో మలయాళ సినిమాలు ఇంకెన్ని వందల కోట్లు ఖాతాలో వేసుకుంటాయో వేచి చూడాల్సిందే!