నేను త్రిషకు సారీ చెప్పడం ఏంటీ? పెద్ద జోక్ ఇది.. మాట మార్చిన మన్సూర్
కొద్దిరోజులుగా త్రిష -మన్సూర్ అలీ ఖాన్ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కొద్దిరోజులుగా త్రిష -మన్సూర్ అలీ ఖాన్ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీఖాన్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. చిరంజీవి, కుష్బూ సహా పలువురు నటీనటులు, దర్శకులు మన్సూర్ తీరును తప్పు పట్టారు. జాతీయ మహిళా కమిషన్ స్పందించి కేసు నమోదు చేయించినా త్రిషకు క్షమాపణ చెప్పేది లేదని మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశాడు.
విమర్శలు తీవ్రమైన తర్వాత త్రిషకు మన్సూర్ క్షమాపణలు చెప్పాడు. అతడి క్షమాపణలను త్రిష కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతటితో ఈ వివాదం ముగిసింది అని అనుకుంటుండగా.. మళ్లీ మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిష, చిరంజీవి, కుష్బూలపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు.
ఆ తర్వాత కూడా మన్సూర్ ఆగడం లేదు. అసలు తాను త్రిషకు క్షమాపణే చెప్పలేదని మాట మార్చాడు. తాను తన మేనేజర్ తో మాట్లాడినప్పుడు క్షమాపణ అనే మాటే తన నోట నుంచి రాలేదని.. అతడు తప్పుగా అనుకొని క్షమాపణలు కోరినట్లు రాసుకొచ్చాడని చెప్పాడు. తాను త్రిషకు సారీ చెప్పడం ఏంటీ? పెద్ద జోక్ ఇది అని కొట్టిపారేశాడు.
వివాదం ముగిసింది అన్న తరుణంలో మన్సూర్ అలీ ఖాన్ మళ్లీ ఆజ్యం పోస్తుండడంతో ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాల్సి ఉంది. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ పై నడిగర్ సంఘం ఇక ఏ సినిమాలోనూ అతడు నటించకుండా రెడ్ కార్డు జారీ చేసింది. అయినప్పటికీ మన్సూర్ అలీఖాన్ తీరులో ఏమాత్రం మార్పు కనపడకపోవడం గమనార్హం.