Ari Movie - మరో భక్తి పాట పాడిన మంగ్లీ
Ari Movie - అరి మూవీ కోసం మంగ్లీ ఓ పాట పాడింది. వినడానికి క్యాచీగా ఉంది. చూస్తుంటే, పెద్ద హిట్ అయ్యేలా ఉంది.
మంగ్లీ పాటలు పాడడం కొత్త కాదు. ఆమె ఏ పాట పాడినా వైరల్ అవుతుంది. అయితే ఆమె భక్తి పాటలు పాడితే మాత్రం వైరల్ అవ్వడంతో పాటు, కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. అందుకే మంగ్లీ భక్తిపాటలు పాడితే కొంతమంది అలర్ట్ అవుతారు. ఈసారి కూడా ఈ సింగర్ ఓ భక్తి పాట పాడింది.
అనసూయ, సాయికుమార్, వైవా హర్ష లాంటి ఆర్టిస్టులతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో అరి అనే సినిమా తెరకెక్కుతోంది. జయశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఓ పాట పాడింది మంగ్లి. కృష్ణుడిపై ఆమె ఆలపించిన ఈ భక్తి గీతాన్ని అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు.
అయితే ఈసారి ఎలాంటి వివాదాల్లేవు. పూర్తిగా భక్తిభావమే ఉంది. పాట కంపోజిషన్ లో కానీ, సాహిత్యంలో గాని ఎలాంటి అభ్యంతరాల్లేవు. మరీ ముఖ్యంగా దర్శకుడు జయశంకర్ ఒకటికి రెండుసార్లు సాహిత్యాన్ని చెక్ చేసుకొని మరీ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
చిన్నారి కిట్టయ్య అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. ఆ దేవదేవుడే మనిషిగా మారి మానవజాతికి దారి చూపించాడనే అర్థం వచ్చేలా కొన్ని లిరిక్స్ ను బాగా రాశాడు కాసర్ల శ్యామ్. సాంగ్ చాలా క్యాచీగా ఉంది. మంగ్లీ పాడింది కాబట్టి ఆటోమేటిగ్గా వైరల్ అయ్యే అవకాశం ఉంది.
అన్నట్టు ఈ లిరికల్ వీడియో కోసం కాసర్ల శ్యామ్, మంగ్లి తదితరులపై ప్రత్యేకంగా షూటింగ్ కూడా చేశారు. ఈ లిరికల్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారెంరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.