Telugu Global
Cinema & Entertainment

నా ఫ‌స్ట్ ఆస్కార్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ - నాటు నాటుతో ఆస్కార్ సాధించిన కీర‌వాణి వెల్ల‌డి

కీర‌వాణి వ్యాఖ్య‌ల‌పై ఆర్జీవీ చాలా భావోద్వేగంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కీర‌వాణి వీడియోను షేర్ చేస్తూ `నేను చ‌నిపోయిన భావ‌న క‌లుగుతోంది..` అని ఆయ‌న పేర్కొన్నారు.

నా ఫ‌స్ట్ ఆస్కార్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌    - నాటు నాటుతో ఆస్కార్ సాధించిన కీర‌వాణి వెల్ల‌డి
X

త‌న ఫ‌స్ట్ ఆస్కార్ రామ్‌గోపాల్‌వ‌ర్మ అని సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి అన్నారు. `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలోని `నాటు నాటు` పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న కీర‌వాణి ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2023లో తాను అందుకున్న ఆస్కార్ రెండోది అని ఆయ‌న తెలిపారు.

తాను సంగీత ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాల కోసం తిరుగుతున్న స‌మ‌యంలో దాదాపు 51 మందిని క‌లిశాన‌ని, వారెవ‌రూ త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డానికి ముందుకు రాలేద‌ని ఆయ‌న చెప్పారు. వారిలో కొంత‌మంది అయితే తాను చేసిన ట్యూన్‌ల క్యాసెట్‌ని చెత్త‌బుట్ట‌లోకి విసిరేశార‌ని ఆయ‌న తెలిపారు. అప్ప‌ట్లో తానొక అపరిచితుడిన‌ని, త‌న‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం వారికి లేద‌ని చెప్పారు. కొంద‌రికి త‌న ట్యూన్‌లు న‌చ్చినా అవ‌కాశం ఇవ్వ‌డానికి ముందుకు రాలేద‌ని వివ‌రించారు.

కానీ అప్ప‌టికే `శివ‌`తో భారీ హిట్ సాధించిన రామ్‌గోపాల్‌వ‌ర్మ త‌న‌కు `క్ష‌ణ‌క్ష‌ణం` చిత్రానికి అవ‌కాశ‌మిచ్చార‌ని వివ‌రించారు. అప్ప‌ట్లో `శివ‌` విజ‌యం రామ్‌గోపాల్‌వ‌ర్మ సాధించిన ఆస్కార్ అని ఈ సంద‌ర్భంగా కీర‌వాణి తెలిపారు. అలాంటి వ‌ర్మ కొత్తవాడినైన త‌న‌కు అవ‌కాశ‌మివ్వ‌డం ఆస్కార్ లాంటిదేన‌ని ఆయ‌న చెప్పారు.

వ‌ర్మ‌తో క‌లిసి కీర‌వాణి ప‌నిచేస్తున్నాడంటే అత‌నిలో ఏదో ఉంద‌నే అభిప్రాయంతో ఆ త‌ర్వాత త‌న‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఆ విధంగా వ‌ర్మ అసోసియేష‌న్ త‌న‌కు ఎన్నో అవ‌కాశాల‌ను ఇప్పించింద‌ని కీర‌వాణి వివ‌రించారు.

కీర‌వాణి వ్యాఖ్య‌ల‌పై ఆర్జీవీ చాలా భావోద్వేగంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కీర‌వాణి వీడియోను షేర్ చేస్తూ `నేను చ‌నిపోయిన భావ‌న క‌లుగుతోంది..` అని ఆయ‌న పేర్కొన్నారు. `ఎందుకంటే చ‌నిపోయిన‌వారినే ఇంత గొప్ప‌గా పొగుడుతారు` అంటూ భావోద్వేగంతో క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్న ఎమోజీల‌ను పంచుకున్నారు. వెంక‌టేష్‌, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన `క్ష‌ణ‌క్ష‌ణం` చిత్రం మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

First Published:  26 March 2023 7:30 AM IST
Next Story