Telugu Global
Cinema & Entertainment

హమ్మయ్య, బాక్సాఫీసుని జయించాడు!

మొత్తానికి పురచ్చి దళపతి విశాల్ హిట్ కొట్టాడు. తొమ్మిది వరస పరాజయాల పరంపరతో ప్రశ్నార్ధకంగా మారిన అతడి కెరీర్ ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ తో తిరిగి గాడిన పడింది.

హమ్మయ్య, బాక్సాఫీసుని జయించాడు!
X

మొత్తానికి పురచ్చి దళపతి విశాల్ హిట్ కొట్టాడు. తొమ్మిది వరస పరాజయాల పరంపరతో ప్రశ్నార్ధకంగా మారిన అతడి కెరీర్ ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ తో తిరిగి గాడిన పడింది. సెప్టెంబర్ 15 న విడుదలైన ‘మార్క్ ఆంటోనీ’ లో ద్విపాత్రాభినయం, ప్రయోగాత్మకంగా టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ తో, గ్యాంగ్ స్టర్స్ కొత్త తరహా కథా కథనాలూ అతడిని బాక్సాఫీసుకి దిగ్విజయంగా చేరవేశాయి. నిన్న సోమవారంతో వరుసగా నాల్గు రోజులు తిరుగులేని వసూళ్ళ యాత్ర సాగించి మరింకా కొనసాగే దిశగా పయనిస్తోంది. వారాంతంలో విడుదలైన సినిమాలకి ఆదివారం దాటి సోమవారం వస్తే నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. సినిమాల జాతకం నిర్ణయమయ్యేది సోమవారమే. సోమవారం కలెక్షన్లు నిలబడ్డాయా ఇక గట్టెక్కినట్టే. ‘మార్క్ ఆంటో’ నీ సోమవారం గండం గట్టెక్కి హిట్ ఖాతాలో పడింది.

‘మార్క్ ఆంటోనీ’ రోజు వారీ బాక్సాఫీసు కలెక్షన్లు చూస్తే, శుక్రవారం, రోజు 1: రూ. 8.35 కోట్లు; శనివారం, రోజు 2: రూ. 9 కోట్లు; ఆదివారం, రోజు 3: రూ. 10.44 కోట్లు; మొత్తం : రూ. 27.79 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా : రూ. 38.40 కోట్లు. ఇక ఈ రోజు సోమవారం విషయానికొస్తే మార్నింగ్ షోస్ కి అదే బలమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది. ఈ రోజు, అంటే నాల్గవ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 7.4 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా మంచి ఫలితాలు కనబరుస్తోంది.

రూ. 28 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ హిట్ అన్పించుకోవాలంటే రూ. 40 కోట్లు వసూలు చేయాలి. ఈ మార్క్ కి సోమవారం నాటికే చేరిపోయింది.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.5 కోట్లు గ్రాస్‌తో పనితీరు డీసెంట్‌గా వుంది. మౌత్ టాక్ బావుండడంతో రోజురోజుకీ మరింత పుంజుకుంటుందని బయ్యర్లు ఆశిస్తున్నారు. రేపు వచ్చే శుక్రవారం పెద్ద సినిమాలు లేకపోవడం కలిసి వచ్చే అంశం. సోమవారం వినాయక చవితి సెలవుతో సహా వారాంతం వరకూ మంచి రోజులే. తమిళనాడులో 1100 స్క్రీన్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లు, కేరళ -కర్ణాటక రాష్ట్రాల్లో లో 500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 2900 స్క్రీన్లలో విడుదలైంది.

సినిమా విడుదలకి ముందు ఇది ‘జవాన్’ తాకిడిని తట్టుకుని నిలబడగలదన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు విశాల్. ఇది నిజమైంది. ‘మార్క్ ఆంటోనీ’ కి ముందు తన కెరీర్‌లో ఎప్పుడూ ద్విపాత్రాభినయం చేయలేదు విశాల్. ఇదొక ఆకర్షణ అయింది. ‘19 ఏళ్ళలో నేను ద్విపాత్రాభినయం చేయడం ఇదే తొలిసారి. 32 సినిమాల తర్వాత నేను ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలు చేస్తున్నాను. ఇది టైమ్ ట్రావెల్ సినిమా. ఐదేళ్ళకి, పదేళ్ళకి ఒకసారి ఇలాంటి సినిమా వస్తుంది. ఇది సిటీ ప్రేక్షకులకే కాదు, గ్రామీణ ప్రేక్షకులకి కూడా చేరువయ్యేలా వుంటుంది’ అని చెప్పాడు.

ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ 20 సంవత్సరాల తేడా వున్న రెండు టైమ్‌లైన్‌ల కోసం విడి విడిగా జరగలేదు. ‘ఒక రోజు నేను గడ్డం, ప్రొస్తెటిక్ మేకప్, విగ్, గ్రీన్ లెన్స్ ధరించి విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో గ్యాంగ్‌స్టర్‌గా నటించాను. ఆ మరుసటి రోజు నేను కొడుకుగా నటించాల్సి వచ్చింది. విధేయుడు, పిరికివాడు, ఎలా పోరాడాలో తెలియని వాడు. ఇది పూర్తిగా భిన్నమైన గెటప్. ఈ విధంగా సినిమా ముగిసే సమయానికి నేను స్ప్లిట్ పర్సనాలిటీగా మారతానేమోనని దర్శకుడితో జోక్ చేశాను’ అని వెల్లడించాడు.

అంతేగాక, తమిళం, తెలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి ద్విపాత్రాభినయం కోసం నాలుగు విభిన్న స్వరాలని వినిపించాల్సి వచ్చింది. ‘డబ్బింగ్ పార్ట్ చాలా కష్టమైన భాగం. ఒక్కో భాషకి నాలుగు వాయిస్ మాడ్యులేషన్స్ చేయాల్సి వచ్చింది. ఒకటి నేను మీతో మాట్లాడే సాధారణ స్వరం, మరొకటి బొంగురుగా, పగిలిన స్వరం ఇవ్వడానికి నా గొంతుని రెండు వేళ్ళతో పట్టుకోవాల్సి వచ్చింది. అది తండ్రి పాత్ర స్వరం. ఇదంతా తెలుగులో చేయడం చాలా కష్టమైంది’ అన్నాడు.

అన్నట్టు విశాల్ తెలుగు వాడే. పూర్తి పేరు విశాల్ కృష్ణా రెడ్డి. చెన్నైలో జన్మించాడు. అప్పట్లో తండ్రి జికె రెడ్డి తెలుగు, తమిళ సినిమాల నిర్మాత. విశాల్ విజువల్ కమ్యూనికేషన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. 32 తమిళ సినిమాలు నటించిన తనకి, 2004 లో తెలుగు డబ్బింగ్ ‘పందెం కోడి’ తో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుంచి తను నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి.

విశాల్ నటుడే గాక నిర్మాత, పంపిణీదారుడు కూడా. 2015 లో తమిళనాడు ఆర్టిస్టుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2017 లో నిర్మాతల మండలి అధ్యక్షుడుగా ఎన్నికై కొనసాగుతున్నాడు. 2006 లో తమిళ సినిమా రంగానికి చేసిన సేవలకి గాను కలైమామణి పురస్కారంతో సత్కరించింది తమిళనాడు ప్రభుత్వం!

First Published:  18 Sept 2023 2:56 PM IST
Next Story