Manchu Manoj - ఘనంగా మంచు మనోజ్ పెళ్లి
Manchu Manoj - హీరో మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు.
హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి హైదరాబాద్ ఫిలింనగర్ లో గ్రాండ్ గా జరిగింది. ఫిలింనగర్ లోని మంచు నివాసంలో, కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.
అయితే బంధుగణం లేకపోయినా పెళ్లి ఆర్భాటంగా జరిగింది. పెళ్లికి ముందు జరిగే మెహందీ, సంగీత్ లాంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలన్నీ జరిగాయి. ఈ పెళ్లి మొత్తాన్ని మంచు లక్ష్మి దగ్గరుండి చూసుకున్నారు.
మోహన్ బాబు దంపుతులు, మంచు విష్ణు దంపతులు ఈ పెళ్లికి హాజరై మనోజ్-మౌనిక ను ఆశీర్వదించారు. అటు భూమా కుటుంబ సభ్యులు, మౌనిక అక్క అఖిలప్రియ పెళ్లికి హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ సైతం ఈ పెళ్లికి వెళ్లారు.
పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు మంచు మనోజ్ కూడా తను పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. త్వరలోనే మంచు మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.